భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపసంహారం

[సూచన: ఈ వ్యాసం పుస్తకపు చివరి అధ్యాయానికి అనువాదం. ఇది చదవబోయే ముందు ఈ సంచికలోనే సంజయ్ సుబ్రహ్మణ్యం, ఫిలిప్ వాగనర్ వ్రాసిన లేఖలు, ఆపైన మొదటి అధ్యాయం చదవండి. అవి చేసే పరిచయంతో ఈ వ్యాసం అర్ధం కావడం సులభమవుతుంది – సం.]


“సంతృప్తి, సంతోషం ఉన్నవాణ్ణి నేను. అందుచేత మంచి చరిత్రకారుణ్ణి కాను.”

– యోహాన్ గోయ్‌థ

1. చరిత్ర అల్లికలో పడుగు పేకలు

దక్షిణ భారతదేశంలో, పదహారు పదునెనిమిది శతాబ్దాల మధ్యకాలంలో, చరిత్రకారుల కొరతేమీ లేదు. ఆధారాలు ఎక్కువగా లభించడం లేదు కాని అంతకు ముందు కాలంలో కూడా ఇలాంటి కొరతేదీ ఉండి ఉండకపోవచ్చు. ఆ కాలంలో తెలుగు, తమిళ, మరాఠీ, పార్సీ భాషలలో ఉన్న అశేషమైన చారిత్రక గ్రంథసంపదలో కొద్దిపాటి భాగాన్ని మాత్రమే ఉజ్జాయింపుగా యీ పుస్తకంలో అందించడం జరిగింది. ఈ చారిత్రక రచనలను కొన్ని లక్షణాల ఆధారంగా వర్గీకరించే ప్రయత్నం కూడా చేశాము. కార్యకారణ సంబంధాల చిత్రణ, చరిత్ర రచన కోసమై ఒక వ్యవస్థా నిర్మాణం, కథనశైలిలో కనిపించే రకరకాల కాలక్రమ రీతులు, మొదలైన లక్షణాలను పరిశీలించాము. ఒక నిగూఢమైన అంతర్గత తత్త్వం యీ రచనలను సచేతనం చేస్తుంది. ప్రపంచంలోని యే చారిత్రక రచనకైనా వర్తించే విషయమే యిది. వీటి తత్త్వాన్ని తెలుసుకోవడానికి కొన్ని విశ్లేషాత్మక సూత్రాలు అవసరమవుతాయి. చరిత్రకి సంబంధించిన కాలం, క్రమం, కారణం, మొదలైన అంశాల గురించి పాశ్చాత్యుల నుండి సంక్రమించిన (అరువు తెచ్చుకున్న) అభిప్రాయాలు, దక్షిణభారత చారిత్రక రచనల నిజస్వరూపాన్ని మరుగు పరిచాయనిపిస్తుంది. ఈ పూర్వస్థిత భావనలను పునస్సమీక్షించుకొని మన ఆలోచనాపరిధిని విస్తృత పరచుకోవలసిన అగత్యం ఇప్పుడుంది.

సాహిత్య ప్రక్రియ (genre) విషయానికి వస్తే – ఆధునిక యూరోపులో మాదిరిగా దక్షిణ భారతదేశంలో చరిత్ర రచన ఒక సాహిత్య ప్రక్రియ కాదు. రకరకాల రూపాల్లో చరిత్ర రచన సాగింది. సాధారణంగా యిది రెండు రకాల పొరపాట్లకి (తప్పుడు అవగాహనలకి) దారితీస్తోంది. ఒకటి – ఉద్దేశంలోను, చెప్పే స్వరంలోను, విషయంలోను కూడా స్పష్టమైన చారిత్రకత ఉన్న రచనలను, ఇతర ప్రయోజనాల కోసం చేసిన రచనల కోవలోకి చేర్చి గందరగోళ పడడం. రెండు – (మొదటి గందరగోళానికి అనవసర పరిహారంగా!) పూర్వకాలాన్ని ప్రస్తావించే, ప్రతిఫలించే, ప్రతీ రచననీ ఏదో ఒక రకమైన చారిత్రక రచనగా భావించడం. ఈ రెండవది మొదటి దానికన్నా తక్కువ పొరపాటేమీ కాదు. ఈ రచనలని సరిగా అర్థం చేసుకోడానికి కొన్ని సహజసిద్ధమైన పఠనసూత్రాలున్నాయి. వాటికి సంబంధించిన విజ్ఞత పూర్తిగా నాశనమైపోవడమే యీ గందరగోళానికంతకీ కారణం. చాలాసార్లు, చారిత్రక రచనలు, ఇతర రచనల మధ్య భేదాన్ని స్పష్టంగా నిర్ణయించడానికి ఒక్క వాక్యం సరిపోతుంది.

ఇలాంటి నిర్ణయాలన్నిటికీ కీలకమైన అంశమే మేము పేర్కొన్న ‘శైలీలక్షణం’ (Texture). అంత మాత్రాన భేదాన్ని సూచించే విలక్షణాంశం ఇదొక్కటే అని కాదు. నిర్మాణ వ్యవస్థ వంటి విషయాల గురించి ఇంతకుముందే ప్రస్తావించాము. రచనోద్దేశాన్ని ప్రకటించే స్పష్టమైన వాక్యాలు, పేర్లు, శీర్షికలు – ఇలా తమ రచనామార్గంలో రచయితలు వదిలే కొన్ని సాధారణమైన గుఱుతులు (generic markers) కూడా ఉంటాయి. కాని, ఎలాంటి స్పష్టమైన ప్రక్రియాసూచకాలు లేని సందర్భంలో, బహుశా శైలీలక్షణ స్థాయి అన్నిటికన్నా ప్రభావవంతమై, నిర్ణయాత్మక అంశంగా నిలుస్తుంది. ఎవరైనా తాము మాట్లాడే స్థానికభాషలో ఉన్న చారిత్రక రచనని చదివినా విన్నా, దాన్ని యిట్టే గుర్తు పట్టగలుగుతారు. ఇది రచన అల్లికలో అంతర్భాగమైన అనేక సూక్ష్మ సూచకాల వల్ల సాధ్యమవుతుంది. వాక్యనిర్మాణము, శబ్దసౌందర్యము, నిశ్శబ్దత, ప్రామాణికత మొదలైన సాహిత్య సాధనాలు రచయిత ఉద్దేశాన్ని నిర్దుష్టంగా, నిర్దిష్టంగా నిరూపించ గలుగుతాయి. ఇలాటి సూచకాలు విశ్లేషణకి సులువుగానే లొంగుతాయి కాని, చాలావరకూ, పాఠక-శ్రోతలు తమకి తెలియకుండానే వాటిని గ్రహించేటంత సున్నితంగా, అత్యంత సహజంగా రచనలో అవి ఒదిగిపోతాయి. రచన అంతటికీ మూలమైన ఒక ఉద్దేశపూర్వకతకు యీ సూచకాలు ఆకృతినిస్తాయి. “ఇది చరిత్ర, ఇదే చరిత్ర” అని చాటి చెపుతాయి. వీటి ప్రభావం క్రమప్రవర్ధకము (cumulative) స్వయంపరిపుష్టము (self-reinforcing) అయినందువల్ల అనేక శైలీలక్షణపు భేదాల మధ్య నుండి కూడా రచనోద్దేశం స్పష్టంగా తెలుస్తుంది.

నిర్మాణవాదుల శల్యపరీక్షకు శైలీలక్షణం అంత సులువుగా లొంగదు. ఇంతటి సూక్ష్మమైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, రచనాస్వరూపాన్ని గూర్చి, “యిది యిది, యిది కాదు” అని కచ్చితంగా గిరిగీసి చేసే మూకుమ్మడి వర్గీకరణలు చాలా అపరిపక్వంగా కనిపిస్తాయి. శైలీలక్షణం రచన తాలూకు పడుగుపేకల్లోకి మనను తీసుకుపోయి, అందులోని ప్రతి పోగునూ మనం సావధానంగా పరిశీలించాలని ఆకాంక్షిస్తుంది, ఆదేశిస్తుంది. రచన నిర్మాణానికీ, సంవిధానానికి అంతర్గతంగా ఉండే సూచకాల ఆధారంగా, రచన అల్లికలో ఏకమొత్తంగా వ్యక్తమయ్యేదే చారిత్రక గుణం. రచన నేపథ్యమేమిటి, అది ఏ వర్గానికి చెందినది, మొదలైన ప్రశ్నల పరిష్కారంలో బాహ్య ప్రమాణాలు (ఉదాహరణకి, ప్రాచీన భాండాగారాలూ శాసనాల ద్వారా లభ్యమయ్యే సమాచారం వంటివి) అంతగా ఉపయోగపడవు. శైలీలక్షణం వాటికి తక్షణ సమాధానాలు అందిస్తుంది. హికాయత్‌లు, బబద్‌లను అర్థం చేసుకోడంలో ఆగ్నేయాసియా చరిత్రకారులు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నారు. దక్షిణ భారతదేశ రచనలకే కాకుండా, మేము ప్రతిపాదిస్తున్న పద్ధతి, వాటికి కూడా అంతే బాగా వర్తిస్తుంది. ఆధునిక పాశ్చాత్య చరిత్రకారులకి కూడా యిది ఉపయోగపడుతుందన్నది మా వాదన. ఒక రచనని సర్వసమగ్రంగా అర్థంచేసుకోవాలన్న ఆకాంక్షతో, అది చెప్తున్నదేమిటో జాగ్రత్తగా, కాస్త వినమ్రంగా చదివే లేదా ‘వినే’ ఒక పద్ధతిని మేమిక్కడ ప్రతిపాదిస్తున్నాము.

చరిత్ర రచన ఒకే సాహిత్య ప్రక్రియకి, ఒకే జాన్రాకి పరిమితమైపోని వ్యవస్థలో, రీతి, రూపం, నిర్మాణం వంటి వాటి గురించి పట్టుబట్టడం వల్ల ప్రయోజనం లేదు. అలాంటి సందర్భంలో శైలీలక్షణం వీటికి సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. అంతేకాదు, పైన చెప్పిన వాటికన్నా శైలీలక్షణం తక్కువ ప్రామాణికమైనదేమీ కాదు. ఈ విషయాన్ని చాలా రకాలుగా నిరూపించే ప్రయత్నం ఈ పుస్తకంలో చేశాము. గతకాలాన్ని గురించి వాస్తవికము, హేతుబద్ధము అయిన కథనాన్ని అందించాలనుకునే రచయితకి శైలీలక్షణం అనేక మార్గాలను ముందుంచుతుంది. ఒకే ప్రక్రియకి పరిమితం చేసెయ్యదు. చరిత్ర ఆకృతి దాల్చేందుకు రెండంశాలు ప్రధానంగా అవసరమవుతాయి. ఒకటి కాల స్వరూపం, రెండు స్థల స్వరూపం. కాల స్వరూపం అంటే కాలక్రమాన్ని గురించిన లౌకిక వైఖరి. స్థల స్వరూపం అంటే ఒక ప్రదేశం కాదు. అది కాలస్వరూపపు వైఖరిలో వచ్చిన మార్పు వల్ల ఏర్పడిన చారిత్రక స్వరూపం. ఈ రెండు స్వరూపాలు క్రమంగా, చదునుగా ఉండాలనే నియమం లేదు. చరిత్ర, కాలము ఒకే వేగంతో, ఒకే క్రమంలో నడిచేవి కావు. కాలస్వరూపంలోని ఎగుడుదిగుడుల నుంచే చరిత్ర పుడుతుంది కాబట్టీ ఈ చారిత్రక కాలక్రమం తిన్నగానే సాగాలని లేదు. చరిత్ర కాలంతో పాటుగా అదే వేగంతో నడవదు. ప్రతీ సంఘటన కాలవేగంతోనే ఉండదు. కొన్ని కుదించబడతాయి, కొన్ని సాగదీయబడతాయి. అందువల్ల క్రమ వర్గీకరణ పద్ధతులలో చరిత్రను మనం తెలుసుకోలేము. ఈ రకమైన చారిత్రక క్రమాన్ని అర్థం చేసుకోడానికి రచనలో ఇమిడిపోయి వున్న సూచనలను గుర్తించగలగాలి. అందుకు సూక్ష్మగ్రాహ్యత అవసరమవుతుంది. పడుగుపేకల చట్రంలో అల్లుకుని ఉండే సూచకాలు, ప్రత్యేకంగా అల్లబడ్డ ఆ చరిత్ర చెప్పే సత్యాలను మన కళ్ళముందుంచుతాయి. అలా వ్యక్తీకరింపబడే సత్య స్వభావాన్ని గురించి స్థిరనిశ్చయానికి వచ్చేందుకు, శైలీలక్షణం ఎంతగానో తోడ్పడుతుంది. చరిత్ర రచనకి స్వాభావికమైన ఈ విషయాన్ని గురించి యిక్కడ మరికాస్త లోతుగా పరిశీలింవలసిన అవసరం ఉంది.

2. కల్హణుని రాజతరంగిణి – స్వరూప నిరూపణలో పొరపాట్లు

మేము పరిశోధించిన మేరకు, దక్షిణ భారత సాహిత్య ప్రక్రియా వ్యవస్థలో, చరిత్ర తానెప్పుడూ నిజం చెపుతున్నాననే అనుకుంటుంది. దక్షిణభారతమే అని యెందుకు, అటు పశ్చిమదేశాలు, యిటు చైనా, మధ్యలో ఇరాన్ — వీటన్నిటి చరిత్ర గురించి కూడా యిదే మాట చెప్పవచ్చు. కాస్త కరకుగా చెప్పాలంటే — చరిత్రకారులు కొన్ని కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతునే ఉంటారు. కాని ఆ అబద్ధాలు చెప్పే పద్ధతిలో తేడా వుంటుంది. మేము పదే పదే ప్రస్తావిస్తున్నట్టు, జాగ్రత్తగా అంచనా వేసి నిర్ధారించవలసిన అంశాలకు ఆస్కారమిచ్చే కొన్ని వ్యక్తావ్యక్త నియమాలు చరిత్ర రచనలో ఉంటాయి. చరిత్ర గూర్చి తాను చేసే వ్యాఖ్యానానికి పూర్తిగా బద్ధుడై ఉంటాడు చరిత్రకారుడు. ఇది సాధారణంగా చరిత్రరచనలో వినిపించే అతని స్వరలక్షణంలో (texture of voice) మనకు గోచరిస్తుంది. చరిత్రకారుడు చెప్పే సత్యం, చారిత్రక సత్యాల (కనీసం చారిత్రక వాస్తవాల) పూర్ణ స్వరూపం ఎప్పుడూ కాదు. అయితే, తానెనున్నుకున్న రచనాస్వరూప నియమాల పరిధిలో, ఆ సత్యం యుక్తియుక్తము సమగ్రమూ అయి ఉంటుంది.

అందుకనే చరిత్ర రచనలలో, వాస్తవ-కల్పనల కమనీయమైన కలగలుపు, రకరకాలుగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చరిత్ర శుద్ధసాహిత్యంగా మారిపోవచ్చు. మహాభారతం విషయంలో ఇలా జరిగినట్టు అనిపిస్తుంది. కాలక్రమంలో చారిత్రకస్ఫూర్తి యితర ఉద్దేశాల చేత కప్పబడిపోవచ్చును. వాస్తవికతను పట్టిచ్చే రచనాచిహ్నాలు లుప్తమయిపోవచ్చును. అప్పుడు, రసభరితమో, నీతిబోధకమో, పౌరాణికమో, వ్యంగ్యచిత్రణమో అయిన కథలుగానే చరిత్ర విస్తరించుకుపోతుంది. ఈ వ్యవహారమంతా, “గతంలో జరిగిన సంఘటనలే చాలా వరకూ కాలగమనంలో తమ విశ్వసనీయతని అతిక్రమించి పుక్కిటి పురాణాలుగా మారిపోయాయి”, అన్న థుసిడైడిస్ (Thucydides)అభిప్రాయానికి దగ్గరగానే ఉన్నప్పటికీ పుక్కిటి పురాణాలు చరిత్రని పూర్తిగా మింగెయ్యడమనే థుసిడైడిస్ భావన కొన్ని దక్షిణాసియా రచనలకి యథాతథంగా వర్తించకపోవచ్చు.

దీనికి, పందొమ్మిదవ శతాబ్దపు పూర్వభాగంలో సెంజి నారాయణన్ అనే కరణం వ్రాసిన, కర్ణాటక రాజాక్కల్ చవిస్తార చరిత్తిరం (Extensive History of Carnatic Kings) అనే రచన ఉదాహరణగా నిలుస్తుంది. ఈ రచనలలో అనుభవసిద్ధమూ విశ్లేషణాత్మకమూ అయిన చారిత్రక వాస్తవికతతో పాటు, పౌరాణిక కల్పనలు కూడా వివిధ స్థాయిలలో పెనవేసుకొని ఉంటాయి. అదృష్టవశాత్తూ, ఆ చిక్కుముడులను ఎలా విప్పాలనేది పాఠకులు ఎవరికి వారు నిర్ణయించుకొనే అవకాశముంది. స్వభాషా పాఠకులకిది సహజంగా అబ్బుతుంది. తమ స్వానుభవం, సాంస్కృతిక వారసత్వం ఆధారంగా, తమకు విశ్వాసం కలిగించే అంశాలను వారెన్నుకుంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో (ఆ రచనావ్యవస్థ పరిథిలో అసంగతం కానంత వరకూ) సాధారణ దృష్టికి అనుభవ దూరమనిపించే విషయాలను సైతం ‘వాస్తవాలుగా’ పరిగణించవలసి వస్తూంటుంది. ఉదాహరణకు, విజయరాఘవ నాయకుడు తంజావూరులో 1673లో జరిగిన యుద్ధంలో చనిపోయిన తర్వాత, తంజావూరుకు పశ్చిమాన అరవై మైళ్ళకు దూరంగా ఉన్న శ్రీరంగంలోని రంగనాథునిలో ఐక్యమవ్వడం కొందరు చూసినట్టుగా ‘తంజావూరు ఆంధ్రరాజుల చరిత్ర’లో ఒక కరణం చరిత్రకారుడు నమోదు చేశాడు. దీనిని కాదనే ధైర్యం మనకుందా! కోసెలెక్ (Reinhart Koselleck) అంగీకరించినట్టు, చారిత్రక సంఘటనల వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చే పాశ్చాత్య చరిత్రరచనలో కూడా, పౌరాణిక కల్పనల పునరావృత్తి వంటిది సర్వసాధారణంగా కనిపిస్తుంది. వర్తమానం, భవిష్యత్తుకు గతమైపోయే నిరంతర పరిణామ క్రమంలోనే, మధ్యమధ్యలో, ఆ వరుసని అతిక్రమించే కొన్ని బలీయమైన, అతి సుపరిచితమైన, అర్థవంతమైన నమూనాలు తిరిగి తిరిగి ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, గతాన్ని గూర్చిన పునర్విమర్శ నుండే, ఆ సింహావలోకనానికి సహజమైన పొడిగింపుగా, అలాంటి పునరుక్తులు సృష్టింపబడతాయి.