పలుకుబడి – కాలమానము

సర్వం కాలకృతం మన్యే భవతాం చ యదప్రియం
సపాలో యద్వశే లోకో వాయోరివ ఘనావలిః
(శ్రీమద్భాగవతమ్ 1.9.14)

ఘనమైన మేఘాలను కనిపించని వాయువు నడిపించినట్టు, లోకంలో సర్వ జీవరాశిని కాలం నడిపిస్తుంది అని కాలం యొక్క విశిష్టతను భాగవతం, ప్రథమ స్కంధంలో భీష్ముడు ధర్మరాజాదులకు వివరిస్తాడు. ఈ శ్లోకాన్నే పోతన ఇలా తెనిగించాడు:

వాయు వశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం
బాయుచు నుండు కైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై
పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదు కాల మన్నియుం
జేయుచునుండుఁ గాలము విచిత్రము దుస్తర మెట్టివారికి.
(భాగవతం 1. 9. 209)

కాలాన్ని అగ్నిగాను, బలిష్టమైన శక్తిగానూ వర్ణించడం అథర్వ వేదంలోని కాలసూక్తం నుండీ మనకు కనిపిస్తుంది. “కాలోఽస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో (లోకంలో సర్వశక్తిమంతులను హరింపజేసే కాలస్వరూపుడను నేనే)” అన్న భగవద్గీతలోని ప్రసిద్ధమైన శ్లోకం అందరికీ తెలిసిందే. అయితే, ఋగ్వేదంలో కాలప్రస్తావన అంతగా కనిపించదు.

రాత్రి-పగళ్ళ రాకపోకలను, సూర్యచంద్రుల గమనాన్ని, ఏటా పునరావృత్తమయ్యే ఋతువుల క్రమాన్ని పరిశీలించిన ప్రతీ మానవ సమాజం కాలాన్ని కొలవడానికి అనువుగా తమదైన పదజాలాన్ని ఏర్పాటు చేసుకొన్నది. తెలుగులో మనం వాడుతున్న కాలమాన పదజాలాన్ని, వాటి వ్యుత్పత్తి చరిత్రలను చర్చించడం ఈ విడత పలుకుబడి వ్యాసం ముఖ్యోద్దేశ్యం.

చంద్రుడు, రాత్రి, నెల

సూర్యకాంతి కొంతకాలం ప్రసరించి ఆ తరువాత వెలుగు తొలగిపోవడం, ఆపై చీకటిగా మారటం అనాదికాలం నుండి మానవుడు గమనించాడు. సహజంగానే, ఈ చీకటి వేళలను ప్రమాదానికి, భయానికి సూచకమని భావించాడు. ఆ చీకటివేళలో వెలుగు ప్రసరింపజేసే చంద్రుని రూపం ప్రతిరోజూ మారిపోతుండడం కూడా మానవుడు గమనించాడు. ఒక్కోసారి నిండుగా కనిపించే చంద్రుడు, ఆపై పరిణామంలో తగ్గుతూ చివరకు కనిపించకుండా మాయమవ్వడం, ఆ తరువాత మళ్ళీ పెరుగుతూ నిండుగా రూపు సంతరించుకోవడం ఆదిమ మానవుడు గమనించే ఉంటాడు. దాదాపు 35,000 సంవత్సరాల క్రితమే చంద్రుని గమనం ప్రతి 29-30 పగళ్ళు-రాత్రుళ్ళ తరువాత మళ్ళీ పునరావృత్తమవుతుందని మానవుడు అర్థం చేసుకున్నాడనడానికి మనకు ఆధారాలు దొరుకుతున్నాయి. ఆఫ్రికాలో దొరికిన లెబోంబో ఎముకపై వరుసగా 29-గీతలు ఉండడం శాస్త్రజ్ఞులను ఆశ్చర్యపరిచింది. ఇది ఆ కాలంలో చంద్రుని గమనానికి, స్త్రీల ఋతుచక్రంలో రోజులను లెక్కించడానికి ఉపయోగించి ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల ఊహ. నమీబియాలో ఆదిమవాసులు రోజులను లెక్క పెట్టుకోవడానికి ఇప్పటికీ ఇటువంటి ఎముకలనే ఉపయోగించడం ఈ రకమైన ఊహకు బలాన్నిస్తుంది. అంటే, చంద్రుని నెలలో ఇరవైతొమ్మది రోజులుంటాయని అన్ని వేల సంవత్సరాల క్రితమే మానవుడు ఊహించాడన్నమాట.

నెలకు, చంద్రుని గమనానికి సంబంధం ఉంది కాబట్టే పలు భాషలలో (పలు భాషా కుటుంబాలలో) నెలకు సమానార్థకాలైన పదాలు చంద్రుని పేరుతోనే కనిపించడం కద్దు. ఉదాహరణకు, ఇంగ్లీష్ భాషలో moon అంటే చంద్రుడు; moon-th > month అంటే నెల రోజులు. అలాగే, సంస్కృతంలో మాసం అంటే నెల అన్న అర్థమే కాక, చంద్రుడు అన్న అర్థం కూడా ఉంది. ద్రావిడ భాషలలో కూడా ‘నెల’ అంటే చంద్రుడు. ఇప్పటికీ తమిళ, కన్నడ భాషలలో నిల/నెల అన్న పదాలకు చంద్రుడు అన్న అర్థమే ఉంది. తెలుగులో నెలరాజు అన్న పదబంధంలో ఈ పదాన్ని అదే అర్థంలో వాడడం కూడా గమనించవచ్చు. తమిళ, కన్నడ భాషలలో ‘నెల రోజులు’ అన్న అర్థంలో వాడే తింగళు- అన్న పదానికి కూడ మొదటి అర్థం చంద్రుడే.

ద్రావిడ భాషలో ‘రాత్రి’ అన్న అర్థం వచ్చే పదాలు *చిర-వు-/చిరంక- అన్న మూల ధాతువుల నుండి వచ్చాయి. ఈ ధాతువుకు మూలార్థం చీకటి, అంధకారం. నిజానికి, చీఁకటి అన్న పదం చిరంకటి- అన్న ధాతువు నుండే వచ్చింది. అయితే, దక్షిణ ద్రావిడ భాషలలో పదాది చ-కారం లోపించడం తఱచుగా కనిపిస్తుంది. అందుకే, తమిళాది భాషలలో *చిరవు-, ‘ఇరవు’ గా ‘ఇరళు’ గా మారింది. తెలుగులో కూడా ఇరులు అంటే చీకటి. “అదృష్టవంతులు మీరు, వెలుగును ప్రేమిస్తారు, ఇరులను ద్వేషిస్తారు […] వెలుగు లేని చీకట్లే, ఇరుల లోని మిణుగురులే చూస్తాం [మేము]” అంటూ సాగే శ్రీశ్రీ కవిత చిన్నప్పటి నుండి నాకిష్టమైన కవితల్లో ఒకటి.

చాలా నిఘంటువులలో రేలు అన్న పదాన్ని రేయి అన్న పదానికి బహువచనంగా, రాత్రి అన్న సంస్కృత పదానికి వికృతిగా వివరిస్తారు. కానీ, *ఇరుళు- అన్న పదమే వర్ణవ్యత్యయం వల్ల రేలు-గా మారిందని, రేయి, రేలు రెండూ పూర్తిగా ద్రావిడ పదాలేనని నా అభిప్రాయం.

సూర్యుడు, పగలు, ప్రొద్దు

పగలు అన్న పదానికి, దాని పర్యాయ పదాలలో చాలా వాటికీ మొదటి అర్థం సూర్యుడు. తెలుగులో బాగా వాడే ప్రొద్దు అన్న పదానికి మూల ధాతువు *పొೞುత్తు. ఇది వర్ణవ్యత్యయం వల్ల ప్రొద్దు గానూ, ఆపై పొద్దు గానూ రూపాంతరం చెందింది. ఈ పదానికి కూడా ప్రాథమికార్థం సూర్యుడే. ‘ప్రొద్దుపొడుచు-’, ‘ప్రొద్దుపొడుపు’ అంటే సూర్యుడు ఉదయించడం అనే. ఇక్కడ ‘పొడుచు’ అంటే పొడచూపు, పొడకట్టు, కనిపించు అన్న అర్థాలే. ప్రొద్దుగూకు, ప్రొద్దుగూకులు, ప్రొద్దుగ్రుంకు, ప్రొద్దుపోకడ, ప్రొద్దుపోవు, ప్రొద్దుగడుచు అన్న పదాలన్నీ సూర్యాస్తమయాన్ని సూచిస్తాయి. అలాగే, ‘ప్రొద్దుజంట’, ‘ప్రొద్దుజోడు’ అంటే సూర్యుని జోడి అయిన చంద్రుడు. ‘ప్రొద్దురాయి’, ‘ప్రొద్దుకల్లు’, ‘ప్రొద్దుగల్లు’ అంటే సూర్యశిల. ‘ప్రొద్దుపట్టి’, ‘ప్రొద్దుగొడుకు’, ‘ప్రొద్దుకూన’, ‘ప్రొద్దుచూలి’ అంటే సూర్యుని కొడుకు — యముడు, శని, కర్ణుడు, సుగ్రీవుడు మొదలైన వారిలో ఎవరికైనా వాడవచ్చు. ‘ప్రొద్దుపట్టు’ అంటే సూర్య గ్రహణము.

అయితే, ‘ప్రొద్దులు’ అన్న పదాన్ని ప్రసూతి సమయాన్ని సూచించడానికి కూడా వాడిన ప్రయోగాలు ఉన్నాయి. ‘ప్రొద్దులుపడు’, ‘ప్రొద్దులవేళ’, ‘ప్రొద్దులనెల’, ‘ప్రొద్దునెల’ మొదలైన పదాలన్ని కానుపు అయ్యే సమయాన్ని సూచించడానికి వాడుతారు. అయితే, ఈ పదానికి, సూర్యుడు అన్న అర్థమున్న *పొೞುత్తు అన్న ధాతువుకు ఏ సంబంధం లేదు. కానుపుకు సంబంధించిన ఈ పదాలన్ని *పురుటు- అన్న ధాతువు సంబంధించినవి. ‘పురుడు’ అన్న పదం కూడా ఈ పదాలకు సోదర (cognate) పదమే.

నేడు, ఱేపు, ఎల్లుండి, నిన్న, మొన్న

నేడు: ద్రావిడ భాషలలో సమయాన్ని సూచించడానికి ఎక్కువగా వాడే పదాలకు మూల ధాతువు *ఞాన్ఱు-/నాన్ఱు-. ఈ ధాతువు తెలుగులో మొదట నాండుగా మారి, ఆపై నాఁడుగా రూపాంతరం చెందింది. ఈనాండు అంటే ప్రస్తుతపు దినం. అది వర్ణవ్యత్యయం చెండి నేండుగా, నేఁడుగా మారింది. తమిళ కన్నడాదులలో కనిపించే నాళ్- కూడా నాణ్డు-/నాండు- సంబంధించిందే కావచ్చు. అయితే కాలాన్ని సూచించే ధాతువు*ఞాన్ఱు- ధాతువు నుండి పుట్టన నాఁడుకు, ప్రాంతాన్ని సూచించే ధాతువు *నాట్టు- నుండి పుట్టన నాడుకు తెలుగులో అరసున్న మాత్రమే తేడా. ఇప్పుడు అరసున్నాలు రాయటం లేదు కాబట్టి సందర్భాన్ని బట్టి అది కాలాన్ని సూచిస్తుందా, ప్రాంతాన్ని సూచిస్తుందా తెలుసుకోవాలి. అంటే, తెలుగులో ప్రముఖ ప్రతిక అయిన ‘ఈనాడు’ పేరును కాలాన్ని సూచిస్తూ ‘ఇవ్వాళ’ అని అర్థం చేసుకోవచ్చు, లేదా స్థలాన్ని సూచించే ‘ఈ ప్రాంతం’ అని కూడా అర్థం చేసుకోవచ్చు.

నిన్న: నిఱ-/నెఱ- అంటే నిండిన. నిఱనాళ్/నిఱనాండు అంటే నిండిన రోజు, అంటే పూర్తి అయిన రోజు. నిఱనాళ్- అన్న పదమే తెలుగులో నిఱ్నగా నిన్న గా మారింది.

మొన్న: మును- అన్న ధాతువు -నాళ్/-నాఁడు అన్న ధాతువుతో కలిస్తే మున్నాళ్/మున్నాండు అవుతుంది. మును- అన్న పదానికి కడచిన, అంతకు ముందు జరిగిన విషయానికి సంబంధించింది అన్న అర్థాలు కూడా ఉన్నాయి కదా. మున్నాళ్/మున్నాండు నుండే మొన్న వచ్చిందని చెప్పడం అంత కష్టం కాదు. మొదటి అక్షరంలో ఉ-కారం తరువాతి అక్షరంలో అ-కారం ఉంటే తెలుగు, కన్నడ భాషలలో అది ఒ-కారంగా మారుతుందని నిరూపిస్తూ కృష్ణమూర్తి గారు రాసిన వ్యాసం ప్రసిద్ధమైనది (నిజానికి, అది ఆయన రాసిన మొట్టమొదటి పరిశోధనా పత్రం. అప్పటికి ఆయన వయస్సు 25 ఏళ్ళు మాత్రమే).