స్వప్నభంగం

అక్షయపాత్రలో ఆఖరి అక్షరం కూడా అయిపోయింది
వేళ్ళకు తడితడిగా తగులుతూ
కొన్ని సిరా చుక్కలు.

ఆకాశంలో చివరి నక్షత్రం కూడా ఆరిపోయింది
అంతటా అలికేసినట్టుగా
ఒలికిన వెలుగులు.

కాగితం గతం
కలం కళ్ళలో కదలాడే ఒక పురాజ్ఞాపకం
అంతరంగం
నిత్యం అలలతో ముందుకీ వెనక్కీ ఊగే
నిస్సహాయ సముద్రం.

దారి వేరైపోయింది
చెదిరిన కలలోంచి
బెదురు చూపులతో వచ్చిన దుప్పి
ఎదురుగా కారుకి తగిలి పడిపోయింది.