జీవిత నవల – 2

ఇంతకుముందు చెప్పినట్టు, జీవిత నవల ఇంకా శైశవ దశలోనే ఉంది. అందువల్ల, నేను రాసిన మెదటి జీవిత నవల లస్ట్ ఫర్ లైఫ్ (Lust For Life) నుండీ మొన్నటి ఇమ్మోర్టల్ వైఫ్ (Immortal Wife), లవ్ ఈజ్ ఎటర్నల్ (Love is Eternal) నవలల వరకూ నా రచనలలో నేను పైన చెప్పిన నియమాలని, పద్ధతులని ఏ విధంగా ఆచరణలో పెట్టానో సోదాహరణంగా విశదీకరిస్తే బహుశా ఆసక్తి ఉన్నవారికి అది ఉపయోగపడవచ్చు.

లస్ట్ ఫర్ లైఫ్ నవలకి ముందు నాకు జీవిత నవలలు రాయడంలో ఎటువంటి అనుభవమూ లేదు. ఆరోజుల్లో నేను నాటకరచయితని. ఒకరోజు, పారిస్‌లో నా స్నేహితులు నన్ను బలవంతంగా విన్సెంట్ వాన్‌గో (Vincent van Gogh) చిత్రాలు చూడటానికి తీసుకొని పోయారు. అది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన. ఒక పెద్ద హాలంతా నిండిపోయిన వాన్‌గో వర్ణచిత్రాలు నన్ను ఆమూలాగ్రం కదిలించి వేశాయి. ఆనాటి భావోద్వేగం మాటల్లో చెప్పలేనిది, మొదటిసారి బ్రదర్స్ కరామజోవ్ (Brothers Karamazov) నవల చదివినప్పుడు ఎటువంటి అనుభూతికి లోనయ్యానో అటువంటి ఉద్వేగమే, నన్ను అంతే తీవ్రంగా, కదిలించింది. ఎలాగైనాసరే, నన్నంతగా కదిలించిన వాన్‌గో గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే పట్టుదల నాలో కలిగింది. న్యూయార్క్ తిరిగి వచ్చేశాక, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ భాషలలో దొరికినంతవరకూ చెదురుమదురుగా విన్సెంట్ గురించిన వివరాలు అన్నీ చదివాను. ఒకపక్క నేను రాస్తున్న నాటకాలపై పనిచేస్తూనే, సాయంత్రాలన్నీ ఫిఫ్త్ ఎవెన్యూలోనూ, ఫార్టీ-సెకెండ్‌ స్ట్రీట్‌లోనూ ఉన్న పబ్లిక్ లైబ్రరీలలో విన్సెంట్‌ తన తమ్ముడు థియోకి రాసిన ఉత్తరాలు, మూడు సంపుటాలు, అన్నీ శ్రద్ధగా చదివాను. ఇదంతా అతని గురించి తెలుసుకోవాలనే కోరికతోనే గానీ, అతనిపై ఒక నవల రాయాలనే ఆలోచన నాలో ఏ కోశానా లేదు. కాని, అలా నాకు తెలియకుండానే, నా ప్రయత్నమేమీ వేరేగా లేకుండానే విన్సెంట్ నన్ను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. అతని కథ నన్నెంతగా వశం చేసుకుందంటే, అర్ధరాత్రి మూడింటికి లేచి థియో, విన్సెంట్ మధ్య సంభాషణలో లేదా, ‘ఓవెర్ స్యుర్ వాస్‌’లో (Auvers sur Oise పారిస్ నగరంలో ఒక ప్రాంతం) విన్సెంట్ మరణ సన్నివేశమో రాస్తుండేవాడిని. ఆటుపోట్లతో నిండిపోయిన విన్సెంట్ జీవిత ప్రయాణం ఎంతో భావంతో నిండుకుని, ఒక గొప్ప కథగా నాకనిపిస్తుండేది. ఆ సంవత్సరాంతానికల్లా నాకింక వేరే ఏ ఆలోచన పొసగక, ఆఖరికి అతన్ని నా ఆలోచనలనుంచి నెట్టివెయ్యడానికైనా సరే, విన్సెంట్ జీవిత నవల రాయాలని నిర్ణయించుకున్నాను.

కాని, అటువంటి కథని రాయడానికి నాకున్న నేపథ్యం ఏమాత్రమూ సరిపోదు. నేను పెరిగింది శాన్ ఫ్రాన్సిస్కోలో. చచ్చి, తలకిందులుగా వేలాడుతున్న రెండు కుందేళ్ల బొమ్మ కూడా అక్కడ గొప్ప కళాఖండమే! అందుకని నా మెదటి కర్తవ్యం ఆధునిక చిత్రకళ, చిత్రకారుల గురించి సాంతంగా చదివి తెలుసుకోవడం, ఆనక వీలయినంతగా వారు గీసిన చిత్రాలని చూడడం. భుజానికి ఒక సంచీ తగిలించుకుని, నేను యూరోప్‌కి వెళ్ళి విన్సెంట్ జీవితాన్ని అనుసరించాను. అతను నడిచిన దారిలో నడిచాను – బొరినాజ్‌లో (Borinage, బెల్జియం దేశంలో ప్రాంతం) అతను దిగిన బొగ్గుగనుల్లోకి నేనూ దిగాను, మేడమ్ డెనిస్ బేకరీలో అతనే గదిలో పడుకున్నాడో అక్కడే నేనూ పడుకున్నాను, హాలండులో అతను తన కుటుంబంతో నివసించినచోటే నేనూ ఉండి నోట్సు రాసుకున్నాను, దక్షిణ ఫ్రాన్స్‌లో అతను పనిచేసిన యెల్లో హౌస్‌లో పని చేశాను, సాన్ రేమీలో (Ste. Remy) అతనిని బంధించిన పిచ్చాసుపత్రిలోనే నేనూ కొన్నాళ్ళు ఉన్నాను, చివరికి అతని నలభయ్యవ వర్ధంతినాడు ఓవెర్ స్యుర్ వాస్‌ లోని చిన్న హోటల్లో అతను అద్దెకున్న గదిలో, అదే పక్క మీద, పడుకున్నాను.

జీవిత నవల రాయడంలోని లోటుపాట్లు నాకెంత తెలుసో, తెలీదో నాకే తెలియదు కాబట్టి, లస్ట్ ఫర్ లైఫ్ నవల రాయడానికి పూనుకున్న మొదటి ఉదయం, నాకు గుర్తుగా నాలుగు నియమాలు రాసుకున్నాను. అవి – 1. నాటకీయత; 2. వీలయినంత ఎక్కువగా సంభాషణ; 3. సజీవమైన పాత్రలు; 4. సున్నితమైన హాస్యపు సన్నివేశాలు.

అవే ఆనాడు నన్ను నడిపించిన నాలుగు సూత్రాలు. ఇప్పుడైతే, నవల ఎలా ఉండాలో, ఉండకూడదో యాభై పేజీలకి తక్కువ కాకుండా ముందే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రాసిపెట్టుకుని దాన్నే అనుసరిస్తున్నాను. అయినా, ఇప్పుడు వచ్చిన నా నవలలేవీ లస్ట్ ఫర్ లైఫ్ కంటే గొప్పగా లేవనే ప్రజాభిప్రాయం. అందుకే ఒక్కోసారి, ఆ రోజుల్లో సహజసిద్ధంగా తెలిసినదానినే ఈ పాతికేళ్లలో విశ్లేషించి వివరంగా చెప్పగలగడం మించి ఇంకేమీ కొత్తగా సాధించినదేమీ లేదేమో అనే సందిగ్దం నన్ను వేధిస్తూ ఉంటుంది.

ఏ ప్రేరణైతే నాచేత లస్ట్ ఫర్ లైఫ్ రాయించిందో సరిగ్గా అటువంటి ప్రేరణే ఇమ్మోర్టల్ వైఫ్ నవల రాయడానికి నన్ను పురికొల్పొంది. ఈ రెంటికీ మధ్య మూడు జీవిత చరిత్రలు రాసేంత కాలం ఎలా జీవిత నవలకు దూరంగా ఉండగలిగానో, నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అమెరికా అధ్యక్ష పదవికోసం పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులపై దే ఆల్సో రాన్ (They Also Ran) అనే నవల రాశాను. అందులో జాన్ ఫ్రీమాంట్‌పై అధ్యాయం రాస్తుండగా, ఆయన సతీమణి జెస్సీ బెంటన్ ఫ్రీమాంట్ మరోసారి నా తలపు తలుపు తట్టింది — కాలేజీ రోజుల్లో ఆమే నా ఆరాధ్య దేవత, నా భార్యని ఎంచుకోవడంలో కూడా ఆమే నాకు స్ఫూర్తి. విన్సెంట్ కథ నన్ను ఎలా ఆవహించిందో, జెస్సీ కథ కూడా అలానే నన్ను ఆక్రమించుకుంది.

ఇమ్మోర్టల్ వైఫ్ రాయడానికి పూనుకునేముందు, అంటే 1943లో, సుమారుగా అరవైమూడు సూత్రాలతో జీవిత నవల రాయడానికి రచయితకున్న స్వేచ్ఛాపరిమితులు, అతని ఎల్లలు, సరిహద్దులపై ఖచ్చితమైన నియమావళి రాసుకున్నాను. అందులోంచి ఒక ఉదాహరణ:

కథలో వడి ఉండాలి. పాటలా హాయిగా సాగిపోవాలి. ప్రధానంగా వ్యక్తుల కథ కాబట్టి చరిత్ర నేపథ్యంలోనే ఉండాలి. కనీసం సగం పైగా సంభాషణలుండాలి. జెస్సీ స్వగతాలు, ఆలోచనలు చాప కింద నీరులా ఉండాలి. ప్రతీది ఆమెగానే ఆలోచించాలి. పాత్రలన్నీ సజీవంగా, చైతన్యవంతంగా ఉండాలి. ప్రతీ సన్నివేశం, ప్రతీ పదం ఇప్పటి భాషలో ఉండాలి. పాఠకుడు జెస్సీతో మమేకమైపోవాలి. 1840 నుంచీ 1900 మధ్య కాలంలో ప్రపంచాన్ని ఆమె దృష్టితోనే చూపించాలి. వర్ణన కోసం వర్ణన ఉండకూడదు. వర్ణనలు జెస్సీ జీవితానికి అనుబంధంగా, ఆమె చూసి చేస్తున్నవిగానే ఉండాలి. చారిత్రక సత్యాల ఏకరువు కాకుండా అవి జీవితంలో భాగమైనవిగానే ఉండాలి. విషయ సామగ్రి కొత్తగా ఉండాలి. అది పడుగూ పేకలా వర్ణిస్తున్న ఆ జీవితంలో ఇమిడిపోవాలి. అంతర్లీనంగా హాస్యం వాడి కథకు తేలికదనాన్ని తేవాలి. కథలో ప్రధానాంశాలు ప్రవేశపెట్టడంలో, వాటిని అభివృద్ధి చెయ్యడంలో ఓపిక అవసరం. మొదట ఇదొక ప్రేమ కథ అని మర్చిపోకూడదు. జాన్, జెస్సీల మధ్య అనుబంధం ఎప్పటికప్పుడూ మారుతున్నా, వారి ప్రేమానురాగాల స్వభావం ఎప్పుడూ ఒకటే. మానవ సహజమైన పొరబాట్లు, తప్పిదాలు ఈ కథకి మూడో కోణం. ఒకరంటే ఒకరికి, అలానే వారిద్దరికీ ప్రపంచంపై ఉన్న విశ్వాసం, ఆశావహ దృక్పథమే జీవనానికి పునాది అనే వారి ఆదర్శం, ఈ కథకు నాలుగో కోణం. ప్రేమ, వివాహంపై కూలంకషంగా, లోతుగా కథనం ఉండాలి. ఆ బంధం సహజానుబంధంగా చూపాలి. ఏ వివరం వొదిలి పెట్టకుండా, ఏ విషయం ఎక్కువగా వర్ణించకుండా, అప్పటి కాలాన్ని కళ్ళకి కట్టినట్టుగా చిత్ర్రించాలి. కథాస్థలాలైన వాషింగ్టన్, సెయింట్ లూయిస్, మారిపోసాల మధ్య వైవిధ్యం ప్రస్ఫుటమవ్వాలి. చరిత్రను ఆసక్తికరంగా కథలో ఇమిడ్చి, ఏ ఒక్క జీవితమైనా సర్వమానవాళి జీవితానికి ప్రతీక అనే భావన కలిగించాలి.

ఏడేళ్ళ తర్వాత, ది ప్రెసిడెంట్స్ లేడీ (The President’s Lady) నవలకి అవసరమైన పథకం తయారుచేసుకుంటున్నప్పుడు, “రేచల్ మనసు తెలుసుకోవడం ఎలా” అని నేను మథనపడుతూ, నాకై నేను రాసుకొన్న సలహాలు ఇప్పుడు అప్రస్తుతం కావు.

పరిస్థితులకి ఆమె మనస్సుతో మనం స్పందించాలి. ఆమె కళ్లతో మనుషులని చూడాలి; ఆమె విలువలే మన విలువలు కావాలి; ఆమెని తబ్బిబ్బుచేసే సంగతులే మనల్ని కూడా కలవరపెట్టాలి; ఆమెకి ఏది కావాలో అది ఆమెకి దొరకాలని మనం కోరుకోవాలి; ఆండ్రూపై ఆమెకి గల ప్రేమని మనం సొంతం చేసుకోవాలి. ఆమెతో పాటుగా, ఆమె సుదీర్ఘమైన ఒంటరితనంలో మనమూ క్రుంగిపోవాలి; ఆమె కలతలే మన కలతలు, ఆమె అవసరాల నేపథ్యంతోనే మనం సంఘటనలని బేరీజు వెయ్యాలి. ఆవిడ స్నేహితులు, బంధువులు మనకూ అంతే దగ్గరవాళ్ళు. ఆండ్రూకి గుర్తింపు, కీర్తి లభించాలని మనం కోరుకోవాలి. వాటివల్ల అతను మనకు దూరమైపోతాడని భయపడాలి కూడా. ఆమె మతాన్ని ఆరాధించినప్పుడు మతమే మనకి కూడా ఆసరా కావాలి. రేచల్ అనే వేదిక మీద చరిత్ర నటించినట్టుగా చూపించాలి. ఆమె సామాజిక విజయాలకి మనం ఉప్పొంగిపోవాలి, ప్రాణాంతకమైన దెబ్బకి ఆమెతో మనం కూడా మరణించాలి. రేచల్‌ని మనం ప్రేమించాలి, ఆమెతో స్నేహం చెయ్యాలి, ఆమెని అర్థంచేసుకోవాలి. ఆమె జీవితాన్ని ఆమె హృదయంతో, మనస్సుతో మనం అనుభవించగలగాలి.

ఇదంతా ఆర్ద్రతతో, ఆమె పట్ల కరుణతో రచయిత కథ చెప్పగలిగితేనే సాధ్యం. ఆమెని మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే సాధ్యం. నిజాయితీగా, సూటిగా, ఉత్ప్రేక్షలు లేని కథనంతోనే సాధ్యం. అలా అయితేనే, పాఠకుడు రేచల్ పట్ల సహానుభూతికి లోను కాగలడు. కథలోని సన్నివేశాలలోంచి, అన్ని సంఘటనల లోనుంచి రేచల్‌ను చురుకుగా నడిపించుకుంటూ రావాలి. ప్రేమలోనూ, వైవాహిక జీవితంలో ఆమె పడిన బాధలు విశ్వసామాన్యమని చూపిస్తూనే, ఆమె జీవితం మిగతా అందరి స్త్రీలకంటే భిన్నమైనదని వెల్లడించాలి. ఆమె కూడా మనందరి లాగానే విధివైపరీత్యాలకు తల వంచినదిగానే చూపిస్తూ, రేచల్ లాంటి జీవితం నభూతో నభవిష్యతి అని ఆమె ప్రత్యేకతను నిరూపించగలగాలి.

నవలపై ఏడాదిన్నరపాటు పనిచేశాక, చివరి అధ్యాయం రాసేముందు, నవల ద్వారా ఏ సిద్ధాంతనిరూపణలు చెయ్యనవసరం లేదు గానీ, రేచల్ జీవితాన్ని వెలుగులోకి మరింతగా తీసుకుని వచ్చే బాధ్యత నాదే కదా? అని నాకు నేను చెప్పుకుంటూ, నవల ఎందుకోసం మొదలుపెట్టానో ఆ ఉద్దేశం నెరవేరిందా లేదా, ఈ నవలను ఒకటిగా పట్టి వుంచే అంతస్సూత్రం ఏమిటి? అనే మీమాంసలో పడ్డాను.

లింకన్ల జీవితకథపై నాకున్న అమితమైన ఆసక్తి కారణంగా ఆ విషయంపై చాలా చదివాను, కాని చాలా కాలం వరకూ నాకంటూ ఒక కొత్త కోణం చిక్కలేదు. అందరి లాగా నేను కూడా, “పాపం ఏబ్రహాం, మేరీతో ఎలా వేగాడో” అనే అనుకున్నాను. కొత్తగా చెప్పేదేం దొరక్క, ఓ పదేళ్ళపాటు ఆ కథని అలానే మగ్గనిచ్చాను. ఇంతలో లింకన్ల దాంపత్యంపై ఒక పత్రికకి వ్యాసం రాయవలసి వచ్చింది. ఆ వ్యాసానికి అవసరమైన సామగ్రి కోసం వెతుకుతుండగా, లింకన్ల రోజువారీ జీవితానికి సంబంధించిన వివరాలతో ఉన్న అరుదైన వ్యాసం ఒకటి దొరికింది – ముఖ్యంగా ఏబ్రహాం లింకన్ భర్తగా ఎలా మెసలుకునేవాడో ఆ వ్యాసంలో ఉంది. అది చదివి, “పాపం మేరీ!, ఏబ్రహాంతో ఎలా వేగిందో” అనుకున్నాను. ఆ క్షణం, వారి దాంపత్యంలో సమానత్వం నాకు అర్థమయింది. ఇక నేను వారి కథ చెప్పకుండా తప్పించుకోలేను. లింకన్ పెళ్ళిరోజున, “Love is Eternal” అని చెక్కిన ఉంగరాన్ని మేరీ వేలికి తొడిగాడు. అదే కథా వస్తువుగా వారి జీవితకథని చెప్పడానికి పూనుకున్నాను.