చెట్టు కింది మనుషులు

పైన రంగు రంగుల ఆకాశం
కింద మర్రి చెట్టు
దాని కింద వీళ్ళు.

నల్లని పాదాలతో
ఆకాశాన్ని తంతున్న
మర్రి ఊడలు
జుట్టు జుట్టూ
పట్టుకుని
చెక్క ఈర్పెనలు
గుప్పు గుప్పుమని
బీడీకి బీడీ జత

పక్షి మాంసంతో
కుండలో
కుతకుతలాడుతున్న
అన్నం
జుర్రుకుందామని
చుట్టూ చేరిన
పిల్లా మేకా
గోల గోల
కేకలకి
అదిగో పారిపోయాడు
చెట్టు మీది బ్రహ్మ రాక్షసుడు.

పైన నల్లని ఆకాశం
కింద మర్రి చెట్టు
దాని కింద వీళ్ళూ
వీళ్ళ మూటలూ
మూటల్లో
రంగు రంగుల
పూసలు
దండలు
దువ్వెనలు.