స్మృతి

ఏది వాస్తవమో ఏది జ్ఞాపకమో
తెలియని అయోమయం కలగా పులగమై
మనసంతా ఆవరిస్తుంది

పొంగే కన్నీటి కెరటాల వెనుక
ఇన్నేళ్ళ మన స్నేహం
తెరిచిన పుస్తకం పుటల్లా రెపరెపలాడుతూ
పదేపదే జాలిగా కదలాడుతుంది

మొన్నటిదాకా కలలో కూడా మరువలేని నీ చిన్నారుల్ని
ఈనాడు హటాత్తుగా దీపంలేని చీకటి ఇంట్లో నిస్సహాయంగా వదిలేసి
నిశ్శబ్దంగా లంగరెత్తి అంధకారపు కడలి కడుపు లోకి
మాయమయ్యే ఒంటరి నావలా నీవు వెళ్ళిపోయే క్షణాన
నీ అంతరంగంలో చెలరేగిన వేదనల తుఫానుల్ని
నీ కళ్ళల్లో గట్టు తెగిన సముద్రాల్ని ఊహించుకున్నప్పుడల్లా
నా గుండె తరుక్కుపోకుండా ఎలా?

అందమైన నీ చిరునవ్వు, ఆరోగ్యంతో తొణికిసలాడే నీ రూపం
గంటలపాటు మనం సాగించిన చర్చలు, ముచ్చట్లు
ఇన్ని సంవత్సరాల మన సావాసపు గలగల నవ్వులు
అన్నీ ఒక్కసారిగా చెమ్మగిల్లిన జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయా?

నిండుగా తాజాగా విచ్చిన నీ జీవన పుష్పం
రేకులు వడలిపోకముందే అంతలోనే
ఇంత బాధాకరంగా ,ఇంత అర్ధంతరంగా రాలిపోవాలా?

సురేఖా, నీ అకాల నిష్క్రమణం తలచుకుని నేను
అశక్తుడి కోపం లాంటి శోకంతో నిలువెల్లా వణికిపోతాను


(నా స్నేహితురాలు, కొలీగ్ డా.సురేఖా ద్వివేది. 03/10/2012)

రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...