మూడు లాంతర్లు – 11

17.

ఇంక రాసే వీలు లేక, ఇది ఇక్కడితో ఆపగలిగితే బాగుణ్ణు అనుకునే పరిస్థితి వచ్చింది నాకు. ఏవో ఆటంకాలు ఒక్కసారే వచ్చిపడ్దాయి. ఒకవైపు అలవాటైన పుస్తకాలకీ, పరిసరాలకీ, మనుషులకీ దూరంగా దేశం వదిలి వేరే దేశంలో ఉండవలసి వచ్చింది. పనులు చాల ఎక్కువ, తీరిక తక్కువ అయ్యింది. ఇంకొకవైపు ఇక్కణ్ణించి ముందుకి చెప్పుకోవలసిన విషయాలేమో చాలా ఉన్నాయి, జటిలంగా ఉన్నాయి; వాటిలో ఏ ఒక్కదాన్ని గురించయినా రాయడం చాల ప్రయాసతో కూడుకున్న పని. ఉదాహరణకు కావ్యాంగాలు ఐదు అని చెప్పుకున్నవి: మాట (Word); రూపకం (Metaphor); పద చిత్రం (Image); ఊహ (Thought); ఉద్వేగం (Emotion). ఇవి జ్ఞాపకం (Memory)తో కలసి ఆరూ సృజన నిర్మాణంలో ఎలా పాలుపంచుకుంటున్నాయి, వీటి మౌలికమైన స్వరూపం ఏమిటి, వీటికి పరస్పరం ఉన్న సంబంధాలు ఏమిటి అనేది ముందుగా చర్చించాలి. ఆ తరువాత సృజన వ్యవస్థలు ఒక్కొక్కదాన్నీ నిర్వచించి, వాటి స్వరూపాన్నీ, పరస్పర సంబంధాలనూ, పైని కావ్యాంగాలు ఈ ఒక్కో వ్యవస్థ నిర్మాణంలో ఏ పాత్ర పోషిస్తున్నాయనేదీ ఎత్తిరాయాలి. సృజన వ్యవస్థలు అన్నీ కలసి ఏక కాలంలో సృజనకు బిగువును, అంటే internal consistencyని, అందాన్నీ ఎలా ప్రసాదిస్తున్నాయనే అంశాన్నీ, ఈ నిర్వహణలో ఒక్కొక్క వ్యవస్థలోనూ ఉత్పన్నమయ్యే గుణదోషాలనూ విచారించాలి.

ఈ బిగువును గురించే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన అనుభవాలూ జ్ఞాపకాలూను అనే పుస్తకంలోన పదే పదే చెప్పుకున్నారు. ఇది ఒక్క స్థాయిలో కాకుండా సృజనలోని అనేక స్థాయిల్లోన, అంటే at different hierarchical scales, ప్రస్ఫుటమౌతుంది. ఉదాహరణకు ఒక శిల్పంలోన అనేక విగ్రహాలుంటే, ఒక్కొక్క విగ్రహపు అంగాలు – శిరస్సు, మొండెం, కాళ్ళు, చేతులూ ఇలాంటి వాటి నడుమ పొందికను సాధించుకోవాలి. అది అవయవాల స్థాయి (scale). అంతకంటె దిగువన శిరస్సులోని కన్ను, ముక్కు, పెదవులు వీటి మధ్యనా పొందిక కుదరాలి, అది ఇంకొక స్థాయి. అంతకంటె ఎగువన అన్ని విగ్రహాల మధ్యా సమన్వయం కుదరాలి, ఇది పై స్థాయి. మాట, పద బంధం, వాక్యం, పేరా, అధ్యాయం, సంకలనం, గ్రంధమాల, సారస్వత సముచ్చయం (Canon) ఇవి వచన రచనలో స్థాయికి ఉదాహరణలు. ఈ పొందిక అనేది ఒక్క కవితతోనో, కావ్యంతోనో ఆగదు. అది ఆ కవి సృజనలన్నిటి నడుమనూ పొందిక, అంటే consistency కావాలన్న ఆకాంక్షతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక కవి జీవితకాలంలోని అన్ని సృజనల నడుమ, అంతే కాక ఆయన సృజనలకూ సారస్వత మూర్తిమత్వానికీ నడుమా సమన్వయాన్ని, పొందికను ఆశిస్తాము. ఇది అక్కడితోనూ ఆగదు. సృజనకారుడు తనకు వారసత్వంగా సంక్రమించిన సారస్వత పరంపర లోన ఒక కాలానికి – అంటే యుగానికి (Age) ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన సృజనకు, సారస్వత మూర్తిమత్వానికీ, అతను బతుకుతున్న యుగ ధర్మానికీ, అదివరకటి సాంస్కృతిక వారసత్వానికీ నడుమనూ పొంతన కోసం వెదుక్కుంటాము.

కాల్పనిక సృజనలోనే కాదు, మిగతా కళారూపాల్లోనూ, శాస్త్ర విజ్ఞానంలోనూ, నిర్వహణలోనూ, ఆత్మీయమైన సంబంధాలవంటి జీవితపు అనుభవాల్లోనూ, ఇలాంటి పొందికను ఆశిస్తాము. దీన్ని గురించి వివరించి చెప్పవలసింది ఉంది. సృజన శరీరానికీ, ఇదివరకు ఉద్వేగ ప్రధానమైనదని చెప్పుకున్న కావ్యాత్మకూ ఉన్న సంబంధ బాంధవ్యాలను వివరించి, అవి ఇదివరకు చెప్పిన దృశ్యాభాసను కవి పరంగానూ, పాఠకుని పరంగానూ – అంటే సృజన అనుక్రమపు రెండు కొసల్లోనూ ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదీ, ఈ వ్యవస్థలకూ పాతకాలంవాళ్ళు వర్ణిస్తూ వచ్చిన రసం, ధ్వని, వక్రోక్తి వంటి ప్రతిపాదనలకూ ఉన్న సారూప్యాలను పరిశీలించాలి. పాతకాలం వాళ్ళు – పింగళి లక్ష్మీకాంతంగారు, నారాయణాచార్యులుగారు, స. వెం. రాఘవయ్యగారు, శ్రీరామ చంద్రుడుగారు, శ్రీపాద వంటివాళ్ళు ఇలాంటి అంశాలను చాల ఆసక్తితో చర్చించేరు. అప్పట్లో వాళ్ళకు లేని వెసులుబాటు, ఇప్పుడు ఉన్నదీ ఏమంటే ఇంగ్లిష్ సారస్వతంలోను, అంతకంటె విశేషంగా మనస్తత్వం, Cognitive Science వంటి వైజ్ఞానిక రంగాలలోనూ అలాంటివే ప్రశ్నలని గురించి చర్చ చాల కొత్త గాను, బహుముఖం గాను, విజ్ఞాన శాస్త్రాలకు సహజమైన నిర్దిష్టత, ప్రామాణికత తోనూ వెలువడుతున్నాది. ఇవి అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ, ఇదివరకు చెప్పినట్లు ఒకే విషయం చుట్టూ మళ్ళీ మళ్ళీ చక్కర్లు కొడుతూ చేసే వివేచనకు ఇప్పుడు మొదటిసారిగా అవకాశం ఉంది.

ఆసక్తి ఉన్నవాళ్ళకు, ఈ వ్యాసంగంతో సంబంధం తప్పనిసరి అయిన వాళ్ళకూ అలాంటి వివేచన సహాయకరంగా ఉంటుంది. సృజన అనుక్రమం (pipeline) అని అనుకున్నది ఒక్క కవీ – పాఠకుల జోడీకే పరిమితమై ఆగిపోయేది కాదు. అది గరిష్టంగా ఒక భాషకు చెందిన మొత్తం సారస్వత సమాజానికీ, ఆ పైన మొత్తం మానవ సమాజానికీ వర్తిస్తుంది. ఇది అర్ధం చేసుకోడానికి ఇది వరకు జలస్రవంతి అని చెప్పుకున్న సాదృశం ఉపయోగిస్తుంది. యుంగ్ (Carl Jung), ఆయన అనుయాయులూ Man and His Symbols, ఇంకా Art and the Creative Unconscious వంటి పుస్తకాల్లోన ఈ విషయాన్ని వివరిస్తున్నారు. జాతి సుప్తచేతనను వాళ్ళు Collective Unconscious అని వ్యవహరిస్తారు. కవి ఒక్కడు కాడు; పాఠకుడూ ఒక్కడే కాడు. వాళ్ళు జాతి సాంస్కృతిక సంపదను, సారస్వత సంపదనూ వారసత్వంగా అందిపుచ్చుకున్నవాళ్ళు. సృజనశీలి తను పుట్టిన సమాజం, భాష, సంస్కృతి, చదువు నుండి ఇక్కడ కావ్యాంగాలు అని వ్యవహరిస్తున్న వాటిని తన యధాశక్తి గ్రహించి, సృజన కోసం వాడుకుని, ‘కెరయ నీరను కెరెగె చల్లి’ గీతంలో అన్నట్టు ఆ చెరువు లోంచి దోయిలించిన నీళ్ళనే మళ్ళీ అదే చెరువు లోనికి జార విడుస్తున్నాడు. పాఠకుల సమాజం ఆ సృజనను తమ యధాశక్తి గ్రహించి, తమ అంతశ్చేతన లోనికి జీర్ణం చేసుకొని మళ్ళీ జాతి సుప్త చేతన లోనికే తమ అభిప్రాయాలు, దృక్పధాలు, భాష, ఆచార వ్యవహారాలుగా తిరిగి సమర్పిస్తున్నాది. జాతీయమైన సృజన అనుక్రమాన్ని ఈ నేపధ్యంలో వివేచించి చూస్తే ఇక్కడ లేవనెత్తిన రెండవ ప్రశ్నకు సహాయంగా ఉంటుంది. అందుకు యుంగ్, ఆయన అనుయాయులు సృజన ప్రక్రియను గురించి ప్రతిపాదించిన విషయాలు వివరంగా ఎత్తి రాసుకోవాలి.

కవి సృజనను కల్పిస్తున్నప్పుడూ, పాఠకుడు దాన్ని పునర్నిర్మించుకుంటున్నప్పుడూ తీసుకొంటున్నవి వందలాదిగా సృజనాత్మకమైన నిర్ణయాలు సృజన వ్యవస్థలకు చెందినవి. ఈ aesthetic decision making ప్రక్రియను కవీ, పాఠకుడూ కలసి నెరపే తీరును, దాన్లోని సాధక బాధకాలనూ కధలు, కవితలు, నవలలు, నాటకాల నుండి ఎన్నో ఉదాహరణలతో వివరించి చెప్పాలి. కాల్పనిక సృజన పదార్ధ శిల్పం కాదు, కుర్చీలు, గోడల వంటి భౌతిక శిల్పం కాదు, కొట్టకొసాకి మాటలతో కట్టినట్టు రూపించినంత మాత్రాన అది భాషా శిల్పం కాదు, అంతిమంగా అది కేవలం తార్కికమైన వివేచనతో కాక, కళాత్మకమైన వివేకంతో కావ్యాంగాలను ఒక్కొక్కటీ ఏరి తెచ్చుకొని, పేర్చి, చెక్కుకునే మనోదృశ్య శిల్పం. దీనికి ఒక నమూనా దృశ్యాభాస అని ఇదివరకు చెప్పినది. ఇంకొకటి కల, మూడవది ప్రయాణం. వీటిలో కల అనేదాని సూచన ఏమంటే పాఠకుడు సృజన అనే కలలోనికి ప్రవేశించేక ఇంక ఎక్కడ ఏ సృజన వ్యవస్థకు ఏ పాటి భంగమయినా కల చెదిరిపోతుంది, పాఠకుడికి ‘మెలకువ’ వొచ్చేస్తుంది, అంటే సృజన అతని యెడల విఫలమయ్యింది. సృజన చదవటం లోనికి ప్రవేశించక ముందు పాఠకుడు లోకవ్యవహారం లోన నిమగ్నమై ఉన్నాడు. శక్తివంతము, అసలీ అయిన సృజన అతని లౌక్యాన్ని అటకాయించి, ఆపి, ధ్యాసను పూర్తిగా తనలో, అంటే తను కల్పించే దృశ్యాభాసలో నిమగ్నం చేసుకుంటుంది. సగటు పాఠకుడికే కాదు, గొప్ప మేధావికి, శాస్త్ర పండితుడికి కూడా సృజన మౌలికమైన స్ఫురణానుభవం ఇలాగే ఉంది. ఇది ఉద్వేగ ప్రధానమైన పరిక్రియ.

ఫ్రాన్స్‌లో డెగా (Edgar Degas) అని ఒక ఆర్టిస్ట్, ఫ్రెంచి కవి మలార్మేకు (Stephane Mallarmé) చిరకాలంగా స్నేహితుడు. డెగాకి కవిత్వం రాయాలని ఉబలాటంగా ఉండేది. ఆయన మలార్మే దగ్గరకెళ్ళి “నేను సంవత్సరాల తరబడి కవిత్వం రాస్తున్నాను. కాని అవి చదివితే నాకే వెగటుగా ఉంటుంది. ఇదేంటి? నా కవిత్వంలో మంచి పదునైనవి, కొత్తవీ ఎన్నో ఆలోచనలుంటాయే?! ఎందుకిలాగ …?” అని వాపోయేడు. మలార్మే “అయ్యో! కానీ …కవిత్వం ఆలోచనలతో కట్టరు; మాటలతో కడతారు. మాటల్ని జాగర్తగా వినాలి.” అన్నాడు. (“Oh, but poetry is not made with ideas; it’s made with words, you have to listen to the words.”) శ్రీపాద ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తారు. త్రిపుర నాకు ఏం చెప్పేరంటే కవి అంతిమంగా సారస్వతానికి ఇచ్చిపోయేది ఆలోచనలని కాదు, మాటలని. (“A poet’s contribution to literature is, ultimately, words, not ideas.”) ఇవి ఎలియట్ (T. S. Eliot) అన్న మాటలు. “Genuine poetry can communicate before it is understood.” అని ఎలియట్ చెప్పినది కూడా సృజనలో ఆలోచనకు, తార్కికమైన అవగాహనకు ఉన్న పాత్ర బలహీనమైనదని విశదం చేస్తున్నాది. సృజన అర్ధం చేసుకునే ప్రయత్నం కంటే ముందుగా అనుభవం అవుతుంది. ఇదివరకు చెప్పిన షావుకారు గారి వంటి పాఠకుడు – అంటే creative reader – ముందుగా సృజనను ఇలా పట్టి చూసి, ముందుకి చదవగలడో లేడో నిర్ణయించుకుంటున్నాడు. ఇలాంటి దార్శనికోక్తుల్ని తరచి చూసి, అవి ఏం ప్రతిపాదిస్తున్నాయో జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంది.

సృజన నమూనాలను, అవి పనిచేసే పద్ధతుల్నీ అర్ధం చేసుకున్న తరువాత, సారస్వత సమాజం, లౌకిక సంఘం సృజనను గురించీ, సృజనకారుణ్ణి గురించీ ఒక అంచనాకు రావడాన్ని ప్రభావితం చేసే సామాజికాంశాలు – ప్రచురణ, సాహితీ స్నేహం, సంపాదకత్వం, ముద్రణ, పరపతి, ప్రచారం, ప్రవాస జీవితం, వనరులు, రాజకీయ వ్యవస్థ, అంతస్థు, సాంఘిక పరిస్థితులు, టెక్నాలజీ – ఇలాంటివాటి ప్రభావాన్ని తప్పనిసరి కాబట్టి కొంతైనా చెప్పుకోవాలి. ఎందుకంటే సృజన బహిరంగ వ్యవస్థను ఇవి తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు సృజనను వెలువరించే సందర్భంలో కవికీ, సంపాదకునికీ నడుమ జరిగే సామనాన్ని, సంఘర్షణను గురించి, సంపాదకుడు నిర్వహించే పాత్రను గురించిన వివేచన తెలుగులో ఏమంత అందుబాటులో లేదు. ఇంగ్లిష్‌లోనూ కొంచెమే ఉంది. శ్రీపాద సుబ్రహమణ్య శాస్త్రిగారికీ, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారికీ ఒక నవల ప్రచురణ సందర్భంలో కేవలం ఒక్క మాటను గురించి నెలల తరబడి నడచిన సంఘర్షణను, దాన్ని నివృత్తి చేసుకోడానికి మధ్యవర్తిని ఆశ్రయించిన వైనాన్నీ ఆయన వివరిస్తారు. సాలింజర్ (J. D. Salinger) ఇలాగే తన సృజనల్లోన కామాలు, చుక్కల్ని గురించి సైతం పరమ చాదస్తంగాను, కఠోరంగానూ ఉండేవాడట. (He strove for absolute perfection in his writing and sought complete power over its presentation. When a copy editor at the New Yorker dared to remove a single comma from one of his stories, Salinger snapped. “There was hell to pay,” recalled William Maxwell, and the comma was quickly reinstated.) సృజన ఆవిష్కరణలో కవి, మొదటి పాఠకుడు, సంపాదకుడు, ముద్రాపకుడు వీళ్ళ నడుమ జరిగే సామనం ఒక్కటి విచారించడానికే చాల అన్వేషణ ఉంది, వ్యవధి కావాలి. ఈ పనులన్నింటిలోనా ప్రతి అడుగూ ఇదివరకటి ఆలోచనల్ని, పుస్తకాల్ని, పరిశోధన పత్రాల్ని వెదుక్కొని, తరచి చూసుకొని, వివేచించి ఎత్తిరాసుకోవడానికి సమయం కావాలి, అదిన్నీ ఒంటరిగా కూర్చొని పనిచెయ్యగల అవకాశం. ప్రయాస ఏమీ లేదు ఎందుకంటే ఇది నాకు ఇష్టమైన పని, సహాయకరమైన పని కాబట్టి. వెతకడం, చదవడం ఎలాగూ నేను తప్పనిసరిగా చేసే పనులు. కాని, రాయడం దగ్గరకి వచ్చేసరికి అది ఎంతో ప్రయాస, సమయం తీసుకొనే పని.

ఇవిలా ఉంటే ఈ అడ్లు చాలవన్నట్టు పులి మీద పుట్ర లాగ నాకు ఫణిబాబు పరిచయమయ్యేడు. అంటే – నేనే వెదికి, వెదికి వెళ్ళి స్నేహం చేసేను. అణువులు, పరమాణువులు ఇలా పరిశోధించేవాళ్ళు ఏవేవో చదువుకుని, పరిశోధించి ఏదో కొత్త పరమాణువు ఒకటి ఉంటుంది అని రకరకాలుగా ఊహిస్తుంటారు, ప్రతిపాదిస్తారు. అలాంటివాళ్ళకి ఒక రోజు హటాత్తుగా వాళ్ళు వర్ణిస్తున్న వస్తువే నిజంగా కనిపిస్తే మరి ఒకేసారి వెర్రి సంతోషం, దుఃఖం – యురేకా! యురేకా!! లాగ. ఫణిబాబుని కలుసుకున్నాక నాపనీ అలాగే అయ్యింది. సృజనశీలి అని ఇలాగ అలాగని నేను రకరకాలుగా వర్ణిస్తూ వస్తున్నది యదార్ధంగా కళ్ళెదుటే ఉన్నట్టు ఉన్నాడు, ఊహిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, రాసుకుంటున్నాడు. అందరం కావాలనుకునేవి – చదువు, ఉద్యోగం, ఇల్లు, అంతస్థు ఇలాంటివి ఏవీ పట్టించుకోకుండా సృజన వ్యాసంగం – చదువుకోడం, రాసుకోడం, ఆలోచించడం, నచ్చితేనే మాట్లాడ్డం, వీటిమీదే ధ్యాస పెట్టుకుని బతుకుతున్నాడు. తను దర్శిస్తున్న సృజన స్వరూపం తప్ప ఇంక ఏం మర్యాదా మప్పితం లేకుండా, ప్రదర్శన, ప్రతిష్ట అంటే ఖాతరు లేకుండా ఉన్నాడు. సృజన రంగాన్నే నమ్ముకుని ఎన్ని దెబ్బలు తింటున్నా ఆ ఆటుపోట్లన్నీ తట్టుకొని కూడా ఎంత మాత్రం రాజీ పడకుండా, క్రుంగిపోకుండా ఇదే నాకు కావాలి అని భీష్మించుకున్నాడు. మర్యాద కోసమో, సామరస్యం కోసమో, ఈసు కోసమో, ఉక్రోషంతోనో, బోరుకొడితే కాలక్షేపం కోసమో కాక, తన్ని చాలా వేధించే ప్రశ్నలని అర్ధం చేసుకోవడం కోసం ఇంక విధి లేకపోతేనే చర్చ జోలికి పోతాడు. నేను కొంత కాలం ఇతను ఎలా బతుకుతాడు, ఏమైపోతాడు అని బెంగ పెట్టుకున్నాను. ఇంకొంతకాలం అతని ప్రతిభను, పట్టుదలను, వివేకాన్ని తలచుకొని కులికి చాలా సచ్చేను. ఎందుకు అంతలా చలించిపోతున్నావు? అని మా ఇంట్లోవాళ్ళూ, నన్ను నేనే పదిసార్లు, పాతికసార్లు అనుకున్నాము. ఫణిబాబునే అడిగేను. ‘ఏమో, నాకేం తెల్సండీ…’ అన్నాడు. అతనికి నేను ఊహించేవీ, చెప్పదల్చుకున్నవీ ఇంకా నోట్లో మాట బయటికి అనకుండానే అర్ధం అవుతాయి. అతను అనుకునేది నాకూ అలాగే. నేను ఇదివరకెప్పుడూ అనుకునేవాణ్ణి: ఐర్లండ్ లాంటి చిన్న చిన్న దేశాల్లోన, మొత్తం జనాభా అరకోటి కూడా ఉండని జాతుల్లో సృజన తీవ్రమైన స్వభావంగా ఉండేవాళ్ళు, సృజనకే కట్టుబడి ఉండేవాళ్ళు ఎందరో ఉన్నారు. మనం పదికోట్లన్నా జనాభా ఉంటాము, ఇంతమంది జనంలో అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడో తప్పకుండా ఉండే ఉంటారు, బయటికి కనిపించరు అంతే అని. ఫణిబాబుని చూసి నేను అనుకున్నది, రాసేదీ నిజమే అని నాకే రూఢి అయ్యింది. ఆడబోయిన తీర్ధం, రాసినదానికి బహుమానం; ఇంక రాయకపోతేనేమి, ఇంక చాలు అనుకున్నాను.

రాయడంలో నాకు కనిపించే ఒకటే ప్రయోజనం ఏమిటంటే అది ఈ చదువుకున్నదాన్ని, ఆలోచించినదాన్ని అంతట్నీ ఒకచోట ప్రోది చేసుకొని, అంతా మననం కావడానికి నా ఒక్కడికే పనికొస్తుంది. అంటే Writing as thinking అని ఇదివరకు చెప్పినట్లు. తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు. అంతకు మించి రాసింది ఎవరికైనా పనికొస్తుందని తోచదు. ఫణిబాబు ఉన్నాడు కాబట్టి అతనితో మాటాడొచ్చు, ఇంక ఇది రాయక్కర్లేదు అనుకున్నాను. నేను రాసుకొనేవాటికి ఒకే ఒక్క పాఠకుణ్ణి నేనే. ఎందుకు రాస్తున్నావు? అంటే ఒక్క కనక ప్రసాదు కోసమే రాస్తున్నాను అని. మనం రోజూ అన్నం తినేటప్పుడు ఉన్నతమైన తెలుగు సస్యసీమల భవిష్యత్తు కోసమో, తెలుగు పిండివంటల భవిష్యత్తు ఏమవుతుందోనని బెంగపెట్టుకునో అన్నం తినము. మనకి ఆకలేస్తోంది కాబట్టి, తప్పనిసరై అన్నం – లేదూ ఏది దొరికితే అదీ తింటాము. ఎవరైనా ‘మేము, మీ పాఠకులం …’ అని బహువచనంలో రాస్తే నాకు అపనమ్మకం గాను, నౌతాలు గానూ ఉంటుంది. పగలబడి నవ్వుకుంటాను. ఎందుకంటే ఇదివరకే చెప్పుకున్నట్టు నేను ఏవీ ఒక పట్టాన చదవలేను, నొప్పెడుతుంది. ఎంతో పేరు మోసినవారి రచనలను తెచ్చి ముందు పెట్టి ‘ఇదిగో! విశ్వనాధవారి నవల, కృష్ణశాస్త్రిగారి కవిత – పెద్దవారివి, చదువు!’ అన్నా సరే నేను ముందుగా వాటి ఔద్వేగిక ఆవరణలోని పటుత్వాన్నీ, కాంతినీ, స్వఛ్ఛతనూ పరిశీలించి, ఒద్దకపోతే సాయించక ఇంక ముందుకు పోలేను. మరి నేను రాసేవీ ఇంకొకరు చదివేము అని నాతో చెప్తే ఆశ్చర్యంగా, అపనమ్మకంగా ఉంటుంది. వీళ్ళకి నొప్పెట్టదా?! అని. నేను రాసేవి పొరపాటున ఎవరైనా చదివితే వాళ్ళను నొప్పిస్తాయేమో, ఏమైనా హాని అవుతుందేమోనని, మనోభావాలు దెబ్బతింటాయేమోనని నాకు అనుమానం, దిగులు. సంపాదకుల్ని ఈ ఒక్క విషయం మాత్రం చూసి, ఏ హానీ లేదని అనిపిస్తేనే ప్రచురించండని అడుగుతుంటాను. ఎవరూ చదవకుండా ఉంటే ఈ బెంగ తీరిపోయింది. కాయితం మీద ప్రచురించకుండా ఉంటే తెల్ల కాయితం, సిరా ఇంక దేనికైనా పనికొస్తాయి; హరితవనాలు కొన్నైనా బతికిపొతాయి.

ఈ వ్యాసం విషయంలోన ఆ బెంగ తీరదు. నాకు దీన్ని చదువుతున్నామని ఇద్దరు, ముగ్గురు చెప్పేరు. అంతే కాక సృజన తత్వాన్ని గురించీ, జూటా అంటే ఏమిటనీ ఇలాగ ప్రశ్నలు కూడా అడిగేరు. ఆదివారం మధ్యాహ్నాలు కవితను గురించి రాస్తే అలా కాక మరి ఇంకెలా రాసి ఉండవచ్చునని, ఆ కవితను నేను ముందే చూసి ఉంటే ఏవైనా సలహాలు ఇచ్చుండేవాణ్ణి కదా అనీ ఇలాగ. ఇవి చూసి నాకు ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యీ అన్నట్టు తయారయ్యింది. ఈ రాసేదాన్ని అర్ధంతరంగా ఆపేస్తే దీన్ని చదివిన ఇద్దరు, ముగ్గురు పాఠకుల్లోనూ అనవసరంగా, అన్యాయంగా కొత్త అపోహలనూ, కొంత అయోమయాన్నీ కల్పించిన వాణ్ణవుతానని, వాళ్ళ సృజన వ్యాసంగాలకు అనవసరంగా అడ్డం వచ్చినట్టు అవుతుందనీ తోస్తున్నాది. మరీ అర్ధంతరంగా ఆపీకుండా ఈ ఒక్క ఇబ్బందినీ కొంతైనా నివృత్తి చేసుకోడానికి అవసరమైనది మాత్రం రాసి, కనీసం కామా పెట్టినట్టు అయ్యేక ఇంక ఊరుకుందామని అనుకున్నాను.


“A creative writer is one for whom writing is a problem.”

– Ronald Barthes

ఇప్పటివరకు స్పృశిస్తూ వస్తున్నవి రస చర్చకు, సౌందర్య శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు. రసం, సౌందర్యం అనే మాటలు ఇంగ్లిష్‌లో Affect అనే మాటకు సమానార్ధకాలుగా అనుకుంటున్నవి. వీటికి విమర్శతోను, మంచి రచనలు ఎలా చెయ్యాలి (How to…), మంచి సాహిత్యం భవిష్యత్తు ఎలా కాపాడుకుందాము? వంటి చర్చ తోను ప్రత్యక్షమైన సంబంధం లేదు. వాటిమీద నాకు ఆసక్తి లేదు. సృజనల్లో నేను వెతుక్కొనేది నైసర్గికమైన, పరిపూర్ణమైన సౌందర్యాన్ని, affectను. ఎందుకు? అంటే ఏమో నాకు తెలీదు. తప్పనిసరిగా ఇలా వెతుక్కొని రాసుకున్న వాళ్ళు ఉన్నారు. స్థూలంగా ఇలాంటి వివేచనను Aesthetics అనుకోవాలి; కాబోలు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఇలాంటి ప్రశ్నల్నే కొన్నింటిని విశేషంగా చర్చించేరు – కవి మనఃస్థితి ఏమిటి, కవికీ పండితుడికీ తేడాలేమిటి, కవికి కవిత్వం ఎందుకు తప్పనిసరి, కవికీ లోకానికీ సంఘర్షణ ఎందుకు – ఇలాంటి ప్రశ్నలు. ఆయనకు సాంప్రదాయికమైన చదువే ఉంది. ఆధునిక విజ్ఞానాన్నీ, శాస్త్రాలనూ ఆయన చదువుకోలేదు, ఇంగ్లిష్ చదువుకోలేదు. ఆయన ఆలోచనలు, ప్రతిపాదనలూ కొత్తగా, లోతుగా ఉన్నా పరిభాష పాతదే ఉంటుంది – రసం, ఆత్మానందం, ఋషి, బ్రహ్మానందం, ధ్వని, వక్రోక్తి, సమాధి ఇలాగ. ఇలాంటి పరిభాషకు విజ్ఞానశాస్త్ర పరమైన ప్రాతిపదకలు లేవు, ఏ ఉనికీ లేదు కాబట్టి ఆధునికులకు ఇప్పుడివి చిత్రంగా, చాదస్తంగానూ తోస్తాయి. కాని ఆ పరిభాష వెనుక ఆయన వంటి వాళ్ళు చేసిన ప్రతిపాదనలకూ ఇప్పుడు సృజన చుట్టూ ఆధునిక విజ్ఞానం లోన కొత్తగా ప్రతిపాదిస్తున్న సంగతులకూ అంగీకారం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. శాంటాయన (George Santayana) అని ఉండేవారు. ఆయనా అలాగే వెదుక్కొని The Sense of Beauty అని చాలా కాలం వివేచించి, రాసుకున్నాడు. పుట్టపర్తి నారాయణాచార్యులుగారు ఇలాంటి వెదుకులాటను తీవ్రమైన రసదృష్టి అని చెప్పుకొనేవారు. దీన్ని విమర్శ కోసం, సలహా సంప్రదింపుల కోసం డైరెక్టుగా అన్వయించుకొనే ప్రయత్నం చేస్తే అది పదుగురి సృజన వ్యాసంగానికి ఇబ్బంది, అంటే disservice అయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు చేత్తో, చేతి వేళ్ళతోనే వేలాది పనులు, వృత్తులన్నిట్నీ నిర్వహించుకుంటాము. చెయ్యి ఎలా పని చేస్తుంది, వేళ్ళెలా పని చేస్తాయి? అనేది ఒక ప్రత్యేకమైన వివేచన. అది కుండలు ఎలా చేస్తారు? కుట్లు ఎలా అల్లుతారు? వంటి నిర్దిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి పనికిరాదు. అలాగే సృజన ప్రక్రియను, తత్వాన్నీ గురించిన వివేచన నుండి నిర్దిష్టమైన సృజనల్ని గురించి సలహా, విమర్శ, మూల్యాంకనం, బేరీజు, దిద్దుబాటు ఇలా ఏమీ ఆశించలేము. రచనల మంచి చెడ్డలని విచారించే పని – అంటే విమర్శను, దిద్దుబాటును, సిఫారసును నాకు అప్పగిస్తే చాల పొరపాటు అవుతుంది. అనవసరంగా నొప్పెడుతుంది. నాకు ఉన్నవి ఏవీ ఒక పట్టాన నచ్చవు. ఉండీలేనిదేదో వెతుక్కుంటాను.

రక రకాల జీవితానుభవాలతో, ఆసక్తితో రాద్దామని ప్రయత్నం, సాధన చేసేవాళ్ళు, రాసేవాళ్ళు, ప్రచురించేవాళ్ళు, ఆత్రంగా చదువుకునేవాళ్ళు వీళ్ళందరూ ‘కవులే’. అంతే కాక, సృజన ఆవిష్కరణలో కవి ఒక్కడికే కాకుండా, తొలి పాఠకుడు, సమీక్షకుడు, సంపాదకుడు, ప్రచురణకర్త, ముద్రాపకుడు వీళ్ళందరి ప్రమేయం, ప్రభావం విశేషంగా ఉంటాయి. సృజన మీద, అభ్యాసం మీద ధ్యాస ఉన్న కవులు వ్యక్తిగతంగా జవాబులు వెదుక్కొనే ప్రశ్నలు ఏమంటే నేను ఈ కవిత రాసేను, కధ రాసేను. ఇది బాగుందా, లేదా? దీన్ని ఎలా మెరుగు పెట్టుకోవాలి? ఇది పూర్తయ్యిందని నాకెలా తెలుస్తుంది? దీన్ని ప్రచురించేదా వద్దా? ఇలాంటివి. అసలు దీన్ని రాయాలన్న కోరిక ఎందుకు నాకు? అనీ. ఇవి వ్యక్తిగతమైన ప్రశ్నలు. అలాగే, సామాజిక స్థాయిలోన అభ్యుదయ సాహిత్యం, మార్క్సిస్ట్ సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం వంటివి లేవనెత్తేవీ మనుగడకు అనివార్యమైన ప్రశ్నలు. అవి ప్రాతినిధ్యం వహించే సృజన అవసరంగా, అనివార్యంగా వెలువడేది. అవి మానవ సమాజాల్లోన అత్యధికుల స్థితినీ, వేదననూ చిత్రిస్తున్నాయి. వాటికి తమవే ప్రత్యేకము, నిర్దిష్టమైన సృజన సాంప్రదాయం, విమర్శ సాంప్రదాయం ఉన్నాయి. మొదటిది కనీస అవసరాలు తీర్చుకోవడమే పెద్ద కష్టం, ప్రశ్న అయినవాళ్ళ దుఃఖం నుండి అవసరంగా వెలువడేది. రెండవది ఆడవాళ్ళ కష్టం నుండి అవసరంగా వెలువడేది. అవి చిత్రించే దుఃఖం, వేదన, నొప్పీ కోట్లాది మనుషులవి మౌలికం, అతివేలమైన ఔద్వేగిక అనుభవాలు. సృజన మౌలికమైన తత్వాన్ని, స్వరూపాన్ని గురించి మాత్రం ఇక్కడ చర్చించే ప్రశ్నలు మనుషులందరికీ సామాన్యం, మౌలికమైన స్ఫురణ అనుభవానికి చెందినవి. వాటికీ పైన పేర్కొన్న ప్రత్యేకమైన సృజన పద్ధతులకూ మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు. అవి ఒకదాన్నొకటి రద్దు చేసుకోవు. ఇక్కడ లేవనెత్తినవి Authenticity వంటి ప్రశ్నలు ఈ రెండు పద్ధతుల్లోనూ ఇదివరకే చర్చింపబడినవి.

యూలండ్ (Brenda Ueland) అని ఉండేవారు; 1938లో ఆవిడ ఒక పుస్తకం ప్రచురించేరు: If You Want to Write: a Book about Art, Independence and Spirit అని. ఆ పుస్తకాన్ని సృజన ఒక తప్పనిసరి స్వభావంగా, అవసరంగా ఉండీ దాన్ని ఎలా నిర్వహించుకోవాలో, ఏం చెయ్యాలో, అసలు రాయాలో వద్దో అని ఇలాంటి ప్రశ్నలతో సతమతమయ్యేవాళ్ళు చాలా నెత్తిన పెట్టుకుంటారు, ఈ నాటికీ. ఆవిడ శైలి బాగా నాటకీయంగా, 1930ల నాటి వాతావరణానికి అనువుగా ఉషారు మాటలు (pep talk) లాగ ఉంటుంది. కాని ఆవిడ పుస్తకంలోని విషయాలు సృజనకారులకు ఈనాటికీ పనికిరావచ్చు. ఇలాగని చదివిన వాళ్ళందరూ, ఔత్సాహిక రచయితలు కృతజ్ఞతతో చెప్పుకుంటుంటారు. మచ్చుకి కొన్ని విషయాలు. త్రిపుర, నారాయణరావుగారు చెప్తున్నట్టే ఆవిడ కూడా రాయాలని ఉత్సాహం ఉన్నవాళ్ళు అందరూ ఎలాంటి సంకోచం, బెరుకు లేకుండా తప్పకుండా, నిరభ్యంతరంగా రాసుకోవాలని పదే పదే చెప్తారు. రాయాలి అని అనిపించడమే ప్రధానమనీ, రాసుకోవడం చాల అవసరమైన, ఆరోగ్యకరమైన పని అనీ ఎందుకో వివరించి చెప్తారు. ప్రజాస్వామ్యవాదం కూడా ఇలాంటి నిర్ధారణలనే ప్రతిపాదిస్తుంది. అంటే – మనుషులందరూ సమానం కాబట్టి అందరికీ రాసే హక్కు, భావ ప్రకటనా స్వేఛ్ఛా ఉన్నాయి కాబట్టి, అందరూ రాయాలి, అవన్నిటినీ అందరం గౌరవించాలి అని. లెఖ్ఖల పరీక్షలో ఒక్కొక్కసారి తెలివైన విద్యార్ధులు జటిలమైన ప్రశ్నలకి తప్పుడు పద్ధతుల్ని అనుసరించి కూడా సరైన సమాధానాన్నే కనుక్కుంటారు చివరికి. అంటే అసంగతమైన ప్రాతిపదికల మీదుగా చివరికి సరైన జవాబునే రాసి చూపిస్తారు. జవాబు సరైనదే కాబట్టి పట్టి చూడకుండా ఉంటే అలాంటి జవాబులకీ మంచి మార్కులే పడుతుంటాయి. సృజన వివేచనలో మేధావులైన ప్రజాస్వామ్యవాదీ, లౌక్యుడైన వ్యవహర్తా, రాజనీతిజ్ఞుడి ప్రతిపాదనలు ఇదిగో ఈ తెలివైన విద్యార్ధుల తప్పు లెఖ్ఖల్లాంటివి. ఎందుకంటే అవి సృజన అనుభవం ప్రాతిపదికగా కనుక్కున్న సమాధానాలు కావు. అలాంటి నిరుపయోగమైన మర్యాద ప్రాతిపదికగా కాకుండా, సృజన అనుభవం, కళాత్మకమైన అభ్యాసం ప్రాతిపదికలుగా ఇలాంటి ప్రశ్నలతో ఎలా సమాధానం పడవచ్చునో యూలండ్ వివరిస్తారు.

రాసింది ఎవరికి చూపించాలి? ఎవరి సలహా తీసుకోవాలి? అని ఇంకొన్ని ప్రశ్నలు కవికి. మనం సాధారణంగా విమర్శకులకు, నిర్వాహకులకు, మంచి రచయితలు, కవులని పేరున్న వాళ్ళకూ, తెలివితేటలున్న వాళ్ళకీ చూపిద్దామని అనుకుంటాము. ఆవిడ అలా ఎంతమాత్రం చెయ్యొద్దని చెప్తారు. ఈ తెలివైనవాళ్ళూ, శక్తిమంతులూ ‘ఇదింకా ఇలా మారిస్తే బావుంటుంది, అది అలా రాస్తే బావుంటుంది’ అని నొక్కే నొక్కులు, తమ దృష్టితో, నైపుణ్యంతో మార్పులూ చేర్పులూ చెయ్యబోయే ప్రయత్నాలూ అవి ఎంత వినయంగా, మర్యాదగా, అభిమానంగా, పెద్దరికంగా చెప్తున్నప్పటికీ అసలే సున్నితంగానూ, సంశయాత్మకంగానూ, వేదనాభరితంగానూ ఉన్న కవి పనినీ, కల్పననూ నిరుత్సాహ పరచే అవకాశమే ఎక్కువ అని. ఇది నేనూ ఒప్పుకుంటాను. మొదటి పాఠకుణ్ణి చాల జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని ఆవిడ చెప్పింది. ఊరికే వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ పొగిడేవాళ్ళ వలనా సహాయం లేదు; బూరెల్లో పురుగులెంచడమే ప్రవృత్తిగా ఉన్నవాళ్ళ వలనా సాయం లేదు. ఎప్పుడో చాన్నాళ్ళ కిందట నేను పాటలు రాసేవాణ్ణి. అలా రాసిందొకటి తీసుకెళ్ళి మా అన్నకి చూపించేను. వాడు అది వింటూ వింటూనే వాకిట్లో కళ్ళు తేలేసి పడిపోయినట్టు ఏక్షన్ చేసి ‘ఒరే! నేను లేను, నీ పాట ఉంది!!’ అన్నాడు, తిలక్ కవితని పేరడీ చేస్తూ. దాన్ని అక్కడితో ఆపీసేను. జోక్ మాత్రం ఇప్పటికీ నవ్వొస్తుంది. బ్రెండా యూలండ్ ఏమన్నారంటే కవి వేరే ఎవర్నీ సంప్రదించకుండా తనంటే, తన పని అంటే బేషరతుగా అభిమానం, ప్రేమ ఉండే మనుషులకు చూపించి ఊరుకోమని. అంటే భార్య, భర్త, పిల్లలు, సాహితీ స్నేహితులు కాకుండా మామూలుగా స్నేహితులు ఉంటే అలాంటివాళ్ళకూ మాత్రమే చూపించమని.

ఎవరినుండీ ఒప్పుకోలును, ప్రశంసను ఆశించకుండా ఊరుకోవడం సులభం కాదు కాని, అలవాటయితే అభ్యాసానికి ఎంతో స్వేఛ్ఛగానూ, చాల హాయిగానూ ఉంటుంది. నల్లమందు, సిగరెట్లు లాంటివి బాగా అలవాటయి పోయినవాళ్ళు అది రోజూ తగిన మోతాదులో పడితే గాని ఉండబట్టక విలవిల్లాడతారు. కాని అలాంటి అలవాట్లు కూడా ప్రయత్నం చేసి, సాధన చేసి మానుకున్న వాళ్ళనీ చూస్తాము. ప్రశంసను ఆశించటం సహజం కాదా! అది ఇబ్బందెలా అవుతుంది? అంటే అది సృజన Authenticityని వేరు పురుగులాగ ఎలా తొలుస్తుందో, ప్రదర్శన, ప్రశంస, మూల్యాంకనం, మర్యాద ప్రాతిపదికలుగా నెరపే సాహితీ నిర్వహణ సృజనకారులని, సృజన వ్యవస్థనూ, బయట మెరుగైన డొల్లను గొప్ప పూనికతో నిర్వహిస్తూనే లోపట్నుండి ఎలా పట్టి పల్లారుస్తుందో చాల వివరంగా, విడిగా, ఎందరో కళాకారుల చరిత్రలను పరామర్శిస్తూనే చెప్పాలి తప్ప ఇంకోలా వీలు లేదు. స్థూలంగా చెప్పుకోవాలంటే ప్రదర్శన మీద ధ్యాస అభ్యాసానికి, సృజన నిష్టకూ అడ్డొస్తుంది. ఒక రోజు వయొలిన్ మేష్టారు ఒకాయన ఇంట్లో కూర్చున్నాము. ఆయన ఒకబ్బాయికి పాఠం చెప్తున్నారు. ఆ అబ్బాయి చాల హృద్యంగా వాయిస్తుంటే కూర్చున్నవాళ్ళందరం ఇష్టంగా, మెచ్చికోలుగా వింటున్నాము. ఆ అబ్బాయి అది చూస్తూనే ముందుకి మరింత ఉత్సాహంతో ఇంకొక పాట వాయిస్తుంటే మేష్టారు హఠాత్తుగా కోపగించుకుని ఆ అబ్బాయి భుజమ్మీద చెయ్యి వేసి ఆపి, కమాను పట్టుకున్నారు. ఆ అబ్బాయితో సహా అందరం తెల్లబోయేము. అప్పుడూ మేష్టారు ‘నువ్వు అభ్యాసం కోసం వాయించినంత సేపూ హాయిగా ఉన్నాది. అలా కానివ్వకుండా నువ్వు ప్రదర్శన కోసం వాయించడం మొదలెట్టేవు. అది నీ అభ్యాసానికి అడ్డొస్తోంది ఇంక. You’re supposed to be practicing here. Do not perform!’ అని చీవాట్లు పెట్టేరు.

సృజనా స్రవంతి కాలం మీద క్రమంగా మూల్యాంకనం, మర్యాద పునాదులుగా పరస్పరం ప్రశంస, ప్రదర్శన, ప్రతిష్ట ప్రఛ్ఛన్నమైన లక్ష్యాలుగాను కట్టిన వ్యవస్థగా మళ్ళీ మళ్ళీ పతనమౌతుంటుంది. అది అందించ గలిగిన రచనలు చాల అభిలషణీయమైన ఆదర్శాలతో, అందమైన భాషతో, నవ్యము, గొప్ప పదునూ అయిన ఆలోచనల్తో రకరకాలుగా అలంకరింపబడి కూడా నిర్జీవంగా ఉండి నిరాశనే మిగులుస్తాయి. సారస్వతం ఒక్కటే కాదు, తెలుగులో అనే కాదు; అన్ని కళారూపాలకూ, ఇంగ్లిష్ వంటి భాషల సారస్వతంలోనూ ఈ అవస్థ ఉంది. నేను త్రిపురని అడిగడిగి కాల్చుకుతిన్న ప్రశ్నల్లోన మొదాటిదే ఏమిటంటే ‘త్రిపుర! అచ్చులో ఇన్నేసి వొస్తుంటాయి. సాహిత్యం!! సాహిత్యం!! అంటారు, నాకు అలాగ అనే అనిపించదు. ఎందుకు?’ అని. ఆయన అలాగ చూసి, చూసి “That is because it isn’t literature. It is something else.” అని నవ్వుతున్నారు. టెలిఫోన్ డైరెక్టరీ, రైల్వే టైంటేబిల్ వంటివి కూడా తెరిచి చూస్తే ఒకటి రెండు మాటలు చదివీ ఏదో ఒక కొత్త కాల్పనిక లోకంలోనికి పోవచ్చు కదా. అలాగని అచ్చులో వచ్చినదల్లా సాహిత్యం అని అనుక్కోలేమూ అన్నారు. ఎవరో కావాలని చేస్తున్నారని కాదు. సృజన నిర్వహణ చాల కష్టసాధ్యమైన పని. దీన్ని గురించి జిడ్డు క్రిష్ణమూర్తి గారు చెప్పిన కధ ఉంది. ఒకరోజు సైతాన్, అతని స్నేహితుడూ సరదాగా తోటలో షికారెళ్తున్నారు. వాళ్ళకి ఎదురుగా ఒకతను నడుస్తూ వచ్చి, హటాత్తుగా వంగి ఒక మెరుస్తున్న వస్తువును తీసి, గొప్ప సంతోషంతో జేబులో వేసుకున్నాడు. పొంగిపోయి పరిగెడుతూ వెళ్ళిపోయేడు. సైతాన్ స్నేహితుడు సైతాన్ని ‘వాడు ఎందుకలా పొంగిపోతున్నాడు?’ అనడిగేడు. సైతాన్ తాపీగా “ఆఁ, ఏంలేదు! వాడు ఎన్నాళ్ళుగానో సత్యం కోసం వెతుక్కుంటున్నాడు. అది దొరికింది, అందుకే ఆ సంబరం!” అన్నాడు. అప్పుడు స్నేహితుడు కంగారుగా “అయ్యో! మనిషికి సత్యం దొరికేస్తే నీకు చాలా ప్రమాదం కాదా?” అన్నాడు. సైతాన్ ఏమీ తొణక్కుండా “ఏం కంగారు పడకు. ఇప్పుడు వాడు వెళ్ళి ఆ సత్యం చుట్టూ ఒక వ్యవస్థని నిర్మిస్తాడు. దాని రంధిలో పడి సత్యాన్ని వాడంతట వాడే పోగొట్టుకుంటాడు. వాడి కధ మళ్ళీ మామూలే!” అన్నాడట. సృజనకూ ఇది వర్తిస్తుంది.

కొత్తగా ఎవరైనా ప్రతిభావంతులు కనిపిస్తే వాళ్ళ సృజనను సాహిత్యం అనే వ్యవస్థ ఇలాగే నెమ్మది నెమ్మదిగా దువ్వి, సన్మానం చేసి, మచ్చిక చేసుకొని, రాజీ చేయించి, సృజనాంతరంగాన్ని కబళించి చివరికి నిర్జీవంగా ‘మహాకవి’ వంటి డొల్ల పేరును, ప్రతిష్టనూ మోసుకు తిరిగే zombie ప్రేతాల్లా మరుస్తుంది. మర్యాదపూర్వకమైన ప్రదర్శన బారినుండి తోటకూర నాడే ఎలా తప్పించుకోవచ్చునో యూలండ్ వివరిస్తున్నారు. ఆసక్తి ఉన్నవాళ్ళకు ఉపకరిస్తుంది. బలమైన కళాకారుడు ఈ రంధి నుండి ఎలా తప్పించుకుంటాడో అందుకు సమున్నతమైన నిదర్శనం త్రిపుర. జిడ్డు క్రిష్ణమూర్తి గారి మాటలే జ్ఞప్తికి వస్తాయి:

“Why is there this everlasting craving to be loved? Listen carefully. You want to be loved because you do not love; but the moment you love, it is finished, you are no longer inquiring whether or not somebody loves you. As long as you demand to be loved, there is no love in you; and if you feel no love, you are ugly, brutish, so why should you be loved? Without love you are a dead thing; and when the dead thing asks for love, it is still dead. Whereas, if your heart is full of love, then you never ask to be loved, you never put out your begging bowl for someone to fill it. It is only the empty who ask to be filled, and an empty heart can never be filled by running after gurus or seeking love in a hundred other ways.”

ఆయన మాటల్లోన loveకి బదులు praise అని రాస్తే అది సృజన అభ్యాసం విషయంలో సహాయంగా ఉంటుంది. ఎవరిమీద వాళ్ళకు ఉండే అభిమానం, అంటే స్వాభిమానమే స్థైర్యానికి పునాది. అది గీర, ధిషణ ఇలాంటివాటికి భిన్నమైనది. అది సాధించుకున్న సృజనశీలి తనలో తాను ‘నెంబర్ వన్ పుడింగి’. అప్పుడు ఇంక ‘నేను రాసింది చదవవా, అభిప్రాయం చెప్పవా, మెచ్చుకోవా, అచ్చు వెయ్యవా?’ అని కులం, లింగం, మతం, ప్రాంతాల వారీగా వరుస బిచ్చానికి ఏ సాహిత్య గురోజీ యెదుటా దేబిరించనక్కర్లేదు. దీన్ని గురించి యూలండ్ వివరించి చెప్తారు.

ఆవిడ ఇంకొకటి చాల పరిచితమైన సంశయాన్ని చర్చిస్తారు. అదేమంటే, ‘ఎందుకు రాస్తున్నాను, నలుగురికీ చూపించుకుని, ప్రచురించుకుని బడాయి పోదామనా?’ అనేది. ఈ ప్రశ్నకు చిక్కుకున్నవాళ్ళు రాయడమే మానుకుని, బిగదీసుకుని కూర్చునే అవస్థ ఉంది. ఇది సృజనకు ప్రాణప్రదమైన అభ్యాసానికి అడ్డం వస్తుంది. ఈ ప్రశ్నతో ఆవిడ ఎలా కొట్టుమిట్టాడిందో, చివరికి ఎలా బయటపడిందో వివరించి చెప్తుంది. ఇంకొకటి, ఈ వ్యాసంలోనే చర్చిస్తూ వచ్చిన ప్రశ్న. సృజనల్లో జూటా అంటే ఏమిటని. Authenticity గురించిన ఈ విషయాన్ని ఆవిడ విస్తారంగా చర్చిస్తారు. సృజన ఔద్వేగిక వ్యవస్థలోన స్వఛ్ఛత అని, కపటం లేని కాల్పనిక ధార అనీ అంటూ వస్తున్నదాన్ని సాధించుకోడాన్ని గురించి ఆవిడ Microscopic Truthfulness అనే పేరిట కొంతవరకు వివరిస్తారు: “But we must try to find our True Conscience, our True Self, the very Center, for this is the only first-rate choice-making center. Here lies all originality, talent, honor, truthfulness, courage and cheerfulness. Here lies the ability to choose the good and the grand, the true and the beautiful.” అని. అంటే సృజనశీలి సారస్వత మూర్తిమత్వానికీ, నిర్ణాయక వ్యవస్థకూ అవినాభావమైన సంబంధం ఉంది. బాల్యంలో స్పష్టాస్పష్టంగా ‘రాయాలి’ అని మాత్రం స్పృహ ఉన్నవాళ్ళు పెరిగి పెద్దయ్యి కవిత్వం, కధ, డిటెక్టివ్ నవలలు, చారిత్రక నవల ఇలా వందలాది సృజన రూపాల్లో ఏ ఒకటి రెండింటికో ఎలా బద్ధులౌతున్నారు? ఎలాగంటే వాళ్ళు తమ నిజ తత్వాన్ని ప్రయత్నించి, కనుగొంటున్నారు. ఏ తరహా Mind ఆ తరహా సారస్వతాన్ని మాత్రం సృజించగలుగుతుంది. అలాగే కావాలని త్రిపుర సూచన. ఉదాహరణకు రమణజీవిగారిది అతివేలము, అధివాస్తవికమైన కల్పనా వైచిత్రి – అంటే phantasmagoria. ఎమ్మెస్‌నాయుడుగారి కవిత్వానికి ప్రధానమైనవి వాక్య నిర్మాణాన్ని, దృశ్య నిర్మాణాన్నీ కావాలని, పనిగట్టుకొని అపరిచితమైన తోవల్లో నడిపించే ఉక్తి వైచిత్రి, నిర్మాణ వైచిత్రి: కమింగ్స్ (e. e. Cummings) కవిత్వంలో వంటి idiosyncrasy of syntax, డిలన్ థామస్ (Dylan Thomas) కవితలలో వంటి idiosyncrasy of image pattern. అవి వాళ్ళ సృజనాంతరంగాలకు, నైసర్గికమైన దృష్టికీ ఒప్పినవి.

మర్యాద కోసం, సంఘం మెప్పు కోసం తన నైజానికి, స్వాభావికమైన చేతనకూ భిన్నంగా పోతే సృజన భంగపడుతుంది. బలమైన కళాకారుడు అనివార్యంగా ఇందుకు భిన్నంగా ఉంటాడు. ఇదివరకు చెప్పిన గార్డ్‌నర్ (John Gardner) మాటల్లోన “Creative individual has the capacity to free himself from the web of social pressures in which the rest of us are caught. He is capable of questioning the assumptions that the rest of us accept.” సమాజం సకృత్తుగా అంగీకరించి, గౌరవించేదాన్ని తనకు తప్పనిసరి అయితే ఆయన “థూ! నాశినం …” అని ప్రశ్నించగలుగుతున్నాడు. కాని ఈ True Self అనేది ఎవరికీ ఒకటే స్థిరం అయిపోయి ఉండదు. మనుషులందరిలాగే సృజనకారుని వ్యక్తిత్వానికీ, అనుభవానికీ అనేక పార్శ్వాలుంటాయి. ఈ అన్ని selfలలోనా ఏది తన True Self? అనే ప్రశ్ననూ యూలండ్ చాల సహాయకరంగా చర్చిస్తారు. Pep talkలాంటి ఉషారు మాటల శైలిని సహించి చదువుకోగలిగితే ఆవిడ చెప్పిన విషయాలు సహాయంగా ఉంటాయి. కాని ఆవిడ చర్చించని విషయం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. సృజన మౌలికంగా ‘సత్యం’ (Truth) కాదు. అది ముమ్మాటికీ కల్పన, కాబట్టి సృజన యావత్తూ అంతిమంగా ‘జూటా.’ ఈ ప్రశ్నను ఆవిడ చర్చించరు. ఈ ఒక్క ప్రశ్నను తలకెత్తుకుంటేనే తవ్వడానికి జీవితాలే సరిపోనంతా పని ఉంది.

సృజన ప్రబలమైన స్వభావంగా ఉన్నవాళ్ళకు వాళ్ళ స్వభావమే ఒక సమస్య; జబ్బు లాంటిది. శ్రీపాద, నామిని, సాలింజర్, బ్యుకోస్కీ – ఇలాంటివాళ్ళు ఆత్మచరిత్రాత్మకంగా రాసినవి చదివితే అవగతమౌతుంది. తప్పనిసరిగా రాయాలన్న కాంక్షను మనస్తత్వంలో హైపర్‌గ్రాఫియా (Hypergraphia) అని ఒక రుగ్మతగా నిర్ధారించేరు. మా అమ్మది ఇలాంటి స్వభావం. తను మాకు ఊహ తెలిసినప్పటినుండీ ఎంత పనిలో ఉన్నా, రాయాల్సి వచ్చినప్పుడు తొందరగా ముగించుకొని తడి చేతులు తుడుచుకొని వచ్చి, ఎక్కడ తెల్ల కాయితం దొరికితే దాని మీద రాసీసి, మళ్ళీ పన్లోకి పోయేది. పద్యాలూ, పాటలూ, కధలు, వ్యాసాలూ ఇలా ఆపకుండా ఏదో ఒకటీ రాస్తూనే ఉంటుంది. రాసినవన్నీ, వేలకొద్దీ పేజీలు ఒక పెట్టెలో పడేస్తుంది. ఇప్పటికీ అంతే. ‘ఎందుకమ్మా ఇంతలాగ రాస్తావు?’ అంటే వాటివలన ఏ ప్రయోజనం లేదనీ, కాని తను ఆపుదామనుకున్నా ఆపలేని పని కాబట్టి అలా తప్పనిసరిగా రాసుకుంటాననీ చెప్తుంది. స్వాంతఃస్సుఖాయ తులసీ రఘునాధ గాధా… అని పాడుతుంది. ఆలిస్ ఫ్లాహర్టీ (Alice Flaherty) అని హార్వర్డ్ మెడికల్ సెంటర్ నుండి ఒక న్యూరాలజీ ప్రొఫెసర్ ఉన్నారు. ఆవిడకి కవల పిల్లలు పుట్టి, పోయిన దుఃఖంలో ఉండుండి ఈ హైపర్‌గ్రాఫియా అనే రుగ్మత పట్టుకుంది, ఆపాలనుకున్నా ఆపలేకుండా రాసే ప్రవృత్తి. ఆవిడ రాసిన పుస్తకం The Midnight Disease: The Drive to Write, Writer’s Block, and the Creative Brain లోన సృజనకారులకు రాయాలని ఉండే ఆకాంక్షనూ, Writers Block వంటి ఇబ్బందులనూ చర్చిస్తారు. ఈ పుస్తకాన్ని కూడా సృజనాత్మక రచయితలు చాలామంది సహాయంగా ఉందని చెప్పుకున్నారు. శ్రీపాద, నామిని వంటివాళ్ళు – తప్పనిసరిగా రాసుకొనే తీరాలి, అది తప్ప ఇంకే పనీ చెయ్యలేము అని చెప్పుకున్న వాళ్ళ మనస్తత్వాన్ని ఆవిడ మనో విజ్ఞానశాస్త్ర పరంగానూ, కాఫ్కా, డొస్టొయెవ్‌స్కి, నబకోవ్ వంటి రచయితల స్వభావాలను విశ్లేషిస్తూ ఉదాహరణలతోనూ వివరిస్తారు. రాయటం అనేది వేరే ఎవరికోసమో, సమాజం కోసమో కాదు, సాహిత్యం భవిష్యత్తు కోసం కాదు, అది ఒక నొప్పికి ఊరటలాగ అని Dostoyevsky (Notes from Underground):

“There are perhaps thousands of reasons. Again, what is my object precisely in writing? If it is not for the benefit of the public why should I not simply recall these incidents in my own mind without putting them on paper?

Quite so; but yet it is more imposing on paper. There is something more impressive in it; I shall be better able to criticise myself and improve my style. Besides, I shall perhaps obtain actual relief from writing. Today, for instance, I am particularly oppressed by one memory of a distant past. It came back vividly to my mind a few days ago, and has remained haunting me like an annoying tune that one cannot get rid of. And yet I must get rid of it somehow. I have hundreds of such reminiscences; but at times some one stands out from the hundred and oppresses me. For some reason I believe that if I write it down I should get rid of it. Why not try?”

అలాగే యోగి మనస్తత్వానికీ, కవి మనస్తత్వానికీ సామాన్యంగా ఉన్న సృజన ప్రాతిపదికలను ఆవిడ మనో విజ్ఞానశాస్త్ర పరంగా వివరించే ప్రయత్నం చేస్తారు.

యోగిది ఆత్మనిష్ట, సృజనశీలిది రసనిష్ట, శాస్త్రజ్ఞునిది సత్యనిష్ట, నాయకునిది కార్యనిష్ట, లౌక్యుని ధ్యాస ఏక కాలంలోనే లౌకిక విజయం మీద, అది తీరీ తీరకుండా ఉండే లోక వ్యవహారపు బోర్‌డమ్ నుండీ, నొప్పి నుండీ ఊరట మీదాను…

(To be continued by the reader.)