నాకు నచ్చిన పద్యం: ద్రౌపది పరివేదన

ఉ.  మీ సుభటత్వమున్ బలము మిన్నకపోవఁగ దుస్ససేనుఁడ
      ట్లా సభలో ననుంబఱిచె నంతియగాక జయద్రథుండు సం
      త్రాస భరంబు లేక నుచితంబొనరించినఁ జెల్లిపోయె నేఁ
      డీ సభికుల్ గనుంగొనగ నిట్లయితిన్ వగ నాకు వింతయే

కొన్ని కొన్ని పద్యాలు గొప్ప ప్రాచుర్యంలోకి రాకపోయినా పుస్తకంలో ఆ సందర్భం మొత్తం చదువుకుంటుంటే ప్రత్యేకంగా గుండెను పట్టేస్తాయి. దానికి కారణం ఆ పద్యంలో కనిపించే ఆక్రోశమూ, ఆ ఆక్రోశాన్ని వ్యక్తం చేసిన తీరూ అనిపిస్తుంది.

పై పద్యం భారత విరాటపర్వం లోనిది. కవి తిక్కన సోమయాజి. తనని తరుముకుంటూ వచ్చి విరటుని సభలో తనను అవమానించిన కీచకుని గురించి భీమునితో చెపుతూ పలికిన పలుకులివి.

బహుశా ప్రపంచ సాహిత్యంలోనే, ఏ స్త్రీ పాత్ర కూడా ద్రౌపది అంతగా అవమానాలు సహించి ఉండదనుకుంటాను. కామించడం, వాంఛించడం వేరు. అది మానవ ప్రకృతి. ఆ వాంఛా పరిపూర్తి కోసం సభ్యేతరమైన త్రోవలు తొక్కడం – అది దౌష్ట్యం. ఉద్ధతుడు, బలగర్వితుడు, అధికార మదాంధుడు, తననెవరూ ఏమీ చేయలేరు అనుకునే వాడు – ఔద్ధత్వంతోనే తన ప్రయత్నం సాగించుకోడానికి చూస్తాడు. బలవంతంగానే ఎత్తుకుపోతాడు (రావణుడు – సీత); వంచనతో చెంత చేరతాడు (ఇంద్రుడు – అహల్య); బలాత్కరించి చెరుస్తాడు (రావణుడు – రంభ). కానీ మహాసభలో భర్తల ఎదుట, గొప్ప ధర్మవేత్తలుగా పేరు పొందిన వారు చూస్తుండగానే, గుడ్డలు లాగివేయబడే హీనాతిహీనమైన పరాభవం ద్రౌపదికి జరిగింది. ఈ అవమానం అన్ని అవజ్ఞలకూ పరాకాష్ఠ. ఆ తర్వాత జరిగిన పరాభవాలు తక్కువవి కాకపోయినా ‘వగ నాకు వింతయే’ – అని అనిపించేంత నిర్లిప్తత కలిగించింది. నిజానికది నిర్లిప్తత కాదు. భీముని ఎత్తిపొడవడానికి, అతనిలో ఆక్రోశపూరితమైన కసి పెంచడానికి పైకి సామాన్యంగా కనిపించే ఆ మూడు పదాలూ చాలా బలంగా పని చేసి ఉంటాయి.

విరటుని సభలో అవమానం పొందిన ద్రౌపది తన బసలో నిద్రపోతున్న భీముని వద్దకు వచ్చి నిద్ర లేపుతుంది. ఈ సందర్భంలో జరిగిన కార్యక్రమాన్ని ఎంతో అందంగా సహజంగా రూపించాడు మహాకవి. నన్ను అవమానించిన తర్వాత ఇంటికి పోయి, కీచకుడు సుఖనిద్ర పోతున్నాడు. కానీ “నీ కన్ను మొగుడ్చు నూఱటకు కారణమెయ్యది భీమసేన, మీ యన్న పరాక్రమంబు వలదన్న నొకో దయ మాలితక్కటా” అంటు సన్నని ఎలుగుతో పలుకుతూ చేత్తో తట్టి లేపుతుంది భీముణ్ణి. లేచిన భీముడు ‘ఎవరూ’ అని అడిగి, ద్రౌపది గొంతు గుర్తించి – కీచకుని దురాగతం నాకు చెప్పి వాణ్ణి చంపేందుకు నన్ను నియోగించడానికి వచ్చింది కాబోలు అనుకుంటూ, అయినా తన నోటితోనే విందామని నిశ్చయించుకొని – ‘ఇంత రాత్రివేళ ఎందుకొచ్చావు, ఎవరూ చూళ్ళేదు గదా’ అంటాడు. ఆమె ఆ మాత్రం అర్థం చేసుకోలేదా? “ఎఱిగి ఎఱింగి నన్నడుగనేమిటికి, అప్పుడెఱింగి ఇంతకున్మరచుట గల్గెనే, యున్న రూపెఱిగియు నెను జెప్ప విన నిష్టము గల్గుట చాల లెస్స” అని మొదటినుంచీ చెప్తాను విను అంటూ తాను సైరంధ్రి పనుపున కీచకుని ఇంటికి పోయినప్పటినుంచీ జరిగిన వృత్తాంతాన్ని వివరంగా చెపుతుంది.

“అక్కుల పాంసనుండు కోపమడరంగ కూడ ముట్టెనట, ఎఱుంగుదు వీవు, మీ యన్న పెద్దతనము చూచితివేమందు వనిల తనయ” అని చెప్పి పై పద్యంలో తన బాధను వ్యక్తం చేస్తుంది. తనకు జరిగిన పరాభవం వల్ల కలిగిన బాధే కాక తన భర్తల నిష్ప్రయోజకత్వం వల్ల కలిగిన అదనపు బాధనూ గుర్తు చేసుకొని మరీ ఎత్తిపొడుస్తుంది. ద్రౌపది ఉద్యోగపర్వంలో కృష్ణుడిని రాయబారానికి పంపే ముందు ఒక మాట అంటుంది. కురు సభలో జరిగిన అవమానం తాలూకు కసిని ‘చిచ్చు ఒడింగట్టిన యట్లు’ మోస్తున్నాను అని. నిజానికి అలా చిచ్చును మోస్తుండడం ప్రతీ సందర్భంలోనూ మనకు కనిపిస్తూనే వుంటుంది. పై పద్యంలోనూ కనిపిస్తున్నది. ఏమాత్రం అవకాశం వచ్చినా భర్తలతో మాట్లాడేటప్పుడు వారి నిష్క్రియాపరత్వాన్ని ఎత్తి చూపుతూనే ఉంటుంది. పై పద్యం గూడా చూడండి.

దుస్ససేనుడట్లా సభలో నను బఱిచె అని చెప్పేముందు మీ సుభటత్వమున్ బలము మిన్నక పోవగ అనే క్రియా విశేషణాన్ని తగిలించి, మండే భీమసేనుడి కోపాగ్నిలో మరి కాస్త ఆజ్యం పోసిందో, లేక తన గుండెలు మండి పోతుంటే మీ పరాక్రమం తగలబడ్డట్టే ఉంది అనే ఉపాలంభన దానంతటదే వెలికి వచ్చిందో గానీ, ఎంతో బలమైన ప్రతిస్పందన అది. అంతకు ముందు అరణ్యంలో ఉండగా సైంధవుడు వావివరుసలు మరిచి ఆమెను బలవంతంగా రథం మీదకి లాగి కూర్చోపెట్టుకుని తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. జయద్రధుండ నుచితంబొనరించిన చెల్లిపోయె అనే ముందు సంత్రాస భరంబు లేక – మీరంటే ఎంతమాత్రమూ భయం లేకుండా – ఆఖరికి వాడికి కూడా మీరంటే లెక్క లేకుండా పోయిందని ఎత్తి పొడుపు. నేడీ సభికుల్ కనుంగొనంగా నిట్లయితిన్ – ఇట్లయితిన్ అనే మాటలో ఎంత దృశ్యానుభూతి పండిందో గమనించండి. ఇక వగ నాకు వింతయే అనే ముగింపు కూడా ఎంత బాగుందో!

అదీ ద్రౌపదంటే. అదీ తిక్కన మహాకవంటే. ఇట్లయితిన్, చెల్లిపోయె, వగ నాకు వింతయే – ఎంత నిసర్గ మనోహరాలయిన తెలుగు పదాలు. పద్య నిర్మాణం మటుకు? గొప్ప నిరాడంబరత పద్యమంతా. ఎక్కడ ఏ పదం పొదిగితే ఎంత అర్థం వస్తుందో తెలిసి వాడిన పనివాడి తనం. తిక్కన ప్రత్యేకతలైన ఉచితజ్ఞత, నాటకీయత, స్ఫుటంగా దృశ్యమానమయ్యే పద్యం. ఇంకో చిన్న విశేషం ఏమంటే ప్రయత్నపూర్వకంగా వేశాడో, అదాటున అలా కుదిరిపోయిందో – రెండో అక్షరానికే కాక మూడో అక్షరానికి కూడా నాలుగుపాదాల్లోనూ ప్రాస అమరిపోయింది.

పాత్రానుభూతిని పాఠకానుభూతిగా అనువదింపజేసే చక్కని పద్యమిది. మహాభారత మహాకావ్యంలో విరాటపర్వం ఒక ప్రత్యేకతతో భాసిస్తుంది. దానికదే ఒక ప్రత్యేక కావ్యమా అనిపిస్తుంది. మనస్తత్వ విశ్లేషణా సన్నివేశాల నిర్వహణ, సంభాషణా కుశలత, ఎంత హృదయంగమంగానో ఉంటాయి. బహుశా తిక్కన మహాకవి రచించిన మొదటి పర్వం కాబట్టి, ఆ ప్రారంభోత్సాహం పర్వం నిండా పరుచుకు పోయిందా అనిపిస్తుంది.