చారిత్రక నవల: కొల్లాయి గట్టితే నేమి?

రామనాథంతో పాటు కాలేజీ చదువు మానుకొని సత్యాగ్రహ ప్రతిఙ్ఞ తీసుకొన్న విధ్యార్ధులలో మంగరాజు ఒకడు. అతని తండ్రి సూపరింటెండింగ్ ఇంజనీరు. ఆ మరుదినమే తన పలుకుబడివల్ల కొడుకుని మళ్ళీ కాలేజీలో చేర్పిస్తాడు. ఆ ఇంజనీరే గాంధీ ప్రయాణ సౌకర్యార్థం ప్రభుత్వానికి అర్థంకాని పద్ధతిలో కొన్ని ఏర్పాట్లు చేస్తాడు. ’ఆత్మాభిమానం చంపుకొని, ప్రిన్సిపాల్ కు క్షమార్పణ చెప్పుకొని, కొడుకు కాలేజీలో చేరేటట్లు ఒత్తిడి పెట్టిన ఇంజనీరు ఈనాడు గాంధీగారి ప్రయాణ సౌకర్యం కోసమే రాజోలు ప్రయాణం పెట్టుకొని వుంటాడన్నది’ రామనాథం ఊహలకు కూడా అందని విషయం.

రామనాథం పెంపుడు తండ్రి శంకర శాస్త్రికి గాంధీ మీదా, కాంగ్రెస్ మీదా యెప్పుడూ సదభిప్రాయంలేదు. అతని ఆచార పరాయణత్వమూ, జాతీయోద్యమ ప్రభావంతో తనకొడుకు సర్వనాశనమైనాడనే భావమూ కారణం కావచ్చు. గాంధీ ముంగండకు వస్తున్నప్పుడు ఆ శంకరశాస్త్రే తాటాకు మీద భగవద్గీతా శ్లోకం ఒకటి చక్కటి గుండ్రని అక్షరాలతో జాగ్రత్తగా రాసి, అక్షరాలు స్ఫుటంగా కనిపించేటందుకు కాకరాకు పసరు రుద్ది, గాంధీకి విరాళంతో పాటు సమర్పించడానికి తయారు చేసినాడు. గాంధీని తల్చుకొని ‘ఒక్కొక్క జాతకం..’ అంటూ ’ఏదో అదృశ్య శక్తికి ఓ నమస్కారం చేశాడు.’

వ్యక్తుల వ్యక్తిగత ప్రవర్తన లోని ఈ ద్వంద్వ స్వభావమే గాక, సామాన్య జనుల సామూహిక ప్రవర్తన లోని ద్వంద్వ స్వభావం కూడా నవలలో నిర్ద్వంద్వంగా చిత్రింపబడింది. ఆచార సంపదకూ, వేదవిద్యా సంపదకూ, బ్రాహ్మణ అగ్రహారాలకు ముంగండ తలమానికం వంటిది. చెరువులో చేపలు పట్టితే జీవహింస జరుగుతుందనీ, చెరువులో నీళ్ళు పంచములు ముట్టుకుంటే చెరువే మైల పడుతుందనీ చెరువుకు రేయింబవళ్ళూ కావలి వుంటారు ఆ వూరి బ్రాహ్మణులు. రామనాథం తన తోట లోని బావి నీటిని హరిజనులు తోడుకోడానికి అనుమతించడం ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. కానీ ఆ పనికి ప్రారంభోత్సవం చేయడానికి కాశీనాథుని నాగేశ్వరరావు వచ్చినప్పుడు ఆ సద్బ్రాహ్మణులే చిత్రంగా ప్రవర్తిస్తారు. ’కాశీనాథుని నాగేశ్వరరావుగారు వచ్చేరు. ఆయన్ని పలకరించే వాడుండడేమోనని రామనాథం దిగులు. కానీ, ఆయన మత్తుమందు చల్లినట్లు ముంగండ బ్రాహ్మణ్యాన్ని తనచుట్టూ తిప్పుకున్నారు… (ఊరేగింపుగా) రాజవీధి వెంట వెడుతుంటే రెండు మూడు ఇళ్ళవద్ద దండలు వేసి హారతులిచ్చేరు. జైలులో మైలపడి ఆనాటి వరకు సంఘ బహిష్కృతుడుగా వున్న రామనాథంతోనూ, నాగేశ్వరరావుతోనూ కలిసి బ్రాహ్మణ యువకులు కొందరు సహ పంక్తి భోజనం చేసినారు; వాళ్ళకు వీరసనాతనుడైన సాంబావధాని వడ్డన. వూళ్ళో పెద్దలు పదిమంది తాము భోజనాలు చేస్తుంటే సావట్లో కూర్చుని ఉన్నారు. వాతావరణమంతా ఈ అనాచారాన్ని ముంగండ పండితులు ఆశీర్వదిస్తున్నారా అనిపించేట్లు వుంది.

నాగేశ్వరరావు పట్లనే కాదు. గాంధీ పట్ల కూడా వాళ్ళ ప్రవర్తన అంతే. అంటరానితనాన్ని నిర్మూలించడానికి కంకంణం కట్టుకున్న గాంధీని వేదోక్తాశీస్సులతో సమాదరించడానికి తయారవుతారు, అంటరాని వాళ్ళని బ్రాహ్మణ వీధుల్లో కూడా నడవనియ్యని సద్బ్రాహ్మణులలో కొందరు. వైయక్తిక ప్రవర్తన లోనూ, సామాజిక ప్రవర్తన లోనూ అంతర్వైరుధ్యాలున్న పాత్రలు యీ నవలలో యాదృచ్ఛికంగా చోటుచేసుకున్నవి కావు. రచయిత ఉద్దేశ పూర్వకంగానే చిత్రించినట్లు అర్ధమౌతూనే ఉంది. ఐతే దీనికి కారణం యేమిటి? పాత్రలు తమ స్వభావాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారా? స్వభావమంటే యేమిటి? హేతుబద్ధంగా ప్రవర్తించవలసిన పాత్రలు హేతురహితంగా ప్రవర్తిస్తున్నారా? దీని ప్రయోజనమేమిటి?

జీవితంలోని అనంత వైవిధ్యాన్ని సాహిత్యం సరిగా ప్రతిబింబించలేదనే విమర్శ అనాదిగా ఉంది. సాహిత్యంలోని యీ లోపానికి కారణం Aldous Huxley వంటివాళ్ళు యీ విధంగా చెప్తారు: సాహిత్యం యెప్పుడూ హేతుబద్దంగా (rational) ఉంటుందనీ, జీవితం చాలా హేతురహితంగా (irrational) ఉంటుందనీ. హేతువాదం (rationalism) మీదా, కార్యకారణ సూత్రం (law of causality) మీదా విశ్వాసం లేని ఒక రకం మనుషులకు – మార్మిక వాదులూ (mystics), అతీంద్రియ వాదులూ (transcendentalists) మొదలయిన వాళ్ళకు – యీ వాదం చాలా ప్రీతిపాత్రం. ఈ కోవకు చెందిన గోపీచంద్ లాంటి వాళ్ళు సాహిత్యం జీవితమంత విశాలంగానూ ఉండాలంటూ రచించిన నవలలు లక్ష్యశుద్దీ, భావైక్యమూ, కథన పాటవమూ కోల్పోయి, చివరకు జీవితమంత గందరగోళం గానూ, జీవితం కనిపించేటంత అర్ధరహితం గానూ, జీవితంకంటే నిస్సారం గానూ తయారు కావడం మనమెరిగిన విషయమే. వీళ్ళు జీవితాన్నీ, సాహిత్యాన్ని అర్థం చేసుకోవడంలోనే ఒక మౌలికమైన పొరపాటు వుంది.

జీవితం హేతురహితంగా కనబడుతుందే కాని, నిజానికి హేతురహితం కాదు. కారణరహితమైన కార్యం కానీ, కార్యరహితమైన కారణం గానీ జీవితంలో ఉండవు. కానీ, జీవితంలో ప్రతికార్యానికీ అనేక కారణాలు ఉంటాయి. అట్లే ప్రతి కారణానికీ సాధారణంగా అనేక కార్యాలు ఉంటయి. అంతేగాక, ప్రతి కారణానికీ సద్యః ఫలితమైన కార్యాలే గాక కాలాంతర ఫలితాలు కూడా వుంటాయి. ప్రతి కార్యానికీ సద్యః కారణమే గాక కాలాంతర కారణాలు కూడా వుండవచ్చు. అంతేగాక, కార్యమే మళ్ళీ కారణంలో మార్పు తెచ్చి, తానే కారణ రూపం ధరిస్తుంది. (భర్త ప్రవర్తనను బట్టి భార్య ప్రవర్తన మారుతుంది. తత్ఫలితంగా భర్త ప్రవర్తనలో మార్పు వస్తుంది. అందువల్ల భార్య ప్రవర్తనలో మరొక మార్పు వస్తుంది. అందువల్ల భర్తలో ఒక కొత్త మార్పు వస్తుంది.) అనంతంగా సాగే యీ కార్యకారణ ఘర్షణలో కారణమూ, కార్యమూ నిశ్చల తత్వాలు కావు. రెండూ ఒకదానికొకటి కారణాలే. రెండూ ఒకదానికొకటి కార్యాలే. దీనినే dialectics అంటారు. అందువల్ల వాస్తవ జీవితంలో కార్యకారణాలు అన్నీ ఒకదానితో ఒకటి బీరకాయ పీచులాగా పెనవేసుకొని, యేది దేనికి కారణమో, యేది దేనికి కార్యమో విడదీయడానికి సాధ్యం గాకుండా ఉంటాయి. తత్కారణంగా జీవితం హేతు రహితంగా కనపడవచ్చునే గాని, నిజానికి అత్యంత హేతుబద్ధమైనది.

ఇక సాహిత్యం అచ్చం జీవితం లాగే ఉండాలనుకోవడం కూడా తీవ్రమైన పొరపాటే. జీవితాన్ని అర్థం చేసుకోడానికి మానవుడు చేసే ప్రయత్నంలో ఒక భాగమే సాహిత్యం (మరొకభాగం సైన్సు). ఒకదాన్ని అర్థం చేసుకోవడమంటేనే దానిలోని కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడం, దానిలోని హేతుబద్ధతను గ్రహించడం. కనుక జీవితం మానవునికి యే మేరకు అర్ధమౌతుందో, యే మేరకు అర్థమైనట్లు భాసిస్తుందో, ఆ మేరకే జీవితం సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. అనగా హేతుబద్ధమైన జీవితమే సాహిత్యం లోకి యెక్కుతుంది. అనగా సాహిత్యం హేతుబద్ధంగా తప్ప మరొక విధంగా వుండజాలదు. సాహిత్యం మరీ హేతుబద్ధంగా ఉంటున్నదని నిందించడం ఈ యుగపు మేధావుల అతి తెలివికి మాత్రమే నిదర్శనం.

కాని, అపరిణతులైన సాహిత్యకారులు జీవితంలోని సంకీర్ణ హేతుబద్ధతను గ్రహించలేక పాత్రలనూ, సన్నివేశాలనూ సరళరేఖ లాంటి కార్యకారణ సూత్రంలో బంధించి, సాహిత్యాన్ని ఎక్కాల బుక్కు తర్కస్థాయికి దించుతున్న దించుతున్న మాట నిజమే. జీవితంలో ప్రతి వ్యక్తి మీదా నిత్యం పరస్పర విరుద్ధమైన అనేక అంతర్బహిఃప్రేరణలు పని చేస్తుంటాయి. ప్రతి వ్యక్తిలోనూ స్వార్థమూ వుంటుంది, పరోపకార బుద్ధీ ఉంటుంది; అహంకారమూ ఉంటుంది; మమకారమూ ఉంటుంది; కామక్రోధాదులూ ఉంటాయి, శమదమాదులూ ఉంటాయి; ధైర్యమూ ఉంటుంది, భయమూ ఉంటుంది; సాహసమూ ఉంటుంది, పిరికితనమూ ఉంటుంది. ఒకొక సందర్భంలో ఒకొక దాని ప్రభావం బలీయంగా ఉండవచ్చు. ఒకొకరిలో ఒకొకదాని పాలు అధికంగా ఉండవచ్చు. ప్రతి వ్యక్తి మీదా భిన్న శక్తుల ప్రభావం నిత్యం ఉంటుంది గనుక, యే వ్యక్తి ప్రవర్తనా సరళరేఖ లాగా జీవితాంతం ఒకే విధంగా ఉండదు. వ్యక్తులలోని యీ అంతర్వైరుధ్యాలను చిత్రించేదే ఉత్తమ సాహిత్యమని పాత్ర చిత్రణలో పేరెన్నికగన్న సోమర్సెట్‌ మామ్ సూక్తి.

రామమోహనరావుగారి పాత్రల ప్రవర్తనలోని అంతర్వైరుధ్యాలు కూడా ఈ జీవిత యథార్ధాన్ని ఆశ్రయించినవే. సూపరింటెండింగ్ ఇంజనీరైనా, పడవ గుమస్తా ఐనా, శంకరశాస్త్రి ఐనా సాధారణ మనుషులు. సాధారణ మానవులలో స్వార్థమూ, గతానుగమన స్వభావమూ, సమాజంలో యేది బలవత్తరంగా వుంటే దానికి తలవొగ్గడమూ ప్రముఖంగా వుండే గుణాలు. కనుక వాళ్ళ నిత్య ప్రవర్తనలో సాహసమూ, త్యాగమూ కనిపించవు. స్వార్థమూ, సంకుచితత్వమే రాజ్యం చేస్తుంటాయి. కాని కొన్ని ప్రత్యేక సమయాల్లో, యే గాంధీ మహాత్ముని వంటి వాడో యెదురైనపుడు, వాళ్ళలో సాహసమూ, త్యాగబుద్ధీ కనిపిస్తాయి. కనీసం గొప్పవాని గొప్పతనాన్ని గుర్తించి కీర్తించే మేరకైనా వాళ్ళ సంకుచితత్వం బ్రద్దలౌతుంది. అది క్షణకాలం మాత్రమే. ఆ గొప్పవాడు అదృశ్యమైన వెంటనే అదే సంకుచితత్వమూ, అదే స్వార్థమూ, మళ్ళీ వచ్చి వాళ్ళ వ్యక్తిత్వాలను బంధిస్తాయి. సాధారణ వ్యక్తులలోని ద్వంద్వ స్వభావానికి మూలం ఇదే. యెంత ధీరోదాత్తులైన మహా పురుషులలోనైనా యూ ద్వంద్వ స్వభావం పూర్తిగా నశించదు. యెపుడో ఒకసారి బయట పడుతూనే వుంటుంది. కాని మనుషుల ద్వంద్వ సభావాన్ని గ్రహించినంత మాత్రాన దాన్ని సాహిత్యంలో చిత్రించటం సులభ సాధ్యంకాదు. యెందుకంటే ద్వంద్వ స్వభావం అనేది హేతురాహిత్యంగా వ్యక్తం కాకూడదు; ప్రతిపాత్రా, ద్వంద్వ స్వభావం యెంత వున్నా, హేతుబద్ధంగానే ప్రవర్తించాలి. పాత్రలూ, సన్నివేశాలూ, అన్నీ కలిసి, మొత్తం నవలలో అంతస్సూత్రంగా వున్న హేతుబద్ధతకు అనుగుణంగానూ వుండాలి. రామమోహన రావుగారి నవలలో యెన్ని పాత్రలు యెంత ద్వంద్వ స్వభావం ప్రదర్శించినా, హేతుబద్ధతకు ఎక్కడా భంగం వాటిల్లలేదు. యే పాత్ర యెంత చిత్రంగా ప్రవర్తించినా, ఆ చిత్రానికి ప్రేరణ యేమిటో మనకు తెలుస్తూనే వుంటుంది. ఒకోసారి ఆ ప్రేరణ స్పష్టంగా తెలియకపోయినా, ఉదాహరణకు గాంధీ పట్లా, నాగేశ్వరరావు పట్లా ముంగండ బ్రాహ్మణ్యం ప్రదర్శించిన సామూహిక ప్రవర్తన కేవలం మంద మనస్తత్వం (mob psychology) అనుకున్నా – వాళ్ళ ద్వంద్వ స్వభావం వాస్తవ జీవితానికి యెంత సన్నిహితంగా వుంది! అని మనకు అనిపిస్తూనే వుంటుంది.

ఈ నవల చారిత్రక నవల గనుక ఇందులోని పాత్రల ద్వంద్వ మనస్తత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యం వుంది. ఒక యుగసంధిలో భిన్న చారిత్రక శక్తుల మధ్య జరిగే చారిత్రక సంఘర్షణకు అంతర్యుద్ధ స్వభావం ఉంటుందని ముందే గుర్తించినాము. అది మొత్తం సమాజాన్నే గాక కుటుంబాలనే రెండు శిబిరాలుగా చీల్చి, తండ్రీకొడుకులనూ, భార్యా భర్తలనూ పరస్పర శత్రుపక్షాలలో నిలబెడుతుంది. ఆ చారిత్రక సుడిగుండంలో చిక్కుకున్న అబ్బాయినాయుడివంటి కొందరికి అది తీవ్ర అంతస్సంక్షోభరూపం ధరిస్తుంది. మరి యితరులమాట యేమిటి? చారిత్రక ప్రవాహంలో దిగకుండా ఒడ్డున ఉన్న సాధారణ వ్యక్తులమాట యేమిటి? చారిత్రక పరిణామంలో వాళ్ళ పాత్ర యేమిటి ? చారిత్రక సంగ్రామానికి వాళ్ల ప్రతిస్పందన యేమిటి ? ఈ ప్రశ్నలకు సమాధానమే ఆ సాధారణ జీవుల ప్రవర్తనలోని ద్వంద్వ స్వభావం. తమ సాధారణ ప్రవృత్తికి భిన్నంగా ప్రవర్తించడమే చారిత్రక సంగ్రామం పట్ల వాళ్ళ ప్రతిస్పందన. భిన్న చారిత్రక శక్తులలో దేని ప్రభావం బలీయమైనపుడు దానికి అనుగుణంగా ప్రవర్తించడమే వాళ్ళుకూడా అంతర్యుద్ధానికి వెలిగా లేరనడానికి నిదర్శన. వాళ్ళ మనస్తత్వంలోని అంతర్వైరుధ్యం మొత్తం సమాజంలోని అంతర్వైరుధ్యానికి ప్రతిరూపం. సాధారణ జీవులలోని అంతర్వైరుధ్యం చిత్రించకుండా మొత్తం సమాజంలో సర్వగ్రాసియైన అంతర్యుద్ధం జరుగుతూ ఉందనడం అసహజంగా ఉంటుంది. ఆ అంతర్వైరుధ్యం పేలవంగానూ ఉంటుంది. చారిత్రక విప్లవాలను ప్రత్యక్షంగా అనుభవించినవాడు, చరిత్ర సారాన్ని గాఢంగా గ్రహించినవాడూ గనుక రచయిత యూ అంతర్వైరుధ్యాన్ని కేవలం మానవలక్షణంగానే గాక, చారిత్రక లక్షణంగా కూడా చిత్రించగలిగినాడు.

ఒకటి రెండు లోపాలు వున్నా ఆనాటి చారిత్రక వాస్తవాన్ని చిత్రించడంలో ఈ నవల సంపూర్ణంగా కృతార్ధమైంది. ఆనాటి సాంఘిక దురాచారాలూ, అంధవిశ్వాసాలూ, కరడు గట్టిన ఛాందస అఙ్ఞానమూ, ప్రభుత్వ దమన నీతీ, ప్రభుత్వ అధికార్లలోని బానిస తత్వమూ, వీరికి వ్యతిరేకంగా యువకులూ, దేశభక్తులూ, విద్యావంతులూ సాగించిన పోరాటాల ఫలితంగా యేర్పడిన హృదయతాపాలు, మానసిక సంక్షోభాలు, కుటుంబ విచ్ఛేదాలు అన్నీ కన్నులకు కట్టినట్లు చిత్రితమైనాయి. అన్నీ పాఠకులకు ప్రత్యాక్షానుభూతులుగా రూపు ధరించినాయి. చెప్పుకోదగిన చారిత్రక నవల అంటూ లేని తెలుగు సాహిత్యంలో యీ నవలకున్న స్థానం అమూల్యమైనది. దురదృష్టవశాత్తు తెలుగులో చారిత్రక నవలాకారునిగా పేరుకెక్కిన వాళ్ళందరూ ఫ్యూడల్ కుసంస్కారానికీ, సనాతన మూఢాచారాలకూ అంతో ఇంతో బానిసలైనవాళ్ళే. వాళ్ళు రాసిన నవలల్లో గతకాలపు మూర్ఖత్వాలకూ, అఙ్ఞానానికి, బానిస బుద్ధికి, భోగలాలసతకూ ధర్మ పరిరక్షణ పేరుతో పట్టాభిషేకం చేయడం తప్ప నిజమైన చారిత్రకత అనేది దాదాపు శూన్యం. ఫ్యూడల్ సంస్కారాన్నే గాక, బూర్జువా సంస్కారాన్ని కూడా అధిగమించి, పరిపూర్ణమైన భౌతికవాద దృక్పథం జీర్ణించుకున్నవాడు తప్ప చరిత్రను సరిగా అర్థం చేసుకోలేడు. గతకాలపు ఘటనలను యీనాటి విఙ్ఞాన వివేకాలతో అధ్యయనం చేయగలిగేదే చరిత్ర. గతకాలపు రాజులను గురించి వాళ్ల వందిమాగధులు చెప్పిన స్తోత్రపాఠాలే తిరుగులేని చారిత్రక ప్రమాణాలుగా స్వీకరించిన వాళ్ళు రాసినవే యీనాటి వరకు మనకు చారిత్రక నవలలుగా ప్రసిద్ధి పొందుతూ వచ్చినాయి. తెలుగు నవలా కారులలోనే కాదు, మన జాతీయ పోరాట కాలం నాటి తెలుగు కవుల దేశభక్తి కవిత్వం నిండా యీ గతవైభవ సంకీర్తనా జాడ్యం కరుడు గట్టుకొని ఉంది. గురజాడవలె “మంచి గతమున కొంచెమేనోయ్” అని చెప్పగలిగిన ఆధునిక మనస్తత్వం మన రచయితల కెవ్వరికీ పట్టుబడనే లేదు. గురజాడ తన కాలం నాడు, రచించబడిన విజయనగర సామ్రాజ్యం అనే చారిత్రక నవల మీద రాసిన విమర్శను యిక్కడ స్మరించడం అప్రస్తుతం కాదనుకుంటాను. చిత్రమేమంటే గురజాడ మరణించిన 50 యేండ్ల తర్వాత కూడా తెలుగు చారిత్రక నవల దాదాపు అదే స్థాయిలో ఉండడం. అంతకంటే బాధాకరమైన విషయమేమంటే గురజాడ అంతగా తిట్టిపోయిన ఆ నవల యీనాటికీ పునర్ముద్రణలు పొందుతూ తెలుగుదేశపు విశ్వవిద్యాలయల్లో పాఠ్య గ్రంథంగా మన్ననలు పొందుతూ వుంది. తెలుగుదేశపు విద్యావంతుల చారిత్రక పరిఙ్ఞానానికి, ఆధునిక మనస్తత్వానికీ యింతకు మించిన నిదర్శనం వుండబోదనుకుంటాను. తెలుగు చారిత్రక నవలను ఆవరించిన యీ గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ యీనాటికి వేగుచుక్క లాగ ఉధ్బవించింది, రామమోహనరావు గారి ’కొల్లాయి గట్టితేనేమి?’. అందువల్ల యీ నవలకు మన సాహిత్యంలో ఒక చారిత్రాత్మకమైన స్థానం ఉంటుంది.

(ఈ వ్యాసంలోని చారిత్రక నవలా లక్షణాలు ప్రపంచ ప్రసిద్ధ మార్క్సిస్టు సిద్ధాంతవేత్త అయిన Georg Lukacs చెప్పినవి.)
(సంవేదన – ఏప్రిల్ 1968)