చారిత్రక నవల: కొల్లాయి గట్టితే నేమి?

నిజానికి యీ నవల అతిశయ నాటకీయంగా కానీ, నాటకీయంగా కానీ వుందనే విమర్శకంటే, వుండవలసిన చోట తగినంత నాటకీయంగా లేదనే విమర్శ సమంజసంగా వుంటుంది. నవలలోని అనేక సన్నివేశాలను రచయిత నాటకీయంగా కల్పించుకొని కూడా, ఆ సన్నివేశాలలోని నాటక తత్వాన్ని (Dramatic element) పూర్తిగా వినియోగించుకోలేక పోయినాడనే అనిపిస్తుంది. ఉదాహరణకు సంభాషణలోని నాటక తత్వాన్ని రచయిత సరిగా గుర్తించినట్లు లేదు.

నవల అనేది గతంలో జరిగిన ఒక కథను చిత్రిస్తుంది. కనుక కథనం యెప్పుడూ భూతకాలంలో (Past tense) వుంటుంది. ఇది యెప్పుడో జరిగి పోయిన కథ అనే స్పృహ (consciousness) పాఠకుని యెప్పుడూ వెన్నాడుతూ వుంటుంది. అందువలన కథ చదువుతున్నట్లు వుంటుందే కాని, ప్రత్యక్షంగా చూస్తున్నట్లు ఉండదు. ఎంతో నాటకీయంగా వున్న సన్నివేశాలలో మాత్రమే పాఠకుడు ఆ స్పృహ నుండి బయటపడి, పాత్రలతో తాదాత్మ్యం పొంది, ఆ సన్నివేశాలను ప్రత్యక్షానుభూతులుగా అనుభవించగలడు. నవలా తత్వమే అంత – యెప్పుడో జరిగిన కథను యెవరో చెప్పుతూ వుంటే మనం వింటున్నట్లు వుంటుంది. నాటకంలో ఐతే కథ అంతా మన కండ్ల యెదుటనే జరుగుతున్నట్లు మనకు అనుభూతమౌతుంది. ఇందులో అభినయ కళకుగల ప్రాముఖ్యం యెంత వున్నా, నాటకానికీ, నవలకూ రచనా సంవిధానంలోనే వున్న భేదమే కీలక అంశం. నాటకం అంతా సంభాషణల రూపంలో సాగుతుంది. ఆ సంభాషణలు మనకు వినపడతాయి. పాత్రలు స్వయంగా వచ్చి మన కండ్ల యెదుట మాట్లాడుకుంటారు. కథ అంతా వర్తమానకాలంలో జరుగుతుంది. సంభాషణల మధ్యలో రచయిత ప్రవేశించి వివరణలూ, వ్యాఖ్యలూ యివ్వడం జరగదు. పాత్రలు ముఖాముఖిగా నిలబడి, పరస్పరం ఘర్షించుకుంటారు. పాత్రల మనోభావాలూ, హృదయ తాపాలూ, వివిధ రాగద్వేషాలూ మనకు ప్రత్యక్షానుభవంలోకి వస్తాయి. కథ యెవరో చెప్పగా మనం వింటున్నట్లు గాక, మన ఎదుట జరుగుతున్న కథను మనం చూస్తున్నట్లు వుంటుంది. సంభాషణల్లోగల యీ కళామర్మం గ్రహించిన Hemingway వంటి నవలా కారులు తమ నవలల్లో సంభాషణలకు విశేష ప్రాముఖ్యం యిచ్చినారు.

రామమోహనరావుగారి యీ నవలలో సంభాషణల పాత్ర చాలా తక్కువగా వుండటమే గాక, యెంతో నాటకీయంగా వున్న సన్నివేశాలలో కూడా పాత్రల సంభాషణ స్వేచ్ఛగా సాగదు. అడుగడుగునా రచయిత పాత్రలమధ్య ప్రవేశించి వాళ్ళ మాటలకు వ్యాఖ్యలూ, వివరణలూ యిస్తాడు. లేదా పాత్రల పాత్రను తానే స్వీకరించి వాళ్ళ మాటలు తానే indirect speech లో చెప్తాడు. అందువలన పాత్రల ముఖాముఖి ఘర్షణ పతాకస్థాయిలోవున్న సన్నివేశాలలో కూడా వాటి నాటకీయ అవకాశాలు నష్టమైపోయినాయి. సంభాషణల్లోని నాటక తత్వాన్ని సరిగా వినియోగించుకోలేకపోవడానికి రామమోహనరావుగారి రచనాతత్వంలోని లోపమే కారణమని తోస్తుంది. నవలకు గానీ, యే సాహిత్యరూపానికిగానీ చరమ ప్రయోజనం ఒకటే: పాఠకునికి ఉత్తమ సంస్కారం కలిగించడం. ఇది పాఠకుని హృదయం మీద గాఢమయిన అనుభూతుల ముద్రలు వేయడం ద్వారా జరుగుతుంది కానీ, పాఠకునికి వివేకాన్ని ప్రబోధించడం ద్వారా జరగదు. రామమోహనరావుగారి రచనా తత్వంలో ఙ్ఞానదానదృష్టి (Didactic or pedagogic approach) బలంగా వున్నందువల్లనే గతంలో ఆయన రచించిన ’ఎవరికోసం’, ’కత్తుల వంతెన’ అనే నవలలు కళాత్మకంగా దెబ్బతిన్నాయి. ఆ ఙ్ఞానదాన దృష్టి యీ ’కొల్లాయిగట్టితేనేమి?’లో అంత బలీయంగా లేదు గానీ, ఆ వాసన పూర్తిగా చావనందువల్లనే నవలలోని సంభాషణలు నిర్జీవంగా తయారైనాయని నా అనుమానం. సంభాషణలు మరింత సజీవంగా, మరింత నాటకీయంగా వుండి వుంటే, నవలలోని అనేక సన్నివేశాలు పాఠకుల హృదయాల మీద మరింత గాఢమైన ముద్రలు వేయగలిగి వుండేవి; నవల మరింత కళాత్మకమైన విలువను సంతరించుకొని వుండేది.

రచయితలోని ఙ్ఞానదానదృష్టి మరొక విషయంలో కూడా వెల్లడవుతున్నది. బెజవాడలో కాంగ్రెసు కమిటీ సమావేశం జరుగుతున్నపుడు వలంటీర్ల సమ్మె జరిగింది. తత్ఫలితంగా బహిరంగ సభ అల్లకల్లోలమై, గాంధీమహాత్మునికి ఆ రాత్రి భోజనం తప్పిపోయింది. ఇది చరిత్ర. ఈ చారిత్రక ఘటనకు నవలలోని కథతో సంబంధం యేమీ లేకపోయినా, నవలలో చోటు చేసుకుంది. ఆనాటి చరిత్రలో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటనను పాఠకులకు తెలియజేయాలనే ఙ్ఞానదానదృష్టి తప్పితే, యీ ఘటన వల్ల నవలకు ఒరిగిన ప్రయోజనమేమీ కనిపించదు. ఈ ఘటనవల్ల నవలకు జరిగిన నష్టమేమీ లేదనుకున్నా, రామ మోహన రావుగారి రచనా తత్వంలోని బలహీనత మాత్రం వ్యక్తమౌతున్నది.

ఈ నవలలో గమనించదగిన విశేషాంశాలు కొన్ని ఉన్నాయి. రామనాథానికి చిన్నప్పుడే పెండ్లి అయింది కానీ, అతని భార్య కాపురానికి రానని అతనితో తెగతెంపులు చేసుకుంది. స్వరాజ్యానికి కూడా చిన్నప్పుడే పెండ్లి అయింది. కానీ, ఆమె భర్త మళ్ళీ పెండ్లిచేసుకొని స్వరాజ్యాన్ని పరిత్యజించినాడు. బ్రహ్మసమాజపు విశ్వాసాలు గల అబ్బాయినాయుడు (స్వరాజ్యం తండ్రి) కూతురుకు పునర్వివాహం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కులం యేదైనా సరే విఙ్ఞాన వివేకాలున్న వరుడు కావాలని మాత్రమే అతని కోరిక. కానీ స్వరాజ్యం తాను ప్రేమించిన రామనాథాన్ని పెండ్లి చేసుకుంటానన్నప్పుడు అబ్బాయినాయుడు తలమీద పిడుగు పడినట్లు బాధపడతాడు. కూతురును గద్దించి లొంగదీసుకోడానికి ప్రయత్నిస్తాడు; లాలించి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. స్వరాజ్యం ఆ ప్రయత్నాలన్నిటినీ ధిక్కరించి, రామనాథం పట్ల అతనికి గల అభ్యంతరమేమిటో చెప్పమంటుంది. నిజానికి అభ్యంతరమేమిటో అతనికే తెలియదు. కూతురుకేమని చెప్పగలడు! ’రామనాథం అందగాడు, ఆరోగ్యవంతుడు, మంచి చదువుంది. సంఘ సంస్కరణ దృక్పథం వుంది. దేశం అంటే ప్రేముంది. నాయుడు అభిమానించే అన్ని లక్షణాలూ వున్నాయి. కాని అతనిని కూతురు వరుడుగా అంగీకరించలేకున్నాడు, చేతకావడం లేదు. ఆ అభ్యంతరమేమిటో మాటకు అందడంలేదు.’

ఆ అభ్యంతరం యేమిటో మనకు తెలుస్తూనే వుంది. అది కేవలం అంతరాత్మకు సంబంధించింది. అంతరాత్మ అనేది మానవుని వ్యక్తావ్యక్త మనస్సులో (Sub-conscious mind) గూడు కట్టుకున్న విశ్వాసాల సంపుటి. ధర్మాధర్మాలకూ, నీత్యవినీతులకూ సంబంధించిన విశ్వాసాల సంపుటి. మానవుని చుట్టూ వున్న సమాజంలోని విశ్వాసాలే పసితనం నుండి అతని మనసులో ప్రవేశించి వయసు వచ్చేటప్పటికి స్థిరపడి అంతరాత్మ రూపం ధరిస్తాయి. వయసు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి అర్జించే నూతన విద్యా విఙ్ఞానాల ఫలితంగా ధర్మాలను గురించి అతని అభిప్రాయాలు మారవచ్చు. కానీ వ్యక్తావ్యక్త మనస్సులోని అతని విశ్వాసాల పట్టు సులభంగా సడలదు. అనగా, వ్యక్తి వివేకం యెదిగినంతగా అతని అంతరాత్మ యెదగదు. తత్కారణంగా వ్యక్తులకు అంతరాత్మ పీడనలూ, అంతస్సంక్షోభాలూ ఏర్పడుతుంటాయి. రామమోహన రావుగారీ అంశాన్ని చరిత్రకు అన్వయించిన తీరు ఆయన ఊహాశక్తికి గొప్ప నిదర్శనం మాత్రమేగాక, సమాజానికీ, వ్యక్తికీ గల నిగూఢ సంబంధాలను గురించి ఆయనకున్న గాఢ గంభీర పరిఙ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది.

చరిత్ర యే మార్పులకూ లోను గాకుండా నిలువ నీరు లాగా వున్న కాలంలో ధార్మిక విశ్వాసాలు తరతరాలుగా నిశ్చల నిశ్చితాలుగా వున్న సమాజంలో యిటువంటి అంతస్సంక్షోభాలు సాధారణంగా యెవరికీ కలగవు. కానీ, ఆ విశ్వాసాలు తరతరానికీ మారుతున్న యుగసంధిలో జన్మించిన మానవులకు యీ అంతస్సంక్షోభాలు తప్పవు. అబ్బాయినాయుని అవస్థ అదే. అతని కూతురు పునర్వివాహం చేసుకోడానికి హిందూ ధర్మశాస్త్రమూ, బ్రహ్మసమాజ ధర్మమూ ఒప్పుకోకపోయినా అతనికది ధర్మంగా కనపడింది; అతని బ్రహ్మసమాజ మిత్రులెవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ రామనాథానికి అంతకుముందే పెండ్లి అయి భార్య సజీవంగా కూడా ఉంది. అతని పునర్వివాహానికి బ్రహ్మసమాజం ఒప్పుకోదు. అబ్బాయినాయుని అంతరాత్మ బ్రహ్మసమాజనీతుల మేరకు యెదిగిందే కానీ, ఆ పైన యెదగలేదు. వధూవరుల కిరువురికీ గతంలో వివాహాలైనా, ఉభయుల వివాహాలూ సంపూర్ణంగా భగ్నమైనాయి గనుక ఉభయులూ పునర్వివాహాని కర్హులే అని అతను అంగీకరించలేకపోతున్నాడు. నిజానికి అతని వివేకం అంగీకరిస్తుంది. కానీ అంతరాత్మ అంగీకరించదు. రామనాథం వివాహం భగ్నం కావడంలో అతని దోషమేమీలేదు గనుక అతను మళ్ళీ పెండ్లి చేసుకోవడం ఏ మాత్రం తప్పులేదంటాడు నాయుడు. కానీ తన కూతురుకు మాత్రం అతన్ని వరుడుగా అంగీకరించలేడు. రామనాథం పునర్వివాహాన్ని హిందూ సమాజం ఆమోదిస్తుంది. స్వరాజ్యం పునర్వివాహాన్ని బ్రహ్మసమాజంలో అందరూ కాకపోయినా కొందరయినా ఆమోదిస్తారు. ఆ యిరువురి పరస్పర వివాహాన్ని ఏ సమాజమూ ఆమోదించదు. ఎవరూ ఆమోదించని వివాహం వివాహమెలా అవుతుంది? అదీ నాయుని బాధ. సామాజిక ఆమోదం లేనిదే వివాహం అనేది వుండజాలదనే విశ్వాసమే అతని అంతస్సంక్షోభానికి కారణం. వివాహ విషయంలో అతని అంతరాత్మ సమాజానికిచ్చిన నిర్ణాయక స్థానమే అతని బాధకు హేతువు. వాళ్ళ సంబంధాన్ని ప్రజలు వివాహంగా గుర్తించరు. వ్యభిచారం అంటారు. ఉంచుకున్నాడంటారు; దానికదే పేరు. ఫలానా నాయుడు కూతుర్ని ఎవడో లేవదీసుకు పోయాడంటారు, ఉంచుకున్నాడంటారు. అదీ అతని అంతరాత్మ పడే ఆందోళన.

చివరకు అతని అంతరాత్మ మీద అతని వివేకం జయిస్తుంది. వాళ్ళ వివాహానికి అంగీకరిస్తూ, “ఏదో తప్పు చేసినట్లు, ఎరిగివున్న వాళ్ళకి ముఖం మాటు చేసుకునే మనస్థితి మీ పెళ్ళికి ప్రధానమైన శత్రువు. మన సంఘంలో ఉన్న ఆచారాలూ, అలవాట్లూ ఆ మనస్థితికి మూలం. దానినుంచి బయటపడి సుఖపడం”డని ఆశీర్వదిస్తాడు.

“మన సంఘంలో ఉన్న ఆచారాలూ, అలవాట్లూ ఆ మనస్థితికి మూలం” అనడంలో అంతరాత్మ జన్మస్థానమేమిటో స్పష్టంగా వివరిస్తున్న రామమోహనరావు గారు యెందుకో ’అంతరాత్మ’ అనే పదం మాత్రం వాడకుండా, ’మనస్థితి’ అనే అన్నారు. బహుశా అంతరాత్మను దైవాంశగా భావించే సంప్రదాయం దేశంలో ఉన్నందువల్ల ఆ మాటను ఆయన బహిష్కరించినట్లుంది. ‘అంతరాత్మ’ అనే మాటనే రచయిత ఉపయోగించి ఉంటే అబ్బాయినాయుని మనస్సంకోచానికి మూలమేమిటో పాఠకులందరికీ సులభ గ్రాహ్యంగా వుండేది. అదే దెబ్బతో అంతరాత్మలోని దైవాంశ కూడా చావుదెబ్బ తిని వుండేది.

పదప్రయోగం యెట్లున్నా, యుగసంధిలో జీవించేవాళ్ళు తమ అంతరాత్మలతో చేయవలసిన పోరాటం ఏమిటో, ఎలా ఉంటుందో అబ్బాయినాయుని పాత్ర ద్వారానే గాక, స్వరాజ్యం, రామనాథంల పాత్రల ద్వారా కూడా చిత్రింపబడింది. ఒక యుగసంధిలో భిన్న చారిత్రక ధర్మాల మధ్య జరిగే చారిత్రక సఘర్షణను వ్యక్తుల వ్యక్తిత్వాలలో జరిగే అంతస్సంఘర్షణగా చిత్రించడం చాలా అరుదైన కళాభిఙ్ఞత. చరిత్ర సారాన్ని ఈ విధంగా మానవ హృదయానుభూతుల పరిభాషలో అవగాహన చేసుకోవడం చాలా అరుదైన భావుకత. యుగసంధిలోని వ్యక్తుల అంతరంగిక ఆవేదనలకూ, సామాజిక వ్యవస్థలకూ గల సంబంధాన్ని వివరించడంలో రచయితకు గల మేధా పరిపాకం అపురూపమైనది. ‘ఆ వివాహాన్ని సంఘం ఒప్పుకోదు. చట్టం ఒప్పుకోదు. ప్రాచీన సంప్రదాయ పద్దతివారి వివాహబంధాన్ని కూర్చలేదు. ఆధునిక సంప్రదాయమంటూ ఏర్పడలేదు.’ ఆధునిక సంప్రదాయం వూరకే ఏర్పడదు; ఆధునిక జీవులు యేర్పరిస్తే తప్ప. అది ఏర్పడిందాకా బాధలు తప్పవు. అదే యుగసంధి తత్వం. ప్రాచీన సంప్రదాయాలను భగ్నంచేసి వాటి శిథిలాల మీద ఆధునిక సంప్రదాయాలను నిర్మించడమే యుగసంధి లోని వ్యక్తుల చారిత్రక కర్తవ్యం. ఎవడో ఒకడు విప్లవకారుడయి ముందు నిలబడితే తప్ప, వీరుడై తక్కినవాళ్ళకు మార్గదర్శకత్వం వహిస్తే తప్ప, ఆధునిక సంప్రదాయాలంటూ ఏర్పడవు. ఆధునిక సంప్రదాయాలు నిత్యం ఏర్పడుతుంటే తప్ప సమాజం నిలువ నీటి మురికిగుంట అవుతుంది; ఈ నవల ద్వారా చరిత్ర మనకిచ్చే సందేశం యిదే.

ఈ నవలలోని మరొక విశేషాంశం పాత్రల ప్రవర్తనలోని అంతర్వైరుధ్యాలు. రామనాథం తన మిల్లుబట్టలు అగ్ని సాక్షాత్కారం గావించి ‘సత్యాగ్రహ ప్రతిఙ్ఞ తీసుకొన్నప్పుడు తోటివాళ్ళంతా (తోటి విద్యార్ధులు) చప్పట్లు కొట్టేరు. హుషారు చేసేరు. వాళ్ళే మళ్ళీ రాత్రి తన గదికి వ్రేలుమొగాలు వేసుకువచ్చి చదువు మానేస్తున్నందుకు అంత బాధపడ్డారు. ప్రతిఙ్ఞ నుంచి బయటపడేందుకు అన్ని మార్గాలు చూపించేరు.’ విద్యార్ధుల ప్రవర్తన లోని యీ అంతర్వైరుధ్యం నవల ప్రారంభంలోనే మనకు పరిచయమౌతుంది.

రామనాథం పడవలో ప్రయాణం చేసేటప్పుడు పడవ గుమస్తా అతన్ని సరంగుకు పరిచయం చేస్తూ, “పంతులుగారెవరో తెలుసా? గాంధీగారి మనిషి, పులి. మొన్న సభలో ఏం మాట్లాడేశారు. ఎంత బాగుంది! ఓహ్!” అంటూ పరవశంతో ప్రశంసిస్తాడు. అదే గుమస్తా రామనాథంతో పడవగదికి కేవు (ఛార్జీ), ఇతరులతో కంటే రెండణాలు యెక్కువ వసూలు చేస్తాడు.

అబ్బాయినాయునికి కాంగ్రెస్ అన్నా, గాంధీ అన్నా ఎంతో భక్తి. అటువంటివాడు ఓ పక్క గాంధీ కాలేజీలు వదలమంటూ ఉంటే, తన కూతురును కాలేజీకి పంపడానికి సిద్ధపడ్డాడు.
రామనాథం పెదనాన్న విశ్వనాథం కూడా అంతే. ఆ చుట్టుపక్క గ్రామాలలో అతనే ప్రథమ జాతీయవాది. కాంగ్రెస్ సభలకనీ, సమావేశాలకనీ తిరగడంలోనే ఆస్తి అంతా పాడయింది. కానీ, చదువు మాని గ్రామాలకు రావలసిన వాళ్ళలో తన కొడుకును మాత్రం ఎన్నడూ లెక్కవెయ్యలేదు.

గాంధీకి ముంగండలో స్వాగతం యివ్వడానికి జరిగే ప్రయత్నాలలో గవరయ్య రేయింబవళ్ళూ పాల్గొంటున్నాడు. ‘స్వరాజ్యగీతా’లనే పుస్తకాలు తెచ్చి ఊర్లో అమ్ముతున్నాడు. కుర్రవాళ్ళ లోని దేశభక్తి ఉత్సాహాన్ని వినియోగించుకొని అతను ఆ పుస్తకాలమీద ఎక్కువ ధర గుంజినాడు. “నేనెవ్వరినీ మోసం చెయ్యలేదు. రెట్టింపు ఖరీదు ఇస్తే పుస్తకాలు యిస్తానన్నాను. బలవంతం ఏముందీ?” అని వాదిస్తాడు. “లేకపోతే ఈ తిరగడానికి డబ్బులేవీ? పన్నెండు పుస్తకాలు అమ్మేను. రెండురోజుల భత్యాలొచ్చాయి.” అని సమర్ధించుకొంటాడు.