ఆఖరి మనిషి

క్రమక్రమంగా
మరణానికి అలవాటుపడటమే
జీవితంగా మారిపోతుంది.
పావురాలకి బదులు తీతువు పిట్టలు
ఉత్తరాలు మోసుకువస్తాయి.

చిన్నప్పటి గ్రూప్‌ఫోటోలో
చిరునవ్వులు చిందించినవారంతా
ఎవరి ఫొటో వారు వెతుక్కుని
వెళ్ళిపోతారు

నటులేకాదు, ప్రేక్షకులు కూడా
ఒకరొకరుగా నిష్క్రమిస్తారు.
రంగస్థలం మీది విషాదానికి
కలిసి కన్నీరు పెట్టటానికి
ఇరువైపులా ఎవరూ కనబడరు

ఆకులతోబాటు
ఈ “సంసారవృక్షం”
వేళ్ళు కూడా ఒకటొకటిగా
పోగొట్టుకుంటుంది

అన్ని ముడులూ విడిపోయాక
అన్ని తీగలూ తెగిపోయాక
ప్రపంచంతో కలిపే ఏకైక సూత్రంలా
శుష్కించిన ఒక శరీరం
మిగిలిపోతుంది.