కాల్వీనో కథల నుంచి – 4

1. లైబ్రరీలో సేనాపతి

ప్రజాతంత్ర రాజ్యాధ్యక్షుల వారికి ఉన్నట్టుండి ఒక అనుమానం పొడసూపింది. అక్కడితో ఆగకుండా అది పెనుభూతమైంది. వెంటనే త్రిదళాధిపతుల్ని పిలిపించి వారితో సమావేశమయ్యారు. సూటిగా విషయంలోకి వచ్చారు. తమ పాలనను అధిక్షేపించే పుస్తకాలు పత్రికలు లైబ్రరీల నిండా ఉన్నాయని, అవి తమ ప్రభుత్వాన్ని, వారికి కొమ్ముగా నిలిచిన సైన్యాధ్యక్షులనీ కూడా విమర్శిస్తున్నాయని, వాటిని అలానే కొనసాగనిస్తే తమ పరపతి దెబ్బతింటుందని తమకొచ్చిన అనుమానాన్ని వారితో పంచుకున్నారు.

త్రిదళాధిపతులు ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు. తమ వెంటే తెచ్చిన ఒక రహస్య నివేదికను రాజ్యాధ్యక్షుల వారికందించారు. సరిగ్గా ఇదే అనుమానంతో గత కొన్ని నెలల నుంచీ ప్రజలందరిపైనా నిఘా వేసి, రహస్యంగా విచారణలు జరిపించి, కూపీలు లాగి మరీ సైన్యాధ్యక్షులు సేకరించిన వివరాలున్నయి అందులో. ముఖ్యంగా ఆందోళన కలిగించిన సంగతులేమిటంటే – ప్రభుత్వాధిపతులు, సైన్యాధికారులు దైవాంశ సంభూతులు కారనీ, మామూలు మనుషుల లాగానే వారూ తప్పులు చేయగలరని, తరచూ చేస్తారని, వారి ఆలోచనలు, నిర్ణయాలు ఎప్పుడూ ప్రజల మంచి కోసమే కాదనీ ప్రజలు అనుకుంటున్నారు. అంతే కాకుండా యుద్ధాలన్నీ ప్రభుత్వం చెబుతున్నట్టు చెడు మీద మంచి వీరోచితంగా గెలవడం గురించి కాదనీ, ప్రభుత్వం తన స్వార్థం కోసమే యుద్ధాలు చేస్తుందని కూడా అనుకుంటున్నారు. పాలకులపై ఈ రకమైన విమర్శ చాలా పుస్తకాలలో – కొత్తవి, పాతవి, స్వదేశి, విదేశి, స్వభాష, పరభాష – ఎప్పట్నుంచో ఉంటోందని, ప్రజలు వాటిని చదివే తమ గురించి గొప్పగా అనుకోవడం లేదని, ఆ రహస్య నివేదిక సారాంశం. అంతే కాక, సైనికులు అవి చదివిన పక్షంలో వారి నైతికత దెబ్బతినడానికి, లేకపోతే తిరుగుబాటు చెయ్యడానికి ఆస్కారం ఏర్పడుతుందని కూడా ఆ నివేదిక హెచ్చరించింది.

రాజ్యాధ్యక్షుల వారి అధ్యక్షతన సైన్యాధ్యక్షుల సమావేశం ఏర్పాటయింది. అధిపతుల మేధ, సమర్థత, పాలనల గురించి ప్రజలకున్న అపోహల వివరాలు చర్చించబడినై. మేధోమథనం జరిగింది. గణాంక పట్టికలు శల్యపరీక్ష చేయబడినై. కారణం తెలిసింది కాబట్టి, ఇక కార్యాచరణ ఎలా? సమావేశ మందిరం ఆలోచనల సెగలతో వేడెక్కి పోయింది. అధిపతులందరూ ఇంతగా తలలు పట్టుకోడానికి కారణం, ఎవరికీ ఏం చేయాలో ఇదమిథ్థంగా తెలియకపోవడం. యుద్ధాలంటే పాత చింతకాయ పచ్చడే కానీ, పుస్తకాల గురించి ఏమీ తెలియదే! మరి వాటిని ఎలా ఎదుర్కొనడం?

శత్రువులకి సింహస్వప్నమనీ, ఖచ్చితమైన వాడనీ, అత్యంత విశ్వసనీయుడనీ పేరు పొందిన కల్నల్ సర్వగ్యాని అధ్యక్షతన ఒక మిలటరీ కమీషన్ ఏర్పాటు చేయాలని నిశ్చయించి సర్వగ్యానిని పిలిపించారు. కమిషన్ పని ప్రజాతంత్ర రాజ్యంలోనే ముఖ్యమైనది, అతి పెద్దది అయిన సెంట్రల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నిటిని పరిశీలించి ఆరు నెలల్లోగా తమకు ఒక విస్తృత నివేదిక అందించడం. అంతే కాదు, రిటైరైన మిలటరీ అధికారులు, జడ్జీలతో ఏర్పాటు చేసిన ఒక మేధోకూటమికి ప్రతీ రోజూ సాయంత్రం ఏడు గంటలకు రోజువారీ రిపోర్టు పంపాలి. మేధోకూటమి ఎప్పటి కప్పుడు ఆ రిపోర్టులు పరిశీలించి సర్వగ్యానికి సూచనలు, సలహాలు ఇవ్వడం, కమీషన్ పనితీరుని పర్యవేక్షించడం, గడువు ముగిసే లోగానే పని పుర్తయ్యేలా చూడడం, వగైరా వగైరా ఆజమాయిషీ చేస్తుంది.

ప్రజాతంత్ర విశ్వ సారస్వత నికేతనం (సెంట్రల్ లైబ్రరీ అసలు పేరు) బాగా పాతబడ్డ మూడంతస్తుల భవనం; పెద్ద ద్వారబంధం, ముందు వెడల్పాటి నాపరాతి మెట్లు. గుమ్మానికి అటూ ఇటూ పొడూగ్గా స్థంభాలు. ఒకప్పటి రాజుగారి హవేలీని అప్పుడెప్పుడో లైబ్రరీకని ఇప్పించుకున్నారు. అక్కడక్కడా పెచ్చులూడిపోయిన గోడలు, ప్రహరీ గోడ బీటల్లోంచి, మెట్ల సందుల్లోంచి పెరుగుతున్న పిచ్చి మొక్కలు, ఆలనా పాలనా సరిగ్గా లేకపోయేప్పటికి ఆ మేడ మరింత పాతగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల గోడలు వానకు తడిసి, ఎండకు ఎండీ కూలిపోయినై కూడా. ఇక లైబ్రరీ ముందూ వెనకా ఉన్న తోట గురించి చెప్పనక్కర్లేదు, కలుపు మొక్కలతో నిండిపోయి ఒక చిన్న అడివిలా ఉంటుంది. లోపలికెలితే అటూ ఇటూ పై అంతస్తులకి మెట్లు, లెక్కలేనన్ని గదులు, ప్రతీ గదిలోను లెక్కలేనన్ని పుస్తకాలు, బీరువాల నిండా. కొన్ని గదుల్లో అవి చాలక నేలమీదే గుట్టలు గుట్టలుగా దుమ్ము పేరుకొని పోయి పడుంటై. కొన్ని గదుల్లోకైతే ఎలుకలు మాత్రమే దూరగలవు; ఇంకొన్నింటిలో కేవలం బొద్దింకలే. పాపం, ప్రజాతంత్ర దేశపు ప్రభుత్వాదాయమంతా సైన్యానికి, దాని అవసరాలకే సరిపోతుంది, లైబ్రరీలకీ స్కూళ్ళకీ దాని దగ్గర డబ్బుల్లేకపోయె.

ముసురు పట్టి జల్లు పడుతున్న ఆ నవంబరు 3వ తేదీ ఉదయాన, లైబ్రరీ ముందు ఒక మిలటరీ జీపు, దాని వెనకాలే ఒక ట్రక్కు వచ్చి ఆగినై. జీపు లోంచి కల్నల్ సర్వగ్యాని ముందుగా దిగాడు. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన మిలటరీ యూనిఫారం, నున్నగా గీసుకున్న గడ్డం, క్రమశిక్షణతో పెరిగిన మీసం, తీక్షణమైన కళ్ళకు అడ్డంగా నల్ల కళ్ళజోడు, ధృఢచిత్తంతో బిగుసుకున్న దవడ కండరం, గీత గీసినట్టున్న పెదాలు, ముడిపడిన నుదురు – సర్వగ్యాని వెనకాలే ఇంకో నలుగురు అనుచరులు, కవళికల్లో కల్నల్ మల్లేనే ఉండి, జీపు వెనకాలనుంచి దిగారు. వాళ్ళ చేతుల్లో బ్రీఫ్‌కేసులున్నై. లైబ్రరీ భవనాన్ని పైనుంచి కిందిదాకా నిశితంగా పరిశీలించి, తల చివాలున పంకించి కల్నల్, ఆయన అనుచరులు నిటారుగా లోపలికి నడిచారు. వెంటనే వెనకాల ట్రక్కులోంచి కొంత మంది సైనికులు దిగి పెద్ద పెద్ద ట్రంకు పెట్టెలు దింపడం మొదలు పెట్టారు. కాసేపటికి లైబ్రరీ బిల్డింగు వెనకాల పెరిగిపోయిన తుప్పల్ని నరకడం, నేల చదును చేసి, వంట చేయడానికి వీలుగా గోడవారన రాళ్ళు పేర్చడం, ఎండు తుప్పల్ని ఒక మూలగా నెట్టి మంట పెట్టడం, చెట్ల కింద గుడారాలు పాతడం – ఇలా కాసేపట్లో అక్కడంతా పెద్ద హడావిడి మొదలయింది. మెషీను గన్లు పట్టుకున్న ఇద్దరు సైనికులు గేటుకి అడ్డంగా ‘ప్రవేశము లేదు’ అని ఒక హెచ్చరిక వేలాడేసి, దానికటూ ఇటూ కాపలా కాస్తూ, దేనివంకా చూడకుండా అన్నిటిని గమనిస్తూ నిలబడ్డారు.

పొద్దున్నే గొడుగులు పట్టుకొని, భుజాలకు సంచీలు వేలాడేసుకొని, కళ్ళజోళ్ళు సర్దుకుంటూ, లైబ్రరీలో పుస్తకాల మధ్య రోజంతా గడపడానికి వచ్చేవాళ్ళంతా ఈసురోమంటూ మళ్ళీ ఇళ్ళకు పోవాల్సొచ్చింది. వాళ్ళకేమీ పాలు పోలేదు. ఏమిటిదంతా? లైబ్రరీ దగ్గర సైన్యం ఎందుకుంది? వెనకాల ఆ గుడారాలేమిటి? ఆ కవాతులేమిటి? వాళ్ళు పుస్తకాలన్నీ తగలేస్తారా? లైబ్రరీకొచ్చే వాళ్ళందర్నీ కాల్చేస్తారు కూడానా? – ఇలా రకరకాలుగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఎవరి దగ్గర చూసినా ప్రశ్నలే తప్ప జవాబుల్లేవు. సర్వగ్యాని కమీషన్‌కి ఒప్పచెప్పిన పని వివరాలు ఎంతో గోప్యంగా ఉంచాలని, పత్రికలకు, ప్రజలకు ఏమాత్రం తెలియకూడదనీ రాజ్యాధ్యక్షుల వారి ఆదేశం మరి.

కల్నల్ సర్వగ్యాని ఆదేశం మేరకు, లైబ్రరీలో పనిచేసే వాళ్ళందరికీ పిలిచేదాకా రావద్దని చెప్పి మరీ సెలవులిచ్చి ఇళ్ళకు పంపేశారు. కేవలం ఒక్క లైబ్రేరియన్‌ని మాత్రం ఉండమన్నారు, ఏ పుస్తకం ఎక్కడుందో వెతికేవాళ్ళకు తెలియాలి గదా! పొట్టిగా, బక్కపల్చగా కళ్ళజోడు, పెద్ద నుదురుతో ఉండే ఆ లైబ్రేరియన్ పేరు సోమయాజి. ఆయన ఎన్నేళ్ళ నుంచీ అక్కడ పనిచేస్తున్నాడో ఎవ్వరికీ తెలీదు కానీ చాలామంది పెద్దవాళ్ళు కూడా వాళ్ళ చిన్నతనం నుంచీ ఆయన్ను అక్కడే చూస్తుండేవాళ్ళం అని పిల్లలకు చెప్తుంటారు.

కల్నల్ సర్వగ్యాని ముందున్న మొట్టమొదటి బాధ్యత వ్యూహ రచన. పని పూర్తయే దాకా లైబ్రరీ వదిలి రావద్దని అధిపతుల ఇచ్చిన ఉత్తర్వులు తప్పకూడదు. ముందున్న పని సామాన్యమైనది కాదు; ఎంతో ఏకాగ్రత, క్రమశిక్షణ అవసరం. వసతి సౌకర్యాల నిర్వహణ లెఫ్టినెంట్ ఏకవేదికి అప్పగించబడింది. అతను వెంటనే, ఆరునెలలకు కావల్సిన వెచ్చాలు, వంట చెరకు తెప్పించి లైబ్రరీ వెనక నిలవ చేయించాడు. సైనికులందరికీ గుడారాల్లో హరికేన్ లాంతర్లు పెట్టించాడు. మడత మంచాలు, రాత బల్లలు వేయించాడు. లైబ్రరీలో గుమస్తాలు కూర్చునే గదులు ఖాళీ చేయించి, కల్నల్‌కు, మిగిలిన వారికి అక్కడ మంచాలు వేయించాడు. గదుల్లో ఎలుకల బోన్లు పెట్టించాడు, బొద్దింకలమందు కొట్టించాడు. లైబ్రరీలో కొత్త బల్బులు, హీటర్లు పెట్టించాడు. ఆ లైబ్రరీలో అంతకు ముందెప్పుడూ అంత వెలుతురు గానీ వెచ్చదనం గానీ ఎవరూ ఎరిగిన పాపాన పోలేదు.

సైనికులని దళాలుగా విభజించి వారికి పని అప్పచేప్పే బాధ్యత లెఫ్టినెంట్లు ద్వివేది, త్రివేది, చతుర్వేదులకి ఇవ్వబడింది. వారు వెంటనే ఆరుగురు సైనికుల్ని ఒక దళంగా, ఆ దళానికి ఒక నాయకుణ్ణి, అలాంటి దళాలు మూడిటికి ఒక మహా నాయకుణ్ణి నియమించారు, అలాంటి ముగ్గురు మహానాయకులకు ఒక అధినాయకుడు. ఒక్కో దళానికి లైబ్రరీలో ఒక్కో శాఖ కేటయించబడింది. ఒక శతాబ్దపు చరిత్ర అంతా సుబేదార్ ముఖర్జీ దళానికి, ఆర్థిక, సామాజికాంశాలు ఛటర్జీ దళానికి, సాహిత్యం, విద్యా శాఖలు బెనర్జీ దళానికి, ఇలాగా. కెప్టన్లు త్రిపాఠి, ఏకపాఠి, ఘనాపాఠి తదితరులు ఆ రకంగా దళాల పర్యవేక్షణకు అధినాయకులుగా నియమించబడ్డారు. పుస్తకాన్ని చదవగానే దళంలో సభ్యుడు ఆ పుస్తకం మీద సమీక్ష రాసి వారి నాయకుడికి ఇస్తాడు. అలా అర్జీలనుంచి ఏదో ఒక పాఠికి, ఆ పైన ఎవరో ఒక వేదికి పుస్తకం వివరాలు అందుతాయి. పాఠీలు తమకందిన సమాచారాన్ని వేదీలతో చర్చిస్తారు, వేదీలు తమ అభిప్రాయాలని సర్వగ్యానికి సమర్పిస్తారు. ఆఖరున కల్నల్ సర్వగ్యాని ఆ పుస్తకం అర్హత నిర్ణయిస్తాడు – ఆ పుస్తకం సైనికులు, సామాన్యులు చదవదగిందేనా? లేక సైనికాధికారులకే పరిమితమా? నిషేధించవలసిన పుస్తకంగా సిఫారసు చేస్తూ మేధోకూటమికి పంపించడమా? – ఈ రకంగా బేరీజు వేసి, పుస్తకం మీద తగినట్టుగా రబ్బరు స్టాంపు ముద్ర ఒకటి వేస్తాడు.

ఇలా కల్నల్ సర్వగ్యాని ఆధ్వర్యంలో కమీషన్ పని మెరుపు వేగంతో మొదలయింది. ప్రతి రోజు ఠంచనుగా ఏడుగంట్లకు లైబ్రరీలో అమర్చిన రేడియో గుండా, మిలటరీ వేవ్‌లెంగ్త్ మీద కల్నల్ సర్వగ్యాని, మేధోకూటమికి ఆ రోజు ఫలితాలను అందించేవాడు. సాధారణంగా – ఆ రోజున ఎన్ని పుస్తకాలు పరీక్షించారు. ఎన్ని పుస్తకాలు అనుమానాస్పదంగా అనిపించాయి. ఎన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ని పుస్తకాలు సైనికులు, ప్రజలు చదవటానికి యోగ్యమైనవిగా నిర్ణయించారు – ఇలాంటి ఖచ్చితమైన గణాంకాలు మాత్రమే ఉంటై సర్వగ్యాని నివేదికలో. అడపాదడపా, ఫలానా సైనికుడికి కళ్ళజోడు కావాలనో, ఫలానా అర్థశాస్త్రం అసలు ప్రతిని ఎలుకలు కొరికేసి చదవ యోగ్యం కాకుండా చేసినై అనో కూడా ఆ నివేదికలో వినిపిస్తుంటై.

అయితే, ఆ నివేదికల్లో బయటకు రాని విషయం ఒకటుంది. అది కెప్టెన్ పాఠీలను, లెఫ్టినెంట్ వేదీలను కలవరపెడుతున్నది. అదేమిటంటే, చదివేకొద్దీ పుస్తకాల సంఖ్య తగ్గకపోగా మరింతగా, ఇంతింతగా పెరిగిపోతోంది. తవ్వేకొద్దీ ఇంకా పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. నిజానికి సోమయాజిగారు ఎప్పటికప్పుడు సహాయం చేస్తుండక పోయుంటే ఈపాటికి వాళ్ళంతా ఎప్పుడో ఆ లైబ్రరీలో దారి తప్పిపోయేవారే. ఒకసారి నారాయన్ పాత్రో ఉన్నట్టుండి చదువుతున్న పుస్తకం నేలకేసి విసిరి కొట్టి, “ఈ పుస్తకం అంతా అబద్ధం. సామ్యతంత్ర దేశంలో కరువుకి కారణం మా సామ్యవాద నాయకులు కానే కాదు. మా సామ్యవాదులెప్పుడూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు!” అని అరిచాడు. వెంటనే సోమయాజిగారు పాత్రో దగ్గరికి వచ్చి, సౌమ్యంగా – “అదొక్కటే కాదండీ, సామ్యతంత్ర దేశ రాజకీయాల్లో సామ్యవాదుల పాత్ర పూర్తిగా తెలుసుకోవాలంటే, ఇదిగో ఈ పుస్తకం, ఈ పుస్తకం, ఇంకా ఈ రెండు పుస్తకాలు చదవండి. మీరు మీ సమీక్షలో రాయడానికి ఇంకొంచెం వివరాలు దొరుకుతాయి.” అని ఆ పుస్తకాలు వెతికి చూపించాడు. పాత్రో ఆ పుస్తకాలు తిరగేస్తూ, “ఓ! అవునా! ఈ సంగతి నాకిప్పటిదాకా తెలీదే! అరె! ఇలా కూడా జరిగిందా, చాలా ఆసక్తిగా ఉందే! అబ్బ, ఏం వింత పుస్తకాలు బాబూ! చదువుతుంటే ఎన్ని కొత్త సంగతులు తెలుస్తున్నాయో!” అంటూ కోపం అంతా పోయి, ఆశ్చర్యపడిపోతూ మళ్ళీ శ్రద్ధగా చదవడం సాగించాడు.

యుద్ధాలు, శాంతి ఒడంబడికలు, దేశాలు, సమితులు, దొంగనాయకులు, నాయకదొంగలు, కులాలు, మతాలు, వాటి మధ్య అల్లర్లు, వాటి రాజకీయాలు, చదువులు, పదవులు, సాహిత్యం, విప్లవాలు, సాహిత్య విప్లవాలు, విప్లవ సాహిత్య రాజకీయాలు, – ఇలా ఒకటేమిటి, ఏ పుస్తకం గురించైనా, ఏ శాస్త్రమైనా, ఏ సందర్భమైనా సోమయాజిగారు సైనికులు అడిగీ అడగక ముందే, అలసటనేది లేకుండా, ముఖం మీద చిరునవ్వు వాడకుండా సైనికులు చదువుతున్న పుస్తకానికి సంబంధించిన పుస్తకాలు మరిన్ని చూపిస్తుండేవాడు. సైనికులు మరింతగా లీనమైపోయి చదివేస్తుండేవారు.

ఎన్ని రోజులో పట్టకుండానే, కల్నల్ సర్వగ్యాని రేడియో ద్వారా కూటమికి ఇచ్చే రోజువారీ నివేదికలో చదివేసిన పుస్తకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ, పుస్తకాల అర్హత తేల్చి చెప్పడం రాన్రానూ తగ్గిపోతూ వచ్చింది. సర్వగ్యాని రబ్బరు స్టాంపులకి పని తక్కువైంది. ఒకరోజు కల్నల్ ఒక పుస్తకాన్ని చూసి లెఫ్టినెంట్ చతుర్వేదిని “ఈ పుస్తకం ఎలా మంచిదనుకున్నావ్? దీంట్లో సేనాపతులకంటే సైనికులే గొప్ప అని రాసుంది. అసలు రాసినవాడికి సైన్యం గురించి తెలుసా!” అని గద్దించాడు. చతుర్వేది వెంటనే, త్రిపాఠి, ముఖర్జీలని పిలిపించాడు. ఆ పుస్తకం మంచిదే అనడానికి గల కారణాలు చెపుతూ, ఇంకో ఆరు పుస్తకాల పేర్లు ముఖర్జీ ఏకరువు పెట్టాడు. అందులో మూడు పుస్తకాలు రాజకీయ శాస్త్రానికి, రెండు పుస్తకాలు ఆర్థిక శాస్త్రానికి, ఒకటి సామాజిక శాస్త్రానికి సంబంధించినవి. దాంతో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ఇలా కొన్ని సార్లయేటప్పటికి ఒక్క పుస్తకాన్ని బేరీజు వేయడానికి కూడా గంటల తరబడి చర్చలు, వాదోపవాదాలు జరుగుతుండేవి. చడీ చప్పుడూ లేకుండా ఏ మూలనుండి వచ్చేవాడో సోమయాజిగారు తెలియదు కానీ చర్చ బాగా వేడిగా సాగుతున్నప్పుడు ఆ చర్చకు సంబంధించిన ఇంకో పుస్తకం ఏదో సిఫారసు చేసేవాడు. దాంతో సర్వగ్యాని నిర్ణయం తీసుకోవడం మరింతగా ఆలస్యమౌతుండేది.

అర్హత బేరీజు వేయాల్సిన పుస్తకాలు అలా పేరుకుపోవడంతో, సైనికులకి పని లేకుండా పోయింది. వారికేం చేయాలో తోచలేదు. గోళ్ళు గిల్లుకుంటూ ఎంతసేపని కూర్చోగలరు వాళ్ళు మాత్రం? ఒకరోజు విద్యాచరణ్ శుక్లా అనే సైనికుడు వచ్చి చదువుకోడానికి ఏదైనా పుస్తకం ఇప్పించమని అడిగాడు. అప్పటికే రబ్బరు స్టాంపేయించుకున్న పుస్తకం ఇద్దామనుకొన్నాడు గానీ, ద్వివేదికి ఇంకా చదవని పుస్తకాలు అన్నేసి ఉన్నప్పుడు, ఒకసారి చదివిన పుస్తకాన్నే ఇవ్వడం పని దండగ అనిపించింది. అలా అని ఏ పుస్తకం పడితే అది అందులో ఏం రాసుందో తెలీకుండా ఇవ్వలేడు కూడా. సోమయాజిగారి సిఫారసుతో ఒక చిన్న నవల లాంటిదేదో శుక్లాకి దక్కింది. ఒకట్రెండు రోజుల్లో మిగతా సైనికులు కూడా అలానే పుస్తకాలు తెచ్చుకున్నారు. చదవడం రాని నటేశన్‌ కోసం స్వామినాధరెడ్డి పుస్తకాన్ని పెద్దగా చదివేవాడు. అతని చుట్టూ ఇంకో నలుగురు సైనికులు గుమిగూడేవారు. ఎవరిలోనో ఏదో ప్రశ్న తలెత్తేది. దానికి నాలుగు రకాల సమాధానాలొచ్చేవి. అది వాదనగా మారేది. ఇలా సైనికులంతా కూడా గుంపులుగా చేరి పుస్తకాలు చదివి చర్చించుకోడం మొదలైంది. ఇంకొన్ని రోజులకు వాళ్ళు పాఠీలు, వేదీల చర్చల్లో కూడా చేరిపోయారు. ఇప్పుడు లైబ్రరీలో ఎప్పుడు చూసినా సైనికులు, అధికారులు అందరూ చర్చలు చేస్తూ కనిపిస్తున్నారు. సోమయాజిగారు ఎప్పట్లానే చిరునవ్వుతో వారికి అవసరమైనప్పుడల్లా మరిన్ని పుస్తకాలందిస్తూ సహాయం చేస్తున్నాడు.

రాన్రానూ కమీషన్ పని ఎంతవరకూ వచ్చిందో కూటమికి అర్థం కాకుండా పోయింది. పైగా అప్పుడప్పుడు క్రమం తప్పుతూ చివరికి శీతాకాలం గడిచేటప్పటికి రోజువారీ నివేదికలు పూర్తిగా ఆగిపోయినై. మేధోకూటమి అధ్యక్షుడికి లైబ్రరీలో ఏం జరుగుతోందో తెలియక కంగారు పడ్డాడు. పెట్టిన గడువు కల్లా పని పూర్తి చేసుకుని ఒక కూలంకషమైన నివేదికతో రమ్మని సర్వగ్యానికి కబురు పంపించాడు. కబురు మోసుకొచ్చిన కల్నల్ బిభూతికి సైనికులంతా మారిపోయినట్టుగా కనిపించారు. ఒకపక్క వారికి పుస్తకాలు చదవడం, రోజూ కొత్త కొత్త విషయాలు తెలుసుకోడం ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు ఎన్నడూ ఊహించనన్ని పుస్తకాలు చదువుతున్నారు. ఇంకో పక్క త్వరగా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలని, బైట ప్రపంచంలోకి, వాళ్ళ వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళాలనీ ఉంది. కొత్తగా నేర్చుకున్న జ్ఞానం వారికి బైట ప్రపంచాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. కానీ, త్వరలోనే లైబ్రరీ వదిలి వెళ్ళిపోయే రోజు తలచుకుంటే చెప్పలేని బెంగ పుడుతోంది. అందరి తలల్లోనూ ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు, ఎన్నో వింత వింత ఊహలు – ఇదమిత్థంగా ఇదీ అని చెప్పలేకుండా ఉన్నారు.

మలి సంజె వేళకి అందరూ లైబ్రరీ లోకి చేరేవారు. కిటికీకవతల అప్పుడప్పుడే కొత్తగా చిగురేస్తున్న మొక్కల్ని, ఆకులమీద, చెట్ల మీద, వీధి దీపాలను కమ్ముకుంటూ, రాలుతున్న పొగమంచునీ, చీకటి దుప్పటిని మెల్లిగా కప్పుకుంటున్న ఊరినీ చూస్తున్నప్పుడు, ఎవరో లాంతరు సన్నని వెలుగులో ఏ పుస్తకంలోంచో ఒక కవిత గొంతెత్తి చదివేవాడు. అందరూ నిశ్శబ్దంగా వింటుండేవారు. ఒక్క కల్నల్ సర్వగ్యాని తప్ప.

గడువు ముగిసేలోగా నివేదిక పూర్తిచేయాలన్న పట్టుదలతో కల్నల్ సర్వగ్యాని అతని గది నుంచి బైటికి రాటల్లేదు. ఎవరూ ఆయన ఏకాగ్రత చెడగొట్టకూడదని ఉత్తర్వులు జారీ చేశాడు. కానీ అప్పుడప్పుడూ సర్వగ్యాని గదిలోంచి సోమయాజీ అని పిలుపు వినిపించేది. కేవలం సోమయాజిగారొక్కరికే ఆ గదిలోకి పోడానికి అనుమతి ఉన్నది. ఆయనని సర్వగ్యాని ఏదో అడగడమూ, సోమయాజిగారు లైబ్రరీ లోంచి ఏదో పుస్తకం తీసుకొని మళ్ళీ గదిలోకి పోవడమూ, ఇదే తంతు. సోమయాజిగారి సహాయం లేకుండా సర్వగ్యాని నివేదిక రాసే స్థితిలో లేడు. చివరికి ఇద్దరూ కలిసే ఆఖరి నివేదికను తయారు చేశారు.

ఫెళ్ళుమని ఎండ కాస్తున్న ఆ మే 4వ తేదీ ఉదయం, మేధోకూటమి, త్రిదళాధిపతులు, రాజ్యాధ్యక్షులు అందరూ సమావేశమైనారు. సర్వగ్యాని నివేదికలో ఏముందో తెలుసుకోడం కోసం ఊపిరి బిగబట్టుకొని మరీ ఎదురు చూస్తున్నారు. గంట కొట్టగానే ఠంచనుగా సర్వగ్యాని తన నివేదికని వినిపించడం మొదలుపెట్టాడు. అతని ఉపన్యాసం మనిషి పుట్టిన నాటి నుంచి నేటి దాకా మానవ విజ్ఞాన సర్వస్వాన్ని పరిచయం చేస్తూ మొదలయింది. ప్రజాతంత్ర రాజ్యంలో అప్పటిదాకా ప్రజల మంచికని నమ్మబలికి ప్రజాధ్యక్షులు ఒంటిపోకడలో తీసుకున్న నిర్ణయాలని తప్పుపట్టింది. ప్రజల కష్టాలకి కారణం ప్రభుత్వమూ, పురపాలకులే అని తేల్చి చెప్పింది. ప్రజలు అజ్ఞానంలో పడి అనవసరంగా యుధ్ధాలు, విప్లవాలలో బలి అయిపోయిన వారిని, త్యాగధనులు, అమరవీరులు అని పొగుడుకుంటున్నారనీ, అసలు నిజం అది కాదనీ స్పష్టం చేసింది. ప్రజల అజ్ఞానానికి కారణం ప్రభుత్వమే అని వేలెత్తి చూపింది. అలా అని ఉపన్యాసం పూర్తిగా స్పష్టంగా కూడా లేదు. కొత్తగా ఏదైనా నేర్చుకున్నవాళ్ళు, లేదూ ఒక కొత్త వాదాన్ని తలకెత్తుకున్నవాళ్ళు సమస్యలని నలుపూ తెలుపుల్లో పైపైనే చూసేసి అభిప్రాయాలేర్పరచుకుంటారే, అలాగే, సర్వగ్యాని నివేదికలో కూడా అక్కడక్కడా ఒకదానికొకటి సరిపోని తీర్మానాలు, వివరణలూ ఉన్నై. కొన్ని తప్పులూ ఉన్నై. కానీ సర్వగ్యాని ఉపన్యాసపు సారాంశంలో మాత్రం ఏ సందేహమూ లేదు.

వింటున్న అధ్యక్షులు, త్రిదళాధిపతులు అవాక్కయినారు. స్థాణువులైనారు. కాసేపటికే తేరుకున్నారు. గొంతెత్తి బిగ్గరగా అరవడం మొదలుపెట్టారు. సర్వగ్యాని నివేదిక చదవడం పూర్తయేదాకా కూడా ఎవరూ ఆగలేదు. రాజద్రోహ నేరం కింద కల్నల్ సర్వగ్యానిని విచారించాలనీ, అతన్ని శిక్షించాలనీ అందరూ అరిచారు. కానీ అలా చేస్తే, ప్రజలకు అనుమానం వచ్చి తిరుగుబాటు చేస్తారేమో, సైన్యం కూడా తోడవుతుందేమో అన్న భయం వారిని నిలువరించింది. కల్నల్ సర్వగ్యాని, అతని లెఫ్టినెంట్లు ఏకవేది, ద్వివేది, త్రివేది, చతుర్వేదులను ఆ క్షణం నుండే ఆరోగ్యకారణాల వల్ల సైన్యం నుంచి విడుదల చేస్తున్నామని, దురదృష్టవశాత్తు విధినిర్వహణలో ఒత్తిళ్ళ వలన వారికి మానసిక స్థిమితం తప్పిపోయిందని, వారి అకుంఠిత దీక్షను, దేశభక్తిని పొగుడుతూ పత్రికా ముఖంగా ప్రకటించారు.

మామూలు బట్టల్లో, భుజానికి సంచీలు వేలాడేసుకుని, చలికి శాలువా కప్పుకొని ఆ ఐదుగురూ పొద్దున్నే ఆ పాత లైబ్రరీకి పోవటం ఇప్పుడు తరుచుగా కనిపించేదే. అక్కడ వీళ్ళ కోసం పుస్తకాలు ఏరిపెట్టి సోమయాజిగారు రోజూ ఎదురుచూస్తూ ఉంటారు కదా.

(A general in the library, 1953.)

2. అవేకళ్ళు

రోజులాగానే తెలిసిన దారిలోనే నడుస్తున్నా ఏదో చెప్పలేని ఇబ్బంది. తనల్నెవరో గుచ్చి గుచ్చి చూస్తున్నట్లుగా, ఒళ్ళంతా తూట్లు పొడుస్తున్నట్టుగా, ఏదో తెలియని చిరాకు. ఆసిఫ్ ఉన్నట్టుండి ఆగి తల వెనక్కి తిప్పి చూశాడు. ఎవరూ కనిపించలేదు. అంతా మామూలుగానే ఉంది.

ఆసిఫ్ రోజూ ఆ గల్లీలోంచే నడుచుకుంటూ వస్తాడు, మెయిన్ రోడ్ మీదకి. ఇంటినుంచి బస్టాపుకు రావడానికదే దారి. అలా అదురుపాటుతో వెనక్కి తిరిగి చూసినందుకు ఆసిఫ్‌కి తన మీద తనకే కోపమొచ్చింది. కాయర్ కహీఁకా! అని తనని తానే తిట్టుకొని మళ్ళీ నడక సాగించాడు. కాసేపటికే మళ్ళీ, అదే ఇబ్బంది, ఎవరో అదేపనిగా తనని గమనిస్తున్నట్టు. తన మెడపైనే చూపు నిలిపి సడీ చప్పుడూ లేకుండా ఎవరో తనకు దగ్గర దగ్గరగా వచ్చేస్తున్నట్టు. ఆసిఫ్ సన్నగా వణికాడు.

ఈ గల్లీలోంచి బైటపడి మనుషుల్లో పడితే కానీ ఈ చిరాకు పోదేమో. మెయిన్ రోడ్ మీదకి తిరుగుతూ మళ్ళీ చుట్టూ చూశాడు. కొత్తగా ఏమీ కనపడలేదు. తనను చూసి ఎవరూ దాక్కోలేదు. స్కూల్ యూనిఫాంలో వున్న కుర్రాడెవరో సైకిల్ తొక్కుకుంటూ పోతున్నాడు. ఒకామె వీధి దాటుతోంది. కార్నర్ ఇరానీ కేఫ్‌లో ఇంకా ఎవరూ లేరు. తల తిప్పుకుంటుంటే వీధికవతలవైపు అచ్చం తనలాగే తల తిప్పుకుంటున్న ఇంకొకతను కనపడ్డాడు. ఇద్దరూ ఒకేసారి, చటుక్కున ఒకరినుంచి ఒకరు చూపు తిప్పేసుకున్నారు, ఇంక వేరే దేని కోసమో చూస్తున్నట్లు. ‘ఈ భయం నా ఒక్కడికే కాదేమో. నాలానే అతనిక్కూడా ఇలాగే అనిపిస్తున్నట్టుంది’ అనుకుంటూ ఆసిఫ్ బస్టాప్ గోడ కానుకుని నిలబడ్డాడు.

మెయిన్ రోడ్ మీద అటూ ఇటూ, నడుస్తూ, సైకిళ్ళు, స్కూటర్ల మీద పోతూ మనుషులు, ఎవరి ముఖంలో చూసినా ఏదో చిరాకు, ఏదో తత్తరపాటు, నొసళ్ళు చిట్లించుకొని ఏదో తరుముకొస్తున్నట్టు వస్తూ పోతున్నారు. ‘షాయద్ ఆజ్ సబ్‌కీ తబీయత్ కుచ్ వైసీ హైఁ, క్యా కచ్‌డా దిన్ హైఁయే రే!’ అనుకుంటూ అప్పుడే వచ్చిన బస్సు ఫుట్బోర్డ్ మీదకి ఎగిరి కాలుపెట్టి కమ్మీ పట్టుకొన్నాడు. బస్సు పూర్తిగా ఆగకుండానే మళ్ళీ బయల్దేరింది. గుమ్మాన్ని పట్టుకు వేళ్ళాడుతున్న వాళ్ళని తోసుకుంటూ బస్సు లోపలికి వచ్చి నిలబడ్డాడు ఆసిఫ్, మళ్ళీ మళ్ళీ ‘క్యా కచ్‌డా దిన్ హైఁయే రే! క్యా కచ్‌డా దిన్!’ అనుకుంటూనే. ‘అరే! పొద్దుగాల్నే వంద నోట్ పట్కోనొస్తే చిల్లరెక్కడ్నుంచి నూక్క రావాలె?’ కండక్టర్ ఎవర్నో అరుస్తున్నాడు. ఇవేమీ పట్టనట్టు తాపీగా పాన్ నములుకుంటూ, అదేపనిగా హారన్ మోగించుకుంటూ సైకిళ్ళు, ఆటోల మధ్యలోంచి డ్రైవర్ బస్సు తోలుకుంటున్నాడు. హాండిల్ బారునీ, దానికి వేలాడుతున్న తోలు పటకాలనీ పట్టుకుని నిలబడిన వాళ్ళంతా పడవలో ప్రయాణీకుల్లా అటూ ఇటూ బస్సుతో పాటూ ఊగుతున్నారు.

తనని తాను నిలదొక్కుకొని బస్సులోకి చూసిన ఆసిఫ్‌కి ముందు సీట్లో కూర్చొని కిటికీలోంచి బైటికి చూస్తూ ఆరిఫ్ కనబడ్డాడు. “అరే ఆరిఫ్” అని సీటు దగ్గరకి నెట్టుకొనొస్తూ పలకరించాడు ఆసిఫ్. బైటికి తదేకంగా చూస్తున్న ఆరిఫ్ ఉలిక్కిపడి తలతిప్పి చూశాడు.

“అబే తూ ఆసిఫ్, కైసా హై రే?”

“బస్ చల్రా. క్యా ఆజ్ థోడా పరేషాన్ దిఖ్‌రహా తూ?” అందరిలోనూ తన భయాన్నే చూస్తున్నాడు ఆసిఫ్ తనకు తెలియకుండానే. “నాకూ ఏం బాలేదు. పొద్దుణ్ణుంచీ ఏదో చెప్పలేని భయంగా ఉంది.”

“భయం లేనిదెవరికి!” నిదానంగా అన్నాడు ఆరిఫ్. మాటల్లోనూ, చూపుల్లోనూ సాత్వికంగా ఉండడం వల్లనేమో, అతని మాటలు భరోసా ఇస్తున్నట్టుగా అనిపిస్తాయి.

“నీకు తెలుసా నాకెలా అనిపిస్తోందో. ఎవరివో కళ్ళు నన్నే గుచ్చి గుచ్చి చూస్తున్నట్టు, నన్నే గమనిస్తున్నట్టు.”

“కళ్ళా? ఎలాంటి కళ్ళు?”

“ఇంతకు ముందెప్పుడో చూసిన కళ్ళ లాగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూశానో, ఎవరి కళ్ళో గుర్తుకు రాదు. కోపంగా, అపనమ్మకంతో చూస్తున్నట్టు…”

“నువ్వంటే అసలేం లెక్కలేనట్టు కదూ? కానీ చీడపురుగులా నిన్నూ చంపకుండా ఒదిలేయకూడదన్నట్టు, అవునా?”

“ఎలాంటి కళ్ళంటే…”

“కాఫిర్ల కళ్ళలాగా.”

“అవునవును. అలాగే”

“అందులో అంత వింతేమీ లేదు. ఇలాంటి వార్తలు పేపర్లో వస్తుంటే ఎవరికైనా అలానే అనిపిస్తుంది.”

తన చేతిలో మడతపెట్టి పట్టుకున్న పేపర్ విప్పి చూపించాడు ఆరిఫ్. గుజరాత్‌లో మతకల్లోహాలు, ముంబై, కోల్కత్తాలలో కూడా చెదురుమదురుగా జరుగుతున్న అల్లర్లు, హైదరాబాదుకీ పాకే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మొదటి పేజీలోనే వార్త.

“ఈ భయం అందుకని కాదేమో? ఇదేం మనకు కొత్త కాదు కదా. ఈ తగాదాలు ఎప్పణ్ణుంచో ఉన్నై. ఇప్పుడే ఎందుకు భయపడాలి?

“ఎందుకంటే నిన్నెవరో చూస్తున్నరని నీకు మళ్ళీ అనిపిస్తోంది, నువ్వు మళ్ళీ అవే కళ్ళ గురించి మాట్లాడుతున్నవ్ కాబట్టి.” సాలోచనగా అన్నాడు ఆరిఫ్.

“ఆ కళ్ళు ఇంతకు ముందు నిన్ను ఇలా నిలదీసి చూడలేదు. నిన్ను చూసి చూపు తిప్పుకునే కళ్ళు నిన్నిప్పుడు సూటిగా చూస్తున్నయి. నువ్వూ మెల్లిగా మర్చిపోతున్నవు. ఆ కళ్ళు అప్పటి శత్రువులవి. వీళ్ళవి కాదు. ఇప్పుడు వీళ్ళూ అవే కళ్ళతో మనల్ని చూస్తున్నరు. గుర్తుందా! ఎనిమిదేళ్ళ ముందు, మనల్ని ఎలా చూశాయో ఆ కళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఆ కళ్ళని మనం గుర్తు చేస్కుంటున్నం.”

ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన సంఘటనలు ఇప్పటికీ స్నేహితులిద్దర్నీ వెంటాడుతూనే ఉంటాయి. చాలా జ్ఞాపకాలు, ప్రతీదీ చేదుగా, ఒంటిమీద మిగిలిపోయిన గాట్లలా.

జిలానీ భాయ్ పరిగెత్తుతూ తట్టుకొని పడిపోతే, లేవనీయకుండా అలానే కాళ్ళతో తొక్కి మరీ అన్నని చంపేసి తన వెంటబడిన గుంపులో వాళ్ళు ఇప్పుడెక్కడున్నారో, ఏం చేస్తున్నారో. ప్రాణాలరచేతిలో పెట్టుకొని పరిగెత్తిన పదిహేనేళ్ళ శరీరం.

ఆసిఫ్‌కి ఇప్పుడు అమ్మ తప్పితే ఎవరూ లేరు. తరతరాలుగా సంక్రమించిన పాత ఇల్లు. తిరిగి ఇంటికి చేరేటప్పటికి చీకటి పడుతోంది. తలుపు ఎప్పటిలానే కిర్రుమంటూ నీరసంగా తెరుచుకుంది. చప్పుడు విన్న ఫాతీమా లోపల్నుంచే అరిచింది.

“ఘర్ అబ్ యాద్ ఆయారే! సుబా కబ్ కా గయా తూ…”

“అమ్మీ, నేను ప్రతీ రోజు ఇంటికొచ్చేది ఈ టైముకే కదా.”

“అయితే మాత్రం? ఈ రోజు నాకెంత భయమేసిందో? కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నా నువ్వింటికి ఎప్పుడొస్తావా అని? పొద్దున రేడియోలో విన్నప్పట్నుంచీ, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు.”

“నీక్కూడా అలానే ఉందా! అమ్మీ, అవే కళ్ళు మళ్ళీ మనల్ని చూస్తున్నాయట. అందుకే అందరికీ భయమేస్తోందిట. అదీ ఆరిఫ్‌గాడి కొచ్చిన ఊహ.” భయం ఆరిఫ్ కొక్కడికే ఉన్నట్టు, తనకు లేనట్టు పెద్దగా నవ్వాడు ఆసిఫ్.

ఫాతీమా దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు అరచేతులతో కళ్ళు మూసుకుంది. ఒక్క క్షణం ఆగి “ఆసీ బేటా, మళ్ళీ అప్పట్లానే తగాదాలైతున్నయా?” అడిగింది.

“నై అమ్మీ. ఐసా కబ్ బోలా మైఁ? అభీ నై హోరహా మగర్ యాద్ రఖ్‌నా. నిన్న మొన్నటిదాకా నువ్వేమనేదానివి? రోజులు మారిపోయినై. అప్పుడు కొట్లాటలు రాడానికి ఏదో మతలబీ ఉండింది. ఇంకెప్పుడట్లా కాదు అనేదానివి. ఇప్పుడే మతలబీ అవుతుందో అప్పుడు నీకు తెలీదు కాబట్టి నువ్వట్లా అనుకున్నావ్. కానీ ఏదో ఒక కారణంతో అవే కళ్ళు మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ మళ్ళీ మళ్ళీ వస్తుంటై.”

బైట వాన పడడం మొదలైంది. ఫాతీమా పెట్టిన రోటీలు, కుర్మా తిని బైటికి పోడానికి ఆసిఫ్ చెప్పులేసుకున్నాడు.

“బేటా!”

“క్యా హైఁ అమ్మీ”

“వాన పడుతోంది…”

“అయితే?”

“ఊహూ. ఏమీ లేదు. మరీ ఎక్కువ సేపు తిరగద్దు. జాగ్రత్త.”

“అమ్మీ, మై అబ్భీ ఛోటా బచ్చా హూఁ క్యా?”

“ఠీక్ హైఁ. పర్ జల్దీ లౌటానా బేటా.”

ఆసిఫ్ బైటికి పోగానే ఫాతీమా ముందు తలుపు దగ్గరే నిలబడి చప్పుడొచ్చేట్టుగా గేటు మూసి వెళుతున్న ఆసిఫ్‌ను చూసింది. వాన అలానే పడుతోంది తెరపి లేకుండా. పడుతున్న వాన చినుకుల చప్పుడు వింటూ ఫాతీమా అలానే నిల్చుండి పోయింది. ఆ ఊరు ఇప్పుడెక్కడో దూరంగా ఉంది, ఆ గల్లీలు, ఆ రాత్రులు కూడా దూరంగా ఎక్కడో ఉన్నాయి. కానీ భయం మాత్రం ఇక్కడే దగ్గరగా ఉండిపోయింది. ఇప్పుడక్కడ కూడా ఇలానే వాన పడుతూ ఉంటుందా? అక్కడే నేలమీద చిరిగిపోయి పడున్న జీలూ బేటా సల్వార్ మీద పడుతూ దాన్ని కడుగుతోందేమో. నిల్చున్న వాళ్ళ మీద బురదనీళ్ళు చల్లుతూ పోలీసు జీపులు పెద్దగా సైరన్లు మోగించుకుంటూ దూరంగా అప్పటిలానే ఇప్పుడూ వెళ్ళిపోతూ ఉండుంటాయా? నిజమే, ఇప్పుడింత బెదరి పోనక్కర్లేదేమో. ఈ రోజు ఏ భయమూ లేకుండా ఉండచ్చేమో. బహుశా రేపు కూడా. ఇలానే ఇంకో ఏడాది కూడా. కానీ, ఎంతకాలం ఇలానే భయపడకుండా ఉండగలిగే స్వేచ్ఛ తనకుంటుందో ఫాతీమాకు తెలియలేదు. ఆ రోజుల్లో కూడా, ఏ బెంగా లేకుండా ఉన్న రాత్రుళ్ళలో కూడా, మరుసటి రోజు గురించిన భయం వదిలిపెట్టకుండా సతాయించేది.

ఫాతిమా ఒంటరిగా, చీకట్లోకి చూస్తూ, వాన చప్పుడు వింటూ నిలుచుండి పోయింది. వానలో తడిసిపోతున్న ఆ రాత్రిని చీల్చుకుంటూ అవే కళ్ళు ఆమెను గుచ్చి గుచ్చి చూస్తున్నాయి.

“ఆ కళ్ళు నన్ను చూస్తున్నాయని నాకు తెలుసు” ఫాతీమా మనసులో అనుకుంది, నిటారుగా నిలబడి చీకట్లోకి తలెత్తి సూటిగా చూస్తూ. “కానీ, అవి ఇప్పుడు మా కళ్ళనీ చూడక తప్పదు.”

(Enemy eyes, 1952.)