కాల్వీనో కథల నుంచి – 4

తనని తాను నిలదొక్కుకొని బస్సులోకి చూసిన ఆసిఫ్‌కి ముందు సీట్లో కూర్చొని కిటికీలోంచి బైటికి చూస్తూ ఆరిఫ్ కనబడ్డాడు. “అరే ఆరిఫ్” అని సీటు దగ్గరకి నెట్టుకొనొస్తూ పలకరించాడు ఆసిఫ్. బైటికి తదేకంగా చూస్తున్న ఆరిఫ్ ఉలిక్కిపడి తలతిప్పి చూశాడు.

“అబే తూ ఆసిఫ్, కైసా హై రే?”

“బస్ చల్రా. క్యా ఆజ్ థోడా పరేషాన్ దిఖ్‌రహా తూ?” అందరిలోనూ తన భయాన్నే చూస్తున్నాడు ఆసిఫ్ తనకు తెలియకుండానే. “నాకూ ఏం బాలేదు. పొద్దుణ్ణుంచీ ఏదో చెప్పలేని భయంగా ఉంది.”

“భయం లేనిదెవరికి!” నిదానంగా అన్నాడు ఆరిఫ్. మాటల్లోనూ, చూపుల్లోనూ సాత్వికంగా ఉండడం వల్లనేమో, అతని మాటలు భరోసా ఇస్తున్నట్టుగా అనిపిస్తాయి.

“నీకు తెలుసా నాకెలా అనిపిస్తోందో. ఎవరివో కళ్ళు నన్నే గుచ్చి గుచ్చి చూస్తున్నట్టు, నన్నే గమనిస్తున్నట్టు.”

“కళ్ళా? ఎలాంటి కళ్ళు?”

“ఇంతకు ముందెప్పుడో చూసిన కళ్ళ లాగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూశానో, ఎవరి కళ్ళో గుర్తుకు రాదు. కోపంగా, అపనమ్మకంతో చూస్తున్నట్టు…”

“నువ్వంటే అసలేం లెక్కలేనట్టు కదూ? కానీ చీడపురుగులా నిన్నూ చంపకుండా ఒదిలేయకూడదన్నట్టు, అవునా?”

“ఎలాంటి కళ్ళంటే…”

“కాఫిర్ల కళ్ళలాగా.”

“అవునవును. అలాగే”

“అందులో అంత వింతేమీ లేదు. ఇలాంటి వార్తలు పేపర్లో వస్తుంటే ఎవరికైనా అలానే అనిపిస్తుంది.”

తన చేతిలో మడతపెట్టి పట్టుకున్న పేపర్ విప్పి చూపించాడు ఆరిఫ్. గుజరాత్‌లో మతకల్లోహాలు, ముంబై, కోల్కత్తాలలో కూడా చెదురుమదురుగా జరుగుతున్న అల్లర్లు, హైదరాబాదుకీ పాకే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మొదటి పేజీలోనే వార్త.

“ఈ భయం అందుకని కాదేమో? ఇదేం మనకు కొత్త కాదు కదా. ఈ తగాదాలు ఎప్పణ్ణుంచో ఉన్నై. ఇప్పుడే ఎందుకు భయపడాలి?

“ఎందుకంటే నిన్నెవరో చూస్తున్నరని నీకు మళ్ళీ అనిపిస్తోంది, నువ్వు మళ్ళీ అవే కళ్ళ గురించి మాట్లాడుతున్నవ్ కాబట్టి.” సాలోచనగా అన్నాడు ఆరిఫ్.

“ఆ కళ్ళు ఇంతకు ముందు నిన్ను ఇలా నిలదీసి చూడలేదు. నిన్ను చూసి చూపు తిప్పుకునే కళ్ళు నిన్నిప్పుడు సూటిగా చూస్తున్నయి. నువ్వూ మెల్లిగా మర్చిపోతున్నవు. ఆ కళ్ళు అప్పటి శత్రువులవి. వీళ్ళవి కాదు. ఇప్పుడు వీళ్ళూ అవే కళ్ళతో మనల్ని చూస్తున్నరు. గుర్తుందా! ఎనిమిదేళ్ళ ముందు, మనల్ని ఎలా చూశాయో ఆ కళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఆ కళ్ళని మనం గుర్తు చేస్కుంటున్నం.”

ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన సంఘటనలు ఇప్పటికీ స్నేహితులిద్దర్నీ వెంటాడుతూనే ఉంటాయి. చాలా జ్ఞాపకాలు, ప్రతీదీ చేదుగా, ఒంటిమీద మిగిలిపోయిన గాట్లలా.

జిలానీ భాయ్ పరిగెత్తుతూ తట్టుకొని పడిపోతే, లేవనీయకుండా అలానే కాళ్ళతో తొక్కి మరీ అన్నని చంపేసి తన వెంటబడిన గుంపులో వాళ్ళు ఇప్పుడెక్కడున్నారో, ఏం చేస్తున్నారో. ప్రాణాలరచేతిలో పెట్టుకొని పరిగెత్తిన పదిహేనేళ్ళ శరీరం.

ఆసిఫ్‌కి ఇప్పుడు అమ్మ తప్పితే ఎవరూ లేరు. తరతరాలుగా సంక్రమించిన పాత ఇల్లు. తిరిగి ఇంటికి చేరేటప్పటికి చీకటి పడుతోంది. తలుపు ఎప్పటిలానే కిర్రుమంటూ నీరసంగా తెరుచుకుంది. చప్పుడు విన్న ఫాతీమా లోపల్నుంచే అరిచింది.

“ఘర్ అబ్ యాద్ ఆయారే! సుబా కబ్ కా గయా తూ…”

“అమ్మీ, నేను ప్రతీ రోజు ఇంటికొచ్చేది ఈ టైముకే కదా.”

“అయితే మాత్రం? ఈ రోజు నాకెంత భయమేసిందో? కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నా నువ్వింటికి ఎప్పుడొస్తావా అని? పొద్దున రేడియోలో విన్నప్పట్నుంచీ, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు.”

“నీక్కూడా అలానే ఉందా! అమ్మీ, అవే కళ్ళు మళ్ళీ మనల్ని చూస్తున్నాయట. అందుకే అందరికీ భయమేస్తోందిట. అదీ ఆరిఫ్‌గాడి కొచ్చిన ఊహ.” భయం ఆరిఫ్ కొక్కడికే ఉన్నట్టు, తనకు లేనట్టు పెద్దగా నవ్వాడు ఆసిఫ్.

ఫాతీమా దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు అరచేతులతో కళ్ళు మూసుకుంది. ఒక్క క్షణం ఆగి “ఆసీ బేటా, మళ్ళీ అప్పట్లానే తగాదాలైతున్నయా?” అడిగింది.

“నై అమ్మీ. ఐసా కబ్ బోలా మైఁ? అభీ నై హోరహా మగర్ యాద్ రఖ్‌నా. నిన్న మొన్నటిదాకా నువ్వేమనేదానివి? రోజులు మారిపోయినై. అప్పుడు కొట్లాటలు రాడానికి ఏదో మతలబీ ఉండింది. ఇంకెప్పుడట్లా కాదు అనేదానివి. ఇప్పుడే మతలబీ అవుతుందో అప్పుడు నీకు తెలీదు కాబట్టి నువ్వట్లా అనుకున్నావ్. కానీ ఏదో ఒక కారణంతో అవే కళ్ళు మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ మళ్ళీ మళ్ళీ వస్తుంటై.”

బైట వాన పడడం మొదలైంది. ఫాతీమా పెట్టిన రోటీలు, కుర్మా తిని బైటికి పోడానికి ఆసిఫ్ చెప్పులేసుకున్నాడు.

“బేటా!”

“క్యా హైఁ అమ్మీ”

“వాన పడుతోంది…”

“అయితే?”

“ఊహూ. ఏమీ లేదు. మరీ ఎక్కువ సేపు తిరగద్దు. జాగ్రత్త.”

“అమ్మీ, మై అబ్భీ ఛోటా బచ్చా హూఁ క్యా?”

“ఠీక్ హైఁ. పర్ జల్దీ లౌటానా బేటా.”

ఆసిఫ్ బైటికి పోగానే ఫాతీమా ముందు తలుపు దగ్గరే నిలబడి చప్పుడొచ్చేట్టుగా గేటు మూసి వెళుతున్న ఆసిఫ్‌ను చూసింది. వాన అలానే పడుతోంది తెరపి లేకుండా. పడుతున్న వాన చినుకుల చప్పుడు వింటూ ఫాతీమా అలానే నిల్చుండి పోయింది. ఆ ఊరు ఇప్పుడెక్కడో దూరంగా ఉంది, ఆ గల్లీలు, ఆ రాత్రులు కూడా దూరంగా ఎక్కడో ఉన్నాయి. కానీ భయం మాత్రం ఇక్కడే దగ్గరగా ఉండిపోయింది. ఇప్పుడక్కడ కూడా ఇలానే వాన పడుతూ ఉంటుందా? అక్కడే నేలమీద చిరిగిపోయి పడున్న జీలూ బేటా సల్వార్ మీద పడుతూ దాన్ని కడుగుతోందేమో. నిల్చున్న వాళ్ళ మీద బురదనీళ్ళు చల్లుతూ పోలీసు జీపులు పెద్దగా సైరన్లు మోగించుకుంటూ దూరంగా అప్పటిలానే ఇప్పుడూ వెళ్ళిపోతూ ఉండుంటాయా? నిజమే, ఇప్పుడింత బెదరి పోనక్కర్లేదేమో. ఈ రోజు ఏ భయమూ లేకుండా ఉండచ్చేమో. బహుశా రేపు కూడా. ఇలానే ఇంకో ఏడాది కూడా. కానీ, ఎంతకాలం ఇలానే భయపడకుండా ఉండగలిగే స్వేచ్ఛ తనకుంటుందో ఫాతీమాకు తెలియలేదు. ఆ రోజుల్లో కూడా, ఏ బెంగా లేకుండా ఉన్న రాత్రుళ్ళలో కూడా, మరుసటి రోజు గురించిన భయం వదిలిపెట్టకుండా సతాయించేది.

ఫాతిమా ఒంటరిగా, చీకట్లోకి చూస్తూ, వాన చప్పుడు వింటూ నిలుచుండి పోయింది. వానలో తడిసిపోతున్న ఆ రాత్రిని చీల్చుకుంటూ అవే కళ్ళు ఆమెను గుచ్చి గుచ్చి చూస్తున్నాయి.

“ఆ కళ్ళు నన్ను చూస్తున్నాయని నాకు తెలుసు” ఫాతీమా మనసులో అనుకుంది, నిటారుగా నిలబడి చీకట్లోకి తలెత్తి సూటిగా చూస్తూ. “కానీ, అవి ఇప్పుడు మా కళ్ళనీ చూడక తప్పదు.”

(Enemy eyes, 1952.)