మత్తకోకిల కథ

వసంతకోకిల:- ఎదురునడకతో, అనగా పాదాదిలో లఘువు తరువాత గురువునుంచి వ్రాయుట, మత్తకోకిల గతి ఏలాగుంటుందో అనే ఆలోచనకు కలిగిన రూపము క్రింది పద్యము. ఉత్సాహకు ముందు గురువు నుంచితే పంచచామరము మనకు ఏ విధముగా లభిస్తుందో, అదే విధముగా మత్తకోకిల పాదారంభములో ఒక లఘువు ఉంచితే మనకు వసంతకోకిల లభిస్తుంది.

వసంతకోకిల – జ-భ-ర-స-జ-జ-గ , యతి (1, 12), 19 అతిధృతి 186038

అసీమమైనది పొంగి లేచెడు – హర్షసాగర మీమదిన్
హసించుచున్నవి పూల డోలలు – హాయిహాయిగ నీ వనిన్
వసంతకోకిల పాడెఁ గొమ్మలఁ – బంచమస్వర బద్ధమై
వసంతకాలము శోభ నిండగ – వచ్చె నేడిల నిద్దమై

పాటలు:- త్రిపుట తాళములో ఎన్నో పాటలు ఉన్నా, వాటి కన్నిటికీ కచ్చితముగా మత్తకోకిల లేక కోకిలస్వరపు లయ ఉండదు. క్రింద ఇంచుమించు ఈ లయను ప్రతిబింబించే త్రిపుటతాళములోని ఒక రామదాసు కీర్తన:

రాగము సురటి, తాళము – త్రిపుట

పల్లవి:
మరువకను నీ దివ్య నామస్మరణ మెప్పుడు చేయుచుంటిని
సత్కృపను ఇక వరము లిచ్చెడి స్వామి వనుచును ఎంచు నను మీ
సరిగ వేల్పులు లేరటంచును మరిగ నే చాటుచును నుంటిని
చరణం:
రాతి నాతిగ చేసినావు అజామిళునిపై కృప గలిగి ని-
ర్హేతుకంబుగ బ్రోచితివి ప్రహ్లాదు గాచితి వట సభను ద్రౌ-
పతికి చీరల నొసగితివి సుంతైన నాపై దయను జూపవు
చరణం:
లోకములు నీలోన గలవట లోకముల బాయవట నీవిది
ప్రకటముగ శ్రుతు లెన్నడు చాటుట పరమ సంతోషమున వింటిని
ఇకను నీవే బ్రోవకున్నను యెవరు నాకిక దిక్కు రామా
చరణం:
దాసమానస పద్మ భృంగా దేవ సంతత చిద్విలాస
భాస సీతా మానసోల్లాస భద్రశైలనివాస శ్రీరామ
దాసపోషక ఇంద్రనీల శుభాంగ పక్షితురంగ రామా

ఇంతకు ముందే మత్తకోకిల లయలోని ఒక హిందీ గజలును మీకు పరిచయము చేసినాను. తెలుగులో ఇలాటి పాటలను వెదుకుతూ ఉన్నాను. పాడమని నన్నడగతగునా పదుగురెదుట పాడనా అనే పాటలోని ఈ పల్లవి యిట్టిదే, కాని చరణములకు ఈ లయ లేదు. కన్నడములో ఈ అపూర్వమైన లయతో రెండు పాటలు ఉన్నాయి. అవి గోపాలకృష్ణ అడిగ వ్రాసిన యావ మోహన మురళి కరెయితొ (ఏ మోహన మురళి పిలిచెనొ), జ్ఞానపీఠ పురస్కారమును పొందిన కె. వి. పుట్టప్ప వ్రాసిన దోణి సాగలి ముందె హోగలి. ఈ పాటలో యాదృచ్ఛికముగా మత్తకోకిల అనే పదము కూడ దొరలినది. దీనిని అదే అర్థముతో నేను చేసిన అనువాదము నిక్కడ అందజేస్తున్నాను –

పల్లవి:
పడవ సాగును ముందుముందుకు దూర తీరము జేరగా
వీచు గాలికి పడుచు లేచెడు సరసుపై నడయాడగా
చరణం:
స్వర్ణకలశమునుండి ముత్తెపు నీటి దారను జల్లుచు
మేఘమాలకు రంగు లీయుచు యక్షలోకము వ్రాయుచు
చూడు పూర్వ దిగంతమందు నిసర్గసుందరి యందము
రంజిలంగను యామె కిప్పుడు సుప్రభాతము బల్కుమా
చరణం:
సరసి యంచులపైన వెల్గెడు నీటి చుక్కలు మెరసెగా
మించువలెను తళుక్కుమంచుచు లేత సూర్యుని కాంతిలో
పచ్చపచ్చని జొన్నచేనుల చల్లగాలులు వీచగా
దాగి పాడెడు మత్తకోకిల మధుర గీతము పాడగా
చరణం:
దూరమందున కొండపైగల తెల్ల మేఘము తేలెగా
మొయిలువలెనే మెల్ల మెల్లగ పడవ యాడుచు సాగెగా
మనము లీలామాత్రజీవుల మిలను జీవనలీలలో
నిన్న నిన్నగ నేడు నేడుగ నుండు రేపది రేపుగా

మలయాళ భాషలో కూడ మత్తకోకిల మల్లికా అని ప్రసిద్ధికెక్కిన వృత్తము. ఈ వృత్తములో కుమరన్ ఆశాన్ కవి వ్రాసిన సంకీర్తనం అనే ఐదు పద్యాలలో మొదటి దానిని క్రింద చదువవచ్చును.

చంత మేఱియ పూవిలుం శబళాభమాం శలభత్తిలుం
సంతతం కరతారియన్నొరు చిత్రచాతురి కాట్టియుం
హంత చారు కటాక్షమాలకళ్ అర్కరశ్మియిల్ నీట్టియుం
చింతయాం మణిమందిరత్తిల్ విళంగు మీశనె వాళ్తువిన్ (కుమరన్ ఆశాన్)

అందమైన పూలలో, రంగురంగుల సీతాకోకచిలుకలలో వాని విచిత్ర సృష్టిని చూస్తాము. వాని దీవెనలను సూర్యరశ్మిలో పొందుతాము. ఆ ఈశ్వరుని మనమందిరములో ఎప్పుడు ధ్యానించవలెను.

ముగింపు

విబుధప్రియగా మొలకెత్తి, ఏడు గణముల వృత్తముగా చిగురించి, మల్లికామాలగా పల్లవించి, మత్తకోకిలగా ఉజ్జ్వల సంగీతాన్ని కల్పించి, హరనర్తనములో చర్చరీ నృత్యమును ప్రదర్శించి, భామినీషట్పదిగా పదములందించి, వృషభగతిరగడగా రాణించి, త్రిపుటరేకులుగా యక్షులకు పులకలిచ్చి, ముత్యాలసరముగా నాంధ్రభారతి కంఠసీమ నలంకరించిన ఒక గొప్ప తాళవృత్తమైన మత్తకోకిల నిజముగా కోకిలస్వరమే. ఈ నా వ్యాసమును ఈ లయతోడి కొన్ని కోకిలస్వరములతో ముగిస్తున్నాను.

పాలవెల్లీ మేల్మి మల్లీ – ప్రాణవల్లీ ప్రేయసీ
కాలి మువ్వై చెల్మి పువ్వై – కందు నవ్వై రా శశీ
పూలతోటై మేలి బాటై – ముద్దుగా దేవప్రియా
మాల వేయన్ లీల లీయన్ – మంచి జేయన్ రా ప్రియా

జలదరవములు వినగ నెమలులు – సరస గతులను నటనలన్
సలిపె గనులకు నిడగ సొబగుల – చలిత పదముల చటులతన్
జలదములవలె మెఱయు లలితుని – చలనముల గన మనసులో
నలల తలపులు బెఱిగె వలపుల – నవియు నదియగు క్షణములో

హిమము కురిసిన వేళలో నా – హృదయ మెందుకు కదలెనో
సుమము విరిసిన వేళలో నీ – శోక మెందుకు మనసులో
ద్రుమము లాకులు రాల్చినప్పుడు – తోచుచుందువు స్మృతులలో
మమత నిండగ నొక్క నిముసము – మాటలాడిన చాలుగా

శ్యామసుందర మదనమోహన – శ్యామ ఘడియల వేళలో
శ్యామ రాగము పాడెదను నే – శ్యామలాభ్రపు నీడలో
శ్యామ నేనిట చక్కగా నా – శ్యామవలె సుస్వరముతో
శ్యామలాంగా యనుచు బిలుతును – స్వామి రా నీ నగవుతో

నిన్న రేతిరి వస్తివా యని – నేను వేచితి నిజముగా
కన్నె బహుమతి తెస్తివా యని – కాచి నిల్చితి కన్నయా
వెన్నముద్దుల నిస్తువో యని – వెన్నెలలలో వేచినా
గిన్నెపాలను* పిల్లి తాగెను – కృష్ణమోహన రావిదేం

(తమిళ ఛందస్సులోని వివిధాంశములపై విసుగు లేకుండా చర్చించడము మాత్రమే కాక తేవారం, తిరుప్పుగళ్ వీటి అందాలను వివరించిన న్యూజెర్సీ వాస్తవ్యులు శ్రీ వి. సుబ్రమణ్యంగారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతల నర్పిస్తున్నాను. – మోహన.)


గ్రంథసూచి

 1. ఛందఃసూత్రం – పింగళాచార్య – పరిమల్ పబ్లికేషన్స్, డిల్లీ, 1994.
 2. విరుత్తప్పావియల్ – టి. వీరభద్ర ముదలియార్, సాధు అచ్చుక్కూడం, చెన్నై, 1938.
 3. A Grammar of the Oldest Kanarese Inscriptions – A. N. Narasimhaia, Univeristy of Mysore, 1941.
 4. నాగవర్మన కన్నడ ఛందస్సు – Rev. F. Kittel – Basel Book and Tract Depository, Mangalore, 1875.
 5. జయదామన్ – A Collection of Ancient Texts on Sanskrit Prosody and a Classified List of Sanskrit Metres with an Alphabetical Index – Ed. H.D. Velankar, హరితోషమాల, బాంబే, 1949.
 6. వృత్తరత్నాకరః – కేదారభట్ట – సం. కేదారనాథ్ శర్మా, చౌఖంభా సంస్కృత సంస్థాన్, వారాణసీ, 1995.
 7. ఛందోనుశాసన – హేమచంద్రసూరి – సం. హరి దామోదర వేళంకర్ – సింఘీ జైన్ శాస్త్ర శిక్షాపీఠ, భారతీయ విద్యా భవన్, 1961.
 8. ప్రాకృతపింగలసూత్రాణి – సం. పండిత శివదత్త, కాశీనాథ పాండురంగ శర్మా – నిర్ణయసాగర ప్రెస్, 1894.
 9. రత్నావలి నాటికా – శ్రీహర్ష – సం. శ్రీచంద్ర చక్రవర్తి, అశుతోష్ లైబ్రరీ, ఢాకా, 1902.
 10. కుమారసంభవము, ప్రథమ భాగము – నన్నెచోడుడు – సం. జొన్నలగడ్డ మృత్యుంజయరావు, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1994.
 11. కవిజనాశ్రయము – మల్లియ రేచన – వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1950.
 12. The Love of Krishna – Ed. Frances Wilson – University of Pennsylvania Press, Philadelphia, 1975.
 13. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము – బాలాంత్రపు రజనీకాంతరావు – విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 1975.
 14. ఛందోదర్పణము – అనంతామాత్య – సం. చిర్రావూరి శ్రీరామశర్మ, రోహిణీ పబ్లికేషన్స్, రాజమండ్రి, 1998.
 15. ఉదాహరణ వాఙ్మయ చరిత్ర – నిడుదవోలు వేంకటరావు, విజయభాస్కర్ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1968.
 16. సుగ్రీవ విజయము – కందుకూరి రుద్రకవి – మాధవీ బుక్ సెంటర్, హైదరాబాదు, 1978.
 17. జనార్దనాష్టకం – కందుకూరి రుద్రకవి – పీఠిక ఆరుద్ర, ఆనందమోహన కావ్యమాల, మదరాసు, 19??
 18. When God is a Customer – A K Ramanujan, Velcheru Narayana Rao and David Shulman, University of California Press, Berkeley, 1994.
 19. ముత్యాలసరాలు – గురజాడ అప్పారావు, M శేషాచలం అండ్ కో, మచిలీపట్నం, 1972.
 20. ముత్యాల సరాల ముచ్చట్లు – చేకూరి రామారావు – విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1997.
 21. ఆధునికాంధ్రకవిత్వము – సంప్రదాయములు ప్రయోగములు – సి నారాయణ రెడ్డి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబదు, 1999.
 22. మహాప్రస్థానం మొదలైన గీతాలు – శ్రీశ్రీ – BNK ప్రెస్, మదరాసు, 1950.

* ‘పాలిని’ అన్న పదం ‘పాలను’గా మార్చబడింది (31/7/2012).

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...