మత్తకోకిల కథ

కోకిలస్వర జాతిపద్యము

మత్తకోకిల లయ అపూర్వమైనది, అందుకే దీనిని ఆధారము చేసికొని ఉత్పన్నమైన వృషభగతిరగడ, త్రిపుటరేకులు, భామినీషట్పది ఉదాహరణ కావ్యములలో, యక్షగానములలో, కన్నడ కావ్యములలో వాడబడినవి. ఈ లయతో యితర వృత్తములు కూడ నున్నాయి. నేను సేకరించిన, సృష్టించిన మత్తకోకిల లయలున్న వృత్తాలను పట్టికలో చూడవచ్చును. మాత్రామత్తకోకిలకు కోకిలస్వరము అని పేరు నుంచినాను. ఇది యతిప్రాసలతో కూడుకొన్న ఒక జాతి పద్యము. ఏడు మాత్రల కోకిలస్వర అనే పదములో మూడు, నాలుగు మాత్రలు పక్కపక్కన ఉండడము గమనార్హము. ఇందులో రేఖ, ప్రతిమ, మాల, మత్తోత్సాహ, అమరలతిక, సుగతి, రంజిత, వసంతకోకిల నేను కనుగొన్న వృత్తములు. రేఖ, ప్రతిమ, మాలా వృత్తములు త్రిపుటరేకుల, భామిని షట్పదుల వివరణకై కనుగొన్నవి.


మత్తకోకిల లయవృత్త పట్టిక

మత్తోత్సాహ వృత్తమును త్ర్యస్రగతిలో కూడ పాడుకొనవచ్చును. అదే విధముగా అమరలతికను చతురస్రగతిలో, సుగతిని ఖండగతిలో, రంజితను రెండు విధములైన మిశ్రగతులలో పాడుకొనవచ్చును. హృత్కోకిల వృత్తమును శ్రీమతి సుప్రభ కనుగొన్నారు. మత్తకీరవృత్తమును కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు సృష్టించినారు. మిగిలిన వృత్తములు లక్షణగ్రంథములలో పేర్కొనబడినవి. మత్తకోకిల తరువాత తరళవృత్తమును కవులు విరివిగా వాడినారు. నన్నయ మత్తకోకిలకన్న ముందుగా తరళమునే భారతములో ఉపయోగించినాడు. ఇంద్రుడు తన కుమారుడైన యర్జునుని పొగడుతూ చెప్పిన క్రింది పద్యము నన్నయ భారతములోని అరణ్యపర్వము నందలి తరళ వృత్తము.

శివుఁడు వీనికిఁ బ్రీతుఁడై దయసేసెఁ బాశుపతాస్త్ర మా
దివిజముఖ్యులతోడ నేనును దివ్యబాణము లిచ్చితిన్
దివిరి యీతఁడు మత్ప్రియంబున దేవకార్యము దీర్పఁగా
సవినయస్థితి నున్నవాఁడు నిజప్రతాప బలోన్నతిన్ (శ్రీమదాంధ్రభారతము, అరణ్యపర్వము, 1.374)

మత్తకోకిల లయలు

గీతగోవిందము:- మిశ్రగతిలోని అందాలకూ శ్రీజయదేవకవి కూడ ఆకర్షితుడయ్యాడు. గీతగోవిందములోని ఏడవ అష్టపది ఏడు మాత్రల మిశ్రగతికి చెందినదే. బహుశా జయదేవకవి ఆంధ్ర ప్రాంతములో నుండినవాడు కాబట్టి అతనికి ఈ అష్టపది నిర్మాణమునకు మత్తకోకిల కారణమయినదో ఏమో? భావగాంభీర్యములో గొప్పదైన ఈ అష్టపది ఇలా ప్రారంభమవుతుంది.

మామియం చలితా విలోక్య వృతం వధూ నిచయేన
సాపరాధతయా మయాపి న వారితాతి భయేన

మత్తకోకిలలోని చివరి గురువును తొలగించగా వచ్చిన రూపమాలి వృత్తము కూడ ఇట్టిదే.

జనార్దనాష్టకము:- మత్తకోకిల లయతో మాత్రాగణములతో అత్యుత్తమముగా ప్రబంధయుగములోనే పద్యములు వ్రాసిన ఘనత కందుకూరి రుద్రకవికి చెందుతుంది. కొందరు ఇతడు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజములలో నొకడు అని కూడ అంటారు. ఇతని జనార్దనాష్టకము[17, 18] నిజముగా వాడుక భాషలో అందరి అవగాహనకు అందుబాటులో ఉండేటట్లు వ్రాయబడినది. నేటి కాలపు భరతనాట్య అభ్యాసములో శృంగార పదముల శిక్షణలో ఈ పద్యములకు కూడ స్థానము ఉన్నది. రుద్రకవి కవిత్వము జనరంజకముగా నుండాలని ఆ కాలములోనే భావించాడు కాబోలు, ఇతని యక్షగానము, జనార్దనాష్టకము దీనికి గొప్ప నిదర్శనాలు.

ముత్యాలసరము:- నవయుగములో మత్తకోకిల లయ మరొక ఛందస్సులో ఆవిర్భవించినది, అదే ముత్యాలసరము. ఇది గురజాడ అప్పారావుగారి[19] సృష్టి. మొదటి మూడు పాదాలలో మిశ్రగతిలో పదునాలుగు మాత్రలు, నాలుగవ పాదములో ఏడునుండి పదునాలుగువరకు మాత్రలుండును. యతిప్రాసలు ఇందులో ఐచ్ఛికము. “ఒక జాతి పార్సీ గజలు యొక్క నడక ముత్యాలసరములలో తెచ్చుకొనుటకే నే యత్నించియుంటిని” అని అప్పారావు చెప్పుకొన్నాడు. ఈ ముత్యాల సరాలను గురించిన దీర్ఘ చర్చ చేకూరి రామారావు ముత్యాల సరాల ముచ్చట్లు[20] అనే పుస్తకములో చదువవచ్చును. హఫీజ్ (14వ శతాబ్దము) వ్రాసిన క్రింది గజల్[21] యిట్టిదే.-

వాఇజాకీఁ జల్వబర్ మహ్రాబొమెంబర్ మీకునంద్
చూఁబఖిల్వత్ మీరవంద్ ఆఁ కారెదీగర్ మీకునంద్

పారసీక ఉర్దూ భాషలలో మత్తకోకిల లయను బహర్ రమల్ ముసమ్మన్ మహజూఫ్ అంటారు (బహర్ అంటే పద్యము లేక వృత్తము). దీని సూత్రము ఫాయలాతున ఫాయలాతున ఫాయలాతున ఫాయలున్. దీనిని మన గురులఘువులవలె ఈ విధముగా వివరిస్తారు: =-== / =-== / =-== /=-= (= గురువు, – లఘువు). గాలిబ్ వ్రాసిన ఈ లయలోని సబ్ కహాఁ కుఛ్ లాలహ్ ఓ గుల్ మేఁ నుమాయా హో గయీ అనే గజల్‌ను ఇక్కడ వినవచ్చును.

ఇటీవల ఈమాట రచయిత తఃతఃగారి ప్రేరణవలన హిందీ చిత్రసీమలో సుప్రసిద్ధమైన ఆప్కీ నజరోఁ నే సమఝా ప్యార్ కా కాబిల్ ముఝే అన్న పాట మిశ్రగతిలో సాగినదని కనుగొన్నాను. ఈ పాటను ఇదే అర్థములో నేను అనువదించి యున్నాను. కాని అప్పారావుగారికి ఎందుకు మత్తకోకిలలాటి వృత్తాలు, త్రిపుటరేకులు గుర్తుకు రాలేదో? గురజాడవారి మొదటి ముత్యాలసరము నిక్కడ చూడవచ్చును –

గుత్తునా ముత్యాలసరములు
కూర్చుకొని తేటైన మాటల
కొత్తపాతల మేలు కలయిక
క్రొమ్మెరుంగులు జిమ్మగా (గురజాడ అప్పరావు, తోకచుక్క – 1)

కాని అంతకుముందే ప్రచురించబడిన మేలుకొలుపు గేయము కూడ మిశ్రగతిలో నడచినదే –

మేలుకొనుమీ భరతపుత్రుడ
మేలుకొనుమీ సుజనపుత్రుడ
మేలుకొనుమీ సచ్చరిత్రుడ
మేలుకొనవయ్యా, వత్సా, మేలుకో

కాని వీటి కన్నిటికీ మాతృక క్రింది స్త్రీల పాట అని నేననుకొంటాను –

గుమ్మడేడే గోపితల్లీ
గుమ్మడేడే ముద్దుగుమ్మా
గుమ్మడేడే కన్నతల్లీ
గుమ్మడేడమ్మా

శ్రీశ్రీ జయభేరి[22] నినాదము కూడా మిశ్రగతిలో సాగినదే –

నేనుసైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేనుసైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేనుసైతం భువనఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను