మత్తకోకిల కథ

కన్నడ భాషలో భామినీషట్పదిలాటి షట్పదులతో కావ్యములనే వ్రాసినారు. ఇందులో సంగీత సుభగత్వము ఉండడమువలన ఇవి గానయోగ్యము, సామాన్య ప్రజలకు కూడ సులభముగా పఠనీయము. కుమారవ్యాసుడనే కవి కన్నడ మహాభారతమును మల్లికామాల మరొక అవతారమైన ఈ దేశి ఛందస్సులో వ్రాసినాడు. అందుండి మొదటి పద్యము:

శ్రీవనితెయరసనె విమల రా-
జీవ పీఠన పితనె జగకతి
పావననె సనకాది సజ్జన నికర దాతా రా-
రావణాసుర మధన శ్రవణ సు-
ధా వినూతన కథన కారణ
కావు దానత జనవ గదుగిన వీరనారయణ (కుమారవ్యాసుని గదుగు భారతము – 1.1)

లక్ష్మీపతీ, కమలాసనుని తండ్రీ, లోకపావనా, సనకాది సజ్జనులకు దాతా, రావణసంహారీ, చెవుల కమృతమువలె నుండు కథలకు కారణభూతుడా, గదగుపురిలోని వీరనారాయణుడా, జనులందరిని కాపాడుము.

వృషభగతిరగడ

నాగవర్మ ఛందోంబుధిలో[4], జయకీర్తి ఛందోనుశాసనములో[5] రగడలను గురించి వివరించారు. జయకీర్తి రగడలను రఘటాబంధము అని ప్రస్తావించగా, నాగవర్మ రగళె అని చెప్పినాడు. కన్నడములో మూడు విధములైన రగడలు ఉన్నాయి – అవి త్ర్యస్రగతిలోని ఉత్సాహ రగళె, చతురస్రగతిలోని మందానిల రగళె, ఖండగతిలోని లలిత రగళె. ఏడు మాత్రల మిశ్రగతి కన్నడములో భామినీషట్పది రూపములో నున్నది. రగడలు ప్రాసాంత్యప్రాసలతో మాత్రాగణబద్ధమైన ద్విపదలు. తెలుగులో ఎన్నో విధములైన రగడలు ఉన్నాయి. అందులో మిశ్రగతిలోని రగడను వృషభగతి రగడ అంటారు. కవిజనాశ్రయకర్త రగడలను ఉదహరించలేదు, రగడలను గురించి మనము మొట్టమొదట అనంతుని ఛందోదర్పణములో[14] చదువుతాము. వృషభగతి రగడకు వరుసగా నాలుగు త్రిచతుర్మాత్రలు ఉంటాయి. ఇంతకు ముందే మాలావృత్తము వివరించబడినది. ఈ మాలావృత్తము నిజముగా వృషభగతి రగడయొక్క ఒక ప్రత్యేకత. క్రింద వృషభగతిరగడగా ఒక మాలావృత్తము. ఇందులో చివరి అక్షరాలను తొలగిస్తే మనకు మత్తకోకిల లభిస్తుంది.

వృషభగతిరగడ – మాల – మత్తకోకిల

మాధవా యని నేను బిల్చిన – మానసమ్మున నీవె గా(దా)
మోదమా యని నేను బిల్చిన – మోహనాకృతి నీదె గా(దా)
శ్రీధరా యని నేను బిల్చిన – శ్రీల రూపము నీవె గా(దా)
యాదవా యని నేను బిల్చిన – నంద మన్నియు నీదె గా(దా)

రగడలను పాల్కురికి సోమనాథుని నుండి నేటివరకు కవులు విభక్తి ప్రత్యయాలతో వ్రాయబడిన ఉదాహరణ కావ్యములలో[15] కళికోత్కళికలు వ్రాసేటప్పుడు ఉపయోగించారు. క్రింద వృషభగతిరగడకు ఒక ఉదాహరణ:

మఱియు సజ్జన భక్త గృహముల – మరగి తిరిగెడి కామధేనువు
కఱద లెఱుఁగక వేఁడు దీనుల – గదియు జంగమ రత్నసానువు
శైలజాముఖ చంద్రరోచుల – చవులఁ దవిలెడు నవచకోరము
వేలుపుందపసుల తలంపుల – వెల్లికొల్పెడు నమృతపూరము
దేవతలు మువ్వురకు నవ్వలి – దెస వెలుంగుచు నుండు నెక్కటి
భావవీథులఁ గలసి పలుకుల – బట్టి చెప్పఁగరాని చక్కటి
ఆఱు రేకుల మంత్రకుసుమము – నందు వెలిఁగెడి చంచరీకము
వేఱుసేయక యోగిజనములు – వెదకి పొందెడు నూర్ధ్వలోకము
(రావిపాటి త్రిపురాంతకకవి త్రిపురాంతకోదాహరణము – ప్రథమావిభక్తి కళిక – త్రిపుట తాళము)

యక్షగానములలో త్రిపుటరేకులు

భారతీయ సాహిత్యములో గీతగోవిందమును మొదటి యక్షగానము అని చెప్పవచ్చును. తెలుగులో మనకు దొరకిన యక్షగానాలలో మొట్టమొదటిది కందుకూరి రుద్రకవి వ్రాసిన సుగ్రీవవిజయము[16]. యక్షగానములలో తాళబద్ధములైన పద్యములు, పాటలు వ్రాయడము పరిపాటి. అట్టి తాళబద్ధమైన గేయములలో త్రిపుటరేకులు ప్రసిద్ధమైనవి. ఇంతకుముందే నేను మాలావృత్తమును పరిచయము చేసినాను. మత్తకోకిలలోని చివరి నాలుగు అక్షరాలు తొలగించగా వచ్చిన వృత్తము రేఖ. క్రింద రేఖకు ఒక ఉదహరణ:

రేఖ – ర స జ జ గల – యతి (1, 11), 14 శక్వరి 11099

చింపివేయకు నేను వ్రాసిన – చిత్ర లేఖ
త్రెంపివేయకు నా కరాన య-దృష్ట రేఖ
గంప పూవులు వాడె నా జడ – గాన రమ్ము
చంప కింకను వంద ముద్దుల – జప్పు నిమ్ము

బేసి పాదాలు మాలావృత్త పాదములుగా, సరి పాదములు రేఖ పాదములుగా నుంచి వ్రాయగా వచ్చిన అర్ధసమవృత్తము త్రిపుట రేకుల ఒక ప్రత్యేకత అవుతుంది. అలాటి ఒక వృత్తమును క్రింద చదువవచ్చును.

బేసి పాదాలు – మాల, ప్రాసయతి (1, 11)
సరి పాదాలు – రేఖ, యతి (1, 11)

వేంకటేశుని వీరవర్యుని – సంకటమ్ముల బాపువానిన్
బంకజాక్షుని దల్తు నిచ్చట – పాహి యంచు
అంకమందున మాటలాడు శ-శాంక సోదరితోడ నా మీ-
నాంకు దండ్రిని దల్తు నేను న-మామి యంచు

త్రిపుటరేకులకు మొదటి పాదము వృషభగతిరగడ లాటిది (3, 4; 3, 4 – 3, 4; 3, 4 మాత్రలు, యతి లేక ప్రాసయతి ఐదవ మాత్రాగణముతో చెల్లుతుంది). రెండవ పాదములో 3, 4; 3, 4 – 3, 3 మాత్రలు ఉంటాయి, యతి లేక ప్రాసయతి ఐదవ మాత్రాగణముతో చెల్లుతుంది. రెండు పాదాలకు ప్రాస నియతము. ఈ లక్షణాలతో క్రింద ఒక ఉదాహరణ:

కొండపై నెలకొన్న రాయడు – కొండవలె దా దీర్చు కోరిక
లండ నుండును బాయ కెపుడా – యచ్యుతుండు
నిండు భక్తిని స్వీకరించును – దండముల దండల గ్రహించును
నిండు శాంతికి స్థాన మత్యతి – నిర్మలుండు

సుగ్రీవవిజయములో సీత నెడబాసిన శ్రీరాముని శోకమును వర్ణించే త్రిపుటరేకులను క్రింద చదువవచ్చును –

హా సతీమణి ధర్మచారిణి – హా గుణోన్నత జనకసుత నను
బాసిపోయితి వింతలోనే – పద్మనయన
ఎంత భయపడి తల్లడించితొ – యెంత యడలితొ యెంత బడలితొ
యింతి రావణుఁ డెత్తుకొని చన – నేమి సేతున్
నన్ను విడిచియు నిలువఁజాలక – నాతి వచ్చితి వడవిఁ దిరుగను
నిన్ను వీడి యే నెట్టు లోర్తును – నీలవేణి
లేఁటి మాయలు మదిని దెలియగ-లేక పాపపు రక్కసునిచే
బోటి నిను గోల్పడితి నిఁక నా – కేటి బ్రతుకు
ఇందుముఖి నినుఁ బాసినప్పుడె – యేల పోకను నిలిచెఁ బ్రాణము
నిందలకుఁ బాలైతి ధరలో – నిన్ను బాసి
రమణిరో నినుఁ బాసినప్పుడె – రాతిరే శివరాతి రాయెను
నిముసమైనను నాదు కంటికి – నిదుర రాదు
పలుకు పలుకున నొలుక నమృతము – పలుక నేర్చిన జాణ ముద్దుల
కలికి చిలుకల కొలికి నిన్నెటఁ గందు నొక్కొ
కూడఁ జని యా పసిఁడి మృగమును – గూల్చి చర్మముఁ దెచ్చినాఁడను
వేడుకలు గనుఁగొనఁగనేరక – వెఱ్ఱినైతి
లలన నినుఁ గలనైనఁ బాయఁగఁ – గలన నీవిట లేకయుండినఁ
జలనమొందెను నాదు హృదయము – జలజనయనా
నన్ను నీవెడఁబాయ వెన్నడు – నిన్ను నేనెడఁబాయఁజలను
గన్నెరో యీ వెతలు వచ్చెను – గడవఁ దగవే (కందుకూరి రుద్రకవి సుగ్రీవవిజయ యక్షగానము – 19)