అంతరం

“వచ్చేసావా బాబూ…” అంది అమ్మ. తన గొంతులో వణుకు, మాటలో నిట్టూర్పు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇప్పటికీ అమ్మ నన్ను బాబూ అని పిలవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నేపాలీ భాషలో పిల్లల్ని ప్రేమగా బాబూ అని పిలుస్తారు. అమ్మ చేతికి సూదులతో గుచ్చి పెట్టి ట్యూబులు వేలాడుతున్నాయి.

“ఆఁ, హుజూర్, ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చాను” అని బదులిచ్చాను, నేపాలీలోనే. పెద్దల్ని హుజూర్ అనే పిలవడం మా అలవాటు ఇప్పటికీ. ఆసుపత్రిలో అమ్మ పడుకుని ఉన్న మంచం మీదే ఓ మూలగా కూర్చున్నాను. నా బరువుకి మంచం కొద్దిగా కిందకి క్రుంగింది.

“పిల్లలు ఎలా ఉన్నారు? కోడలు బాగుందా?”

“వాళ్ళంతా బావున్నారమ్మా” అన్నాను. నా కుడి చేత్తో, అమ్మ కుడి చేతిని అందుకోడానికి ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో, అమ్మ ఎడమ చేతికి గుచ్చి ఉన్న సూది ఒకటి ఒత్తుకుపోయింది. పాపం.

అమ్మ నన్నెంతో ప్రేమించేది. అమ్మ, నేను ఒకరినొకరం ఎప్పుడూ విడిచి ఉండేవాళ్ళం కాదు. అమ్మ నేను ఎంత దగ్గరగా ఉండేవాళ్ళమంటే, నా జీవితంలో మొదటి తొమ్మిది నెలలు మేమిద్దరం ఒకే శరీరంలో ఉండేవాళ్ళం, ఒకరిలో మరొకరం భాగం! అప్పటి నుంచి ఇప్పటి దాకా, నేను అంత సన్నిహితంగా ఇంకెవరితోనూ లేను.

నేను పుట్టాక, నా జీవితంలో మొదటి సారిగా అమ్మా, నేను వేరయ్యాం. మావి వేర్వేరు శరీరాలయ్యాయి. ఇది నాకు అమ్మకి మధ్య మొదటి ఎడబాటు.

“ఇప్పుడెలా ఉందమ్మా?”

“అసలేం జరుగుతోందో నాకు తెలియదు నాయనా” అంటూ ఓ క్షణం మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ చెప్పసాగింది. “నాకు ఆకలి వేయడం లేదురా, ఏదైనా తిన్నా కూడా కడుపులో గడబిడ అయిపోతోంది… జ్వరం వస్తోంది, తలనొప్పిగా ఉంటోంది… మొత్తం వళ్ళంతా నొప్పులుగా ఉంటోంది.”

“ఇప్పుడు కూడా జ్వరంగా ఉందా?” అంటూ నుదుటి మీద నా అరచెయ్యి వేసి చూసాను.

నాకు బాగా జ్ఞాపకం ఉంది. చిన్నప్పుడు నాకెప్పుడు ఒంట్లో బాలేకపోయినా, అమ్మ ఇలాగే చేసేది. ఎన్నోసార్లు నా రోగాలు అమ్మ చేతి స్పర్శ తగలగానే మంత్రం వేసినట్లు మాయమయ్యేవి. అమ్మ అరచేతుల స్పర్శ స్నేహితంగా ఎంతో ఆనందంగా ఉండేది, గంగ, యమున నదుల నీళ్ళలా చల్లగా హాయిగా ఉండేది.

” నా టైం అయిపోయినట్లుందిరా” అంది అమ్మ.

“అదేం కాదమ్మా, నీకు నయం అవుతుంది” నేను అబద్ధం చెప్పాను.

నాకు తెలుసు – అమ్మకి ఊపిరితిత్తుల కాన్సర్ అని, అది కూడా చివరి దశలో ఉందని. నేపాలీ డాక్టరుగారి రిపోర్ట్‌ మా తమ్ముడు నాకు ఫాక్స్ ద్వారా అమెరికాకి పంపాడు. వాటిని నేనిక్కడ ఊపిరితిత్తుల కాన్సర్ నిపుణులకు చూపించాను. వాళ్ళు కూడా నేపాలీ డాక్టర్ డయాగ్నోసిస్‌తో ఏకీభవించారు. వాస్తవం ఏంటంటే అమెరికా డాక్టర్ చెప్పిన మేరకే నేను అమ్మని చూడడానికి ఖాట్మాండు వచ్చాను.


నా చిన్నప్పుడు ఎప్పూడూ అమ్మ కూనిరాగం తీసే ఒక పాట గుర్తొచ్చింది. నేను పెరిగి పెద్దవుతాననీ, బాగా చదువుకుంటాననీ, అమ్మకి బియ్యమూ పాలు కలిపి అన్నం పెడతాననీ ఆ పాట. అమ్మకి పాలు, వరి అన్నం అంటే ఇష్టం.

కాని నేను పెరిగిన ప్రాంతంలో వరి అన్నం, పాలు ఆహారంగా తినేది డబ్బున్నవాళ్ళే. పాలు, వరి అన్నం ఐశ్వర్యానికి చిహ్నాలు. ఆ ప్రాంతంలో గోధుమ పండదు. వరిని మినహాయిస్తే, అక్కడ పండే జొన్నలు లేదా అరుగ గింజలనే మాలాంటి మామూలు మనుషులు తింటారు.

“నువ్వింక పెద్దవాడివవుతున్నావు. చదవడం, రాయడం నేర్చుకోవాలి” అంది అమ్మ ఓ రోజు. నెలలో రెండు సార్లు – అమావాస్య, పున్నమి రోజులలో – జరిగే సంత నుంచి అక్షరాలు రాసున్న ఓ పుస్తకం కొని తెచ్చింది.

“ఎందుకు”

“నువ్వు బాగా చదువుకోవాలి. గొప్పవాడివి అవ్వాలి, తెలివైన వాడివి అవ్వాలి”

మా అమ్మ అసలు చదువుకోలేదు. కనీసం తన కొడుకైనా జీవితంలో వృద్ధిలోకి రావాలని, అందుకు ఏకైక మార్గం చదువుకోడమేనని తనదెంతో దృఢవిశ్వాసం. చదువు ప్రపంచాన్ని చూపుతుంది, ప్రపంచంతో ఆడుకోడం నేర్పుతుంది, జీవించడం నేర్పుతుందని ఆమె నమ్మింది. మా గ్రామం దగ్గరలో ఒక్క పాఠశాల కూడా లేదు. కొండకి అవతలి వైపు ఉండే పూజారిగారొకరు నాకు రోజూ ఒక గంట సేపు పాఠాలు చెప్పడానికి అంగీకరించారు. ఆయన డబ్బులు తీసుకోరు. ఆయన విద్వత్తుని, జ్ఞానాన్ని డబ్బుతో కొనలేం. అయితే ఆయన బియ్యం, ఉప్పు, పప్పు, ఇతర దినుసులను హాయిగా పుచ్చుకునేవాడు. ఈ విధంగా ఆయనకి సరస్వతిని అమ్ముకోవలసిన అగత్యం రాలేదు, ఏదీ ఉచితంగా చెయ్యాల్సిన గత్యంతరం పట్టలేదు.

పూజారిగారి తెలివి చూసి సరస్వతి కూడా హడలిపోయిందేమో. పూజారిగారి ఇంటికి వెళ్ళాలంటే కొండదారిలో అరగంట సేపు పైకెక్కి, ఆ తరువాత, మరో పదిహేను నిముషాల పాటు కిందకి దిగాలి. ఔన్నత్యం, జ్ఞానం దిశగా సాగే ఆ మార్గంలో నా మొదటి అడుగులు పడినాయి.

“నాలుగు అయిదులు ఎంతమ్మా?” అని ఒకరోజు అమ్మని అడిగాను. అప్పటికి నేను పూజారిగారి దగ్గరికి వెళ్లడం ప్రారంభించి ఐదారు నెలలు అవుతోంది.

“నాకేం తెలుసు? చదువుకుంటున్నది నువ్వు కదా?” అంది అమ్మ.

“ఇరవై” అని చెప్పాను. ఆ రోజు ఎందుకో నాకు బాగా సంతోషంగా ఉంది. ఎందుకంటే, అమ్మకి తెలియని విషయాలిప్పుడు నాకు తెలుసు. నన్నో గొప్పవాడిని, తెలివైన వాడిని చేయాలనే మా (నాదీ, అమ్మదీ) ప్రణాళికలో భాగంగా మొదటగా అమ్మ తెలివితక్కువది అయింది. మొదటి మూర్ఖురాలైంది. నేను తెలివైన వాడిననిపించుకోవాలంటే, పోలికలో నాకంటే తక్కువ తెలివితేటలున్న వాళ్ళుండాలిగా. నాకన్నా మూర్ఖులు ఎవరు ఉండకపోతే, నేను తెలివైన వాడిని ఎలా అవుతాను?

నేను పుట్టిన తర్వాత, నాకు అమ్మకి మధ్య ఎడం కల్పించిన రెండో సంఘటన ఇది. మమ్మల్ని వ్యతిరేక దిశల్లోకి గుంజేసిన ఘటన ఇది. నాకూ అమ్మకి మధ్య దూరం పెరిగిపోయింది.

“అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు?” అంటూ అమ్మని చూడడానికి ఆసుపత్రికి వచ్చిన ఓ బంధువు పలకరించాడు.

“ఈరోజే” జవాబిస్తూ, అతను కూర్చోడానికి వీలుగా కొంత జరిగాను.

“మా అబ్బాయి కూడా అమెరికాలోనే ఉన్నాడు. అక్కడ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అది చదివేవాళ్ళు మన దేశంలో ఒక్కరు కూడా లేరట కదా?”

“నాకు తెలియదు”.

ఇంతకు ముందు అమ్మని చూడడానికి వచ్చిన ఆయన కూడా ఇదే రకంగా మాట్లాడాడు. తన కొడుకుని పై చదువులకి అమెరికా పంపడం ఎలా అని ప్రశ్నలు గుప్పించాడు. ఉన్నంత సేపూ కొడుకు గురించే మాట్లాడుతూ, నా బుర్ర తినేసాడు.

నేను అమ్మ వైపు తల తిప్పాను. ఆసుపత్రి వాళ్ళ తెల్ల పరుపు మీద నిద్రపోతోంది. నేను పసిపిల్లాడిగా ఉన్నప్పుడు అమ్మ ఒళ్ళో తలపెట్టుకునేవాడిని. అమ్మ తన వేళ్ళతో నా జుట్టుని నిమిరేది. అమ్మ అలా చేయడం నాకెంతో హాయిగా ఉండేది. ఆ సుఖాన్ని మళ్ళీ మళ్ళీ పొందడం కోసం జుట్టులో దురద అని సాకు చెప్పి అమ్మని నా జుట్టుని నిమరమని అడిగేవాడిని. అమ్మ నా జుట్టులో వేళ్ళు జొనిపి మెల్లిగా నిమిరేది. ఎప్పుడైనా నా తలలోంచి పేలు తీస్తుంటే, అప్పుడు కూడా అమ్మ చేతి వేళ్ళతో నా జుట్టు ఆడుకునేది. ఇప్పుడు కూడా నేను అమ్మ ఒడిలో తల పెట్టుకుని, “అమ్మా తలలో పేలు చూడమ్మా” అని అడగాలని అనుకుంటాను. కానీ నా వయసు, నా పెద్దరికం, కాలేజిలో నేను పొందిన డిగ్రీలు, నా విద్వత్తు, ఇవన్నీ నాకు అమ్మకి మధ్య అడ్డుగా నిలుస్తున్నాయి. పైగా నా తలలో ఇప్పుడు పేలు లేనే లేవు. అమ్మని కౌగిలించుకోవాలని, చిన్నపిల్లాడినై ఏడవాలని అనుకున్నాను. నా కన్నీళ్ళు తిరుగుబాటు చేసి కంటి నుంచి బయటకి రానన్నాయి.

“బాబూ, కాసిని మంచినీళ్ళివ్వా”

“ఇదిగోనమ్మా” అంటూ నీళ్ళు అందించాను.


మా కొండల్లో ఎక్కడా బడి లేదు. పై చదువుల కోసం దేశంలోని మైదానాల్లోకి నన్ను పంపించింది అమ్మ. అక్కడ ఓ చిన్న ఊరిలో నాకు బాబాయి వరసయ్యే ఒకాయన ఇంట్లో చేరాను. మొదటి సారిగా నేనూ, అమ్మ వేర్వేరు ఇళ్ళల్లో పడుకున్నాం. నాకూ అమ్మకి మధ్య ఎడబాటు, ఆ దూరం మరింత పెరిగాయి.

నా చదువు బాగా సాగింది. నేను ఖాట్మాండు వెళ్ళి కాలేజి చదువులు చేపట్టాను. అమ్మా, నేను పైకి సంతోషంగానే ఉన్నాం – ఎందుకంటే మా ప్రణాలిక సత్ఫలితాలనిస్తోంది, మేము మా లక్ష్యం దిశగా సాగుతున్నాం కాబట్టి! కానీ నాకు లోలోపలంతా బాధ. అమ్మకీ నాకూ మధ్య ఎడబాటు మొదట్లో ఒకే ఒక్క కోణంలో ఉండేది, అది ఇప్పుడు పెరిగిపోవడమే కాకుండా, బహుకోణాలలో విస్తరించింది. ఇప్పుడు ఎన్నో విషయాలలో నేనూ, అమ్మ వేర్వేరయిపోయాం. చదువులో వచ్చిన ర్యాంకులు, సర్టిఫికెట్లు, డిప్లొమాలు, ఇలా సాధించుకున్న విద్వత్తు, ఔన్నత్యంతో నేను పెరిగిపోతే, నా ముందు అమ్మ మరీ చిన్నదైపోయింది, తెలివితేటలు లేకుండా మొద్దుగానే ఉండిపోయింది. నా ప్రపంచంలో భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే నాకెవరో అలాగే చెప్పారు. అమ్మ లోకంలో సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అది కూడా అమ్మకి ఎవరో చెప్పిన సంగతే. నేను సంభాషణలో కఠినమైన పదాలు, జటిలమైన శబ్దాలు, ఉత్కృష్టమైన ఆంగ్ల పదాలు వాడుతుంతే, అమ్మ సరళమైన గ్రామీణ నేపాలీ భాష మాట్లాడుతుంది. నేను చాలా వేగంగా పాశ్చ్యాత్యీకరణం చెందుతున్నాను. మా సంస్కృతులు మారిపోయాయి, భిన్న మతాల వాళ్ళలా మారిపోయాం. మా మధ్య దూరం యోజనాలు పెరిగింది.

తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయాను. అక్కడ నా పైచదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగం దొరికింది. ఇప్పుడు నేను అమ్మకే కాదు, మాతృభూమికి సైతం దూరమయ్యాను. దూరం దిశదిశలా వ్యాపించినా, మా అమ్మ హృదయంలోనూ, నరనరాలలోనూ శరీరంలోని ప్రతీ కణంలోనూ నాకిప్పటికీ స్థానం ఉంది. ఈ విషయంలో మాత్రం ఏమీ తేడాలు లేవు. కేన్సర్ అమ్మ ఊపిరితిత్తుల నుంచి, ఇతర శరీర భాగాలకి అతి త్వరగా వ్యాపించింది. ఇప్పుడీ కేన్సర్ అమ్మ హృదయంలోంచి, నరనరాల్లోంచి, శరీరంలోని ప్రతీ కణం నుంచి నన్ను తప్పించి, నా స్థానాన్ని అది అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అమ్మలో నావంటూ ఉన్న అన్ని గుర్తులను చెరిపేయాలని చూస్తోంది. మా మధ్య మరో కొత్త దూరాన్ని సృష్టించాలని చూస్తోంది. కానీ అమ్మ ఊరుకుంటుందా? అవసరమైతే తను బలైపోతుందేమో గానీ, నా చోటుని మాత్రం ఇంకొకరికి అప్పగించదు.

ఉన్నట్టుండి అమ్మ ఆయాసపడడం మొదలుపెట్టింది. “ఏమైందమ్మా?” అని అడిగాను. అతి కష్టం మీద మాట పెగుల్చుకుంటూ, ” ఏదో ఇబ్బందిగా ఉందిరా…” అని అంది.
తమ్ముడు డాక్టరుని వెదుకుతూ వెళ్లాడు. కొద్ది క్షణాలలో ఒక డాక్టరు, ఒక నర్సు వచ్చారు. నర్స్ అమ్మకి ఆక్సిజన్ ఇచ్చింది. గంట రెండు గంటల తర్వత, అమ్మ శ్వాస సాధారణ స్థితికి వచ్చింది.

బాగా పొద్దుపోయింది. తన ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోమని, అమ్మ దగ్గర తనుంటానని తమ్ముడు చెప్పాడు. తమ్ముడు ఇక్కడే ఖాట్మాండులోనే ఉద్యోగం చేస్తాడు. అమ్మకి వైద్యం కోసం గ్రామం నుంచి ఇక్కడికి పిలిపించుకున్నాడు. అలాగేనని నేను మా తమ్ముడి ఇంటికి వెళ్ళాను. అన్ని గంటల విమాన ప్రయాణం, పొద్దున్నుంచి ఆసుపత్రిలో కూర్చుని ఉండడం వల్ల బాగా అలసిపోయాను. ఏదో కాస్త తిన్నాననిపించుకుని, పక్కమీద వాలాను. నిద్రపోవాలని ప్రయత్నిస్తున్నా, నా బాల్యం, అమ్మ జ్ఞాపకాలు నన్ను నిద్రపోనీయడం లేదు.

ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు గానీ, ఫోన్ మోగుతుంటే మెలకువ వచ్చింది. అవతలి వైపు మా తమ్ముడు. అమ్మ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, వెంటనే బయల్దేరి రమ్మని చెప్పాడు. అప్పుడు దాదాపు అర్థరాత్రయింది. టాక్సీ వెంటనే దొరకలేదు. చివరికి ఓ టాక్సీ డ్రైవర్‌కి మాములుగా అయ్యేదానికన్నా రెట్టింపు చెల్లించి ఆసుపత్రికి చేరాను. తుఫాను వేగంతో అమ్మ గదిలోకి పరుగెత్తాను. తమ్ముడు గదిలో నేల మీద కూర్చుని ఉన్నాడు. నన్ను చూస్తూనే అతని కళ్ళలోంచి నీళ్ళు జలజలా కారాయి. నా కళ్ళు కూడా కన్నీళ్ళతోనే బదులు చెప్పాయి. అంతా అయిపోయింది. నాకూ మా అమ్మకి మధ్య అన్ని రకాలా దూరం హద్దులు లేకుండా పోయింది. అనంతమై పోయింది. ఇంకెన్నటికి కుంచించుకుపోని విధంగా!

మర్నాడు ఉదయం పశుపతినాథ్ మందిరం పక్కగా ప్రవహిస్తున్న భాగమతీ నది ఒడ్దున అమ్మ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. రోడ్డుకి ఓ మూలగా ఉన్న పార్కింగ్ వైపు నడుస్తున్నాను.

“బాబూ” అంటూ వెనుక నుంచి ఎవరిదో కేక వినిపించింది. ఆ గొంతు మా అమ్మ గొంతులానే అనిపించింది.

వెయ్యి వోల్టుల పిడుగు నెత్తిన పడినట్లుగా, చటుక్కున తల వెనక్కి తిప్పి చూసాను. ఓ పసిపిల్లాడు రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళ అమ్మ వెనుక నుంచి అరుస్తూ పరిగెత్తుకొస్తోంది. మరో వైపు నుంచి ఓ కారు వేగంగా వస్తోంది, ఆ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసాడు. కారు పిల్లాడికి దగ్గరగా వచ్చాకగానీ ఆగలేక పోయింది. కుర్రాడి అమ్మ వేగంగా వచ్చి, పిల్లాడిని చివాలున ఎత్తుకుని వాటేసుకుంది. పిల్లాడు అమ్మని గట్టిగా కరుచుకొనిపోయాడు.

(హిందీ మూలం: శివ్ గౌతం వ్రాసిన అంతరాళ్ కథ. హిందీ ఆన్‌లైన్ పత్రిక గర్భనాల్ సంచిక జూన్ 2012లో ప్రచురితం. పే 47-49.)

కొల్లూరి సోమ శంకర్

రచయిత కొల్లూరి సోమ శంకర్ గురించి: పుట్టింది కృష్ణా జిల్లా గుడివాడలో. పెరిగింది హైదరాబాదులో. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో విద్యాభ్యాసం. అనేక కథలు, వ్యాసాలు, అనువాదాలు ప్రచురించబడ్డాయి. "మనీప్లాంట్" అనే భారతీయ కథల అనువాద సంకలనం వెలువరించారు.  ...