జుగల్‌బందీ

వీధంతా పిండారబోసింది
గుమ్మం, నడవా
పచ్చిక తోవ.
రాకాసి గుళ్ళు మంచు బూచాళ్ళు –
దారి కడ్డంగా,
కారు కదలకుండా.
ఉత్తరాలుంటాయి తెచ్చుకునొద్దాము
ఉత్తుత్తినే వీణ్ణి ఎత్తుకునొద్దాము,
నా చెయ్యి నువ్వూ,
నీ చెయ్యి నేనూ –
జారి పడకుండా,
తూలిపోకుండా.

సుళ్ళు సుళ్ళు తిరిగి రేగిపోతోంది
ఆకులూ, దుమ్మూ
అంతెత్తు ధూళి,
ఊగూగి అరుస్తోంది ఊళల గాలి.
కిటికీ రెక్కలు మూసీసొద్దాము
చీకట్లు తడిమి
దీపాలు పెట్టి,
తలుపులు గడియాలు వేసీసొద్దాము,
ఆప్కో రొజాయి
అంబదొడ్డ బొంత –
నీమీదొకటి
నామీదొకటీ.

దారి పొడుగూ మబ్బు మూసుకొచ్చింది
అట్నుంచి హోరు
ఇట్నుంచి జల్లు
నీలికొండ మాట్నుండి జిగ్గుమని కొట్టి,
ఉరుముతున్నాది
ఎడ తెగని వాన.
గొడుగులో చెరిసగం నడిచీసొద్దాము
డాలర్ సినిమా సగం విడిచీసొద్దాము,
అడుగులో అడుగు
తడిసిపోకుండా.
వెచ్చ వెచ్చనివి
వెన్న పేలాలు –
ఒకటి నీకు
ఒకటి నాకూ.

ఊరు ఉలిక్కిపడి లేచి కూర్చుంది,
అటు చూడు జనం!
ఇటు చూడూ జనం!!
పన్ల మీద పన్లు పడ తిరుగుతున్నాము
దేవుడామని లేచి
దేశాలంట పోయి,
ఎడమొహం పెడమొహం వెదుక్కుంటున్నాము
అపరాత్రి తింటే
అలిసి పడుకుంటే,
అట్నుండి పిలుపు
ఇట్నుండి కబురు –
నీమాన్నువ్వు
నా మాన్నేను.