నైరూప్యచిత్ర కళాయాత్రికుడు

ఈ ముగ్గురి గురువుల్లోకీ పణిక్కర్ ప్రభావం రామారావు పైన ఎక్కువగా కనిపిస్తుంది. పణిక్కర్ తన యూరప్ పర్యటనలో అక్కడి ఇంప్రెషనిస్ట్ ధోరణి పట్ల విపరితంగా ఆకర్షితుడయ్యాడు. కేవలం భారతీయ చిత్రకళను మాత్రమే అధ్యయనం చేయడానికి తమని తాము పరిమితం చేసుకోవద్దనీ, ఇతర ధోరణులనూ అంతే శ్రద్ధతో తెలుసుకోవాలనీ పణిక్కర్ తన విద్యార్థులకు సూచించేవాడు. రామారావు మీద ఆ ప్రభావం చాలా బలంగా ఉంది.


ఎ గర్ల్ విత్ లిలీస్ అండ్ పిచర్, 1960.

రామారావు చిత్రకళనూ, జీవిత తత్వాన్నీ అత్యంత ప్రయోగాత్మకంగా, సాహసోపేతంగా ప్రదర్శిస్తాడు. 1960లో అతను వేసిన ‘గర్ల్ విత్ లిలీస్ అండ్ పిచర్’ చిత్రం టెంపెరా (Tempera) పద్ధతికి చెందినది. అజంతా గుహల్లో చిత్రాలు ఈ పద్ధతిలోనే వేయబడ్డాయి. ఈ పద్ధతిలో చిత్రాలను తైలవర్ణాల్లోనూ, నీటి రంగుల్లోనూ వేయవచ్చు. ఈ చిత్రం వేసిన కాలంలో రామారావు కళాక్షేత్రంలో కే. శ్రీనివాసులు వద్ద చదువుకుంటున్నాడు. రామారావు వేసిన ఈ చిత్రంలో జానపద చిత్రశైలిలోని గొప్పదనమూ, వర్ణ విస్తృతిలోని సామాన్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఒక్క జైమినీ రాయ్ తప్ప తక్కిన భారతీయ చిత్రకారులు ఈ చిత్రంలోని జీవాన్ని పట్టుకోడంలో విఫలమయ్యారు. బెంగాల్‌కు చెందిన జైమినీ రాయ్ జానపద చిత్రకళలో అద్వితీయుడు. ఇతను జానపద చిత్రకళలో పట్ (pat) పద్ధతిని ప్రవేశపెట్టాడు. పనిలో పనిగా ఈ చిత్రంలో రామారావు జానపద శైలిని ఆధునిక పరిభాషలోకి మలిచాడు. ఈ ప్రయోగం చేయగలిగిందీ, చేసి విజయం సాధించగలిగిందీ కేవలం రామారావు మాత్రమే. చిత్రంలో అమ్మాయి శరీరం పసుపుపచ్చగా ఉంటుంది. అందులో లీలామాత్రంగా నారింజరంగు దిద్ది వుంతుంది. చిత్రం చూసిన వారెవరికైనా ఉత్తరాంధ్రలో పసుపు అప్పుడే ముఖానికి రాసుకున్న ఒక పల్లె పడచు జ్ఞాపకం రాక మానదు. ఆమె ఒకచేతిలో పొడుగాటి కాడల కలువలు పట్టుకుని, ఏదో అలికిడై తల తిప్పి హొయలుగా నిలబడి వుంటుంది. ఇదీ ఇందులోని జానపద అంశ. శైలి మాత్రం పూర్తిగా ఆధునికం.


ఎ సీన్ ఫ్రం కేరళ

1961లో త్రివేండ్రంలోని రాజా రవివర్మ మ్యూజియానికి అప్పటి క్యురేటర్ అయిన ప్రముఖ చిత్రకళా విమర్శకుడు పద్మనాభన్ థంపి రామారావుని ఆహ్వానించాడు. కేరళ పర్యటనలో రామారావు అక్కడి అందాలను పూర్తిగా మమేకం చేసుకున్నాడు. దాని ఫలితమే, అదే సంవత్సరం రామారావు వేసిన ఎ సీన్ ఫ్రం కేరళ అనే తైలవర్ణ చిత్రం. మామూలు గ్రామసీమకు సంబంధించిన చిత్రాలనుంచి స్పష్టంగా ఈ చిత్రం విడిపడిన విషయాన్ని ఇట్టే పసి గట్టేయవచ్చు. ఈ చిత్రాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో వకీల్ అండ్ సన్స్ వాళ్ళు ఒక గ్రీటింగ్‌కార్డుగా ముద్రించారు. అది అప్పట్లో బ్రహ్మాండంగా అమ్ముడు పోయింది. మళయాళ మనోరమ పత్రిక రామారావు జీవితరేఖతో పాటు పదకొండు చిత్రాలను, ఒక పెద్ద వ్యాసాన్ని వరుసగా రెండు సంచికలలో ప్రచురించింది. రామారావు చిత్రాలను కేరళ ప్రభుత్వం అధికారికంగా కొని రాష్ట్ర పురావస్తు ప్రదర్శన శాలలో భద్రపరచి సత్కరించింది.

మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో విద్యార్థిగా ఉన్న మూడేళ్ళూ రామారావు జాతీయ స్థాయిలో జరిగిన పోటీలన్నింటిలోనూ ప్రథమ స్థానం పొందాడు. తర్వాత భారత ప్రభుత్వం ఇచ్చిన ఫెలోషిప్‌తో మద్రాసు లోనే ఉంటూ నిరంతరం విభిన్నశైలులతో ప్రయోగాలు చేస్తూ, రూపాన్ని, రంగులని, కుంచెలని మారుస్తూ అద్భుతమైన చిత్రవిన్యాసాలు చేశాడు.


ప్రొసెషన్ (2005?)

రామారావు చిత్రాలను చూసిన ప్రముఖ చిత్రకళా విమర్శకుడు జి. వెంకటాచలం ప్రశంసలు, విమర్శలు, సూచనలు చేసి పైచదువు కోసం అమెరికా గానీ, బ్రిటన్‌గానీ తప్పకుండా వెళ్ళాలని సలహా ఇచ్చాడు. రామారావు అప్పట్లో క్షణం తీరిక లేకుండా శ్రమించేవాడు, ఒక పక్క రంగులతో ప్రయోగాలు చేస్తూ, ఇంకోవైపు తన చిత్రాల ఆకృతులలో సాంప్రదాయక ధోరణి నుండి ఆధునికతకు మారుతూ. అంతమార్పులోనూ చిత్రాలలో అతనిదైన ముద్ర ప్రధానంగా కనపడుతూనే ఉండేది. 1960ల్లో మద్రాసు మ్యూజియం రామారావు చిత్రాలను కొన్నిటిని కొనుగోలు చేసింది. తర్వాత ఢిల్లీ లోని ఫోర్డ్ ఫౌండేషన్ ఐదు చిత్రాలను కొనింది. హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలోనూ, రాజ్‌భవన్‌లోనూ రామారావు చిత్రాలు కొన్నున్నాయి. కొడవటిగంటి కుటుంబరావు, నార్ల వెంకటేశ్వర రావు, ఆచంట జానకీరాం తదితర రచయితలతో రామారావుకు సాన్నిహిత్యం ఉంది. అప్పటి భారతి పత్రికలో రామారావు కళ పైన కొన్ని మంచి వ్యాసాలు రాశాడు. (ఈమాట పాఠకులకు ఇవి త్వరలో అందించే ప్రయత్నం చేస్తున్నాం – సం.) హవాయీ విశ్వవిద్యాలయంలో ఈస్ట్-వెస్ట్ ఫెలోషిప్ కోసం, లండన్ విశ్వవిద్యాలయం, స్లేడ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ వారి కామన్వెల్త్ స్కాలర్‌షిప్ కోసం ప్రయత్నించాడు. ఈ రెండు ఒకేసారి రావడంతో 1962లో లండన్ వెళ్ళడానికే రామారావు నిశ్చయించుకున్నాడు.

రామారావు లండన్‌కి కనీసం కుంచెలు కూడా తీసుకొని పోకుండా ఉట్టి చేతులతోనే వెళ్ళాడు. పాశ్చాత్య చిత్రకళారీతులను అక్కడి గురువుల నుండి మళ్ళీ కొత్తగా మొదటినుండీ నేర్చుకోడానికే నిర్ణయించుకోడం ఇందుకు కారణం. అతని ప్రయత్నమంతా అక్కడ ఒక ఆధునిక చిత్రకారుడిగా ఎదగడమే.


ఎ లైఫ్ స్టడీ, 1962.

లండన్‌లో ఒక సంవత్సరమంతా కూడా కేవలం అక్కడి ఆర్ట్ గ్యాలరీలను చూడడానికి, కళకు సంబంధించిన వ్యాసాలు, సమీక్షలు, విమర్శలు, సిద్ధాంతాలు చదవడానికి, తన ఆలోచనలను కళారంగంలో ద్రష్టలైన వారి ఆలోచనలతో పోల్చుకుంటూ, మెరుగులు దిద్దుకుంటూ గడిపాడు. తన చిత్రాల శైలినీ, చిత్రకారుడిగా తనెన్నుకున్న మార్గాన్నీ పునస్సమీక్షించుకోడానికి ఈ కృషి తోడ్పడింది. ఈ సమయంలోనే బొగ్గుముక్కతో లైఫ్ స్కెచెస్ గీయడాన్ని అధ్యయనం చేశాడు. 1962లో గీసిన ఎ లైఫ్ స్టడీ అనే చిత్రంలో గీతల్లోని దిటవుతనం, ముఖాన్ని మలచడంలో, తీర్చిదిద్దడంలో వడి చూస్తే 17వ శతాబ్దపు మహామహులైన వేర్మీర్ (Johannes Vermeer), రెంబ్రాంట్‌( Rembrandt van Rijn) శైలి గుర్తుకు వస్తుంది. ఈ చిత్రానికి పూర్తి భిన్నంగా కనిపించే చిత్రం ఎ సీటెడ్ వుమన్. ఇది పక్కా పాశ్చాత్య వాస్తవిక ధోరణిలో వేసింది. 17వ శతాబ్దపు స్పెయిన్ దేశపు చిత్రకారుడు డియేగో వెలాస్క్వెజ్‌ (Diego Velazquez) కు రామారావు విపరీతమైన అభిమాని. అతని ప్రభావం కూడా కొంతవరకు రామారావు చిత్రాల్లో కనిపిస్తుంది.

లండన్‌లో రెండవ ఏటినుంచీ రామారావు పాశ్చాత్య కళారంగాన్ని ఒక కుదుపు కుదిపాడు. ఆహ్వానం మేరకు లిస్బన్, పోర్చుగల్‌లో తన చిత్రాలు ప్రదర్శించాడు. పెయింటింగ్ మీద రామారావుకు మక్కువ ఉన్నప్పటికీ లితోగ్రఫీ పట్ల ఆకర్షితుడై, ఈ మాధ్యమంలో తనను తాను వ్యక్తపరచుకోడానికి ఎన్నో ప్రయోగాలు చేశాడు. తనదైన శైలితో లితోగ్రఫీలో అధ్బుతాలు సృష్టించి స్లేడ్ స్కూల్ అత్యుత్తమ లితోగ్రాఫర్ పురస్కారాన్ని అందుకున్నాడు.


అన్‌టైటిల్డ్ (లిథోగ్రాఫ్)

ప్రముఖ సాహిత్య, కళా చారిత్రకుడు, విమర్శకుడు సర్ హెర్బర్ట్ రీడ్ రామారావు చిత్రాలను చూసి తన్మయుడై తన స్వంతానికి రెండు లితోగ్రాఫులను కొన్నాడు. అలా రామారావుకు రీడ్‌తో గాఢమైన సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ కాలంలోనే రామారావు సృష్టించిన లితోగ్రాఫులు విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం లాంటి ప్రముఖ ఆర్ట్ గ్యాలరీలను అలంకరిస్తూ వచ్చాయి. ఏ కళాకారుడైనా న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో తన చిత్రం ప్రదర్శించబడటం అత్యంత గర్వకారణంగా భావిస్తాడు. రామారావు తొలిసారి అమెరికా పర్యటించినప్పుడు, ఆ మ్యూజియం క్యురేటర్ రామారావుని తన చిత్రాలను కొన్నిటిని పంపమని అడిగాడు. అంతర్జాతీయ న్యాయమూర్తుల సమితి పరిశీలన కోసం రామారావు దాదాపు నలభై లితోగ్రాఫులను ప్రదర్శించాడు. సమితి పరిశీలనలో రామారావు లితోగ్రాఫు సహజంగానే ఎంపికయింది. మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో (MoMA) డాలి (Salvadore Dali), పికాసో (Pablo Picasso) లాంటి ఉద్దండుల చిత్రాల సరసన రామారావు చిత్రం సగర్వంగా చేరింది.

చాలామంది లితోగ్రాఫర్ల లాగా కాకుండా రామారావు లితోగ్రాఫు ప్లేటునుంచి ఒకే ఒక్క ప్రతిని ముద్రించి ప్లేటును పగలకొట్టేస్తాడు. ఒక ప్లేటు, ఒక చిత్రం – అంతే. అది అతని ప్రత్యేకత. తన ఒకే చిత్రం పదిమంది దగ్గరుండడం తనకు ఇష్టం వుండదు. అందుకే, తర్వాతి రోజుల్లో తన లితోగ్రాఫు నుంచి ప్రతులు అచ్చు వేసి అమ్మకానికి పెడితే, ఆ ప్రదర్శనలకు వెళ్ళేవాడు కాదు.


ఫెటర్డ్ ఫ్లైట్ ఆఫ్ ఫిమేల్.

రామారావు ప్రత్యేక శైలి, పనితీరులో వెలువడిన లితోగ్రాఫులను అలా ఉంచినా, కర్రతో శిల్పాలను తీర్చిదిద్దడంలోనూ చూపిన ప్రావీణ్యత చూస్తే రామారావులోని నిరంతర ప్రయోగశీలి గోచరిస్తాడు. ప్రతి కర్రకు సహజ సిద్ధంగ ఒక ప్రత్యేకమైన గరుకుదనపు తలం ఉంటుంది. సాధారణంగా కర్రలతో చెక్కే సాంప్రదాయ కళాకారులు ఒక నున్నని చెక్కను తిసుకొని, దానిపైన ఆకృతులు చెక్కి అందులోంచి చిత్రప్రతిని ముద్రిస్తుంటారు. కానీ రామారావు సాంప్రదాయ పద్ధతిలో చిత్రాన్ని ఎన్నడూ చేయడు. అతను వేర్వేరు తలాలున్న చెక్కలను తనకనుగుణంగా ముక్కలుగా చేసుకుని, ఆ ముక్కలను అతికించి తను అనుకున్న చిత్రాన్ని తయారు చేసుకుంటాడు. అప్పుడు, వేర్వేరు చెక్కముక్కలపై విడిగా వేర్వేరు రంగులతో తన ఆలోచనల్లోని తాలూకు చిత్రం తాలూకు వివరాలను సృష్టిస్తాడు. ఫెట్టర్డ్ ఫ్లైట్ ఆఫ్ ఫిమేల్ అన్న చిత్రం వుడ్‌కట్ రామారావు నిపుణతకు సాక్ష్యం. ఈ చిత్రం లోని చెక్కముక్కలపైన వర్ణసమ్మేళనంలో ఖాళీతనాన్ని, చెక్కిన చెక్కల్లో నిండుదనాన్నీ గమనించవచ్చు. ఈ రెండింటి కలయిక వల్ల చిత్రంలోని అసలు అర్థం, చిత్రకారుడు చిత్రానికి పెట్టిన పేరులోని విషయం, ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చిత్రంలోని స్త్రీమూర్తి అంతరాంతరాలలో తీవ్రమైన స్వేచ్ఛాకాంక్ష, అదే సమయంలో సమాజం విధించిన అసంబద్ధపు సంకెలలు, అందువల్ల రెక్కలు తెగి ఎక్కడికీ ఎగర్లేని నిస్సహాయత ఈ చిత్రంలో అద్భుతంగా అవగతమౌతాయి.


ఎ సీటెడ్ వుమన్ (నైరూప్య చిత్రం).

సీటెడ్ వుమెన్ అన్న నైరూప్య చిత్రం, వాస్తవిక ధోరణిలో వేసిన లైఫ్ స్టడి వరుసలోని సీటెడ్ వుమెన్ చిత్రానికి భిన్నమైనది. ఈ నైరూప్య చిత్రం జర్మన్ కళాకారుల బృందమైన వైల్డ్‌బీస్ట్ గ్రూప్ తరహా భావప్రకాశ పంథాకు చెందినది. ఇదే తరహాలో నిష్ణాతుడైన ఫ్రాంజ్ మార్క్ (Franz Marc)ముతక మెరుపు రంగులతో కరుకు కుంచె గీతల్లో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఈ నైరూప్య చిత్రం ఎంత వేగంగా తయారయిందో, అంత వేగంలోనూ చిత్రకారునికి విషయం పట్లా, వర్ణాల మిశ్రమం పట్లా ఎంత పట్టు ఉందో ఇట్టే గ్రహించవచ్చు. ఈ చిత్రం వాస్తవిక శకంలోని నాలుగు గోడల మధ్య స్టూడియోలో వేసే చిత్రాల నుంచి ఆరుబయట వేసే ఇంప్రెషనిస్ట్ తదితర ధోరణులలోకి రామారావు పరిణామం చెందిన క్రమానికి ఆనవాలుగా నిలిచింది. అందులో విజయం సాధించగలిగింది.


ఎ సీటెడ్ వుమన్, 1962.

రామారావు చేసిన ఈ ప్రయోగాలన్నీ అతన్ని ఒక ప్రత్యేకమైన చిత్రకారుడిగా నిలబెట్టేందుకు భూమికగా నిలిచాయి. వీటి ద్వారా తన అంతరంగాన్ని బలంగా అభివ్యక్తీకరించడం, ఆ ప్రయత్నంలో తనని తాను కోల్పోకుండా ఉండడం, రామారావు ప్రత్యేకత, గొప్పతనం అని చెప్పాలి. ప్రముఖ చిత్రకారుడు కొకోష్క (Oscar kokoschka) “ఒక సృజనాత్మకుడైన వ్యక్తికి తన అంతరంగంలోని జ్ఞానిని ఏ విషయమైతే మరుగు పరుస్తుందో, మొదట దాన్ని అన్వేషించడం ప్రధాన లక్ష్యమౌతుంది. ఆ తరువాతే అతను తన మదిలోని శక్తిని కూడగట్టుకుంటాడు” అంటాడు. రామారావు చేస్తున్న ప్రయోగాలన్నింటిలోనూ ఈ అన్వేషణ కొనసాగుతూనే ఉండి, చిత్రకారుడిగా అతని ఎదుగుదలకు అద్దం పడుతున్నాయి.