ఒక పుస్తకం

నీకేం నువ్వు
పుస్తకం ఇచ్చి వెళ్లావు
ఒక్క పదమూ తెలిసింది లేదు
తెలియక పోయిందీ లేదు

వింతగా ఉంది
దారం చెయ్యిలా ఉంది
పడపోతానని బయం
పటం కింద గాలి నవ్వు

విండో సిల్ మీద పేచీ
గాలి మీద సాము
రెండు పావురాలు
ప్రణయమేమో

చెంపల మీద కాంతి
కంటిలో కరుగుతోంది
ఎదురైతే పలకరించక
పోవడమే మంచిదా

ఇది చాల బాగుంది
ఎక్కడికక్కడ విరిగిపోవడం
రెండు పెగ్గులు పద్యం తాగి
ఒక బుజమ్మీద ఒరిగిపోవడం

పాతది మాట్టాడనని
వ్రతం పట్టావు
ప్రేయసి అందుతుంది
బయపడకు, గెడ వెయ్

కాగితాలు ఎట్టాగో పేర్చి
అమ్మను పిలుస్తా
చూడు ఏం చేశానో అని అరుస్తా
ఫొటో తీసుకుంటుంది

మనుషులు కలుసుకోవాలి
మాట్లాడుకోవాలి
తెలుసుకోవాలి ఇంకా
ఏం ఒరిగింది, విడిపోయి
చాల బింబాలుగా
పగిలిపోయి… ?

(అనంతుకు, నాయుడికీ; ఒక ‘బుడదంగి’తో పండుగ చేసుకుంటూ. బుడదంగి – అనంతు కొత్త పుస్తకం పేరూ, వాళ్లూరిలో గాలిపటమూ)