ఆషాఢస్య ప్రథమ దివసే

పరిచయము

ఆకాశము దట్టంగా కారు మబ్బులతో నిండి, ఉన్నట్లుండి కర్ణభేరి బద్దలయేట్టుగా ఉరుముల మ్రోతలు వెనుకంటి వస్తుంటే మెరుపుతీగలు మిరుమిట్లు గొలుపుతూ ఒక వైపునుండి మరోవైపుకు ప్రాకుతున్నప్పుడు, జడివాన మొదటి చినుకులు నేలపై పడి మట్టివాసనను రేపినప్పుడు నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చే పంక్తి మేఘదూతము లోని ‘ఆషాఢస్య ప్రథమ దివసే’. మహాకవి కాళిదాసు (నా ఉద్దేశములో అతడిని కాలిదాసు అని పిలవాలి, ఎందుకంటే అతడు కాలి అంటే శివుని భక్తుడు, కాళికాదేవి భక్తుడయితే అతని పేరు కాళీదాసుగా ఉండి ఉండేది) సంస్కృతములో మేఘదూతమును ఒక ఖండకావ్యముగా వ్రాసినాడు. వర్షము పడుతున్నప్పుడు తనకు ప్రియమైన వ్యక్తి తోడు లేక విరహపు వ్యధ బాధిస్తున్నప్పుడు జ్ఞాపకము వచ్చేది మేఘదూతమే. ఇందులోని పద్యాలు సుమారు 110కి పైగా పూర్వమేఘము, ఉత్తరమేఘము అనే భాగాలలో ఉన్నాయి. కాళిదాసు అన్ని పద్యాలను మందాక్రాంత వృత్తములో వ్రాసినాడు.


ఆషాఢస్య ప్రథమ దివసే
భారత్ తపాలా బిళ్ళ

మందాక్రాంత వృత్తములో ప్రతి పాదానికి 17 అక్షరాలు ఉంటాయి, దాని గణములు – మ భ న త త గగ. పాదమును మూడు భాగాలుగా విడదీయవచ్చును – UUUU – IIIIIU – UIUUIUU. సంస్కృతములో పదాలను వాడేటప్పుడు, పదాలను పై విధముగానే అమర్చాలి. నాలుగవ అక్షరము, ఐదవ అక్షరము, అదే విధముగా పదవ అక్షరము, పదకొండవ అక్షరము సంధి ద్వారా తప్ప మరే విధముగా కలుపబడవు. పాదాంతములో తప్పని సరి యతి ఉంటుంది. తెలుగు భాషలో ఈ నియమాలు లేవు. మందాక్రాంతానికి తెలుగులో ఒక యతి మాత్రమే నియమం. తెలుగు మందాక్రాంత పద్య పాదములో మొదటి అక్షరానికి, పదకొండవ అక్షరానికి అక్షరమైత్రి ఉండాలి, దీనినే వడి అంటారు. మనకందరికీ తెలిసిన ఒక మందాక్రాంత వృత్తము విష్ణుసహస్రనామము లోని క్రింది పద్యము:

శాంతాకారం – భుజగశయనం – పద్మనాభం సురేశం
విశ్వాధారం – గగనసదృశం – మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం – కమలనయనం – యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం – భవభయహరం – సర్వలోకైకనాథం

ప్రయాగ ప్రశస్తి

ఈ మందాక్రాంతవృత్తము కాళిదాసుకు సుపరిచితమే. కాళిదాసు రెండవ చంద్రగుప్తుని కాలములో నివసించాడు, అతని ఆస్థానకవి. ఈ చంద్రగుప్తుని తండ్రి సముద్రగుప్తుడు (క్రీ. శ. 335-380). సముద్రగుప్తుని ఆస్థానకవి హరిసేనుడు. గుప్తయుగములో సామ్రాజ్యాన్ని విస్తరించినది సముద్రగుప్త చక్రవర్తి. ఆ సామ్రాజ్యము కామరూపము నుండి యమున వరకు, హిమాలయము నుండి నర్మద వరకు ఉండినది. అది కాక దక్షిణ భారతదేశము లోని రాజులతోబాటు ఎందరో సామంతరాజులు ఉండేవారు. అతడి విజయాలను వర్ణిస్తూ ప్రయాగ (నేటి అలహాబాదు) దగ్గరి కౌశాంబిలో అశోకుని శాసనస్థంభముపై ఒక భాగములో ఈ హరిసేనకవిచే వ్రాయబడిన శాసనము ఒకటి ఉన్నది. దానిని ప్రయాగ ప్రశస్తి అంటారు. ఉత్తభారతమంతా దిగ్విజయయాత్రలో జయించి దక్షిణములో కంచివరకు వచ్చాడు సముద్రగుప్తుడు. కళింగ, విశాఖ, గోదావరి, పిఠాపురము మున్నగునవి కూడ ఈ శాసనములో ప్రత్యేకముగా పేర్కొనబడ్డాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, హరిసేనుడు వ్రాసిన ఆ ప్రయాగ ప్రశస్తిలో [1,2] ఒక మందాక్రాంత వృత్తము కూడ ఉన్నది. ఆ మందాక్రాంతవృత్తములో రెండు పంక్తులు మాత్రమే పూర్తిగా ఉన్నాయి. అవి:

సంగ్రామేషు – స్వభుజ విజితా – నిత్యముచ్చాపకారాః
తోషోత్తుంగే – స్ఫుట బహురస – స్నేహ ఫుల్లైర్మనోభిః

ఎవరు పరులకు అపకారము చేస్తారో వారిని తన భుజపరాక్రమముతో యుద్ధములో జయిస్తాడో / మనసులు ప్రస్ఫుటమైన బహురసములతో నిండి స్నేహముతో విరిసి చాల సంతోషముతో ఉంటుందో…

వియత్నాంలో మందాక్రాంతము

కాళిదాసు మేఘదూతాన్ని చర్చించడానికి ముందు మరో రెండు శాసనాలలోని మందాక్రాంత పద్యాలను తెలియబరుస్తాను. క్రీ. శ. నాలుగవ శతాబ్దానికే భారతదేశము నుండి నేటి ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి వలస వెళ్లి అక్కడి రాజులను జయించి హైందవ సిద్ధాంతాల పైన ఆధారపడిన సామ్రాజ్యాలనే నిర్మించారు కొందరు. నేటి వియత్నాం లోని మీసోన్ ప్రాంతము ఆనాడు చంపాదేశము అని పిలువబడేది. భద్రవర్మ మహారాజు (క్రీ. శ. 380-413) భద్రేశ్వరాలయము అనే ఒక శివుని గుడిని నిర్మించాడు. రెండు శతాబ్దాల తరువాత ఇది నిర్మూలించబడగా, శంభువర్మ (577-629) శంభు-భద్రేశ్వరాలయమని దీనిని పునర్నిర్మించాడు. నలభై యేళ్లకు ముందు జరిగిన వియత్నాం యుద్ధములో భద్రవర్మ కట్టిన కొన్ని గుడులు బాంబులు పడి ధ్వంసమయిన విషయము శోచనీయము. నేడు మీసోన్ ఒక world heritage site. ఈ శంభువర్మ శిలాశాసనాలలో[3] శివునిపైన ఒక మందాక్రాంత వృత్తము ఉన్నది. అది:

సృష్టం యేన – త్రితయ మఖిలం – భూర్భువస్స్వః స్వశక్త్యా
యేనోత్ఖాతం – భువనదురితం – వహ్నినేవాంధకారం
యస్యాచింత్యో – జగతి మహిమా – యస్య మాదిర్న చాంత
శ్చంపాదేశే – జనయతు సుఖం – శంభుభద్రేశ్వరోऽయం

ఎవడు భూర్భువస్సువర్లోకాలను సృష్టించాడో, ఎవడు వెలుగు చీకటిని తరిమివేసినట్లు సకలపాపాలను నిర్మూలిస్తాడో, ఎవడి మహిమలను ప్రపంచములో ఊహించుకోడానికి వీలుకాదో, ఆ శంభు-భద్రేశ్వరుడు చంపాదేశానికి సుఖములను ప్రసాదించుగాక!

క్రీ. శ. 653-687 మధ్యకాలములో విక్రాంతవర్మ చంపాదేశానికి రాజు. ఇతడు కూడ కొన్ని శాసనాలను మీసోన్‌లో చెక్కించాడు[3]. వాటినుండి ఒక మందాక్రాంతవృత్తమును క్రింద ఉదహరిస్తున్నాను:

యస్యాత్మానః – సకలమరుతాం – మానినాం మాననీయా
అష్టౌ పుణ్యా – వరహితకృతః – సర్వలోకాన్ వహంతి
అన్యోన్యస్య – స్వగుణవిధయా – గాఢసంబధ్యమానా
యోగ్యా యుగ్యా – ఇవ పథి పథి – స్యందనాన్ స్యందమానాన్

ఏ ఈశ్వరుని ఎనిమిది పుణ్యమూర్తులు మరుద్గణములచే నుతించబడుచున్నవో, ఏవి చక్కగా మంచి పనులచే ఎల్ల లోకములను భరించుచున్నవో, ఏవి తమలోతాము గాఢ సంబంధము గలిగి యున్నవో, ఏవి రథమును బాగుగా మార్గముపై నడిపించే గుఱ్ఱములవంటివో, ఆ ఈశ్వరుడు రక్ష నిచ్చుగాక!

మహాకవి కాళిదాసు నాలుగవ శతాబ్దపు అంత్యకాలములో జీవించాడు. ఇతడు పంచకావ్యాలలో రెండైన రఘువంశ కుమారసంభవములను, అత్యుత్తమ నాటకముగా పరిగణించబడే అభిజ్ఞానశాకుంతలముతోబాటు విక్రమోర్వశీయ మాళవికాగ్నిమిత్రములను, మేఘదూత ఋతుసంహార ఖండకావ్యములను రచించాడు. శృంగారతిలకము కాళిదాసు రచన అంటారు కొంతమంది. లాక్షణికగ్రంథమైన శ్రుతబోధ, దండకరాజమయిన శ్యామలాదండకము మాత్రము నిస్సందేహముగా ఇతని రచనలు కావు. మరే పుస్తకాన్ని వ్రాసినా, వ్రాయకపోయినా కాళిదాసు అద్వితీయ ప్రతిభకు ఒక్క మేఘదూతము చాలంటే అది అతిశయోక్తికాదు.

మేఘదూతము


మేఘదూత ప్రయాణ మార్గం

మేఘదూతము ఒక ఖండకావ్యము. ఇందులో మనకు కనబడే సజీవమైన పాత్ర యక్షునిది మాత్రమే. కుబేరుని కొలువులో ఉండే ఈ యక్షుడు రాజకార్యము చేయడములో ఏకాగ్రత చూపకపోయిన కారణాన శాపగ్రస్తుడై ఒక యేడు తన భార్యకు దూరముగా రామగిరి ప్రాంతములో విరహవేదనతో తపిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ సమయములో వర్షాకాలము ఆసన్నమయినది. గుంపులుగుంపులుగా కారు మేఘాలు గున్న ఏనుగులలా ఆకాశములో కనబడుతాయి. ఆ మేఘాన్ని చూచి నీవు నా దూతగా వెళ్లి అలకానగరములో ఉండే నా భార్యను కలిసి నా ప్రేమ సందేశాన్ని అందించమని ప్రాధేయపడుతాడు. అంతేగాక ఆ అలకానగరానికి ఎలా వెళ్ళాలో దారి కూడా చెప్తాడు. కాళిదాసు మేఘదూతములో సూచించిన స్థలములను ఆధారము చేసికొని జాఫర్ ఉల్లా గీసిన మేఘ మార్గాన్ని యిక్కడ చూడవచ్చును. క్లుప్తముగా యిది మేఘదూతపు కథ.

రఘువంశ రచయిత యయిన కాళిదాసుకు రామాయణ గాథ సుపరిచితమే. వర్షాకాలములో కిష్కింధలో రాముడు విరహబాధను అనుభవిస్తున్నాడు. అతడు లంకకు హనుమంతుని ద్వారా సీతకు సందేశాన్ని పంపిస్తాడు. రాముడికి బదులు యక్షుడు, లంకకు బదులు అలకాపురి, కిష్కింధకు బదులు రామగిరి, సీతకు బదులు యక్షిణి, హనుమంతుడికి బదులు మేఘము – ఇలా రామాయణానికి మేఘదూతానికి సాదృశ్యము ఉన్నది. గణితశాస్త్ర రీత్యా ఒకదానికి బదులు మరొకదానిని మనము ఉంచితే మనకు perfect isomorphism లభిస్తుంది. ఈ రామగిరి మధ్యప్రదేశములోని నేటి రాంటేక్ అంటారు. మహాభారతములోని నలోపాఖ్యానములో కూడ హంస ఒక దూత. నలునిచే పంపబడిన హంస తనకు “నలినసంభవు సాహిణములు వారువములు కులముసాములు మాకు కువలయాక్షి” అని దమయంతితో చెబుతుంది. దమయంతి హంసతో “అ నల సంబంధ వాంఛ నాకగున యేని అనల సంబంధ వాంఛ నాకగున చూవె” అంటుంది.