స్నానాల గదిలో

రెక్కలు ముడుచుకున్న బాతులా
కొంకీ మీద కూచునుంది
తువ్వాలు

సబ్బు పెట్టెలో
ఘుమఘుమల ఊపిరి తీస్తూంది
సబ్బు బిళ్ళ

బాదంకాయ తొట్టి పొట్టలోంచి
వెల్ల వేసిన పైకప్పుకు చేరుతోంది
నీటి ఆవిరి

విలాసంగా దేవతావస్త్రాలను
తొడుగుతూన్నది
ఈల పాట

ఆవిరి నిండిన ఈ గదిలో
నేనొక్కదానినే

మునివేళ్ళతో నీళ్ళని తాకి చూస్తాను
తేనీటి కప్పుని పెదవులకి ఆనించినట్టు.