వేణునాదం ఆగింది!

ఒక తెలుగు మాసపత్రిక జనవరి సంచిక చూసేదాకా ఏల్చూరి విజయరాఘవరావుగారు అమెరికాలో కాలంచేశారన్న వార్త తెలియకపోవడంతో నేను దిగ్భ్రాంతికీ, కలవరపాటుకూ గురి అయాను. ముందుగా కొన్ని వ్యక్తిగతవిషయాలు చెప్పాలి. బొంబాయిలో 1970నుంచీ ఉంటున్న నాకు ఆయనతో బాగా పరిచయం ఉండేది. 1958నుంచీ ఫిల్మ్స్ డివిజన్‌లో ఆయన సంగీతదర్శకుడుగా పనిచెయ్యడం వల్ల అక్కడ ఎడిటర్‌గా పనిచేసి, ఆ తరవాత పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కు ప్రొఫెసర్‌గా వెళ్ళిన మా అన్నయ్య రామచంద్రరావుకు ఆయన మంచి మిత్రుడు. మా బాబాయి కృష్ణమూర్తి కూడా అదే ఆఫీస్‌లో తెలుగు కామెంటేటర్‌గా పనిచేసేవారు. ఆ తరవాత నాకున్న హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలోని అభిరుచి దృష్ట్యా ఆయనను చాలా సందర్భాల్లో కలుసుకున్నాను.

ముఖ్యంగా 1978లో బొంబాయి కళాకారుల చేత – ప్రస్తుతం హ్యూస్టన్‌లో ఉంటున్న మా కవి మిత్రుడు, సైంటిస్ట్ డా. అహోబిలవఝ్ఝల మురళి రాసి – నిర్వహించిన కుమారసంభవం అనే నృత్య నాటకానికి నేను సంగీతదర్శకత్వం వహించడం, దాని మలిప్రదర్శనకు ఏల్చూరివారు ముఖ్యఅతిథిగా వచ్చి మా అందరినీ ప్రశంసించడం మరిచిపోలేని సంఘటనలు.

అంతేకాక మేము నడుపుతున్న తెలుగు సాహిత్యసమితి సభ్యుల ఉత్సాహాన్ని గమనించిన రావుగారు కొన్నిరోజులకే 1979లో తాను పుట్టపర్తికి వెళ్ళినప్పుడు మమ్మల్ని సంప్రదించకుండానే మాతరఫున అక్కడ ఎస్.రాజేశ్వరరావునూ, పి.సుశీలనూ ఆర్కెస్ట్రాతోసహా బొంబాయికి ఆహ్వానించారు. అదొక చరిత్రాత్మక ఘట్టమయింది. ఒకవంక మాలో ‘పెద్దలు’గా చలామణీ అవుతున్న కొందరు అలిగి, మొత్తం కార్యక్రమాన్ని చివరి నిమిషాన ముంచే ప్రయత్నం చేశారు. మాలో 35మందిమి వాలంటీర్లం మటుకు పట్టువదలక ఆ పాటల ప్రోగ్రామును అతివిజయవంతంగా నిర్వహించాము. షణ్ముఖానంద హాలులోని 3000 సీట్లూ అమ్ముడు పోవడమేకాక 5రూ. టికెట్టు ప్రేక్షకుల్లోని కొందరు ఆశాపరులకు బ్లాకులో 40రూ. పలికింది! ఇదంతా ఇన్నేళ్ళ తరవాత చెప్పుకోదగినది కాదుగాని, అప్పట్లో మా ఉత్సాహాన్నీ, అందోళననూకూడా పెంచిందనేది చెప్పడానికే.

ఆ ప్రోగ్రాములో గాయకుడు రామకృష్ణ కోరగా నేను తెరలేచే ముందరే రిహార్సల్ లేకుండా తక్కిన ఆర్కెస్ట్రాతో బాటుగా సితార్ వాయించవలసివచ్చింది. ఆ సభకు విజయరాఘవరావుగారు ముఖ్యఅతిథిగా, నౌషాద్ విశేష అతిథిగా రావడం మాకు మరింత సంతోషాన్నిచ్చింది. మేము ఆర్గనైజర్లుగానూ, స్టేజి కళాకారులుగానూకూడా శ్రమిస్తామనే సంగతి విజయరాఘవరావుగారు కళ్ళారా చూసి, భుజం తట్టగలిగారు.

తిరునాళ్ళకు తరలొచ్చే – సంగీతం: వి.రా. రావు

బొంబాయిలో విజయరాఘవరావుగారి వేణుకచేరీలూ, సంగీతంలోని రాగతాళాల మీద చేసిన సోదాహరణ ప్రసంగాలూ, వాటిని సక్రమంగా వినిపించేందుకు గాయక, వాద్యబృందాలతో నిర్వహించిన పెద్ద కార్యక్రమాలూ ఎన్నోసార్లు నేను విని ఆనందించగలిగాను. వాటిలో కొన్ని మా భాభా అణుకేంద్రం ఆడిటోరియంలోనూ, కొన్ని కాలనీలోనూ కూడా ఏర్పాటు చేశాము. ఆయనను ఇంట్లో కలుసుకుని క్రమం తప్పకుండా ప్రతి సాయంత్రమూ ఆఫీసునుంచి తిరిగి రాగానే ఆయన చేసే సంగీతాభ్యాసమూ, చెప్పే విషయాలూ అన్నీ వినే అదృష్టం నాకు కలిగింది. ఆయనకు పద్మశ్రీ రావడం అంత ఆశ్చర్యకరమేమీ కాదు.

ఆయన శిష్యుల్లో రోనూ మజుందార్ బాగా పేరుపొందాడు. ఆయన రెయిన్‌బో అనే ఒక లాంగ్‌ప్లే రికార్డ్‌లో ఒక వేపున వివిధరాగాలూ, తాళాల మాలికను వాద్యబృందం ద్వారా వినిపించారు. రెండోవేపున పదాలు లేకుండా ఒక థీం మ్యూజిక్ వినిపిస్తుంది. సుఖంగా ఉంటున్న ఒక గ్రామానికి క్షామం ఎదురవుతుంది. అక్కడి ప్రజలంతా కొన్నాళ్ళు బాధలు పడ్డాక, కలిసి, శ్రమించి, మళ్ళీ ప్రగతిని సాధిస్తారు. ఈ కథంతా కేవలం వాద్యసంగీతం ద్వారానే మనకు అర్థమవుతుంది. ఈ రికార్డ్ మేము పదేపదే వింటూ ఉండేవాళ్ళం. ఆయన వాయించిన మాల్కౌఁస్ రాగం ఇక్కడ వినవచ్చు. ఒక సభలో ప్రదర్శించిన గీతగోవిందం ఓడిస్సీ శైలి నృత్యనాటకానికి పాటల స్వరరచన జస్‌రాజ్ చెయ్యగా, వాద్యసంగీతమంతా రావుగారే చేశారు.

సితార్ విద్వాంసుడైన రవిశంకర్‌వద్ద సంగీతం నేర్చుకున్న విజయరాఘవరావు ఆయనకు నికరమైన శిష్యుడు ఎందుకంటే కేవలం రాగతాళాలేకాక మొత్తం భారతీయసంస్కృతినీ, అందులోని వివిధ అంశాలనూ పరిశీలించి, అర్థంచేసుకునే సామర్థ్యం ఆయనకు అలవడింది. రవిశంకర్ స్వయంగా సంగీతరచన చేసిన అనూరాధా, గోదాన్, మీరా మొదలైన హిందీ చిత్రాల రికార్డింగ్‌లన్నిటిలోనూ రావుగారు ప్రధానపాత్ర నిర్వహించారు. ఫిల్మ్స్ డివిజన్‌వారి అసంఖ్యాకమైన డాక్యుమెంటరీల సంగీతంలో ఆయన రేడియోశబ్గాల దగ్గర్నుంచీ, రకరకాల ప్రపంచవాద్యాలదాకా అనేకం వాడి విజయవంతమైన ప్రయోగాలు చేశారు. 2008లో మా ఆవిడ, నేనూ అమెరికాలో అట్లాంటాలో ఉంటున్నప్పుడు వాషింగ్టన్ ప్రాంతం నుంచి తన రెండో కుమార్తె వద్దకు వచ్చిన ఆ సంగీతజ్ఞుణ్ణీ, కుటుంబాన్నీ మేము కలుసుకోగలిగాము. నా సితార్, గాత్రం విని ఆయన మెచ్చుకున్నారు కూడా. ఆయనిచ్చిన సలహాలు సంగీతపరంగా చాలా ఉపకరించాయి.

ఆయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీలతో బాటుగా బెంగాలీవంటి ఇతరభాషలు కూడా క్షుణ్ణంగా వచ్చు. విజయరాఘవరావు తన కళాజీవితాన్ని భరతనాట్యంతో మొదలు పెట్టినప్పటికీ, ఆయన వేణువునేకాక, వాద్యబృంద నిర్వహణనూ, మెళుకువలనూ, స్వరరచననూ, సంగీతప్రసంగాలనూ అద్భుతంగా నిర్వహించారు. ఇవన్నీకాక సుబ్రహ్మణ్యంగారి సోదరుడిగా తెలుగు కవిత్వమూ, కథలూ, ఇంగ్లీషులో రచనలూ చేశారు. ఎంతోకాలం ఆంధ్రప్రదేశ్ బైటే నివసించడంతో తెలుగువారికి ఆయన గురించి తెలియకపోవడం వారి దురదృష్టమే అనుకోవాలి. హిందూస్తానీ సంగీతరంగానికి ఆయన బాగా పరిచితుడే.

సినీసంగీతదర్శకుడుగా భువన్‌షోమ్‌ వంటి ఉత్తమ చిత్రాలకు ఆయన సమకూర్చిన నేపథ్యసంగీతం బహుమతులు గెలుచుకుంది. కళాత్మక విలువలపట్ల ఏమాత్రమూ రాజీపడకుండా, ఎవరినీ తిట్టుకోకుండా, ఆనందంగా చివరిదాకా జీవించిన ఆ మహానుభావుడు సదా స్మరణీయుడే.

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...