సారా మానను

చాలామంది లాగే నాకు కూడ గడచిన ఇరవై సంవత్సరాల ముందు వరకు ఫిట్స్‌జెరాల్డు వ్రాసిన ఒమర్‌ఖయ్యాం రుబాయీల అనువాదము తప్ప, మిగిలిన కవుల రచనలు పరిచితముగా ఉండేవి కావు. 90వ దశకములో Today’s Beautiful Gem శీర్షిక క్రింద ప్రపంచ, భారతీయ సాహిత్యములనుండి కొన్ని కవితలను India Digest పాఠకులకు ప్రతిరోజు పరిచయము చేసేవాడిని. అప్పుడు నాకు మహమ్మదీయకవుల సాహిత్యాన్ని చదవాలనే బుద్ధి పుట్టింది. దాని ఫలితమే నాకు కలిగిన ఎందరో గొప్ప మహమ్మదీయ, సూఫీ కవుల పరిచయము. ఆ ఆణిముత్యాలలో కొన్నిటిని తెలుగులో అప్పుడప్పుడు తర్జుమా చేసేవాడిని. వాటిని ఈమాట పాఠకులతో పంచుకోవాలన్నదే యీ ప్రయత్నపు ముఖ్యోద్దేశము. నా యెంపిక నా ప్రత్యేక యిష్టాయిష్టాలపైన ఆధారపడినది కాబట్టి అన్ని అనువాదాలు అందరికీ నచ్చక పోయినా, కొన్నైనా తప్పక స్పందన కలిగిస్తుందనే నమ్మకము నాకున్నది. కొన్ని కవితలను పద్యములుగా, మరి కొన్నిటిని పాటలుగా, ఇంకా కొన్నిటిని వచన కవితలుగా అందజేస్తున్నాను.

తెలుసా అని తెలుగు సాహిత్య వేదిక ఒక పదేళ్లకు ముందు అంతర్జాలములో ఉండేది. అందులో అప్పుడప్పుడు సమస్యాపూరణము నిచ్చేవారు. ఒకప్పుడు యివ్వబడిన సమస్య “సారా మానను, మాను టొప్పగునె, సచ్చారిత్ర భంగంబగున్”. దానికి నేను చేసిన ఈ క్రింది పూరణనే యీ వ్యాసానికి శీర్షికగా యెన్నుకొన్నాను.

ఔరా! యీ మధుశాల రమ్యవసుధాహర్మ్యమ్ము, యీ సౌధమం
ధారాధింతురు పానపాత్ర మది నత్యానందులై ప్రేమికుల్,
సారాయ మ్మత డిచ్చు ప్రేమరసమౌ, సారాయమే జీవమౌ,
సారా మానను, మాను టొప్పగునె, సచ్చారిత్ర భంగంబగున్!


ఇమాం అలీ సమాధి, నజాఫ్ నగరం

మహమ్మదీయులకందరికీ పవిత్రమైన గ్రంథము కొరాను. అది వారి దైనందిన జీవితాన్ని మాత్రమే కాదు, వారి కవిత్వాన్ని కూడ ప్రభావితము చేసింది. ఇరాక్ దండయాత్ర వలన మనకు పరిచయమైనది నజాఫ్ నగరపు పేరు. ఇది షియా శాఖకు చెందిన మహమ్మదీయులకు చాల పవిత్రమైన పుణ్య స్థలము. ఇక్కడ ఇమాం అలీ ఇబ్న్ తాలిబ్ యొక్క సమాధి ఉన్నది. ఇమాం అలీ దేవదూత మహమ్మదు యొక్క ప్రథమ శిష్యుడు. మహమ్మదు సోదరుని కొడుకు. అతని అల్లుడు కూడ. ఇతని కవితలు రెంటిని క్రింద ఇస్తున్నాను.

అల్పజీవులు కొందఱీ యవని పైన,
సత్కృతులు వారివి నిలుచు చాల యేండ్లు
చాల కాలము కొందఱు నేల పైన
బ్రదుకుచుందురు జీవచ్ఛవముల పగిది

వెలుగు నీడల చిత్ర మీ యిల నిజాన
నతిథి యొక రేయి యగుదు మీ యవని పైన
వర్ణమయ స్వప్న మగు మన బ్రదుకు లౌర
మెఱయు నాశా దిగంతాన మించు వోలె

అలీ మహమ్మదు యొక్క కూతురైన ఫాతిమాను పెండ్లాడెను. మహమ్మదీయులకు ఫాతిమా అతి పవిత్రమైన స్త్రీ. తన తండ్రి మహమ్మదు చనిపోయిన పిదప క్రింది భావమును వ్యక్తీకరించెనట.

ఆ సమాధిపై గాలులు మాసి పోని
తావి నిచ్చును సతతము పూవు వోలె
విధి యొసంగిన పెనుదెబ్బ వ్యధల నిచ్చి
దినములను రాత్రి జేసేను మనసు క్రుంగ

రాబియా

ఇరాకులో బాస్రా పురాతన కాలమునుండి నిలిచి ఉన్న పట్టణము. ఈ నగరపు సమీపమున యూఫ్రిటీస్ టైగ్రిస్ నదులు ఒకటవుతాయి. తరువాత దీనిని షతాల్ అరబ్ అని అంటారు. బాస్రా నగరము ఇరాకు దేశములో బాగ్దాద్ పిదప రెండవ ప్రసిద్ధ నగరము. జనాభా సుమారు 15 లక్షలు. బాస్రా నగరము కవులకు, కవిత్వానికి చాల ప్రసిద్ధి. ఇది ఇరాను దేశపు సరిహద్దులో నుండుటవలన జనులకు అరబీ భాషయే కాక పారసీక భాష కూడ పరిచితము. క్రీస్తు శకము ఎనిమిదవ శతాబ్దములో రాబియా అను కవయిత్రికి బాస్రా వాస స్థానము. ఈమెకు సూఫీ సిద్ధాంతమును అనుసరించు వారిలో ఒక అగ్ర స్థానము ఉన్నది. ఈమెకు సంగీతము, నాట్య కళలలో ప్రావీణ్యత ఎక్కువ. జీవితములో ఉన్నట్లుండి దైవభక్తి గలిగి తన శేష జీవితమును దైవ చింతలో గడపినది. ఈమె అవివాహిత. అరబీ మఱియు పారసీక భాషలలో కవిత్వమును రచించినది. ఈమెను మీరాతో పోల్చవచ్చును. ఆంగ్లములో ఈమె కొన్ని కవితల తర్జుమాకు నా తెలుగు సేతను క్రింద మీకు ఇస్తున్నాను.

నరకమున మండు యగ్నికి వెఱచి నిన్ను
కొలుతు నని నీవు సుంతైన తలతు వేని
నరకమున మండు మంటలో త్వరగ నీవు
మాడ నను పంపు మో దేవ వేడు చుంటి

స్వర్గమునగల సౌఖ్యాల సరసులోన
నీద నే నిన్ను పూజింతు నిచ్ఛ తోడ
నంచు నీవు తలతువేని యనఘ నన్ను
స్వర్గమును జేర నీయకు సత్యముగను

ప్రేమ లుప్పొంగ హృదయాన స్వామి యెట్టి
ఫలము కోరక నే నిన్ను దలతు నెపుడు
దివ్య సుందర ప్రభలను దేవ దేవ
చూప కుండకు వేచితి నోప లేను

తార లవి వెల్గ నిదురించె ధరణి యెల్ల
మూయబడె రాజ భవనాలు రేయి వేళ
ప్రేమికులు మాటలాడిరి ప్రేమ మీఱ
నిన్ను జూడ నేకాకిగా నిలిచి యుంటి

నీవు మనుజుడై జనియించి నీవలె నొక
నిర్దయను దేవ ప్రేమించ నేర్చుకొనుము
ప్రేమజీవుల విరహాలు, వెతలు, గాథ
లర్థమగు నీకు, నా ప్రేమ లర్థ మగును

రెండు విధములుగా బ్రేమింతు నే నిన్ను
ఒకటి – ముదము నాకు నొసగుచుండును సదా
రెండు – నీకు తగిన రీతి నొప్పు నదియు
నిన్నె దప్ప నొరుల నే దల్వ నొకటిలో
ఉచిత రీతిగ బ్రేమ నొసగు నప్పుడు నేను
కప్పిన తెరలెల్ల విప్పంగ జూతు నిన్
ఈ రెంటిలో నాకు నే గొప్పయును లేదు
రెంటిలోనను నీవె యుంటివి గొప్పగా