ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన

స్త్రీల రచనలు అనగానే మనకి మొల్ల రామాయణం ముందు కనిపిస్తుంది. కాని, తెలుగు కవయిత్రులు నోటిపాటలుగా తమ దృష్టిలో రామాయణం ఎలావుందో చెప్తూ చాలా పాటలు అల్లారు. అందులోది ఊర్మిళాదేవి నిద్ర. ఈ పాటలు రచించినవాళ్ళ పేర్లు మనకు తెలియవు. వాళ్ళ కవితా శక్తికి ఫెమినిస్టు భావజాలం తెలుగులో వ్యాపించిన తరువాత కూడా ప్రత్యేకంగా గుర్తింపు రాలేదు. జానపద వాఙ్మయం అనే ముద్దుపేరుతో ఇలాటి పాటల్ని చూసిన వాళ్లు కూడా ఇది కవిత్వం అని అనలేదు.

ఊర్మిళాదేవి నిద్ర తెలుగులోనే ప్రచారంలో ఉన్న కథలా కనిపిస్తోంది. ఆ మాట నిజమైతే, ఇది తెలుగు స్త్రీల సృష్టి. ఈ మాట నిజం కాక, ఈ కథ ఇతర భాషల్లో కూడా వున్నా, ఈ పాట నిస్సంశయంగా తెలుగు కవయిత్రి సృష్టి. ఈ పాట గుజిలీ ప్రతుల్లో అచ్చు వేసి తేదీల్లేకుండా, సి.వి.కృష్ణా బుక్‌ డిపో, ఎన్‌.వి. గోపాల్‌ అండ్ కో, ఇత్యాది ప్రచురణకర్తలు* ప్రచురించారు. దాదాపు 50 ఏళ్ళ క్రితం దేవేంద్ర సత్యార్థి అనే పంజాబీ ఆయన తెలుగు దేశంలో కొన్నాళ్ళుండి, ఏలూరులో ప్రఖ్యాత సాహితీపరులూ, చిత్రకారులూ ఆయనని అతిథిగా తీసుకొని ఆదరించగా, ఈ పాటని విని రాసుకుని, దీన్ని గురించి ఇంగ్లీషులో ఒక వ్యాసంగా ప్రస్తావించాడు (ది మోడర్న్ రివ్యూ, ఏప్రిల్ 1940). దాని మూలకంగా ఈ కథ భారతదేశంలో అప్పట్లో జానపద వాఙ్మయంలో పనిచేసే వాళ్ళ దృష్టిలో పడింది. దరిమిలా హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు 1955లో స్త్రీల రామాయణపు పాటలులో ప్రచురించారు. ఈ పుస్తకానికి కృష్ణశ్రీ అనే మారుపేరుతో రాసిన ఆలోచనాత్మకమైన ఉపోద్ఘాతంలో శ్రీపాద గోపాలకృష్ణమూర్తి ఈ పాటల కవితాగుణాన్ని మొదటిసారిగా గుర్తించారు. కోలవెన్ను మలయవాసిని 1986లో ఆంధ్ర జానపద సాహిత్యము, రామాయణము అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఈ పాటని గురించి వివరంగా చర్చించారు. ఆ తరవాత మలయవాసిని ఈ పాటని తమ ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఎలా పాడేవారో విని, వాళ్ళ దగ్గరనుంచి నేర్చుకుని పాడుతుండేవారు. ఈ పాట జ్ఞాపకం దాదాపుగా అంతరించిపోతున్న రోజులలో ఈ పాటని ప్రపంచానికి అచ్చులో తెలియపరచిన పూర్వ ప్రచురణ కర్తలకీ, విద్వాంసులకీ, పాటను తన పుస్తకంలో చర్చించి, పాడి వినిపించిన మలయవాసినిగారికీ ముందుగా నమస్కారాలు చెప్పాలి.

ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు. వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది. కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు. అలా ఒంటరిగా వదిలివేయబడ్డ ఊర్మిళా, అడివికి వెళ్ళిపోతున్న లక్ష్మణుడూ ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం లక్ష్మణుడు తన నిద్రని ఊర్మిళకిస్తాడు. ఊర్మిళ తన మెలకువని లక్ష్మణుడికిస్తుంది. తన భర్త అడివిలో ఉన్న పధ్నాలుగేళ్ళూ ఊర్మిళ నిద్రపోతుంది. లక్ష్మణుడు ఆ పధ్నాలుగేళ్ళూ పూర్తిగా మెలకువగానే ఉంటాడు. ఊర్మిళ భర్తృవిరహాన్ని అనుభవించనక్కర్లేకుండా, లక్ష్మణుడు తన భార్య జ్ఞాపకాన్ని మరిచిపోనక్కర్లేకుండా ఈ చమత్కారమైన ఊహ చేశారు తెలుగు ఆడవాళ్ళు.

స్త్రీల రామాయణపు పాటల నిర్మాణంలో ఓ ప్రత్యేకత ఉంది. అవి మన ఊళ్ళల్లో పెద్ద కుటుంబాల ఇళ్ళ నమూనాలో నిర్మించబడ్డాయి. ఆ ఇళ్ళల్లో మొదటి భాగంలో మగవాళ్ళే ఉంటారు. ఆడవాళ్ళు కనిపించరు. ఇంటి యజమాని గానీ, సేవకులు గానీ, అక్కడుండే వాళ్ళందరూ మగవాళ్ళే. ఇంటి మధ్యభాగంలో ఆడవాళ్ళూ, మగవాళ్ళూ సందర్భాన్ని బట్టి కలిసి కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఇంటి వెనక భాగంలోనూ, పెరట్లోనూ కేవలం ఆడవాళ్ళే ఉంటారు. అక్కడికి మగవాళ్ళెప్పుడూ వెళ్ళరు. చాలా అవసరమైనప్పుడు వాళ్ళు అక్కడికి వస్తున్నామని తెలియపరచి మగవాళ్ళు అక్కడికి వెళ్ళే సందర్భాలుండవచ్చు. కానీ ఇంటి వెనక భాగమూ, పెరడూ పూర్తిగా ఆడవాళ్ళ సామ్రాజ్యం. అక్కడ ఆడవాళ్ళు చుట్టుపక్కల అమ్మలక్కలను పిలిచి, విశ్రాంతిగా కబుర్లు చెప్పుకోవచ్చు. పాటలు పాడుకోవచ్చు, వామనగుంటలూ, వైకుంఠపాళీలూ ఆడుకోవచ్చు. ఇంటి మగవాళ్ళతో వొచ్చే కష్టాలు ఒకరికొకరు చెప్పుకోవచ్చు, వాళ్లని నిరభ్యంతరగా తిట్టిపొయ్యొచ్చు. ఊర్మిళాదేవి నిద్ర సరిగ్గా ఈ రకంగా నిర్మించబడింది. పాట ప్రారంభంలో శ్రీరాముడి పొగడ్తతో మొదలౌతుంది.

శ్రీరామభూపాలుడూ పట్టాభిషిక్తుడై కొలువుండగా
భరత శతృఘ్నులపుడూ సౌమిత్రి వరుస సేవలు సేయగా
మారుతాత్మజులప్పుడూ రాఘవుల జేరి పాదములొత్తగా
సుగ్రీవుడాకొలువులో కూర్మితో నమ్రుడై కొలువుండగా
… …
సకలదేవతలు గొలువా ఉదయాన పుష్పవర్షము గురిసెను

రామరాజ్యం అంతా సక్రమంగా ఉంది. అందరూ ఆనందిస్తున్నారు. ఆ సమయంలొ సీతాదేవి వచ్చి రాముడివైపు తిరిగి “రామమచంద్రా, మనం అడివికి వెళ్తున్నపుడు, లక్ష్మణుడితోపాటు ఊర్మిళ కూడా వొస్తానంది, అందుకు లక్ష్మణుడు ఒప్పుకోలేదు, అప్పటినించి ఆవిడ నిద్ర పోతోంది. లక్ష్మణుడిని వెళ్ళి ఆమెను లేపమనండి.” అని సవినయంగా మనవి చేస్తుంది. తాము అడివికి వెళ్ళిన రోజు మొదలుకొని ఊర్మిళ నిరంతరాయంగా నిద్రపోతోందని రాముడికి అప్పుడే తెలుస్తుంది. వెంటనే తమ్ముణ్ణి వాళ్ళావిడ దగ్గరికి పంపిస్తాడు, ముందు ఊర్మిళని నిద్రలేపి ఆవిడని సంతోషపరచమని. రామాజ్ఞ శిరసావహించి లక్ష్మణుడు అప్పుడు భార్య దగ్గరికి వెళతాడు. నిద్రపోతున్న ఊర్మిళ చీర సవరించి, ఆవిడ పక్కనే కూర్చుంటాడు. ప్రేమగా ఆవిడతో మాట్లాడడం మొదలు పెడతాడు.

కొమ్మ నీ ముద్దుమొగమూ సేవింప కోరినాడే చంద్రుడూ ….
అమృతధారలు కురియగా పలుకవే ఆత్మ చల్లన చేయవే

అ నిద్రలో తన గదిలోకి ఎవరో పరపురుషుడు ప్రవేశించాడనుకుంటుంది ఊర్మిళ.

తన్ను తా మరచియున్న ఆకొమ్మ తమకమున వణకదొడగే

ఆవిడ శరీరం భయంతో వణకడం మొదలవుతుంది.

ఇక్కడతో కథ ఒక్కసారిగా మారుతుంది. అంతవరకూ ప్రశాంతంగా వున్న వాతావరణం చెల్లాచెదురైపోతుంది. రామరాజ్య ధర్మం పటాపంచలై పోతుంది. ఊర్మిళ ఆ సందర్భంలో అనే మాటలు వింటే పరపురుషుడి చేత బలాత్కరించబడిన స్త్రీ ఎంత అసహాయ పరిస్థితిలో ఉంటుందో. తాను హింసకు గురై ఎలా చివరికి అపరాధిలా అందరిముందూ నిలబడాల్సి వస్తుందో గుండె చెదిరే లాగా బోధపడుతుంది.

ఊర్మిళ మొదట్లో ఆ ఆగంతక వ్యక్తిని గౌరవంగా ‘అయ్యా మీరెవ్వరయ్యా’ అంటూ ప్రశ్నిస్తుంది. తరవాత తనకున్న మగతోడు చాలా బలమైనదని నిబ్బరంగా చెప్పి అతన్ని భయపెట్టచూస్తుంది. ఊర్మిళ తన మగతోడుగా చెప్పుకున్న పేర్ల వరస చూడండి.

మాతండ్రి జనకరాజూ వింటె మిము ఆజ్ఞసేయక మానడూ
మా యక్క బావ విన్నా మీకిపుడు ప్రాణముల హాని వచ్చూ
మాయక్కమరది విన్నా మిమ్మిపుడు బ్రతుకనివ్వరు జగతిలో

మొదట తన తండ్రి జనక మహారాజు పేరు చెపుతుంది. ఆ తరవాత శ్రీరాముడి పేరు చెబుతుంది. ఆ తరవాతే తన భర్త పేరు చెబుతుంది. రాముడి పేరూ, తన భర్త పేరు తిన్నగా చెబుతుందా అంటే, చెప్పదు. మా అక్క మరిది అనీ, మా అక్క బావ అనీ అని గోప్యంగా చెబుతుంది. ఎందుకు? తెలుగు ఆడవాళ్ళు బావగారి పేరూ, భర్త పేరూ చెప్పకూడదు. ఒక పక్క తాను హింసపడే ప్రమాదం ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా తెలుగు కుటుంబాల ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా మసలవలసిన నిర్బంధంలో ఉన్నారో ఈ పాట సున్నితమైన మాటల్లో, కొరడాతో కొట్టినంత చురుక్కుమనిపించేలాగా చెబుతుంది. ఆ మాటల వల్ల తనని హింసించబోయే ఆ దుర్మార్గుడు తగ్గే అవకాశం లేదని బోధపడ్డాక ఊర్మిళలో దైన్యం మొదలౌతుంది. ఇక ఆ మాటలు కూడా పనిచేయకపోతే ఊర్మిళ తన నిస్సహాయత్వాన్నీ, అశక్తతనీ తలుచుకుని బాధ పడుతుంది.

హెచ్చయిన వంశానికీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ
కీర్తి గల ఇంట బుట్టీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ

అంటే ఆ బాధ తన శరీరానికీ మనసుకీ కలగబోయే దారుణమైన హింసగురించి కాదు – తాను మెట్టిన ఇంటికీ, పుట్టిన ఇంటికీ రాబొయే అపకీర్తి గురించి. స్త్రీ ఇలాంటి హింసకి గురి అయితే, లోకం ఆవిణ్ణే నిందిస్తుంది. అప్పటికి, ఇప్పటికీ కూడా తెలుగు లోకపు స్థితి ఇదే. ఇక తనకున్న ఒకే ఒక అవకాశం ఆ దుర్మార్గుడికి మంచి బుద్ధి కలిగేలా చెయ్యటం.