నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు

సీ. ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ
            రా పురవీధుల గ్రాలగలదె
      మణిమయంబగు భూషణ జాలములనొప్పి
            ఒడ్డోలగంబున నుండగలదె
      అతి మనోహరలగు చతురాంగనల తోడి
            సంగతి వేడ్కలు సలుపగలదె
      కర్పూర చందన కస్తూరి కాదుల
            నింపు సొంపార భోగింపగలదె

గీ. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర
       వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి
       సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె
       జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము

నర్తనశాల సినిమాలో ఘంటసాల గానం చేసిన ఈ పద్యం చాలామంది విని వుంటారు. భారతం విరాటపర్వం లోనిది ఈ పద్యం. కవి తిక్కన సోమయాజి. సందర్భం ఉత్తర గోగ్రహణ సమయంలో కురుసేనను కకలావికలం చేసి, దుర్యోధనుణ్ణి ఓడించి, అతని ఎదురుగా నిలిచి, అతన్ని ఉద్దేశించి అర్జునుడు ఎగతాళిగా ఎత్తిపొడుస్తూ చెప్పిన మాటలు ఇవి.

తిక్కన సోమయాజి పేరు చెప్పగానే ఆయన కవిత్వమూ, కథా విధానమూ గొప్ప నాటకీయంగా ఉంటాయని అందరూ కంఠోక్తిగా చెప్తారు. కవనంలో నాటకీయత ఆయన జీవలక్షణంగా ఉగ్గడిస్తారు. నిజమే. పై పద్యం అందుకు గొప్ప తిరుగులేని సాక్ష్యం. కానీ, నాటకీయత ఒక్కటే ఆయనలో అన్నిటికన్నా ప్రధానమైనదని చెప్పడం నిజాన్ని కొంతవరకు చెప్పడం మాత్రమే. నా దృష్టిలో ఉచితజ్ఞత అనేది తిక్కన మహాకవి కవిత్వంలో స్పష్టంగా గోచరించే సుగుణం. భాష విషయంలో కాని, పాత్రలను రూపు కట్టించే తీరులో కాని, ఎక్కడా మోతాదు దాటనీయని సంయమనం ఆయనకే చెల్లింది. పదిహేను పర్వాల బృహత్కవిత్వంలో ఎక్కడా తన ఇష్టాయిష్టాల ఛాయ సోకనివ్వలేదు. ఏ పాత్ర ఎడ కించిత్తు రాగద్వేషాలు కనపర్చలేదు. కవిత్వపు తామరాకు మీద నీటిబొట్టు లాగా నిల్చిన కవి తిక్కన. అఖండమైన మేధ, ప్రతిభ గల మహామనీషి అయినా ఆ పాండిత్య ప్రతిభను కవిత్వంలో గుప్పిద్దామని ప్రయత్నించలేదు. అలా అని ఆయన కవిత్వం పాండిత్యపు సొగసు లేనిదని అర్థం కాదు. సన్నివేశాలకు ఎంత సౌందర్యం అవసరమో, ఎంత ప్రాగల్భ్యత అవసరమో అంతే పొందు పరిచాడు. మహాప్రతిభాశాలురైన పెద్దన, శ్రీనాధుడు పద్యం పద్యంలో తన పాండిత్యప్రకర్షనూ, వ్యక్తిత్వాన్నీ నింపి గొప్ప కవిత్వాన్ని సృష్టించారు కాని, తిక్కన అలాంటి చాపల్యానికి లొంగని సంయమనాన్ని పాటిస్తూనే, ఉజ్వలమైన కవిత్వాన్ని అందించాడు.

ఇక భాష విషయంలో ఆయన ఎక్కువ తెలుగు పదాలకే ప్రాముఖ్యం ఇచ్చాడని అందరూ ఎరిగినదే. కొంచెం ఉద్రేకము, ఆర్భటి తెలపాల్సిన సందర్భాలలో సహజంగా మృదువైనది, మాధుర్యవంతమైనది అయిన తెలుగు కన్నా సంస్కృత పదాలు వాడడమే ఉచితం అనిపించినప్పుడు అవే వాడాడు. “భీష్మ ద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు, దుర్యోధన గ్రీష్మాదిత్య పటుప్రతాపవిసరాకీర్ణంబు, దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్” – లాంటి పద్యాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి. ఏ పదాలు సందర్భోచితంగా రసదృష్టినీ, రససృష్టినీ, రసపుష్టినీ కలిగిస్తాయో బాగా తెలిసిన కవి తిక్కన.

పై పద్యంలో గొప్ప నాటకీయత ఉంది. గొప్ప ఉపాలంభన ఉంది. ఈ రెండూ పైకి కనిపించేవి. కానీ పాదం పాదం వెనకా ఒక బాధితుడి ఆక్రోశం వుంది. పదమూడు సంవత్సరాలుగా తమ కష్టార్జితాన్ని తమకు కాకుండా చేయడమే కాక, అడుగడుగునా ఘోషయాత్ర పేరుతోనో, గోగ్రహణం పేరుతోనో కవ్విస్తూ వచ్చిన దౌష్ట్యాన్ని అంతవరకూ భరిస్తూ వచ్చి, ఇక భరించాల్సిన అవసరం లేదని తెలిశాక ఒక్కసారిగా తన సర్వశక్తులూ విప్లవించబోయే ఒక మహా పౌరుషశాలి తెగింపు వుంది. ఏ కారణం వల్ల అయితేనేం ఇంతకాలం తల వంచి కూర్చున్నా, ఇప్పటిదాకా తమను పదపదానా పరిభవిస్తున్న వారిపై తిరగబడగలిగిన అవకాశం వచ్చిందని నింగికెగిరి రెక్కలు సారించే డేగ గరుత్తుల క్షేళాధ్వని వుంది. గుడ్డిరాజు కోసం తమ తండ్రి కొంత సంపాదించి ఇస్తే, తమ సోదరులు రాజసూయం కొరకు నలుదిక్కులకూ పోయి సంపాదించుకొని వచ్చిన సర్వసంపదలను ఎవడో అనుభవిస్తుండగా, తాము కందమూలాలు తింటూ, అడవుల్లోనో, పరాయి పంచల్లోనో అగచాట్లు పడుతున్న దుస్థితి ఎడ బాధ – దురాక్రమణదారుని పట్ల తీవ్రమైన ద్వేషమూ, అక్కసూ వుంది. పద్యం చూడండి. ప్రతి పాదంలోనూ దుర్యోధనుడు అనుభవిస్తున్న భోగాలను పేర్కొని ఎత్తిపొడిచాడు అర్జునుడు. “సింగంబు ఆకటితో గుహాంతరమునం జేడ్పాటు మైనుండి, మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చిన” రీతిగా అర్జునుడున్నాడని ద్రోణుడు ఎంతో అద్భుతంగా వర్ణిస్తాడు.

బృహన్నల నుంచి యథాపూర్వునిగా రూపాంతరం చెందిన అర్జునుడు అంతకు ముందు ఒక సంవత్సరం క్రితమే తన తపస్సుతోనూ, పరాక్రమంతోనూ శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని కైవసం చేసుకొని వచ్చాడు. నేరుగా స్వర్గానికి పోయి ఇంద్రునికి సాధ్యం కాని కాలకేయ నివాత కవచ రాక్షస సంహారం నిర్వహించాడు. స్వర్గ సింహాసనం మీద, ఇంద్రునితో పాటు సగభాగమ్మీద గొప్ప యోగ్యతతో కూర్చుని వచ్చాడు. ఇదంతా, తర్వాత జరిగి తీరబోయే యుద్ధానికి సన్నద్ధం కావడం కోసం చేసిన ప్రయత్నమే. ఆ బృహత్ప్రయత్నానికి నాందీప్రస్తావన లాగా ఉత్తర గోగ్రహణ యుద్ధం జరిగింది. జమ్మిచెట్టు మీది ఆయుధాలకట్టలోంచి లేచొచ్చిన గాండీవం లాగా, ప్రతికూల పరిస్థితుల్లోంచి అవకాశం దొరకగానే పైకెగసిన పార్థుడు, తానే ఒక గాండీవమైపోయాడు. అప్పుడతనికి రథమెలాంటిది, సారథి ఎవరు – ఇవన్నీ అల్పవిషయాలు. అక్కడ, ఆ మహాసముద్రం లాంటి కౌరవసేన ఎదురుగా నిల్చున్నది ఒక ఆక్రోశము, తెగింపు, తిరుగుబాటు, నిస్సీమమైన పరాక్రమము రూపుగట్టిన ఒక ఆజానుబాహుమూర్తి. అతను తన కార్యాన్ని జయప్రదంగా నిర్వర్తించి, ఓడిపోయిన దుర్యోధనుణ్ణి సంబోధించే సందర్భం – ఈ పద్యం.

ఏనుగునెక్కి ఆపక్క, ఈ పక్క ఏనుగులు నడుస్తుండగా రాజధాని వీధుల్లో రాజసం ఒలకబోస్తూ ఊరేగడం కాదు. రత్నమాణిక్య హారాలనూ, ఆభరణాలనూ ఒంటినిండా వేసుకొని సింహాసనం మీద కూర్చుని హొయలు పోవడం కాదు. పెత్తనం ఉంది గదాని అందగత్తెలను రప్పించుకొని వారితో కులకడం కాదు. తేరగా వచ్చిన సుగంధ ద్రవ్యాలతో భోగాలు అనుభవించడం గాదు. ఇప్పుడు నీ గతి చూసుకో. అసలు నీకు సిగ్గనేది ఉంటే ఎక్కడన్నా పడి చావు. తొల్లింటి చూఱగలదె (చూఱ అంటే కొల్ల, దోచుకోవడం) – ఇంతకు ముందు లాగా ఇంకా కొల్లగొడదామనుకుంటున్నావేమో – ఇక్కడ నీ జూదపుటెత్తులు పనిజేయవు సుమా. ఇదీ పద్యభావం. నిజానికి పై వివరమంతా చెప్పాల్సిన పని లేదు. పద్యం చదువుతుంటేనే జ్వరతీవ్రతతో శరీరం వేడెక్కుతున్నట్టుగా పఠితకు పద్యభావంతోటి తాదాత్మ్యత ఎక్కిపోతూ వుంటుంది. “జూదమిక్కడ ఆడంగరాదు సుమ్ము” అని ఆఖరు పాదం చెప్పడం, పద్యంలోని నాటకీయతకు ఎంత అందమైన కొసమెరుపు నిచ్చిందో గమనించారు గదా.

నాటకీయమైన రచన అనుకుంటున్నాం కాబట్టి, మరో రెండు సన్నివేశాలని ఉటంకిస్తాను. కర్ణపర్వంలో దుశ్శాసన వధ ఒకటి. మరొకటి భూరిశ్రవుని సంహారము. దుర్యోధనుడు నిలువు కళ్ళు వేసుకుని దిగ్భ్రమతో చూస్తూ ఉండగా – ఉర్వీపతి చూచుచుండ అని ప్రతిజ్ఞ – భీముడు దుశ్శాసనుని కింద పడవేసి మోకాలితో తన్ని పట్టి ముఖం మీద కత్తి ఝుళిపించి గుండెలు చీల్చి రక్తం దోసిటితో నోటి దగ్గరకు తీసుకునే దృశ్యం – చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అలానే, భూరిశ్రవుడు సాత్యకిని ఓడించి చంపడానికి కత్తి పైకెత్తగా దూరం నుంచి చూసిన అర్జునుడు కత్తినెత్తిన అతని చేతిని బాణంతో నరికేస్తాడు. ఈ దుర్ణయానికి కినిసిన భూరిశ్రవుడు ప్రాయోపవేశానికి కూర్చుంటాడు. ఈ అదనులో కింద పడివున్న సాత్యకి లేచి ధర్మజుడు, అర్జునుడు ఒద్దు ఒద్దు అని అరుస్తున్నా వినక భూరిశ్రవుని తల నరికేస్తాడు. ఈ భూరిశ్రవుడు భీష్ముని పినతండ్రి మనుమడు. ఈ సన్నివేశాలని ఎంతో ఉద్విగ్నభరితంగా, అద్భుతంగా రూపుకట్టించాడు తిక్కన. వాచవి కోసం వీటిని ఎత్తిచూపాను.

అప్పటికి యవ్వనంలో ఉన్న ఎన్. టి. రామారావు (ముప్ఫైలలో ఉన్నాడేమో) అర్జునుడి ఆహార్యంలో అభినయిస్తుండగా – ఇంత అందమైన తిక్కన సోమయాజి పద్యాన్ని – అసలు పద్యం అనేది ఎలా పాడాలో తెలిసిన ఘంటసాల తన మధురగళంతో ఆలాపిస్తుండగా, వింటూ చూడడమూ, చూస్తూ వినడమూ జరిగిన క్షణాలు, ఆహా నా తెలుగు భాష ఎంత కమ్మనిది అనుకుంటూ గుండెలు ఉప్పొంగజేసుకున్న క్షణాల్లో కొన్ని! నాకు నచ్చిన ఈ పద్యం మీకూ తప్పక నచ్చుతుంది.