కవిత్వంలో శ్రీశ్రీ ప్రస్థానం, పరిణామం

[న్యూ జెర్సీ తెలుగు కళా సమితి దీపావళి వేడుకల్లో భాగంగా 20 నవంబర్ 2010న నిర్వహించిన శ్రీశ్రీ శతజయంతి ప్రత్యేక సాహితీ సమావేశంలో ఇచ్చిన ప్రసంగపు వ్యాసరూపం.]


శ్రీ శ్రీ 1930-1940 మధ్యకాలంలో వ్రాసిన ‘మహాప్రస్థానం’ లోని కవితలు ఒక బలీయమైన నిరసన లోంచి వచ్చినవి. ఈ నిరసన ఒక సాంద్రమైన డీప్లీ ఫెల్ట్ ఎమోషన్. ఒక తాత్వికచింతన ననుసరించి వచ్చిన నిరసన కాదు. అంతక్రితం వరకు వచ్చిన, వస్తున్న కవిత్వం సమాజంలో తాడితుల, పీడితుల వేదనలకు స్పందించకుండా వుండటంపై వచ్చిన నిరసన. ఇది మహాశక్తిమంతంగా వెల్లువలా, జ్వాలలా వచ్చింది. ఆయన కవిత్వంలో కూడా అంత బలీయంగానూ వెల్లువయింది. అంచేతనే చలం గారన్నట్లు ఈ సంకలనం లోని కవితలు కత్తులుగా, ఈటెలుగా, మంటలుగా, బాధలుగా తిరుగుబాట్లుగా, యుద్ధాలుగా బహిర్గతమయ్యాయి. తనకు, పాఠకునికి మధ్య అక్షరాలు అడ్డుగా నిలవకుండా ఆయన గుండెలోని ఆవేశాలు, ఆక్రందనలు, ఆకాంక్షలు పాఠకుల గుండెల్లోకి మహా వేగంగా చీల్చుకుంటూ దూసుకపోతవి. ‘మహాప్రస్థానం’ లోని అత్యధికమైన కవితలు ఈ వేగం, ఈ ఊపు కలిగి వుంటవి. వెనుకచూపు లేనే లేకుండా “పదండి ముందుకు, పదండి ముందుకు” అంటూ పిడికిలి బిగించి కదను త్రొక్కుతూ విరుచుకపడుతుంటే, అడ్డంకులన్నీ బేజారెత్తి పటాపంచలై పారిపోతవి. పాఠకులని జ్వలించే మూర్తులుగా ప్రభావితం చేస్తవి.

ఇంతటి శక్తి ఆ కవితలకుండటానికి కారణం కవి ఆవేశస్ఫూర్తి, శబ్దశక్తి, అనుభూతుల నిజతత్వ నిరూపణకు వ్యక్తీకరణ మాధ్యమాలుగా వాడిన పదచిత్రాలు. శ్రీశ్రీ తన ఆవేశావిష్కరణకు మాధ్యమాలుగా వాడే పదచిత్రాలు, పాఠకుల్ని కదిలించి ఊగించే బలం కలవి. సజెస్టివ్ పవర్ గలవి. మహాప్రస్థానం కావ్యంలో అదే పేరు గల మొదటి ఖండిక యొక్క భావవేగం, శబ్దసౌష్టవం, పదచిత్రాల నిర్మాణ ప్రౌఢిమ, అది సాధించిన మనోహరమైన లయ కావ్యానికే తలమానికంగా నిలబడుతవి. అల్లంత దూరంలో ఉన్న దోపిడీ లేని ప్రపంచం లోని ప్రేమ, స్నేహం, సమత, సౌభ్రాతృత్వ పునాదుల మీద లేచిన సమాజం చేరడానికి పిలుపు, మేల్కొలుపు ఈ మహాప్రస్థానం. ఈ ప్రస్థానం సులభం కాదు. అందుకే కృతనిశ్చయంతో సర్వత్యాగాలకు సిద్ధపడి అవసరమైతే గుండె నెత్తురుల తర్పణ చేస్తూ బాటలు, పేటలు, కోటలు, నదులు, కొండలన్నిటినీ అతిక్రమించి గమ్యం చేరటానికి గొంతెత్తి పిలిచే ‘క్లారియన్ కాల్’ ఈ గీతం. ఆశయసిద్ధి కోసం పురోగమించే పోరాటయోధుల అచంచల విశ్వాసం ‘కదం తొక్కుతూ పదం పాడుతూ’ అనడం లోనే ఆయుధాలు చేపట్టి వీరావేశంతో ముందుకు సాగే జనసందోహం దృశ్యమానమవుతుంది. మిలిటరీ బాండ్ సంగీతాన్ని స్ఫురింపజేసే లయతో చరణాలు కదం త్రొక్కుతవి.

“మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరోప్రపంచం పిలిచింది.
పదండి ముందుకు
పడండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి!
….దారి పొడవునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు
బాటలు నడచీ
పేటలు కడచీ
కోటలన్నిటిని దాటండి.
నదీనదాలు,
అడవులు,కొండలు
ఎడారులా మనకడ్డంకి?

‘ఎడారులా మనకడ్డంకి’ అనడంతోనే అడ్డంకులేవీ లేవని నిర్లక్ష్యంగా స్ఫురింపజేయడం మంచి ధ్వనిప్రాయంగా జరుగుతుంది. ‘ప్రభంజనం వలె హోరెత్తండీ/ భావవేగమున ప్రసరించండీ’ అనే ఉద్బోధకు తగినంత వేగంతో అప్రతిహతంగా గీతం ముందుకు సాగుతుంది. ఆ ముమెంటంకు ‘త్రాచులవలెనూ రేచులవలెనూ ధనుంజయునిలా సాగండి’ లాంటి పదచిత్రాలతో ఒక అపూర్వమైన ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఈ సంకలనానికి ధ్యేయ, దిశానిర్దేశం జేస్తుంది ఈ ప్రారంభ కవిత. అలాగే ‘జయభేరి’లో చక్కని చిక్కని, ఉర్రూతలూగించే కవితా ప్రస్థానం సాగుతుంది.

నేను సైతం/ ప్రపంచాగ్నికి/ సమిధనొక్కటి/ ఆహుతిచ్చాను
నేనుసైతం/ ప్రపంచాబ్జపు/ తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం/ భువనభవనపు/ బావుటానై/ పైకిలేస్తాను

అలాగే గంటలు, అమూర్తం, భిక్షువర్షీయసి, అభ్యుదయం, మిధ్యావాది, ప్రతిజ్ఞ (ముఖ్యంగా కాల్చే ఆకలి కూల్చే వేదన/ బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ/ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని), కవితా ఓ కవితా, నవకవిత, కేక, గర్జించు రష్యా, నిజంగానే (బానిసల సంకెళ్ళు బిగిసే/ పాడు కాలం లయిస్తుందా? సామరస్యపు, సోదరత్వపు/ సాధుతత్వం జయిస్తుందా), నీడలు, జగన్నాధుని రధచక్రాల్ (ద్రోహాలని కూలగొట్టి/ దోషాలను తుడిచిపెట్టి/ స్వాతంత్ర్యం/ సమభావం/ సౌభ్రాత్రం,సౌహార్దం/ పునాదులై ఇళ్ళు లేచి/ జనావళికి శుభం పూచి); ఈ కవితలన్నీ గొప్ప కవితలు. ఉర్రూతలూగించే కవితలు. అలజడిని, ఆక్రోశాన్ని, ఆందోళననీ, కలిగించి గుండెలను మండించే కవితలు. రసానందాన్ని కలిగించే కవితలు.

మహాప్రస్థానం, లండన్ ప్రచురణకు ‘నా మాట’ శ్రీశ్రీ వ్రాస్తూ అంటారు: “ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను ‘సామాజిక వాస్తవికత’ అంటారనీ దీనికి వెనుక దన్నుగా ‘మార్క్సిజం’ అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు.

‘నా మాట’ ముగిస్తూ శ్రీశ్రీ ఇలా అంటారు: “మహాప్రస్థానంలో అభ్యుదయకవిత్వము, విప్లవ బీజాలు ఉన్నాయి.విప్లవసాహిత్యం లేదు” అని.

విప్లవసాహిత్యం అంటే ఏంటి? సామాన్యప్రజానీకాన్ని విప్లవాచరణకుద్యుక్తులని జేసే విధంగా సాగేదే! మహాప్రస్థానం వ్రాసే రోజుల్లో సామాజిక వాస్తవికత గురించీ, మార్క్సిజం గురించీ శ్రీశ్రీకి తెలియకపోవటమే మంచిదయింది. తన చుట్టూ ఉన్న సమాజ స్థితిగతులకు చిత్తశుద్ధితో, ఆర్ద్రమైన హృదయంతో స్పందించి వ్రాయబట్టే తన భావుకతకు తోడుగా గొప్ప శబ్దశక్తి, అనుభూతి నిజతత్వ నిరూపణ, వ్యక్తీకరణ మాధ్యమాలుగా శక్తివంతమైన పదచిత్రాలను వాడబట్టే, గొప్ప లయను రచనలో సాధించబట్టే ఆయన గొప్ప కవిత్వం, ఎన్నటికీ మరువలేని కవిత్వం వ్రాయగలిగారు. మార్క్సిజానికి, విప్లవసాహిత్య అలంకారిక కట్టుబాట్లకు ఆయన లోనైన తర్వాత కవిగా ఆయన స్వతంత్రం కోల్పోయారు. సిద్ధాంత ప్రవచనం తన కర్తవ్యంగా స్వీకరించి, తన కవితా వ్యాసంగంపై మార్క్సిస్ట్ సిద్ధాంతానికి పెత్తనం అప్పజెప్పారు. ఆయన దృక్పధంలో సాహిత్యప్రయోజనానికి, సాహిత్యమార్గానికి సంబంధించి ఈ మార్పు వచ్చిన తర్వాత కవిత్వరచనలో శిల్పం యొక్క ప్రాధాన్యతను దాదాపు త్యజించినట్లుగా భావించవచ్చు. ‘శ్రీశ్రీ సాహిత్య విమర్శ దృక్పధం’పై జూన్ 10, 2010 ప్రజాసాహితి సంచికలో కాత్యాయనీ విద్మహే అంటారు: ” ‘కాదేదీ కవితకనర్హం,అవునవును శిల్పమనర్ఘం’. సాహిత్యవస్తువు ఏదైనా కావచ్చు. సాహిత్యంగా దానిని నిర్మించే తీరుకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రారంభంలో శ్రీశ్రీ శిల్పవాది. చెప్పటంలోని చమత్కారం మీదనే దృష్టి. సంవిధానమే సమస్తమూ అనుకునే దశలో ఎలా చెబుతున్నాననే దానికి ప్రాధాన్యతనిచ్చారు. కళ కళ కోసమే అనేవారి దంతప్రాకారంలో జీవిస్తూ అందులోంచి బయటపడి ప్రజలకోసమే కళ అనే నిశ్చయానికి ప్రయత్నపూర్వకంగా వచ్చినవారు శ్రీశ్రీ.”

కళ కళ కోసమే అనే మహాసూక్తిని ఎందుకో మహా మేధావులు కూడా సరిగా అర్ధం చేసుకోలేదనిపిస్తుంది. కళ కళ కోసమే అనడం కళ ప్రజల కోసమే అనేదానికి వ్యతిరేకం కాదు. జాగ్రత్తగా గమనిస్తే ప్రజల కోసమే కళ. అంటే మొదట దేనినైతే మనం కళ అని పిలవదలచుకున్నామో అది కళ కావాలి కదా. కవిత్వం ద్వారా గానీ, లేదా ఇతర సాహిత్య రూపాల ద్వారా కానీ చెప్పదలచుకున్న వస్తువు లేదా విషయం కళగా మారాలి కదా! అది కళగా మారాలి అంటే అది కొన్ని నిర్దుష్టమైన విషయ నియమాలకూ, విధానాలకూ అనుగుణంగా శిల్పసౌందర్యాత్మకమైన, గుణాత్మకమైన మార్పులకు లోనై తీరాలి. లేకపోతే అది కళ కాదు. కళ కాని దానిని కళ అని పిలిచి ఇది ప్రజల కోసం అనడం అసంబద్ధమయిన విషయం. కళ కళ కోసం కానిది ప్రజల కోసం కానేరదు. కారణం కళ కళ కోసం కానప్పుడు అది కళే కాకుండా పోతుంది. ప్రజలను చైతన్యవంతులనే చేయటం ధ్యేయమైతే దానికి కవిత్వమే ఉపయోగించక్కరలేదు. వారికర్ధమయ్యే భాషలో, సరళమైన రీతిలో కరపత్రాలు రచించి, వారు నిరక్షరాస్యులైతే వారిని చిన్న చిన్న కూటములుగా చేర్చి సరళమైన భాషలో సూటిగా మాట్లాడి చైతన్యవంతులను చేయవచ్చు. చక్కగా అర్ధమయ్యే భాషలో చెప్పవచ్చు. కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలంటే వారినది ఆకట్టుకోవాలి. అంటే వినేట్లు లేదా చదివేట్లు చేయాలి. దానిలో ఒక ఆకర్షణ, అందం అంతర్లీనంగా వుండి తీరాలి. కవిత్వం కాని అక్షరాలు కవిత్వంగా నిష్ప్రయోజనం.

మాట్లాడినపుడు కూడా కళ యొక్క ప్రభావం నిబిడీకృతమై ఉంది. కళకు ప్రభావం లేకుండా చేయటం అసంభవం. ఏ రకమైన కమ్యూనికేషన్ విధానంలోనైనా రీతికి ప్రాధాన్యత ఉంటుంది. దానినెవ్వరూ విచ్ఛిన్నం చేయలేరు. రీతిని విస్మరిస్తే నిర్జీవమైన కవిత్వం, నిర్జీవమైన ఇతర సాహితీ రూపాలు, నిర్జీవమైన ప్రసంగాలు మాత్రమే ఉంటవి. ఇళ్ళు ప్రజల కోసమే. కానీ ఇళ్ళు కట్టే రీతిలో నియమభంగం కాని రీతి ఒకటి ఉండాలి కదా! లేకపోతే అది కుప్పకూలి పోతుంది. కళ కూడా అంతే. అంచేత మానవసమాజానికి నీతి ఎంత ముఖ్యమో, రచనకు ముఖ్యంగా సృజనాత్మక రచనకు రీతి అంత ముఖ్యం.

పైనుదహరించిన వ్యాసంలోనే కాత్యాయనీ విద్మహే అంటారు: “కవిత్వం జీవితానికి వ్యాఖ్యానంగా ఉండాలని భావించే శ్రీ శ్రీ కవిత్వాన్ని సౌందర్యంతో ముడిపెట్టి చూసే దృష్టిని విమర్శకు పెట్టారు. అసౌందర్యం ఒక జీవిత వాస్తవం. అది అసలు లేదనుకోవడం భ్రమ అయినా కావాలి; ఆత్మవంచన/ పలాయనవాదం అయినా కావాలి. సౌందర్యారాధకుల అసౌందర్య వ్యతిరేకతను శ్రీశ్రీ నిరసించాడు. అసౌందర్యాన్ని సాహిత్య వస్తువుగా చేసుకుని దాని పట్ల అసహ్యం కలిగించేట్లు వ్రాస్తే – దాని నిర్మూలనకు ప్రేరణలు సమకూడి సత్యసుందరాత్మక ప్రపంచనిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది కనుక అది గొప్ప సాహిత్యం అవుతుందని…” పేర్కొన్నారు. అసౌందర్యం జీవిత వాస్తవికత అయితే అసౌందర్యవ్యతిరేకత కూడా జీవిత వాస్తవమే. శ్రీశ్రీ దృష్టిలో ధ్యేయం ‘సత్యసుందరాత్మక ప్రపంచనిర్మాణ’మని రూఢిగానే చెప్పినట్లయింది. ఈ నిర్మాణానికి మార్గంగా ‘అసౌందర్యాన్ని సాహిత్యవస్తువు’గా చేసికొనడం బాగానే ఉంది. ‘దానిపట్ల అసహ్యం కలిగించేట్లు వ్రాయాలనే సంకల్పం’ కూడా బాగానే ఉంది.కానీ, అసౌందర్యం యడల అసహ్యతను కలిగించే విధంగా వ్రాయడమంటే అసహ్యంగా వ్రాయడం కాదు. దానిలోని అసౌందర్యతను అది అసహ్యించుకోవలసినదిగా స్థిరముద్ర పాఠకుని మనసుపై వేసేటట్లు వ్రాయడం. అంటే వినసొంపుగానే రాయాలి. అపుడే అది అసహ్యతను చూపించగలుగుతుంది.

ఎవరైనా అర్ధం లేకుండా మాట్లాడారని మనం నిరూపించదలచుకుంటే మనం అర్ధం లేకుండా మాట్లాడి నిరూపించలేం. మనం నిరూపించదలచుకున్న అర్ధరాహిత్యాన్ని పదిమంది నిరసించేలా చేయాలంటే మనం చాలా అర్ధవంతంగా మాట్లాడి మాత్రమే చేయగలం. ‘సత్యసుందరాత్మక ప్రపంచనిర్మాణం’ శ్రీశ్రీ కోరుకుంటున్నారంటే ఆయన అసౌందర్య వ్యతిరేకతను నిరసించినట్లు ఎలా అవుతుంది? ఆయన భావనలో గందరగోళం ఉంది. రచనా రీతిలో వైరుధ్యాలు ఉన్నాయి.