రెండు కవితలు

1. ఇంట్లో తూనీగ

హాయిగా జాగిలపడి
సాగని కవితను
గజిబిజిగా కొట్టేస్తూ
నీళ్ళల్లో కూచున్న
బాతు బొమ్మ చేస్తుంటే
దోవ తప్పి ఇంట్లోకి
వచ్చిందో తూనీగ.

కలం మీద వాలి
జ్.. జ్.. మని రెక్కలార్చి
పుస్తకం మీదకి దూకి
వ్రాత బల్ల అంచున
నిల్చుందది చివరికి.

తలుపులన్నీ తెరిచినా
కిటికీలన్నీ తీసినా
బయటకు పోదేమీ
వెర్రి తూనీగ?
ఇదిగో నా తల చుట్టూ
తిరుగుతూనే ఉన్నది.

2. యాపిల్లోంచి యాపిల్

గుర్రాన్ని దౌడు తీయిస్తూ
గుర్రంలాంటి అబ్బాయి
యాపిల్ పళ్ళ బుట్టతో
యాపిల్లాంటి అమ్మాయి

గుర్రం మీద అబ్బాయికి
ఎదురుగా
యాపిల్ పండు అమ్మాయి
వస్తే
గుర్రం ఆగిపోయింది
యాపిల్ పళ్ళు దొర్లిపోయాయి

అమ్మాయి గుర్రం ఎక్కి మాయమైయింది
అబ్బాయి యాపిల్ పళ్ళు ఏరుతూ కూచున్నాడు
చుక్కలు పొడిచేదాకా.

రోజులు గడిచాయి
ఏళ్ళూ దొర్లాయి
చుక్కలు రోజూ పొడుస్తూనే ఉన్నాయి

ఓ రోజు అబ్బాయి
పచ్చ గడ్డిలో పడుకుని
చుక్కల్ని చూస్తూ
విచారంగా
ఓ యాపిల్ని కోస్తే
ఆశ్చర్యం!

యాపిల్ పండులోంచి
యాపిల్ అమ్మాయి
గుర్రం ఎక్కి
బయటికి దూకి
వచ్చింది!