ప్రజాపతి

[ఆస్థికులకు ఒక ముందుమాట: హృషీకేష్ లో ఉన్న దివ్య జీవన సంస్థాపకులు, శ్రీ శివానంద సరస్వతి గారి శిష్యులైన చిదానంద గారి మాటల్లో భగవంతుడు ఏదైనా తల్చుకుంటే, అది ఒక్క మైక్రో సెకండ్ ఆలస్యం లేకుండా జరుగుతుంది. అంటే ఏదైనా చెయ్యాలనుకోవడం అది జరగడం ఒకే సారి అవుతాయి. స్వర్గంలో ఇద్దరు దేవతలు కృష్ణావతారం కధలు విని యశోదమ్మ అదృష్టానికి కొంచెం అసూయ పడి అలాంటి అదృష్టం పట్టడానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ నారదుల వార్ని కల్సుకున్నారు. నారదుల వారి రికమెండేషన్‌తో అయ్యవారి దగ్గిర అపాయింట్మెంట్ సంపాదించేరు. ఇంక చదవండి. – రచయిత.]

విష్ణువు యోగనిద్రలోంచి బయటకొచ్చి, చిరునవ్వు నవ్వుతూ చూసేడు దేవతలిద్దరికేసి, ‘చెప్పండి ఏమి ఇలా వచ్చేరు’ అన్నట్టు; లోపల తెలియదా తనకి వాళ్ళెందుకొచ్చారో? దేవతలకి నోరు పెగలదే? చేతులు ఆడవేం? కనురెప్పలు కదలవే? రావడమైతే వచ్చేరు కానీ మాట పెగల్లేదు దేవతలిద్దరికీ విష్ణువుని చూసాక. ధృవుడికి మొదటిసారి నోరు పెగిలింది కాదు ఇందుకేనేమో. హనుమంతుడి దగ్గిరా కుప్పిగంతులు?

అప్పుడే గుమ్మం దగ్గిర అలికిడైంది. విష్ణువు, అమ్మవారు వెంటనే శేషతల్పం మీదనుంచి కిందికి దిగి, సనక సనందనాదులకి స్వాగతం పలికేరు. దేవతలిద్దరూ కూడా వెళ్ళి స్వాగతించేరు.

“మనోభీష్ట సిధ్ధిరస్తు,” అని పిల్లల చతుష్టయం దీవించారు. ఆశ్చర్యపోవడం దేవతల వంతైంది.

మునులను వెళ్ళనిచ్చి, మహావిష్ణువు అడిగేడు మళ్ళీ, “చెప్పండి, ఏమిటి ఇలా వచ్చేరు?”

“మిమ్మల్ని పెంచిన యశోదమ్మ అదృష్టానికి అసూయపడుతూ అలాంటి మాతృత్వం మాలాంటి వాళ్ళకు ఎలా పడుతుందా అని అడగడానికొచ్చేం” చెప్పేరు ఇద్దరూ ముక్త కంఠంతో.

“మీరిద్దరూ ఇక్కడకి వచ్చేముందే నేను భూలోకంలో మరో జన్మ ఎత్తవల్సిన అవసరం అవసరం పడింది. అదే క్షణంలో మీ ఇద్దరికీ అలాంటి ఆలోచన వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మీరిద్దరూ నన్ను కనడం కుదరదు కనక ఒకళ్ళు నన్ను కనవచ్చు, రెండో వాళ్ళు నన్ను పెంచవచ్చు, రోహిణీ, యశోదలు చేసినట్టే. అయితే ఎవరికేది కావాలో మీరే నిర్ణయించుకోవచ్చు. కానీ కోరుకునే ముందు ఒక్కమాట. భూలోక జన్మ అంటే, అసహ్యమైన చీము, నెత్తురూ ఓడుతూ అనేకానేక అశుధ్ధాలు కలగలుపుగా ఉంటాయి. జన్మ నిచ్చే తల్లి తొమ్మిది మాసాలు దాదాపు చిత్రవధ అనుభవించాల్సి వస్తుంది. తర్వాత పెంచే తల్లికి కూడా జీవితం అంత సాఫీగా ఉండదు, పిల్ల ఆలనా పాలనా చూడడం అంత సులభం కాదు. యశోదమ్మ ఎన్ని పాట్లు పడిందో మీకు తెలిసే ఉంటుంది. మరొక్క మాట. ఈ సారి జన్మలో నేను సర్వసంగ పరిత్యాగిని కాబోతున్నాను. అంటే నేను చెప్పకుండా ఇల్లు విడిచి పోతే ఓర్చుకోగల్గి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరు నాకు జన్మ నిస్తారు? ఎవరు జీవితంలో సాకుతారు?”

దేవతలిద్దరూ ఆశ్చర్యాలతో మొహాలు చూసుకున్నారు. ఏమీ విష్ణుమాయ? తమ ఆలోచనలు గ్రహించడమే కాదు అప్పుడే అవి ఆచరణలో పెట్టేస్తున్నాడు! తెలుస్తోందికదా భగవద్విభూతి అంటే ఏమిటో?

“నేను మిమ్మల్ని నవమాసాలు మోయడానికి సిద్ధం కానీ చాలా కాలం భూమి మీద బతకడానికి సిద్ధంగా లేను” చెప్పింది మొదటి దేవత.

“అయ్యో నేను కనడం, సాకడం కూడా చేద్దామనుకున్నానే. మహా విష్ణువు నా కడుపున పుడుతూంటే ఆ మాత్రం ఓర్చుకోలేనా నేను?” రెండో దేవత చెప్పింది ఆదుర్దాగా.

“సరే మీ ఇద్దరి కోరికలూ నెరవేరుతాయి, వెళ్ళిరండి,” యోగనిద్రలోకి జారుకున్నాడు పరమాత్మ.

“మునులు మనోభీష్ట సిధ్ధిరస్తు అన్నారు. నువ్వు జన్మనిస్తే నేను కూడా కనడం ఎలా కుదురుతుంది? రెండో దేవత అడిగింది మొదటి దేవతని అయోమయంగా.

“బలరాముడ్ని కన్నట్టే అవ్వొచ్చు కదా?” చెప్పింది రెండో దేవత.

దేవతలు వెళ్ళగానే అమ్మవారు నవ్వుకుంది లోపల, ‘ఈయన సర్వసంగ పరిత్యాగా వచ్చే జన్మలో? నేను లేకుండా ఎలా బతుకుతాడో చూద్దాం,’ అనుకుంటూ. అయ్యవారు కూడా యోగనిద్రలో మందహాసం చేసాడు ఈ ఆలోచనలు గ్రహించి. ఇవేమీ తెలియని, శంఖ చక్రాలూ, శేషసాయి విచారంగా మొహాలు పెట్టారు మళ్ళీ భూలోకంలో ఇంకో జన్మ గురించి వినగానే.

దేవతలిద్దరూ భూలోకంలో జన్మించి పెరిగి పెద్దయ్యి ఒకే రాజుని పెళ్ళిచేసుకున్నారు. గ్రహాలు ఉఛ్ఛ స్థితుల్లోకి రావడంతో పావులు కదపబడుతున్నాయి. నారదుడి నారాయణ స్మరణం, సరస్వతి వీణమీద సామగానం ఆహ్లాదంగా జరుగుతూండగా ఇంద్రుడు మొదటి సంకేతనం పంపించేడు. దాన్ని పట్టుకుని బయల్దేరిన ఐరావతం పెద్ద రాణీకి ఓ రోజు కలలో ఆరు దంతాలతో తన గర్భంలోకి ప్రవేశిస్తున్నట్టూ కనిపించింది.


అసిత మహాముని కోట ద్వారం దగ్గిర నుంచుని “మహారాజుతో చెప్పండి నేను వచ్చానని. పుట్టిన బిడ్డని చూడాలనుకుంటున్నానని.” పాలకులతో చెప్పేడు. పది నిముషాల్లో అసితుడు పుట్టిన బిడ్డ పక్క నుంచుని నిశితంగా చూసేడు కుర్రాడికేసి.

“జన్మనిచ్చిన తల్లి ఎలా ఉంది ఇప్పుడు?” అడిగేడు రాజుకేసి తిరిగి.

“మునీంద్రా, బిడ్డ పుట్టిన ఏడో రోజునే రాణి గతించింది.”

మందహాసం చేసేడు అసితుడు అర్ధమైందన్నట్టుగా. “మరి బిడ్డనెవరు సాకుతారు?”

“ఇంకొక రాణిగారు ఉన్నారండి,” రాజు పక్కనున్న సేవకులు చెప్పేరు. మళ్ళీ చిరునవ్వే సమాధానంగా వచ్చింది అసితుడి దగ్గర్నుంచి.

“ఒకసారి ఆ రాణిని పిలవండి. నేను చూడాలి”

రాణి వచ్చేక చెప్పేడు అసితుడు, “అమ్మా బిడ్డనిచ్చిన మాతృమూర్తి జీవితం ధన్యమైంది. ఆవిడ పని తీరిపోయింది. ఇంక వంతు నీది. ఆవిడ కన్నా ఎక్కువ కష్టం నీది. కానీ గుర్తుంచుకో ఈ బిడ్డ విశ్వానికంతటికీ గురువు కాబోతున్నాడు. నీ జన్మ తరించే మార్గం చెప్పేది కూడా ఇతడే. పెంచడంలో జాగ్రత్త. ఏమాత్రం ఏమరుపాటు కూడదు.”

“ధన్యోస్మి. అంతగా చెప్పాలా? వీడే నా కొడుకు పుట్టినప్పటినుండి.”

ఉయ్యాలలో ఉన్న బిడ్డని ఆపాదమస్తకం పరిశీలించి ఉన్న ముఫ్ఫైరెండు అద్భుత లక్షణాలు గమనించేడు అసితుడు. మొదట బిడ్డ కాళ్ళు పట్టుకుని తలకి ఆనించుకుని నమస్కారం చేసేక మళ్ళీ ఒక చిరునవ్వు నవ్వేడు. వెంటనే ఏదో గుర్తుకొచ్చి సాలోచనగా చూసి కణ్ణీళ్ళు తుడుచుకున్నాడు పైబట్టతో. మహారాజు కంగారు పడ్డాడు, ఇది చూసి.

“అయ్యా, బిడ్డకేమీ ఫర్వాలేదు కదా? మేమందరం అసలే రాణీ పోయిన బాధలో ఉన్నాము. ఇంకొక విపత్తు తట్టుకోలేము. మీరు ఎందుకలా కళ్ళు తుడుచుకుంటున్నారు?”

“మహారాజా ఏమీ భయం లేదు. ఈ బిడ్డ నీ వంశానికే కాదు, విశ్వ జగత్తంతటికీ దారి చూపించబోతున్నాడు. అందుకే ఎవ్వరికీ నమస్కారమైనా చేయని నేను ఇతని కాళ్ళకి నమస్కారం చేశాను. కానీ ఈ బిడ్డ పెరిగి పెద్దయ్యేసరికి నేను ఉండను చూడడానికి. అంచేత నా దురదృష్టం తల్చుకుని ఏడుపొచ్చింది.”

“ఏమి పేరు పెట్టమంటారు?” సంతోషంతో అడిగేడు శుద్ధోధన మహారజు.

“సిద్ధార్ధ. అంటే ఏది పొందితే ఇంకేమీ పొందక్కర్లేదో, అటువంటి దాన్ని పొందే వాడు, ఇంక శెలవు.” బయటకి కదిలేడు అసితుడు.

“సిద్ధార్దుడు పుట్టిన సమయానికే కోళీయుల్లో పుట్టిన పాప, దూరంగా పుట్టిన ఇంకో మగపిల్లవాడు, కంటకి అనే గుర్రం, కాలుదాయి, చెన్నుడు అనే వాళ్లూ పుట్టేరు కదా? సరి సరి, వీళ్ళందరి లెఖ్ఖా సరిగ్గానే ఉంది కానీ నా వంశంలో ఎవరేనా బాగు పడతారా?” రాజమార్గంలో నడుస్తూ ఆలోచించేడు అసితుడు, “ఈ బిడ్డ చెప్పేవి వినడానికి నేను ఉండను. నేను సన్యాసిని కనక నాకున్న ఒక్క మేనల్లుడు పెరిగి పెద్దయ్యేసరికి వినడానికి అర్హుడు.” ఆలోచిస్తూ మేనల్లుడిని కలుసుకోడానికి బయల్దేరేడు. ఎదురొచ్చి అసితుడ్ని లోపలకి తీసుకెళ్ళేడు మేనల్లుడు.