ఒంటిచెట్టు

వార్ధితీరంబునందున్న పల్లె యద్ది
కర్షకులును, జాలరు లాదిగాఁ గలట్టి
జానపదులకు నయ్యది జన్మభూమి,
వారి భాగ్యంబు పండెడు వసుధ యద్ది.

ఊరికి నన్నిదిక్కుల దృగుత్సవముం బొనరించుచున్న వి
స్తారపుఁ బంటచేలు హరితద్యుతిమంతములౌచుఁ గూర్చు సిం
గారము మీర గ్రామరమ గారుడవర్ణపు మేల్మిచీర నిం
డారఁగఁ దాల్చియుండెనొకొ యన్న వితర్కముఁ గన్నవారికిన్.

కడలియందునఁ జినచిన్నపడవలందు
తరణమొనరించి తద్గ్రామ దాశవరులు
వలిపవలలను నీటిలోపలను బన్ని
పట్టుకొనుచుంద్రు చేప లవ్వారిగాను.

అతులితవేగవంతముగ నంబుధితీరమునుండి వీచు మా
రుతతతిచేత సాంద్రముగ ప్రోత్థితమై సికతాచయంబు సం
తతముగ పంటచేలఁ బడి నష్టము సేయుటఁ గాంచి, యా మరు
త్ప్రతతినిరోధమార్గము వితర్కమొనర్చి జనంబు లచ్చటన్.

కలసికట్టుగ గుములౌచుఁ గడలికడను
గగనమంటఁగఁ బెరుగంగఁ గల్గునట్టి
లక్షకెక్కుడు దేవదార్వంకురముల
నాటి, రక్షణసేసి రవ్వాటినెల్ల.

క్రమముగ నా ప్రరోహములె కాండపుచేవను గాంచి , నాకలో
కమును స్పృశించుచుం బెరిగి, కంధిజమారుతజాతతీవ్రనా
శమును హరించుచు న్వెలసె; సత్త్వసమంచితసస్యపూర్ణమై
యమరెను క్షేత్రముల్, ప్రజ లనామయులున్, సుఖవంతులైరటన్.

తనయులు తండ్రులై పరగఁ దండ్రులు తాతలునై చనంగ, నా
జనపదమందు శాంతముగ జారెను కొన్నితరంబు, లత్తఱిన్
జనులు సుఖంబునన్మనిరి; సస్యము లెల్లను బండె మెండుగన్,
వననిధిమీనసంతతు లవారిగ నబ్బెను ధీవరాళికిన్.

అట్లు మూఁడుపూవు లాఱుఫలములుగ
సౌఖ్యదంబు నగుచు సకలజనుల
కా జనపద మందె నభివృద్ధి నిత్యంబు
ధరణికంఠహారతరళమట్లు.

అంతట నొక్కరాతిరి మహాపద తారసిలెన్, ధరిత్రి త
త్ప్రాంతము నందు నూయల విధంబున భూరికరాళశబ్దవి
భ్రాంతము నౌచు నూఁగె, సురవర్త్మము నంటుచుఁ బెల్లురేగి గ్రా
మాంతికసాగరోర్ములు రయంబుగఁ బొర్లుచుఁ గప్పె గ్రామమున్.

నాగలోకస్థు లున్మత్తులై ప్రేల్చిరో
         బలమైన ఉదజని బాంబు ననఁగ,
భర మోపఁజాలక పడవైచెనోక్రింద
         ధాత్రినిన్ శ్రాంతదిగ్దంతు లనఁగ,
గాజుగోళం బట్లు కాశ్యపీగోళంబు
         వ్రక్కలించెనొ యేదొ బలమనంగ,
భూమిగోళంబుతో బొంగరమ్ములకేళి
         నెరపుచుండెనొ కాలపురుషుడనఁగ,

మృత్యుదేవతాఘోటకహ్రేషవోలె
దారుణంబగు మర్మరధ్వనులతోడ
వ్రక్కలై భూతలంబెల్లఁ బగులువాఱఁ
గలిగె భూకంప మానాటి క్షణదయందు.

ఉవ్వెత్తుగా లేచి ఉప్పరంబంటుచున్
ఉచ్చండరయముతో నూర్ములంతట సాగి
పథమందుఁ గల సర్వవస్తువుల లోగొంచు
విలయతాండవమాడె వికృతారవంబుతోన్.

నిలయంబులందునన్ నిద్రించు జనులకుం
         బ్రాప్తమయ్యె జలసమాధి యపుడు,
నోరులేని పశుసందోహంబులకు నెల్లఁ
         బంచత్వసిద్ధియే ప్రాప్తమయ్యె,
కారులుపడవలుం గడలిగర్భంబులో
         నాచూకి లేక మాయమయిపోయె,
ఉన్నతసౌధంబు లునికింత కనరాక
         నేలమట్టంబుగాఁ గూలిపడియె,

ఎచటఁ జూచిన విలయంబె మృత్యుముఖమె,
ఎచటఁ జూచిన నార్తులే, ప్రచురశోక
రవములే, వృక్ణదేహసంస్రస్తరక్త
రంజితాధ్వంబులే తోఁచె గ్రామమందు.