జపనీస్‌ పైన్‌ చెట్టు

ఒక్క చెట్టు.
ఒకే ఒక్క చెట్టు.
నూరడుగుల ఎత్తు ఎదిగి ‘నింగీ నేలా చేరువకి’ తెచ్చిన చెట్టు.

జపనీస్‌ దేవదారు వృక్షం.
ఒక్క చెట్టే మిగిలింది.

అతని1 పూర్వీకులు, తాత ముత్తాతలు 70,000 చెట్లు పాతారు, రెండు శతాబ్దాల క్రితం, ఆ చిన్న ఊరు2 సముద్ర తీరాన.


పైన్ చెట్టు, రికుజెన్‌తకటా గ్రామం, జపాన్.
(ఇంటర్నెట్ ఆర్కైవుల నుండి.)

ఇప్పుడు ఆ ఒక్క చెట్టే మిగిలింది.

మార్చ్‌ 11న చెట్టంత ఎత్తున అలలతో వచ్చిన ఉప్పెన రెండువేల పైచిలుకు జనాభాతో పాటు రెండువందలఏళ్ళ నుంచీ ఉన్న దేవదారు తోపుని కూడా కడుపున పెట్టుకుంది. ఒక్క చెట్టు మినహా!

అతను ఒకప్పుడు బడి పంతులు.
ఇప్పుడు వానప్రస్థంలో ఉన్న అరవైఏడేళ్ళ మొండి ప్రాణి. అందరితో పాటూ అతని ఇల్లూ ఉప్పెనలో కొట్టుకొనిపోయింది. దూరంగా కొండల్లో తాత్కాలిక నివాసం.

వారంలో మూడునాలుగుసార్లు ఆ ఊరికి వచ్చి మిగిలిన ఆ ఒక్క చెట్టు భోగట్టా కనుక్కుంటాడు.
ఆ చెట్టు అలా నిలబడిఉండటం చూసినప్పుడల్లా అతని మనసు కుదుట పడుతుంది.
‘మన ఊరు తప్పకుండా పుంజుకోగలదు,’ అన్న ధైర్యం వస్తుంది.

ఈ మధ్యకాలంలో ఆ ధైర్యం కొంత కుంటుపడింది.
ఆకుపచ్చగా ఉండాల్సిన ఆకులు ఎర్ర పడటం మొదలయ్యింది.
చెట్టు వంగి వంగి కుంగుతున్నది.

ఆ ఒక్క చెట్టూ కూడా చచ్చిపోతుందేమోనన్న అనుమానం.
అతనికి, ఆ ఊరి జనాభాకీ, ఆ చెట్టు ‘ఆదర్శమే’ కాదు.
ఆ ఊరి జనాభా పట్టుదలకి ఆ ఏకాకి దేవదారు ‘నిదర్శనం’ కూడా.
ఆ చెట్టు, ఆ ఊరికే కాదు, మొత్తం దేశానికే నిదర్శనంగా మారింది.

ఏదో రకంగా ఆ చెట్టుని బ్రతికించాలి.
చెట్టు వేళ్ళు దృఢమైనవే. ఎంతో లోతుగా పాతుకోపోయినవే.
“ధరను చొచ్చి, దివిని విచ్చి విరులు తాల్చు తరువు,” అని కవి వాక్యం.

అయితేనేం?
ఉప్పెన తెచ్చిన ఉప్పునీరు వేళ్ళ చుట్టూ చేరుకుంది. వేళ్ళ బలిమి సడిలింది.
“మూలాల్ని ప్రశ్నించే గాలికి కూలుతాయి మహా వృక్షాలు,” అన్నట్టుగా!
గాలే కాదు, నీరు కూడా వేళ్ళని సడలిస్తుంది.

‘క్రౌన్‌’ అనే ఒక పద్యంలో కే రయన్‌ (Crown by Kay Ryan. May 22, 2000; The New Yorker.) అంటుంది:

Too much rain
loosens trees.

In the hills giant oaks
fall upon their knees.

You can touch parts
you have no right to –
places only birds should fly.

“చిగిర్చే చెట్టుకి ఎగిరే పిట్ట ఆదర్శం.”

చెట్టు ప్రతీకగా వాడిన సందర్భాలు ఋగ్వేదకాలం కాలంనుంచీ ఉన్నాయి.

మన జపనీస్‌ దేవదారు చెట్టు గురించి చెప్పుకుందాం.

ఉప్పు నీళ్ళు వేళ్ళ చుట్టూ చుట్టుకొనిపోయాయి కదూ! ఇక ఈ చెట్టు బతకదులే అని వదిలెయ్యచ్చు. మనం ఎన్ని వనమహోత్సవాలు చూడలేదు! ఎన్ని చెట్లు బతికున్నాయి? అయినా ఎవరిక్కావాలి ఈ విషయాలు?

అతను, ఆ ఊరి జనాభా అలాగని అనుకోలేదు. సైంటిస్టులని సంప్రదించారు. చెట్టు క్రింది భాగం చుట్టూ బ్యాండేజీలు కట్టించారు. చెట్టు చుట్టూ పదహారడుల లోతుగా కందకం తవ్వి, ఇకముందు సముద్రపునీరు వేళ్ళదాకా పాకకండా కైసాన్‌ కట్టారు. ఉప్పునీరు తోడి, మంచినీరు తెచ్చి నింపారు. ఏమైనా సరే, ఈ చెట్టుని బతికించాలనే పట్టుదల.

మా ఊళ్ళో పేకాట క్లబ్బులో స్కూటర్లు పెట్టుకోడానికి అడ్డంగా ఉన్నదని డెబ్భై అడుగులెదిగి నిటారుగా నిలబడ్డ యాభై ఏళ్ళ నిద్రగన్నేరు చెట్టుని ఒక్క ఉదుటున కొట్టేసి, నేలంతా సిమెంటు చప్టా చేయించారు. (చూ : క్లబ్బులో చెట్టు కథ) ఎవరి అవసరాలు వాళ్ళవి; ఎవరి పట్టుదల వారిది! ‘చచ్చిపోయిన నా చెట్టుని కథలో బతికిద్దామనుకుంటున్నారా మీరు?’ అని రాసిన కవి గారి ఉత్తరం స్ఫురణకొచ్చింది.

మార్చ్‌ ఉప్పెన తరువాత, ప్రధానమంత్రి ఆ ఊరికి వస్తే, ముందుగా అతన్ని ఆ చెట్టు దగ్గిరకి తీసుకొని పోయాడు ఆ వూరి మేయరు. ఉప్పెనలో అతని భార్య చనిపోయింది.

మళ్ళీ అదే జాతి దేవదారు చెట్లని ఆ సముద్ర తీరాన పాతటానికి ఆ ఊరి జనాభా ఏకకంఠంగా వాంఛిస్తూన్నది.

ఆ దేవదారు తోపు చరిత్ర చిత్రమైనది. దిగువ వరిపొలాలకి ఉప్పుజల్లు, ఇసక రాకండా కాపాడటానికి ఆనాడు 70,000 చెట్లు సముద్రతీరాన పాతారు. ఊరు చూడటానికి వచ్చిన యాత్రికులు ఆ తోపు చూడకండా తిరిగి వెళ్ళేవారు కాదు. ఊళ్ళో వయసొచ్చిన యువతీ యువకులు చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవాళ్ళు, ఆ తోపులో! ఊళ్ళో పెద్దవాళ్ళు సాయంత్రం షికారుకెళ్ళేవాళ్ళు, ఆ తోపులో. జాగింగ్‌ చేసే వాళ్ళ సంగతి చెప్పనక్కరలేదు. ఆ ఊరి సాకీసారాయం ప్రసిద్ధికెక్కింది. తరతరాలుగా ఆ ఊళ్ళో తయారైన సోయా సాస్‌ ఆ ఊరికే గర్వ కారణం.

ఇవన్నీ ఒక ఎత్తు; నూరడుగులెత్తెదిగిన 70,000 దేవదారు చెట్లున్న తోపు మరొక ఎత్తు.

మరి, ఆ ఒక్క చెట్టూ చచ్చిపోతే, ఆ చరిత్ర అంతా మరుగునపడిపోదూ! పట్టుదల ఒక్కటే చెట్టుని బతికించగలదా? ఏమో, మరి.

జాయిస్‌ కిల్మర్‌ పద్యం (Trees by Joyce Kilmer, 1914) గుర్తుకొస్తున్నది:

Think that I shall never see
A poem lovely as a tree.

A tree whose hungry mouth is prest
Against the earth’s sweet flowing breast;

A tree that looks at God all day,
And lifts her leafy arms to pray;

A tree that may in Summer wear
A nest of robbins in her hair;

Upon whose bosom snow has lain;
Who intimately lives with rain.

Poems are made by fools like me
But only God can make a tree.

(“చిలకలు వాలిన చెట్టు లోతైన కావ్యం లాంటిదని,” అంటాడు కవి.)

ఆ ఊరి చరిత్ర గుర్తుగా ఆ చెట్టుని బతికించాలనే పట్టుదల. పట్టుదలతో పాటు, ఈ ఒక్క చెట్టూ బతకదేమోనన్న భయం కూడా లేకపోలేదు.

“ఇంకా ఇరవై ముప్ఫై సంవత్సరాలు పట్టినా సరే, మళ్ళీ ఆ దేవదారు తోపు మా ఊరికి తేవాలి,” అంటాడు అతను. 67 సంవత్సరాలు నిండిన అతను.

“మర్రిగింజల్ని పాతు,
నీడల కనురెప్పలు విప్పుకొని
నేత్ర విస్తీర్ణాలై మొలుస్తాయి.

కొబ్బరి బొండాల్ని పాతు.
రహస్య తటాకాలపై
సహస్ర నౌకలు తేలతాయి.” అని కవి హృదయం.


సుమారు నాలుగు నెలలనుంచీ మార్చ్‌ 11 న జపానులో సునామి, భూకంపం పై వచ్చిన వార్తలు చదివింతర్వాత. వాల్‌ స్ట్రీట్ జర్నల్‌, వాషింగ్‌టన్‌ పోస్ట్, మొదలైన పత్రికలలో వచ్చిన వార్తలు, వ్యాసాలు ఈ వ్యాసానికి ఆధారం. ఏ తెలుగు కవి రాసిన కవితల్లో పదాలు స్వేచ్ఛగా వాడుకున్నానో ఈమాట పాఠకులకి చెప్పనవసరం లేదనుకుంటాను.

1. Yasumori Matsuzaka.
2. Rikuzentakata, Coastal town of Northeast Japan.