మాచల

ఎవరీ సుందరి? ఉర్వరాపతితతారేశప్రియామూర్తియో!
అవనిం జేరినవాణియో! స్మరమనోహారిప్రియారత్నమో!
నవలారూపము గొన్ననాట్యకళయో! నార్యాకృతిం బొల్చు వా
సవకేళీవనపారిజాతలతికాసమ్మోహనాకారమో!

నవ్వుల వెన్నెలల్ గురియ నాట్యము సల్పెడు నీ లతాంగి వే
రెవ్వతె కాదు కాకతిమహీపతిమానసమానసంబునన్
మవ్వము మీర నెన్నడును మ్లానత నందక విస్ఫుటంబునై
నివ్వటిలంగఁ బోలు నవనీరజ మీ చెలి మాచలా*ఖ్యయే..

ప్రన్ననౌ లతవలె సున్నితంబగు మేన
         పట్టుచుంగుల రంగువల్వ గట్టి,
కర్ణయుగ్మము నంటఁ గడుసోగలై సాగు
         నయనంబులం దంజనంబు వెట్టి,
అర్ధచంద్రునిఁ బోలు నలికమ్మునందునన్
         కమ్మకస్తురితిలకంబు వెట్టి,
ఎలతుమ్మెదలదిమ్ముఁ దలపించు ధమ్మిల్ల
         మున సుమదామకంబులను గట్టి,

పాదయుగముననాలక్తపంకమొలయ,
పాణితలముల గోరింటవన్నె మెఱయ,
కాలియందెల గజ్జెల క్వణముతోడ
మేఖలాంచితకింకిణుల్ మేలమాడ,

మాచల యొక్కనాఁ డనుపమంబగు నర్తకివేషమూని రౌ
ప్యాచలనాట్యలోలగిరిజాకృతి గొండ్లిని సల్పఁ గొల్వులోన్
ఆ చెలి నాట్యమంజిమను, అన్నువ నెంచి ప్రతాపరుద్రుఁడున్
పూచిన మావిగున్నవలెఁ బొంగుచు నుత్కటరాగదీప్తిచేన్.

ఘనసంభ్రమంబునం జని రత్నఖచితమై
తనకంఠమం దున్న తపనీయహారంబు
మాచలాదేవి గళమందునం గైసేసి
రాచనట్టువగ నా రమణినిం దీవించె.

ఆవిధిఁ గాకతీయవిభుఁ డాదరమొప్పఁగఁ గంఠహారమున్
గ్రీవమునందు నుంచుతఱిఁ గీల్కొను చూపులుచూపు లేకమై
భావజభావవల్లరికి పందిరి గట్టఁగఁ గొంతవట్టు వ్రీ
డావశులౌచుఁ బుత్త్రికలడంబున నిల్చిరి వారలచ్చటన్.

రాగరసప్లుతంబులగు రమ్యవిలోకనపంక్తు లీగతిన్
సాగి పరస్పరాస్యజలజంబులనుండి క్రమక్రమంబుగన్
మూఁగగ నాపదాంతముగ, పొన్‌జిగి మీఱెడి వారిమేనులన్
ప్రోగులుగట్టి నిక్కెను సముద్గతమై పులకాంకురంబులున్.

అట్టు లాలోకనోద్భూతమైన రాగ
మంతకంతకుఁ బరివృద్ధి నందసాగె;
ఏఁగె వత్సరంబులు గాని యింతయేని
పరువ ముడుగని పూవయ్యె వారి ప్రేమ.

పను లొకవేయి యున్న నెడఁబాయక చూడఁగ వచ్చు నిత్య మా
వనరుహలోచనన్ ప్రభువు; వచ్చిన వల్లభు మ్రోల నాడు నూ
తనకుతుకమ్ముతోడ భరతప్రతిపాదితనాట్యరీతులుం,
దెనుగుల దేశిపద్ధతులు దీరిచి కూర్చిన నాట్య మామెయున్.

ఆ వనితామతల్లిక సమంచితకౌశలవృత్తి నృత్తర
త్నావళిలోని భంగిమల నాట్యము సేయఁగఁ గాంచి కాకతి
క్ష్మావిభుఁడొందు సంతసము – స్వర్గణికాగణనాట్యమంజిమన్
ద్రావఁగ వేయికన్నులను దాలిచి యున్న సురేంద్రుకైవడిన్.

కావ్యనాటకసంగీతకళలయందు
పండితుండైన కాకతిప్రభున కామె
కావ్యనాటకసంగీతకళలయందుఁ
దనరు పాండితిచేత మోదంబు గూర్చు.

పరిణతబుద్ధులైన వరపండితవర్గముతోడ, సత్కవీ
శ్వరవిసరంబుతోడఁ బ్రతిభాసితమైన ప్రతాపరుద్రభూ
వరుని సదస్సులం దెలమిఁ బాల్గొనవచ్చిన వాణియో యనన్
సరసిజగంధి పాల్గొనును సారవచఃపరిపాక మేర్పడన్

దైహికసుఖంబునకె యంకితంబు గాక
జ్ఞానవినిమయపథమున సాంద్రమగుచు
వాణివాగీశసఖ్యంబు పగిది వారి
ప్రణయబంధంబు పరమమై పరిఢవిల్లె.

వారిచరిత్ర సత్కవుల పాలిటి కయ్యెను కావ్యవస్తువే,
వారిచరిత్ర నాటకుల పాలిటి కయ్యెను యక్షగానమే,
వారిచరిత్ర గాయకుల పాలిటికయ్యెను గేయవృత్తమే,
వారి చరిత్ర నేటికిని బాటిలఁజేయు గగుర్పు విన్నచోన్.


* మాచలాదేవి కాకతీయ చక్రవర్తి యైన రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాననర్తకి, గణిక, ఆతని ఉపపత్నియును. ఆమె నాట్యమేకాక సాహిత్యశాస్త్రములందును పండితురాలై విద్వజ్జన సంకులమైన ప్రతాపరుద్రుని కవిపండితగోష్ఠులలో పాల్గొనుచుండెడిది. వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామములో నీయమ వర్ణన మున్నది. అందులోని పద్యాలలో ఆమె వైదుష్యమును దెలుపునదీ క్రింది పద్యము:

శా.
ద్వీపాంతంబుననుండి వచ్చితివె? భూదేవా! “ప్రశాంతం మహా
పాపం” సర్వ జగత్ప్రసిద్ధ సుమనోబాణాసనామ్నాయ వి
ద్యోపాధ్యాయి, ప్రతాపరుద్ర ధరణీశోపాత్త గోష్ఠీ ప్రతి
ష్ఠాపారీణ, నెఱుంగవయ్యెదవె మాచల్దేవి వారాంగనన్?

ఆమె జీవితకాలములోనే ఆమెకు, చక్రవర్తికి గల ప్రణయ మితివృత్తముగా గల నాటకము లోరుగంటిలో నాడుచుండిరి. ఆ విషయమును దెల్పునదీ క్రింది పద్యము:

తే.గీ.
లెస్సగాక కిరాట!యీ లేమ చరిత
మాడుదురు నాటకంబుగ నవనిలోన,
దీనిఁ జూడంగఁబోదమా? యీ నెపమున
నరసి చూతము మనకేమి యచట? ననుచు.