నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం

మ.    తలమే బ్రహ్మకు నైన నీ నగ మహత్వంబెన్న నే నియ్యడన్
         గల చోద్యంబులు ఱేపు గన్గొనియెదన్ గాకేమి నేడేగెదన్
         నళినీ బాంధవ భానుతప్త రవికాంతస్యాది నీహార కం
         దళ చూత్కార పరంపరల్ పయి పయిన్మధ్యాహ్నముందెల్పెడిన్

ఈ పద్యం అల్లసాని పెద్దన వ్రాసిన మనుచరిత్రము అనే పేరు గల స్వారోచిష మనుసంభవము లోనిది. ఇది తెలుగు పంచకావ్యాల్లో మొదటిది. పెద్దన వ్రాసినది ఈ ఒక్క కావ్యమే. ఆయనకు ఆంధ్రకవితా పితామహుడు అనే అన్వర్థమైన బిరుదు లభించినది ఈ కావ్యం వల్లనే. శ్రీ కృష్ణదేవ రాయల ఆస్థానంలోని అష్ట దిగ్గజాల్లో ప్రథముడు పెద్దన. ఆ కాలంలోనేమి, ఇవ్వాళ కూడా కవిలోకంలో అనుపమాన కాంతితో వెలిగే గొప్ప కవి అల్లసాని పెద్దన. “పెద్దన్న వడపోత పోసిన ఇక్షు రసంబు” అని విశ్వనాథ చేసిన ప్రశంస కేవలం సహజోక్తియే. మార్కండేయ పురాణం లోని ఏమంత ప్రధానం కాని ఒక చిన్న కథ, ఒక అసామాన్య కావ్యంగా పెద్దన చేతిలో రూపు దిద్దుకున్నది. అందులోని ప్రవరుడు, వరూధిని పాత్రలు ఎరుగని సాహిత్యాభిలాషులు ఉండరంటే అతిశయోక్తి కాదు. నైష్ఠికుడూ, పరస్త్రీ పరాఞ్ముఖుడూ అయిన వ్యక్తిని ‘అబ్బో వీడు ప్రవరాఖ్యుడు రోయ్’ అనటమూ, తనంతట తానే వలచి వచ్చిన స్త్రీని వరూధినితో పోల్చడమూ వాడుక అయిపోయిందంటే, మనుచరిత్రము ఎంత సార్ధకతను సాధించిందో అర్థమౌతుంది. కావ్యాన్ని ప్రారంభించిన తీరు గాని, కథను నిర్వహించిన నేర్పు గాని, పాత్రలను తీర్చిదిద్దిన నైపుణి గాని, సంభాషణలను నడిపించిన చాతురి గాని అనితర సాధ్యాలు. ముఖ్యంగా ద్వితీయాశ్వాసంలోని ప్రవర వరూధినుల సంభాషణలు ఎంత రసానందాన్ని కలిగిస్తాయో ఎవరికి వారు చదివి అనుభవించాల్సిందే. వీటన్నిటితో పాటు పద్యాలను నిర్మించిన నేర్పు మహాద్భుతం. ప్రతి పద్యము గొప్ప ప్రౌఢిమ తోనూ, ఒక ఉజ్వలమైన కాంతి తోనూ సాగిపోతుంది. తిలక్ అన్నట్లు కవిత్వం యొక్క ఆల్కెమీ రహస్యాన్ని పూర్ణంగా ఎరిగినవాడు పెద్దన.

వరుణానదీ తీరాన అరుణాస్పద పురంలో వుండే ఒక నైష్ఠిక బ్రాహ్మనూడు ప్రవరుడు. ఆయన ఇంటికి ఒక రోజు ఒక సిద్ధుడు వస్తాడు. ప్రసంగవశంలో తాను చాలా క్షేత్రాలూ, తీర్థాలూ సేవించినట్లు చెపుతాడు. సిద్ధుడు చూట్టానికి వయసు మీరినవాడు కాదు, ఇన్ని క్షేత్రాలు తిరిగానంటాడు. ఇతనికేమైనా రెక్కలున్నాయా అని ప్రవరునికి అనుమానం వస్తుంది. ఆ మాటే అడుగుతాడు. అదొక పరమ రహస్యం, ఐనా నీకు చెబుతాను. మా వద్ద పాద లేపం అనే పేరు గల దివ్యౌషధపు రసం ఉన్నది. దాని సాయంతో మేము సూర్యుని గుర్రాలతో సమానమైన వేగంతో ప్రయాణం చేస్తాము – అని చెప్తాడు సిద్ధుడు. ప్రవరుడికి ఆశ కలుగుతుంది. స్వామీ, నాకూ తీర్థయాత్రలు చెయ్యాలని ఉంది, అనుగ్రహించండి అని ప్రార్థిస్తాడు. ఇది అని చెప్పకుండా ఒక పసరు ప్రవరుని పాదాలకు రాసి వెళ్ళిపోతాడు సిద్ధుడు. అన్ని తీర్థాలకూ పుట్టినిల్లయిన హిమాలయాలను చూడాలని కోరుకుని ఆ పసరు సాయంతో హిమాలయాలలోకి ప్రవరుడు వెళతాడు. ఇదంతా ఒక రోజు ఉదయం పూట జరిగింది. హిమాలయాల్లో ప్రవరుడు చాలా ప్రదేశాలు చూస్తాడు. భగీరథుడు తపస్సు చేసిన చోటు, శివుని కంటిమంటకు మన్మధుడు బూడిద అయిన చోటు, సప్తర్షుల భార్యలను మోహించి అగ్నిదేవుడు విరహం అనుభవించిన చోటు, కుమారస్వామి పుట్టిన చోటు – ఇలా అన్నీ సంతోషంగా చూస్తాడు. అప్పటికి మధ్యాహ్నమవుతుంది. ఇక ఈ పూటకు చాలు, మరో రోజు వచ్చి మిగతా స్థలాలు చూద్దాం అనుకుంటాడు. పైన వ్రాసింది అలా అనుకున్న పద్యం.

తలమే బ్రహ్మకు నైన నీ నగ మహత్వంబెన్న? – ఈ పర్వతం గొప్పదనం తెలుసుకోవడం బ్రహ్మకైనా సాధ్యమౌతుందా. ఇక్కడుండే వింతలన్నిటినీ మరో రోజు వచ్చి చూస్తాను. ఇవ్వాళ్టికి ఇంటికి వెళతాను. మధ్యాహ్న సమయం అయినట్టుంది – అని అనుకుంటాడు ప్రవరుడు. మధ్యాహ్నం అయింది అని ఆయన అనుకోడానికి ఒక తమాషా అయిన రుజువు చెప్పుకుంటాడు. సూర్యకాంత శిలలు, చంద్రకాంత శిలలు, ఇంద్రనీలోపలాలు అని రకరకాల విలువైన రాళ్ళుంటాయి. చంద్రకిరణాలకు చంద్రకాంత శిలలు చల్లదనాన్నిస్తాయి. సూర్యకిరణాలు సోకి సూర్యకాంత శిలలు మిక్కిలి వేడిని వహిస్తాయి. హిమాలయ సానువుల్లో సూర్యకాంత శిలలు ఎక్కువ. సూర్యుడు క్రమక్రమంగా పైకెక్కి నడినెత్తి మీదకు వచ్చేసరికి, కిరణాలు తీక్షణమౌతాయి. ఆ కిరణాలకు సూర్యకాంత శిలలు వేడెక్కిపోవడమే గాక, హిమాలయాల మీది మంచు కూడా కొంచెం కొంచెం కరుగుతుంది. కరిగిన మంచు బిందువులు వేడెక్కి వున్న సూర్యకాంత శిలల మీద పడేసరికి ‘చుయ్’ అని శబ్దం వస్తుంది, పెనం మీద పడ్డ నీటి చుక్కలాగా. మంచు ఎక్కువగా కరిగి, సూర్యకాంత శిలలు ఎక్కువగా కాలి వుండి, మంచుబొట్లు వేగంగా ఒకదాని వెంట ఒకటిగా పడేసరికి చుయ్‌మన్న శబ్దాలు వెంటవెంటనే వస్తుండే సరికి అబ్బో మధ్యాహ్నమయినట్లుందే అనుకున్నాడు ప్రవరుడు.

నళినీ బాంధవుడు – సూర్యుడు; భాను – కిరణముల చేత; తప్త – కాలిన; రవికాంతస్యాది – సూర్యకాంత శిలలపై చిందిన; నీహారకందళ – మంచునీటి బిందువుల యొక్క; చూత్కార పరంపరల్ – విరామం లేకుండా వినవచ్చే ‘చూ’త్కారాలు – ఇదీ అర్థం. ఒక్కసారి పదాలు విడదీసుకుంటే సులభంగానే అర్థమవుతుంది. ఎంతో సొగసుగా ఉంది గదూ ఈ కల్పన. ఇలాంటి కల్పనలు చేయడంలో పెద్దన సిద్ధహస్తుడు. నిజానికి దీనితో పాటు చాలా పద్యాలు నాకు నచ్చినవి మను చరిత్రలో ఉన్నాయి. ఇది మచ్చుకు మాత్రమే.