గానభారతి

అది యొక యందమైనవన, మందున సుందరతాసుగంధసం
పదలకు నిధానమైన యొక పద్మసరోవర మొప్పు, నందునన్
గదలుచు లీలగా ననిలకల్పితవారితరంగడోలలన్
ముదమును గొల్పు నంచగమి; పుష్పలిహంబులు వాడుఁ బాటలున్.

ఆరమణీయపద్మవనమందున నందములొల్కు విస్ఫుటాం
భోరుహవక్త్రసీమలను ముద్దిడి తద్రసపానమత్తమై
తీరుగఁ బాడు తుమ్మెదలతీరును గాంచుచు నేను తత్సర
స్తీరమునందు విస్మయవశీకృతచిత్తముతోడ నిల్చితిన్.

అట్టు లాపద్మషండంపుటందమెల్ల
నేత్రపాత్రల నిండుగ నించి నించి,
అన్యమగు వింతల నరయ నవ్వనానఁ
గదలితిని ముందునకు నేను కౌతుకమున.

చూచితి నచ్చట న్మిగుల సోయగ మొప్పఁగ నిట్టనిల్వునం
బూచిన తీఁగసంపెఁగల, బూరుగుమ్రాఁకుల, మావిగున్నలన్,
వీచెడి గాలి కల్లనల వేదికపై నటులట్టు లూఁగుచున్
వాచవియైన తేనియల బంభరకోటులఁ దన్పు మ్రాఁకులన్.

చెలువగు చివురుల వలువలు,
సులలితసుందరసురభిళసూనాభరణా
వళులను దాలిచి యైదువ
కొలములపొలుపున లతికలు గొమరారె నటన్.

తలిరులుమెక్కి మెక్కి, సుమితామ్రములందున నక్కి నక్కి, మం
జులకలనాదమాధురులు జొబ్బిలు పాటలు వల్కి పల్కి, పాం
థుల విరహంపుఁదల్లడము దోరమొనర్చి యొనర్చి పొల్చెఁ గో
యిలగము లింపుపెంపులు రహింపఁగ సొంపగు తద్వనంబునన్.

అమితమరందపానమున నబ్బిన మానసవిభ్రమంబుచే
గుములయి వెఱ్ఱిఝంకృతులఁ గూయిడి పొర్లుచుఁ బుష్పధూళిలోఁ
దమగృహసంజ్ఞల న్మఱచి దారుల నున్న సమస్తపుష్పముల్
దమనిలయంబులే యని మదాళులు దూరెను బువ్వుపువ్వునన్.

పద్మరాగంబులే పండెఁ బాదపముల
నన నశోకంబు లెఱ్ఱని ననల నూనె;
పసిఁడిపంటలే పండెను బాదపముల
ననఁగ సంపెఁగల్ బంగారు ననల నూనె.

కిసలంబుల వసనంబులు
కుసుమాభరణంబులు,పికకులభాషణముల్
లసితంబగు కనకాంగము
పొసగ న్నారామలక్ష్మి పొంపెసలారెన్.

చూతముఁ జూచుచుఁ, గ్రోలుచు
జాతీగంధము, నిమురుచు స్తబకోత్కరమున్,
ప్రీతిగ ద్రాక్షలఁ దినుచును,
శ్వేతగరుత్తుల పలుకులు వినుచు న్వనిలోన్.

జ్ఞానమానసేంద్రియతృప్తి సంఘటిల్ల
సంచరించుచుఁ గంటిని సమ్ముఖమున
కుసుమభారానతమనోజ్ఞకుంజ మొకటి
అందు సునిషణ్ణయగు సుందరాంగి నొకతె.

ఘనపటలంబు గప్పఁగ వికాసము దప్పిన యిందుచంద మా
వనితముఖం బొకించుక ప్రభారహితంబయియుండఁ గాంచి నే
ర్పునఁ జని యామెచెంతకు నపూర్వవినమ్రతతోడఁ బల్కితీ
యనువున మార్దవంబును దయారసము న్నెలకొన్నవాక్కులన్.

ఓ లలనావతంసకమ! ఒంటరిగా నిట నుంటివేల? నీ
ఫాలశశాంకబింబ మిటు వన్నెఁ దొఱంగినదేల? తీర్పఁగాఁ
జాలుదొ చాలనో తెలియఁజాలను నీవెతఁ గాని, శక్తికిం
జాలినయంతయత్నమును సల్పుదు నీ మనము న్వచింపవే!

అవిరతసత్యసంధుఁడ, దయామయభాషణతత్పరుండ, వై
ష్ణవకులసంభవుండ, జలజాసనవల్లభకింకరుండ, స
త్కవివృషభుండఁ, బావనుఁడఁ, గావున నన్నిట విశ్వసించి చె
ప్పవె సుకుమారి! నీవిటుల వందుటకుం గలయట్టి హేతువున్.

ఒక్కొకపరి తన వనటను
ప్రక్కనఁ గల వారి కెఱుకపఱచుటచేతం
జక్కనయగు మది; కావున
నిక్కముగాఁ దెల్పఁగదవె నీమది నాకున్.

అనఁగ నొక్కింత లోలోన నా లతాంగి
చింత యొనరించి, కించిత్ప్రశాంతమైన
ముఖమునందున నఱనవ్వు మొలక లీనఁ
బలికె నిట్టుల మంద్రరవంబుతోడ.

“ఏమని చెప్పుదాన సుకవీశ్వర! నాదొక దీనగాథ – ఈ
యామనియందు నీవనమునందుఁ జరించుచు నుంటి మున్ను పే
రామనివోలె భాసిలి సుఖావహమైన మదీయజీవితా
రామపుదృశ్యముల్ మఱపురాక సతంబు మదిన్ గలంచఁగన్.

ఒకమధుమాసమందున సముజ్జ్వలపూర్ణకళాప్రపూర్ణుఁడై
ప్రకటసుధాంశుపూరములఁ బాలసముద్రముగా నొనర్చుచున్
సకలధరిత్రినిన్ జదలఁ జంద్రుఁడు గొల్వును దీర్చియుండఁగా
నొకరితనౌచు నేనిచట నుంటిని లీల విహారశీలనై.