రెండు కవితలు

పొద్దున్నే బిపాసా

ఓ పేజీలో భూకంపం
ఓ పేజీలో సునామీ
మరో పేజీలో
బిపాసా!

వరండాలో నీరెండలో
కాగితప్పూల గరగరల్లో
లేత ఆకుల మిసమిసల్లో
ఆమె లేడి కళ్ళల్లోని
పులుల గుంపులని
తరుముకు పోయి
దంతపు రైలు పెట్టెల
పలు వరుస వెంట
పరుగులు పెట్టేసి
చందనపు భుజాలపైని
వయొలిన్ కంఠాన్ని
మీటుతూ కూచుని
కురుల కారడవుల్లో
కేకలు పెడుతూ తిరిగి
ఆ షాంపూ వనాలలో
కాసేపు కునుకులు తీసి
ఆమె జున్ను బుగ్గల
మీద జర్రున జారిపడి
కుయ్యో మొర్రోమంటుంటే

పాలు పొంగిపోయి
పొయ్యి ఆరిపోతే
నాకెలా తెలుస్తుందీ?

రాత్రి పరుచుకునే తివాచీ

చేతులూపుతూ కనుమరుగౌతాడు సూర్యుడు
మిగిలిన వెలుతురును మింగుతుంది చీకటి
ఝూంకారాలు చెదిరిపోతాయి
పగలంతా పొడిచిన పక్షి ఎగిరిపోతుంది

మిణుకు మిణుకు తారల కింద
కనుచూపు మేర వరకు
గుసగుసలాడుతూ
పువ్వులు పువ్వులు
పువ్వులు విచ్చి
నదిలోకి విడిచిన
అరటి దొన్నె దీపాల్లా
ఊగుతాయీ చలి గాలుల్లో

ఆశ్చర్యార్ధకాలు
తాడి చెట్లు తప్ప
ఈ వింత చూడ్డానికి
ఆ దోవలో ఒక్క బాటసారీ ఉండడు.