పిల్లల కోసం

ఇల్లు

మబ్బులు కప్పు
మన్ను నేల
గాలులు గోడలు
మా ఇంటికి

వెన్నెల దీపం
పచ్చిక శయ్య
మంచు పరదాలు
మా ఇంటికి

కొండలు ప్రహరీ
పొదలు వాకిలి
వానలు ఊచలు
మా ఇంటికి

నింగి, నీరు, నేల

నింగిలోనా తేలుతూ
నల్లనల్లని మబ్బులు
తెల్లతెల్లని కొంగలు
ఇంద్ర ధనుసుల రంగులు

నీటిలోనా మునుగుతూ
ఊదా రంగు నీడలు
కలువ పువ్వుల కాడలు
చేప పిల్లల జాడలు

నేల పైనా ఊగుతూ
చిన్ని చిన్ని గరికలు
చిట్టి పొట్టి పిట్టలు
చిన్న పిల్లల నవ్వులు

మా ఇంటి చంద్రకాంతాలు

ఎప్పుడు సాయంకాలమైనా
ఎంచక్కా వికసిస్తాయి
మా ఇంటి చంద్రకాంతాలు.

ఎవరూ చూడక పోయినా
మరి తాకక పోయినా
ఎన్ని చీమలు పాకినా
కొన్ని దోమలు వాలినా
ఎవరికి నచ్చక పోయినా
కొంచమైనా మెచ్చక పోయినా–

ఎప్పుడు సాయంకాలమైనా
ఎంచక్కా వికసిస్తాయి
మా ఇంటి చంద్రకాంతాలు.