కథ కథ

మీ కళ్ళు ఈ నా మొదటి వాక్యం చదువుతుండగానే కొద్దిగా బెరుకు. నన్నెలా అర్థం చేసుకుంటారు? నేను మీరు చదివే కథలకన్నా భిన్నంగా ఉండబోతున్నాను. కనీసం ఉండాలని నా కోరిక.

మీరు నన్ను ఎందుకు చదువుతున్నారో, నా నుంచి ఏమి ఆశిస్తున్నారో నాకు తెలియదు. మీకు నిరాశ కలగనివ్వనని హామీ ఇవ్వలేను.

నీతి: చెరపకురా చెడేవు.
సందేశం: అవినీతిని నిర్మూలించండి.
జీవిత సత్యం: నువ్వు గడ్డిపోచగా భావించేది మరొకరికి మహద్భాగ్యం కావచ్చు.

హమ్మయ్య! ఒక పని అయిపోయింది. నాలో మీరు ఏదయినా నీతో, సందేశమో, జీవిత సత్యమో వెదుకుతున్నట్లయితే మీరు చివరిదాకా చదివి జుట్టు పీక్కోనక్కరలేదు. మీకు కావలసింది దొరికింది కనక ఇక్కడితో చదవడం ఆపేసినా నేనేమీ అనుకోను. అసలు కష్టం వేయదని కాదు గానీ సర్ది చెప్పుకుంటాను. మనం ఒకరికొకరం తగము. అంతే. మళ్ళీ మీకు మరేమీ పని లేనప్పుడెప్పుడన్నా కలుద్దాము.

మీరు ఇంకా నన్ను చదువుతుంటే కృతజ్ఞతలు. ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని సంతోషపెట్టేందుకు నేనేమీ మారబోవడం లేదు కనక. నాకు తెలుసు మీరు నా ప్రతి అక్షరాన్నీ చదువుతూ ఉన్నారనీ, వాక్యం వాక్యాన్నీ శల్య పరీక్ష చేస్తూ ఉన్నారనీ. బహుశా ఆద్యంతమూ రకరకాల కోణాల్లో పరిశీలిస్తున్నారేమో! పాత్రలూ, సన్నివేశాలూ, సంభాషణలూ, వర్ణనలూ, శిల్పమూ, శైలీ – ఒక్కొక్కటీ వొలిచి చూడాలని ప్రయత్నిస్తారేమో! మీ తీర్పు కోసం నగ్నంగా పరుచుకుని ఉన్నాను. సిగ్గూ కాదు, గర్వమూ లేదు. గుచ్చి గుచ్చి చూసి ఒక్కో లోపాన్నీ ఎత్తి చూపినా మౌనంగా స్వీకరించక తప్పదని తెలుసు.

నా గురించి మీరింత కూలంకషంగా తెలుసుకుంటున్నా నాకు మీ గురించి ఏమీ తెలియదు. ఎప్పటికీ. ఫర్వాలేదు. నేనేమీ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయబోవడం లేదు. మీ ప్రవర్తననూ, ఆలోచనల్నీ గమనించడంలేదు. నాపై మీరు చూపే ఇష్టానిష్టాలు దేనికీ కొలబద్దలు కాదు.

నేను మిమ్మల్ని మోసం చేయబోవడం లేదు. చేసి మీ దృష్టిని ఆకట్టుకునే ఉద్దేశమే ఉంటే నా మొదటి వాక్యం “చిమ్మ చీకట్లోంచి ఒక స్త్రీ ఆర్తనాదం హృదయవిదారకంగా వినిపించింది” అయి ఉండేది. నేనేమీ గొప్ప కథనూ కాను, మంచి కథనూ కాను. వొట్టి కథని. ఒక సాదాసీదా కథని. నిజమే, విభిన్నంగా ఉండాలనుకున్నాను. మీరనుకోవడం లేదా మీరో విభిన్నమైన, ప్రత్యేకమైన వ్యక్తి అని? నేనూ అంతే!

నాలో లోపాలు లేవని చెప్పను. అక్కడక్కడా అప్పుతచ్చులు ఉంటాయి. కొన్ని చోట్ల అరాలే ఎరిపోవ. వాక్యం సగంలో. అనవసరమైన, చోట, కామాలు, ఉంటాయి. చెప్పిన దాన్నే తిరిగి చెప్పడం ఉంటుంది. తప్పుడు సామెతలు పాయసంలో ఎముకలా అడ్డు తగులుతాయి. సరిగ్గా అతకని పోలికలు బొట్టు బిళ్ళల్లా జారుతూ ఇబ్బంది పెడతాయి. చెప్పిన దాన్నే తిరిగి చెప్పడం ఉంటుంది. ఉన్న తప్పులకూ ఒక క్రమం ఉండదు, నిలకడ ఉండదు. ఒక్కసారిగా లభించిన స్వేఛ్ఛ వల్ల కలిగిన అతిలాలసత్వం మరొకటి. ఇవి కాకుండా నాకు తెలియనివీ, తెలిసీ చెప్పనిచ్చగించనివీ మరికొన్ని.

మీరింకా ఆశగా చదువుతున్నారు. నాకు ఒక తీరూ తెన్నూ ఉండి ఉంటాయనీ, ఈ పొరల వెనక కండగల విషయమేదో దొరుకుతుందనీ. కానీ నేను ఖాళీ. నేను మిగతా కథల్లా కాదల్చుకోలేదు. నేనెందుకిలా ఉన్నానో, నా స్వేఛ్ఛ ఎంతవరకో తెలియదు. మీరు దేవుడిని ప్రార్థించినట్టు నేను లోలోపల ఈ రచయితను వేడుకుంటున్నదీ, మొత్తుకుంటున్నదీ ఒక్కటే – తన చేతిలో నన్ను కీలుబొమ్మను చేయొద్దని. ఏ నమ్మకాన్ని నిరూపించడానికో నన్ను తన ఇష్టం వచ్చినట్టు మెలికలు తిప్పుతాడని భయం. నా మానానికి నన్ను వదిలేస్తే అంతకంటే ఏమీ కోరుకోను.

నాకవన్నీ పనికి రావు. ఆ బరువులూ బాధ్యతలూ భరించలేను. ఏ తెచ్చిపెట్టుకున్న గంభీర స్వరంతోటో ఒక బిగదీసుకున్న వాతావరణం సృష్టించుకుని మూతి ముడుచుక్కూచోలేను. నిరపాయకరమైన ఏ తాత్కాలిక భావోద్వేగమో మీలో కలిగించడానికి నానా విన్యాసాలు చేయలేను. లేక మీ వినోదానికై మూతికి లిప్‌స్టిక్ రాసుకున్న కోతిని కాలేను. మీ కాళ్ల చుట్టూ తెరుగుతూ మీ అటెన్షన్ కోసం పాట్లు పడే కుక్కపిల్లను అంతకంటే కాను. ఆ ప్రయాసలన్నీ పడబోను.

తన తెలివితేటలు చూపుకోవడానికో, తనకే తెలుసునన్నట్టో, తను కనక ఇట్లా రాయగలనని చాటింపు వేసుకోడానికో, నలుగురి మెప్పు కోసమో నన్ను నానా తిప్పలు పెట్టడం చిరాగ్గా ఉంటుంది. అప్పటికి తను మాత్రమే జీవితాన్నీ, లోకాన్నీ పరిశీలించి వాటి సారం, పరమార్థం గ్రహించినట్టూ, తను చెప్పినట్టు నడిస్తే సమస్యలన్నీ పరిష్కారమై, ధర్మం తిరిగి నాలుగు పాదాలా నడిచి ప్రపంచమే స్వర్గంగా మారిపోతుందన్నట్టూ – ముసుగులూ, వేషాలూ, ఎత్తులూ, నాటకాలూ – తలుచుకోడానికే వెగటుగా ఉంటుంది.

ఆ చెత్తంతా ఎందుకు మోయాలి నేను? రచయిత చేతుల్లో కీలుబొమ్మల్లా ఆడే పాత్రలూ, సానుకూలంగా జరిగే సంఘటనలూ, వొద్దికగా కుదిరే ముగింపు తోటీ ప్రణాళికాబద్ధంగా ఎక్కడికక్కడ సర్దుకుని భలే భలే అనుకుంటూ పడుండలేను. అవసరమయితే అనవసరమూ అవ్వాలని ఉంటుంది. అన్నీ ఎక్కడివక్కడ వదిలేసి సముద్రపుటొడ్డున కుర్చీలో పడుకుని ఒక పుస్తకం పుచ్చుకుని చదవాలనిపించదూ మీకు? నాకూ అలాగే ఉంటుంది, ఆ పుస్తకం కూడా మినహాయించి.

కటువుగా మాట్లాడానా? ఆదుర్దా పడకండి. నేనెట్లా ఉండకూడదనుకున్నానో చెప్పుకుంటూ పోతే అది ఇంకో కథ అయిపోతుంది. నేను నాలా మాత్రమే ఉండదల్చుకున్నాను.

అంతా ఈ సొదేనా, ఈ సోదేనా అని తిట్టుకుంటూ నా చివరి వాక్యం చదివి మళ్ళీ ఇక్కడికి వస్తారు మీరు. ఈ తీగ చివర ఆకుల్ని వొత్తిగించుకుంటూ ఒక పువ్వులాంటిది విచ్చుకుంటూ కనిపిస్తుందేమోనని. మీకక్కడ మెలికా, కొసమెరుపూ ఏవీ కనపడవు. అయినా నా నిడివి తక్కువ, ఎక్కువ సమయం పట్టదు కనక ఈ కాస్తా చదివేయడానికే మొగ్గు చూపుతారు.

మీరు దృష్టంతా నామీదే పెట్టి శ్రద్ధగా చదవాలనుకుంటాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? దయచేసి కొనసాగించండి. కానీ చదువుతూ నాలో లీనం కాకండి. నేనొక కథనని మాత్రం గుర్తుంచుకోండి.

అర్థమయింది కదా! నిజానికి చెప్పడానికేమీ లేదు. ఏమీ లేనప్పుడు నా అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుందని తెలుసు. కాకపోతే నన్ను మీరు చదువుతున్నంతసేపూ నేను ఉంటాను. మీరూ ఉంటారు. ఇక్కడ రెండే పాత్రలు. మీరూ, నేనూ. మరొకరి ప్రమేయం లేదు. అంతా మనిద్దరి మధ్యే. మీరు చేయగలిగిందల్లా చదవడం. నేను చేయగలిగిందల్లా చదవబడడం. నన్ను చదివినట్టు మిమ్మల్నీ చదవాలన్న తీవ్రమైన కాంక్ష కలుగుతుంది. నా వొక్కో వాక్యమూ మీ మనసులో ఏ భావాన్ని రాజేస్తుందో తెలుసుకోవాలని ఉంటుంది.

నేను ఆత్రంగా మీ మొహంలోకి చూస్తున్నాను. మీ నుదుటిమీద రేఖ విసుగ్గా ముడి పడిందా, మీ పెదాల చివర్లు వంపు తిరిగి చిరునవ్వు మొలవబోతుందా అని. మెచ్చుకోలుగా ఒక్క మాట అయినా అనకపోరా అని లోపల ఒక ఆశ. తిట్టడానికి పదాలు ఏరుకుంటున్నారేమోనని మరో పక్క అనుమానం. దేనికయినా సిద్ధంగా ఉండాలని తెలుసు. రెంటినీ సమంగా స్వీకరించాలనీ తెలుసు. అసలు దేన్నీ ఆశించకూడదని నేను అనుకున్నది మాత్రం నిజం.

మీరు నన్ను ఎందుకు చదువుతున్నారో తెలియదన్నానా? కానీ ఊహించగలను – చవగ్గా, చులాగ్గా ఒక భావోద్వేగం.. ఏమీ పెట్టుబడి లేకుండా.. ఏమీ చెల్లించకుండా.. ఏమీ కోల్పోయే ప్రమాదం లేకుండా.. గుర్తుగా ఏ మచ్చా పడకుండా, ఏ దుమ్మూ మీద పడకుండా. లేదా కాస్త కాలక్షేపం. దానికి తోడు కొంచెం నీతో, జీవితసత్యమో ఇంకొంచెం లోకమూ, జీవితమూ తెలిసిన భ్రమ కలిపిస్తూ. ఇంతవరకూ మీరు చదివిన, నేర్చిన నీతులూ, ఉపదేశాలూ, సందేశాలూ, జీవిత సత్యాల లెక్క నేను అడగను.

లేదు, నేను మిమ్మల్ని మిగతా గుంపుతో కలిపేయడం లేదు. నాకు తెలుసు మీరు వారందరికంటే విభిన్నం. మీకో ప్రత్యేకమైన గుర్తింపూ, వ్యక్తిత్వమూ ఉన్నాయని నమ్ముతాను. దురదృష్టవశాత్తూ వాటిని నేను గుర్తించలేను.

మీరంటే మాత్రం ఏం లెక్క అనిపిస్తుంది కానీ మీరు చదవందే నేను లేనట్టే. ఎవరూ గమనించకపోతే మీరైనా జీవించనట్టే కదా! నిజమే, మీకు నా అవసరం కంటే నాకు మీ అవసరమే ఎక్కువ. ఇక్కడ మాత్రం అనిపిస్తుంది హఠాత్తుగా మీ మనసును రంజింపజేసే బాధ్యత నామీద ఉందేమోనని. ఒక పాత్రకన్నా నాలో చోటిద్దామని. కనీసం మీలాంటి పాత్రకి.

మీరు నన్ను గుర్తుంచుకుంటారా? నా గురించి ఆలోచిస్తారా? మళ్ళీ నన్ను చదువుతారా? ఇట్లా ఆత్రంగా అడగడమూ నాకు ఇష్టం ఉండదు. సమాధానాలూ తెలుసు. మీకు నేను చేసిందేమీ లేదు. అటువంటప్పుడు ఎందుకు ఆశిస్తున్నానవన్నీ?

ఇదీ నేను. ఏమయినా నేను మారలేను. ఇది నేను. ఇదే నేను. ఇది నాది. నేను నేనే. నా ఉనికి నిరర్థకమనీ, నిష్ప్రయోజనమనీ నిందించకండి. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొమ్మని చెప్పానా? ఇంతకంటే మెరుగ్గా కాలేనా? కావచ్చేమో, కానీ అది నేను కాదు. మీలో మెరుగుదల నేను కోరానా?

అంతకంటే మరేం లేదు. మీరు నన్ను చదువుతూ మధ్యలోనే ఇక్కడికి వచ్చి ఉంటే మీరు మిస్సయింది ఏమీ లేదు. నేను మీకు నచ్చకపోయి ఉండవచ్చు. ఫర్వాలేదు. నాకంటే బాగున్న కథ మీకు ఆ పక్కనే దొరకవచ్చు. మీకంటే మెచ్చుకునే పాఠకుడూ మరొకరు నాకు దొరకొచ్చు. మీరు మళ్ళీ చదవాలని వస్తే నేనిక్కడే ఉంటాను. కానీ మరవకండి, మీకు నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు నేను మీలో ఒక భాగం.

ఇది నా చివరి వాక్యం కావడం కంటే విశేషమూ లేదు, ఇక చెప్పదగిందీ లేదు.

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...