విద్యాసుందరి – వ్యాసానుబంధము

[ఈమాట, 2007 నవంబరు నెలలో ప్రచురితమైన విద్యాసుందరి వ్యాసానికి మరికొంత సమాచారాన్ని జోడిస్తూ ఆ వ్యాసానికి అనుబంధంగా ఈ రచనను ప్రచురిస్తున్నాము – సం.]

దేవదాసి కులములో జన్మించి దేవుని దాసిగా మారిన ఒక గొప్ప కళాస్వరూపిణి బెంగళూరు నాగరత్నమ్మ. నాదోపాసనలో లీనమై త్యాగరాజస్వామికై భోగభాగ్యాలను త్యాగము చేసిన తరుణి ఆమె. ఆమె జీవితములోని సంఘటనలను గురించిన వివరాలు ఇంతకుముందే ప్రచురితమైన విద్యాసుందరి వ్యాసములో చదువవచ్చును. ఈ వ్యాసం ప్రచురితమైన నాటినుండి దక్షిణ భారతదేశ సాంస్కృతిక చరిత్రలో ఆవిడకున్న విశిష్ట స్థానాన్ని గుర్తిస్తూ మరుగున పడిన నాగరత్నమ్మగారి జీవిత చరిత్రను, సంగీత, సాంఘిక సేవారంగాల్లో ఆవిడ సల్పిన గొప్ప కృషిని బయటకు తెచ్చే పలు ప్రయత్నాలు జరగటం యాదృఛ్ఛికమే అయినా కడు ముదావహం. ఈ ప్రయత్నాలలో ముఖ్యంగా పేర్కొనవలసినది V. Sriram వ్రాసిన The Devadasi and the Saint – The Life and Times of Bangalore Nagarathnamma అనే పుస్తకము[1]. ఇందులో ఆమె జీవిత చరిత్ర విశదీకరించబడినది. టి. పద్మినిగారు ఈ పుస్తకాన్ని తెలుగులో అనువదించారు. William Jackson కూడా తాను వ్రాసిన Tyāgarāja and the renewal of tradition: translations and reflections లో నాగరత్నమ్మ జీవిత చరిత్రను త్యాగరాజు పరముగా విపులీకరించారు. ఈ మధ్య ప్రసన్న రామస్వామి ఆంగ్లములో నాగరత్నమ్మ జీవిత చరిత్రాన్ని ఆధారం చేసికొని శ్రుతి, స్మృతి, కృతి అనే ఒక నాటకమును వ్రాసారు. నాగరత్నమ్మ ఆ కాలములో మదరాసు జార్జిటవునులో నివసించిన ఇంటిని ఇక్కడ చూడగలరు.

నాగరత్నమ్మ నాట్యకౌశలత గురించి మనకు ఆ కాలపు వారి అభిప్రాయాలు[2] తప్ప మిగిలిన విషయములు తెలియవు. అలాగే 1908 తరువాత ఆమె నాట్య ప్రదర్శన లిచ్చిన దాఖలాలు ఏమీ లేవు. నెమ్మదిగా పుంజుకుంటున్న anti-nautch ఉద్యమం దీనికొక కారణము కావచ్చును (V. Sriram పే. 29). కాని ఆమెకు సంగీత సాహిత్యాలలో ఉండే ప్రావీణ్యత, ఆసక్తికి ఆమె పాటలు, వ్రాతలు కొలబద్దలు. మారుతున్న సాంఘిక పరిస్థితులకనుగుణంగా నాగరత్నమ్మ, కోయంబత్తూరు తాయి, సేలం గోదావరి మొదలైన ప్రముఖ కళాకారిణులు కేవలం సంగీతం పైన దృష్టి సారించారు. తెలుగు దేశములో కూడా ఆమెకు గొప్ప పేరు ప్రఖ్యాతులుండేవి. తరచుగా వెంకటగిరి, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, బొబ్బిలి పట్టణములలో ఆమే సంగీత, సాహిత్య సభలలో పాల్గొనేవారు. అలాటి ఒక సభలోనే ఆమెకు విద్యాసుందరి బిరుదు, గండపెండేరాలు లభించాయి. ఆమెకు ఈ విద్యాసుందరి బిరుదంటే చాల ప్రీతికరము. లాంఛనప్రాయముగా తాను వ్రాసే ఉత్తరాలలో ఈ బిరుదును తప్పక వాడేవారట. 1905-1931 మధ్య కాలములో ఆమె ఒక్క తమిళ దేశము లోనే 1235 కచేరీలలో పాడారు. పరిమితమైన రవాణా సౌకర్యాలున్న కాలములో ఇన్ని కచేరీలివ్వడం విశేషమైన విషయం.

నిత్యకళ్యాణి రాగమాలిక -1నిత్యకళ్యాణి రాగమాలిక -2అనుదినము నీ గుణగానముకాంభోజిపొగడతరమా – అఠాణ

గ్రామఫోను కంపెనీవారు తొలిసారిగా దక్షిణ భారతదేశంలో డిసెంబర్ 1904 మార్చ్ 1905 మధ్య కాలములో[3] రికార్డింగులు (The second “Far Eastern” recording tour) జరిపారు. తొలినాటి రికార్డింగులు కడు పరిమితమైన సాంకేతిక పరికరాలతో జరపబడ్డాయి. [4, 5] అప్పటి మట్టి రికార్డులపై (78 rpm) వచ్చిన సంగీతాన్ని ఈనాటి ఉత్తమ ప్రమాణాలతో పోల్చలేము. ఆమె పాడిన పాటల జాబితాను ఇక్కడ ఇస్తున్నాము. దీనితో కూడా His Master’s Voice సంస్థ వారు ప్రచురించిన కేటలాగులోని ఈమె పాటల జాబితాను కూడా చూడవచ్చు. ఈ జాబితాలోని రికార్డులలో సగానికి పైగా 1904-05 కాలములో తయారయినవి[4]. మిగిలిన అర్ధభాగము 1915 ప్రాంతములో రికార్డు కాబడినవి. ఆమె స్వయముగా తన గళముతో పాడిన అరుదైన నాలుగు రికార్డులను ఇక్కడ వినవచ్చును. నిత్యకల్యాణి రాగమాలిక మూడు భాగాలుగా, అంటే రెండు రికార్డులపైన విడుదలయినది. మాకు మొదటి రెండు భాగములే లభించాయి.

గత రెండు దశాబ్దాలలో దేవదాసీల సాంఘిక పరిణామాన్ని విశ్లేషిస్తూ అనేక పరిశోధక వ్యాసాలు వెలువడ్డాయి[6, 7]. వీటిలో కొన్ని నాగరత్నమ్మ పాత్రను ప్రముఖంగా విశ్లేషించాయి[7, 8]. నాగరత్నమ్మకు కవయిత్రి ముద్దు పళని వ్రాసిన ‘రాధికాసాంత్వనము’ అంటే ఎంతో ఇష్టమని విద్యాసుందరి వ్యాసంలో పేర్కున్నాం. వ్యయప్రయాసలకు ఓర్చి ఈ పుస్తకాన్ని నాగరత్నమ్మ ప్రచురించారు. 1910లో వ్రాసిన ఈ ముందు మాట తప్పక చదువదగినది. ఇందులో ఆమె తనకు కన్నడ, తెలుగు, తమిళ భాషలలో పరిచయము ఉన్నదని, అంతే కాక తెలుగు భాష అంటే ఎక్కువ మక్కువ అనియు తెలిపినారు. తిరుపతి వేంకట కవుల పాణిగృహీతలోని ఒక పద్యము, రాధికాసాంత్వనము ముద్రణకు దారితీసిందని చెప్పారు. కందుకూరి వీరేశలింగము పంతులుగారి తప్పులను ఎత్తి చూపారు. పంతులుగారు ముద్దు పళని కవిత ‘దూష్యమని’ నిందించారు. కాని అట్టి ‘దూష్యములైన’ పురుషకవుల తారాశశాంకాది గ్రంథములను ఎందుకు అంగీకరించి ముద్దుపళని కృతిని ఎందుకు నిరాకరించారని ఎదురు ప్రశ్న వేశారు. రాధికాసాంత్వనము శృంగార రసాన్ని ఒలికిస్తుంది, దాని రచయిత తనలా ఒక దేవదాసి కాబట్టి ఆ గ్రంథాన్ని పరిష్కరించి వెలుగులోకి తీసికొని రావలసినది తన కర్తవ్యమని భావించి వావిళ్ల వారి సహాయముతో ప్రచురించారు. గ్రంథము చివర కడనుడిలో నాగరత్నమ్మ తానే వ్రాసిన రెండు పద్యాలు కూడా ఉన్నాయి. అందులో కవయిత్రి ముద్దు పళనిని ‘మా ముద్దు పళని’ అని నాగరత్నమ్మ పేర్కొనడము ఒక విశేషమే.

రాధికాసాంత్వనము ప్రచురితమైన సంవత్సర కాలం తరువాత, 1911లో, ‘శశిలేఖ’ అన్న పత్రికా సంపాదకులు ఇది అశ్లీల కావ్యమని అభ్యంతరం లేవనెత్తటముతో తెలుగు సాహిత్య, ప్రచురణా రంగములలో పెద్ద కార్చిచ్చు రేగిల్లినది. కందుకూరి వీరేశలింగము గారికి అనుకూలురైన గోటేటి కనకరాజు పంతులు ముఖ్య తెలుగు అనువాదకునిగా పనిచేస్తూ రాధికాసాంత్వనము అభ్యంతరమైన కావ్యమనే సిఫారసు చేయడంతో వావిళ్ళ సంస్థపై పోలీసు దాడులు జరిగాయి. ప్రతిగా వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రులు, నాగరత్నమ్మలు అనేక రాజకీయ, సాహిత్య, విద్యారంగ ప్రముఖులను కూడకట్టుకుని వాదించినా చివరకు 1912లో ఈ పుస్తకం నిషేధింపబడినది. తరువాతి కాలంలో ‘అసభ్యకరమైన’ పద్యాలను తొలగించి ఈ పుస్తకాన్ని పంపిణీ చేస్తుండేవారు. రాధికాసాంత్వనములో నిషేధింపబడ్డ పద్యాల జాబితానూ, మరి కొన్ని వివరాలను EMESCO Books ప్రతికి ఆరుద్రగారు వ్రాసిన ప్రవేశిక[9]లో చదువవచ్చును.1927లో మరొక పర్యాయం వావిళ్ళ సంస్థపైన పోలీసు దాడులు జరపబడ్డాయి. ఈ పర్యాయము రాధికాసాంత్వనము పూర్తిగా నిషేధింపబడినది. ఈ నిషేధము 1947 వరకు కొనసాగింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయిన తరువాతనే మరల పూర్తి పాఠం ప్రచురించుకునే స్వేఛ్ఛ లభించింది. ఈ నిషేధాల గురించి వావిళ్ళ వారి అవతారికను 1950 నాటి రెండవ ప్రచురణలో చదవవచ్చు. ఈ అవతారికలో ఎక్కడా నాగరత్నమ్మగారి పేరును కూడా ప్రస్తావించకపోవడం శోచనీయమైన విషయం.ఈ నిషేధముల ఫలితంగా పలు ‘శృంగార గ్రంథ’ ముద్రణాశాలలు వెలిశాయి. (నిషేధిత గ్రంథముల పైన, కొత్తగా ఏర్పడిన అజ్ఞాత గ్రంథమాలల పైన వివరంగా మరొక వ్యాసము రాయుచున్నాము.]

ఆలాపనగఛ్చామిఇకనేమందునేవ్యామోహప్రశమౌషధం

ముద్దుపళని రాధికాసాంత్వనము, నాగరత్నమ్మల ప్రేరణతో ఈ మధ్య కాలములో ఒక ఆంగ్ల నవల (మరియు సిద్ధాంత వ్యాసము)[10] కూడా వెలువడినది. ఆమె సంస్కృతములో త్యాగరాజస్వామిపై వ్రాసిన అష్టోత్తరశత నామావళిని విద్యాసుందరి వ్యాసముతో జతచేసిన అనుబంధములో చదువవచ్చును. 1947లో త్యాగరాజు మరణ శతాబ్ది సందర్భముగా నాగరత్నమ్మగారు వ్రాసిన వ్యాసము సాయి బ్రహ్మానందం గొర్తిగారి సౌజన్యముతో ఇక్కడ ప్రచురిస్తున్నాము. ఇందులో త్యాగరాజస్వామి ఆరాధన సందర్భముగా ముచ్చటించబడిన కొన్ని సంఘటనల వివరాలు కూడ హిందూ పత్రికలో లభ్యమవుతాయి (అ,, ). ఆమె తెలుగులో నాటక ఫక్కీలో వ్రాసిన వైకుంఠయాత్ర అనే ఒక చిన్న కథను (సమదర్శిని, 1931-32) కూడా మీకు అందజేస్తున్నాము. సంసారికైనా సన్యాసికైనా ఇహలోక వాంఛలను బంధాలనూ విసర్జించడము ఆ విష్ణు భగవానుడు నారదుని ద్వారా సందేశాన్ని పంపినా కూడా జరుగని పని అని హాస్యవ్యంగ్యములతో రాసిన ఆ కథ నాగరత్నమ్మ గారి రచనా ప్రతిభకు ఒక తార్కాణం.

కన్నడ దేశములో పుట్టినను యావద్దక్షిణ భారతదేశము నంతయూ సాహిత్య సంగీత కళలలో, తరువాతి కాలములో త్యాగరాజ సమాధి పునరుద్ధారణలో గొప్పగా సేవ చేసిన బెంగళూరు నాగరత్నమ్మ చిరస్మరణీయురాలు.


గ్రంథసూచి

 1. V. Sriram; The Devadasi and the Saint – The Life and Times of Bangalore Nagarathnamma. East West Books (Madras) Pvt.Ltd., 2010.
 2. త్యాగసేవాసక్త, విద్యాసుందరి, గానకళావిశారద శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర. గృహలక్ష్మి మాసపత్రిక, మార్చ్, 1949.
 3. మొదటి “Recording Tour” Nov-Dec 1902 కాలంలో కలకత్తా నగరములో జరిగినది.
 4. Kinnear, Michael; The Gramophone company’s first Indian recordings 1899-1908. Popular Prakashan. Bombay, 1994. (cf. p.
  121, 165-66)
 5. Gaisberg, Frederick William; The music goes round. New York. Macmillan, 1942.
 6. F. Apfell-Marglin, Wives of the God-King: The rituals of Devadasis of Puri, Oxford Univ. Press, Delhi, 1985; S. Kersenboom-Story, Nityasumangali: Devadasi tradition in south India, Motilal Banarasidas, 1987; S. Banerjee, Dangerous outcaste: The prostitute in nineteenth century Bengal, Calcutta, 2000; K. Jordan, From sacred servant to profane prostitute: A history of the changing legal status of Devadasis in India, 1857-1947, Manohar, 2003 are some selected monographs.
 7. The works from: P. Vijaisri, Recasting the devadasi: Patterns of sacred prostitution in colonial South India, Kanishka Publishers, New Delhi, 2004; and D. Soneji, Unfinished Gestures: Devadasis, Memory, and Modernity in South India, Columbia univ. Press, New York, (Forthcoming) deal with special reference to Telugu country.
 8. S. Tharu and K. Lalita, “Empire, Nation and the Literary Text” in Interrogating Modernity: Culture and colonialism in India, T.
  Niranjana et al (Eds), Seagull, Calcutta, 1999, p. 199-219.
 9. ముద్దుపళని రాధికాసాంత్వనము, ఆరుద్ర ప్రవేశిక, EMSCO Books, విజయవాడ, 1997.
 10. C. Gillespie, My ornament: Writing women’s moving, erotic bodies across time and space: A novel and exegesis, Victoria University. Australia, 2008.
జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...