త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు

ఉపోద్ఘాతము

కావ్యాలలో కవిత్వానికి మూలమూ, హేతువూ అలంకారాలు. పూర్వం నుండీ మనకున్న సంస్కృత, తెలుగు కావ్యాల్లో ఈ అలంకార ప్రయోగాలు ప్రస్ఫుటంగా, విరివిగా కనిపిస్తాయి. అలంకారాలంటే పోలికలు. ఒక వస్తువుని కానీ, ప్రదేశాన్ని కానీ, వ్యక్తిని కానీ, వారి గుణగణాల్ని కానీ ప్రత్యేకంగా వేరొక దానితో కలిపి పోలిక కట్టి చెప్పడమే అలంకారం. వస్తువుని బట్టీ, పోలికల తీరుని బట్టి వివిధ అలంకారాలు నిర్వచించబడ్డాయి. వీటిల్లో చాలా రకాలున్నాయి. వాటి లక్షణాలన్నీ రాజశేఖర విరచిత అలంకారమకరందంలో సోదాహరణంగా చెప్పబడ్డాయి. ఈ అలంకార మకరందాన్ననుసరించి అలంకారాలు రెండు ప్రధాన సమూహాలుగా విభజించారు. ఒకటి అర్థాలంకారాలు. రెండు శబ్దాలంకారాలు. ఈ అలంకారాలు కవిత్వానికీ, సంగీతానికీ ఎలా అన్వయిచుకోవాలో ఈ అలంకార మకరందం చదివితే అర్థమవుతుంది. కావ్య ప్రశస్తిని చెప్పేటప్పుడు “కావ్యశోభాకరాన్ ధర్మానలంకారాన్ ప్రచక్షతే” అంటారు. కావ్యాల్లో కవిత్వానికి అందం తెచ్చేదే అలంకారం అని దీని అర్థం. కావ్య కవిత్వానికి అలంకారాలెలా ప్రశస్తమో, అదే విధంగా సంగీత శాస్త్రంలో శబ్దాలంకారాలు అంతే ముఖ్యం.

వాక్యాల్లో లేదా పద్య పాదాల్లో వున్న అర్థాన్ననుసరించి పోలికలు చెప్పే వాటిని అర్థాలంకారాలన్నారు. ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం వంటివి ఈ అర్థాలంకారాల్లోకే వస్తాయి. ఇవి నూటికి పైగా వున్నాయి. వాక్యంలో కానీ, పద్య పాదంలో కానీ శబ్దాన్ననుసరించి వివిధ పదాలనీ ఒక పద్ధతిలో వాడడాన్ని శబ్దాలంకారాలన్నారు. ఈ శబ్దాలంకారాలకి ధ్వనొక్కటే మూలమయినా, యోగ్యమైన అర్థమున్నప్పుడే అది శబ్దాలంకారంగా నిలబడ గలుగుతుంది. అంటే ఆయా శబ్దాలంకారాలకి అర్థం కూడా నీడలా వెన్నాడుతూనే ఉంటుంది. శబ్దాలంకారాల ప్రాముఖ్యత సంగీతంలో కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. పాడేటప్పుడు పదాల విరుపులూ, సాగదీపులూ ఇవన్నీ పాటకి కొత్త కొత్త అందాలిస్తాయి. ఉదాహరణకి ‘మారాము చేయు మారామునికి మారాడక మా రేడు తెచ్చివ్వనా?’ అన్న వాక్యం తీసుకుంటే ‘మారాము చేయు మారామునికి’ అన్న పదాలనీ, ‘మారాడక మా రేడు’ ని విరుస్తూ (మొదటి ఆవృతంలో ఉన్న పదాన్ని రెండో ఆవృతంలో వేరే అర్థంలో విరుస్తూ) పాడటం ఎంతో సొంపుగా వినిపిస్తుంది. ఈ శబ్దాలంకారాల్లో కూడా చాలా రకాలున్నాయి. అందులో ముఖ్యమైనవి యమకం, అనుప్రాసలు. మరలా వీటిలో కూడా వివిధ ఉపజాతులున్నాయి.

తెలుగు కవిత్వానికి సంగీతమూ, సాహిత్యం రెండశ్వాల్లాంటివి. సాహిత్యం భావ ప్రధానంగా సాగితే, సంగీతం లయప్రధానంతో రాగయుక్తంగా సాగుతుంది. అందువల్ల కవిత్వం కేవలం వచన ప్రధానంగానే కాకుండా శృతయోగ్యంగా కూడా రూపు దిద్దుకుంది. సాహిత్యానికి భాషా, భావమూ ప్రధానమయితే, సంగీతానికి శబ్దం ముఖ్యమైంది. ఈ మూడూ అంటే భాషా, భావమూ, శబ్దమూ కలవడం వల్ల సాహిత్యానికి (కవిత్వం, పద్యం, పాట మొదలైనవి) ఎనలేని పరిపుష్టి లభించింది. సాహిత్యంలో అర్థాలంకారాల పాత్ర పోలికలూ, వర్ణనలకీ మూలమయితే, శబ్దాలంకారాలు సంగీతానికి ఆయువుపట్టయ్యాయి.

సంగీతానికి రాగం, తాళం ప్రధానమైనవి. శబ్ద ప్రేరేపితమైన రాగం ద్వారా పాట తీరు తెలిస్తే, దానికమర్చిన తాళం ద్వారా దానికొక లయస్తుంది. అప్పుడా పాట నడకకొక తూగు, వూగూ అమరుతాయి. సంగీతంలో స రి గ మ ప ద ని స్వరాల గురించి అందరికీ తెలుసు. ఈ స్వరాలని రాగాన్ననుసరించీ ఒక క్రమపద్ధతిలో అల్లడంవల్ల ఆ పాట వినసొంపుగా వుంటుంది. కేవలం స్వరాలతో ఒక రాగంలో పాడితే సంగీతజ్ఞానమున్న వాళ్ళు ఆనందించగలరేమో కానీ, మామూలు ప్రజలకి అదెంత మంచి రాగమైనా ఒక పట్టాన ఎక్కదు. అందువల్ల అందరికీ శ్రుతిపేయంగా ఉండడానికి ఆ సరిగమల స్థానంలో పదాలూ, పద సమూహాలూ వచ్చాయి. వాటితో పాటు భావం వచ్చింది. అందులో కవిత్వం రూపుదిద్దుకుంది. సంగీతం శబ్ద ప్రధానమైనది కాబట్టి ఆ కవిత్వంలో వాడే పదాలు సరళంగానూ, సున్నితంగానూ ఉండే అవసరమొచ్చింది. అందువల్ల ఏ వాగ్గేయకారుడైనా భాష మీద చాలా పట్టుంటే కానీ శబ్దాలంకార ప్రయోగాలు చేయలేరు. ఈ శబ్దాలంకారాల వల్ల పద్యానికయినా, పాటకయినా కొత్త మాధుర్యం వస్తుంది. కర్ణాటక సంగీతంలో ఈ శబ్దాలంకారాల వాడకం అనాదిగా వుంది. పురందర దాసు నుండీ అన్నమయ్య, రామదాసూ, క్షేత్రయ్యా, త్యాగరాజుల వరకూ ప్రతీ వాగ్గేయ కారుడూ వీటిని విరివిగా వాడినవారే!

తెలుగు వాగ్గేయకారులందరిలోకీ త్యాగరాజు కృతుల్లో ఈ శబ్దాలంకారాల ప్రయోగం ఎక్కువగా కనిపిస్తుంది. అన్నమయ్య కీర్తనల్లో కూడా ఉన్నా, సింహభాగం కీర్తనలకి స్వరాలు తెలీవు. అందువల్ల అవి ఆయా రాగాల్లో ఎలా పొందికగా శ్రుతిపేయంగా అమరాయో మనకింకా అనుభవంలోకి రాలేదు. త్యాగరాజు కృతులు బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రస్తుతమున్న కృతుల్లో అన్నింటికీ స్వరాలున్నాయి. వాటి వరసలున్నాయి. అందువల్ల ఈ శబ్దాలంకారాలని సులభంగా గుర్తించడమే కాకుండా విని అనుభవించగలం కూడా. అందుకే త్యాగరాజు కృతుల్లో వివిధ శబ్దాలంకారాలూ ఎలా ఏ విధంగా వాడబడ్డాయీ, తద్వారా పాటల్లో ఎంత సొగసొచ్చిందీ వంటివి వివరంగా తెలియజేయడానికే ఈ చిన్ని ప్రయత్నం.

తెలుగు పద్యాల్లో తేటగీతి, ఆటవెలది, సీస పద్యాలు మినహాయించి ప్రధాన వృత్తాల్లో ప్రాస నియమం వుంది. అంటే ఒక గణం లేదా పదంలో ఉన్న ఒక అక్షరం వేరే గణం లేదా మరో పదంలో అదేస్థానంలో పునరావృతం మవ్వడాన్ని ప్రాస అంటాం. సాధారణంగా ద్వితీయాక్షర ప్రాస వుంటుంది. ఈ ప్రాసల వల్ల ఒక రకమైన లయతో కూడిన భాషా సౌందర్యం వస్తుంది. పద్యాల్లో వాడే ఈ ప్రాస నియమాన్ని కర్ణాటక సంగీతంలోని ప్రముఖ వాగ్గేయకారులూ అనసరించారు. అన్నమయ్యా, రామదాసూ, క్షేత్రయ్యా, త్యాగరాజుల కీర్తనల్లో ఈ ప్రాస నియమం తరచుగా కనిపిస్తుంది. శబ్దాలంకారాల్లో నలభైకి పైగా రకాలున్నా వాటిలో అనుప్రాసము, యమకం ప్రధానమైనవి. సంగీత కృతులూ, కీర్తనల్లో ఇవే ఎక్కువగా కనిపిస్తాయి.

అనుప్రాసము

ఒక అక్షరం గాని లేక అక్షరాల సముదాయం గానీ, లేదా ఒక పదం గానీ మరల మరలా ఒక పాదంలో వస్తే దాన్ని అనుప్రాసమంటారు. ఇది నాలుగు విధాలు. 1. వృత్యాను ప్రాసము, 2. ఛేకాను ప్రాసము, 3. లాటాను ప్రాసము, 4. ఆది లేక అంత్యాను ప్రాసము. త్యాగరాజు కృతుల్లో అనుప్రాసల ప్రయోగం విరివిగా కనిపిస్తుంది. ఈ అనుప్రాసలు వాడుతూ కృతులకి ఒక రకమైన శబ్ద సౌందర్యమే కాకుండా అర్థ సౌందర్యం కూడా వచ్చేలా త్యాగరాజు శ్రద్ధ వహించాడు.

కుంతల వరాళి రాగంలో ‘శర శర సమరైక శూర‘ కృతిలో ఈ అనుప్రాసలు ఎక్కువగా కనిపిస్తాయి.

పల్లవి:
శర శర సమరైక శూర
శరధి మద విదార
అనుపల్లవి:సుర రిపు మూల బలమను కూల
గిరులకు నల సమమౌ శ్రీ రామ |శర|
చరణం:
తొలి జేసిన పాప వన కుఠారమా
కలనైనను సేయగ లేని
బలు విలును విరిచి వెలసిన శ్రీ రఘు
కుల వర బ్రోవుము త్యాగరాజ నుత |శర|

ఈ కృతిలో శర అన్న పదం (శబ్దం) పదే పదే వచ్చింది. అలాగే ర, ల, మ అక్షరాల సముదాయంతో కూడిన పద ప్రయోగం కనిపిస్తుంది. వాడిన ప్రతీసారీ వేరొక హల్లుతో వాడి వేరే అర్థం వచ్చేలా అక్షర పునరుక్తి ప్రయోగం వల్ల శబ్ద పరంగా లయ కుదిరి చెవులకింపుగా వుంటుంది. ఈ కృతిలో కనిపించే అనుప్రాస విధానాన్ని వృత్యానుప్రాసము అంటారు. అంటే ఒకటి గానీ, అంతకంటే ఎక్కువగా కానీ హల్లులు అనేకసార్లు వస్తే, అది వృత్యానుప్రాసము అని నిర్వచిస్తారు.

త్యాగరాజు ఈ కృతిలో రాముడి శౌర్యాన్ని వర్ణిస్తూ స్వరపరిచాడు. కాబట్టి శౌర్యానికి సంబంధించిన పదాలనే అతి చాకచక్యంగా, భావయుక్తంగా వాడాడు. ఇంకో విషయం ఏమిటంటే ప్రతీ కృతికీ తాళానుసారంగా ఒక గతుంటుంది. అందులోకి సాహిత్యం సరిగ్గా ఇమడాలి. భావం చెడకూడదు.లేకపోతే వినసొంపుగా వున్నా, భావయుక్తంగా ఉండదు. అది కాకుండా పాటకి రాగాన్ననుసరించి వివిధ స్థాయిల్లో పాట వెళుతుంది. అందువల్ల పాడే వాళ్ళకి పై స్థాయిలో పాడేటప్పుడు సాహిత్యం సరళంగా ఉండాలి. దిత్వాక్షరాలు కానీ, సమ్యుక్తాక్షరాలూ ఎక్కువగా వాడితే నాలిక మడత పడే ప్రమాదం ఉంది. సరళమైన పదాలే వాడాలి. అందువల్లే ఒక పాట రాయడం కష్టం. త్యాగారాజు కృతిని స్వయంగా రచించి దానికొక రాగం అమర్చాడు. పాటకి వరస కట్టేటప్పుడు ఏ ఏ నియమాలు పాటించాడో, అదేవిధంగా సాహిత్యం వచ్చే సరికీ అవే సూత్రాలు వీలున్నంత వరకూ అనుసరించాడు. జాగ్రత్తగా గమనిస్తే పైన చెప్పిన కృతిలో వాడిన పదాలన్నీ సరళమైనవే.