ఛందస్సే యయె నీదు కోవెల

పరిచయము

తెలుగులో లక్షణగ్రంథాలను ఎందరో లాక్షణికులు రచించారు. రేచన, అనంతుడు, అప్పకవి, వేంకటరమణకవి ఆ కాలపు వారైతే ఇరవైయవ శతాబ్దములో వేదము వేంకటరాయశాస్త్రి, టేకుమళ్ల రాజగోపాలరావు, కొక్కొండ వేంకటరత్నం పంతులు, గిడుగు సీతాపతి, గిడుగు రామమూర్తి, రావూరు దొరసామి శర్మ, కోవెల సంపత్కుమారాచార్యులు, కె. హరిసర్వోత్తమరావు, మోడేకుర్తి సత్యనారాయణ, సంగభట్ల నరసయ్య, రవ్వ శ్రీహరి, గాదె ధర్మేశ్వరరావు ముఖ్యులు. గడచిన శతాబ్దపు చివరి భాగములో సంపత్కుమారాచార్యులు నిజముగా అందరికీ ఈ రంగములో మార్గదర్శకులుగా నిలిచారు.


కోవెల సంపత్కుమారాచార్య
(26 జూన్ 1933 – 6 ఆగస్ట్ 2010)

కోవెల సంపత్కుమారాచార్యులు 1933లో వరంగల్లులో జన్మించారు. తండ్రిగారైన రంగాచార్యులవద్ద సంస్కృతాన్ని అభ్యసించారు. బందరులోని ప్రాచ్య కళాశాలలో భాషాప్రవీణు డయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయములో తెలుగులో, హిందీలో ఎం.ఏ. డిగ్రీలు సంపాదించారు. కాకతీయ విశ్వవిద్యాలయపు మొదటి డాక్టరేటు వీరే. బడిపంతులుగా జీవితాన్ని ప్రారంభించి ప్రాధ్యాపకుడుగా విరమించారు. మూడు భాషలలో ప్రావీణ్యత, ప్రాచీన నవకవితలను నిష్పక్షపాతముగా తరచి చూసి అందులోని సుధలను పంచివ్వగల ధీశక్తి వీరి ప్రత్యేకత. వీరు తెలుగు ఛందస్సుకు చేసిన సేవను నాకు తోచినంతవరకు పాఠకులకు తెల్పడమే ఈ వ్యాసపు ప్రధానోద్దేశము.

సంపత్కుమారుల ఛందస్సేవ

ఛందశ్శాస్త్రమును సంపత్కుమార ఎన్నో కోణాలనుండి అధ్యయనము చేశారు.

 1. ఉన్న విషయాలను జాగ్రత్తగా సేకరించి, వాటిని వడబోసి అందులోని సారాన్ని అందరికీ అర్థమయ్యేటట్లుగా తెలుగు ఛందోవికాసము, ఛందఃపదకోశము అనే గ్రంథాలను రాశారు.
 2. మరుగు పడిపోయిన లక్షణగ్రంథాలను, ప్రచురించబడని గ్రంథాలను పరిష్కరించి వాటికి సుదీర్ఘమైన పీఠికలు వ్రాసి వెలుగులోకి తెచ్చారు. అటువంటి గ్రంథాలే – కూచిమంచి తిమ్మన వ్రాసిన (సర్వ)లక్షణసారసంగ్రహము, కూచిమంచి వేంకటరాయని సుకవిమనోరంజనము. వీటిని ప్రత్యేకముగా ఛందోభూమికలు అనే పుస్తకములో కూడ చేర్చారు.
 3. తార్కికముగా ఛందశ్శాస్త్రాన్ని పరిశోధించి అందులోని కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసికొని వచ్చారు. తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు అనే పుస్తకము ఈ కోవకి చెందినదే.
 4. కొన్ని విషయాలు ఒక్కొక్కప్పుడు వాదవివాదాలకు దారి తీస్తాయి. ఆ సమయములో ఆవేశము లేకుండా అందులోని మంచి చెడులను శాస్త్రీయముగా చర్చించుట ఒక ముఖ్యమైన విషయము. దీని ఫలితమే చేకూరి రామారావు గారితో రాసిన పుస్తకము వచన పద్యము – లక్షణ చర్చ.
 5. సంపత్కుమారులు పండితుడు, పరిశోధకుడు మాత్రమే కాదు, ఉత్తమ కవి కూడ. వారికి తట్టిన కొన్ని కొత్త ఊహలను తమ పద్యాలలో అమలుపరచారు. శ్రీకృష్ణకర్ణామృతము లోని పద్యాలను పరిశీలించి వాటి పేరులను అమృతఛందస్సు అనే ఒక పట్టికగా తయారు చేశారు.

పైన తెలిపిన అన్ని విషయాలకు సంగ్రహముగా నా వివరణలను ఈ వ్యాసములో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ ఛందో గ్రంథములలోని అధ్యాయాలను, వివరించిన విషయాలను అనుబంధంలో చూడవచ్చును.

తెలుగు ఛందోవికాసము

1960లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు తెలుగు ఛందస్సుపైన పెట్టిన పోటీలో గిడుగు సీతాపతిగారి గ్రంథానికి బహుమతి లభించింది. వారి పుస్తకముతోబాటు ఇంకొక రెండు పుస్తకాలను ముద్రించాలని అకాడెమి తలచి, శ్రీ రావూరి దొరసామి శర్మ, శ్రీ కోవెల సంపత్కుమారాచార్యుల పుస్తకాలు దీనికి అర్హములని భావించింది. దాని ఫలితమే ‘తెలుగు ఛందోవికాసము’. ఇది 1962లో ప్రచురించబడినది. దీనికి శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు ప్రస్తావన రాశారు. ఇది 330 పుటల పుస్తకము. ఇందులో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పుస్తకములోని విశేషమేమంటే శాసనకాలమునుండి నేటివరకు, ఛందస్స్వరూపాలను, వాటి ఉత్పత్తి వికాసాలను కూలంకషముగా ఆచార్యులు చర్చించారు. ఈ పుస్తకములోని కొన్ని ముఖ్య విషయాలను ఇక్కడ పరామర్శిస్తాను.

 1. పింగళ ఛందస్సులోని త్రిక గణాలతోబాటు రత్నమంజూష, జ(జా)నాశ్రయి రచయితలు ప్రతిపాదించిన నవీన గణస్వరూపాలను కూడ వివరించారు. ఇది గణస్వరూపాలకు ఒక ప్రత్యేకత నిచ్చింది.
 2. శాసన పద్యాలలో తెలుగు రీతిలో (యతిప్రాసలతో) వ్రాయబడిన సంస్కృత కందము, చంపకమాలలకు ఉదాహరణలను చూపారు. అంతే కాక ఆ కాలములోనే మాత్రాఛందస్సులైన రగడలవంటి పద్యాల వాడుకను గురించి ప్రస్తావించారు.
 3. ఆదికవియైన నన్నయ ఛందస్సుపైన ఒక నిడివియైన అధ్యాయాన్ని కేటాయించారు. ఇందులో వారు ఉపయోగించిన పద్యాల ఛందస్సు, వాటి సంఖ్య, ఖ్యాత వృత్తాలు, విశేష వృత్తాలు, సీసములాటి పద్యాలలోని వైవిధ్యము, వాటిలోని యతుల అమరిక, మధ్యాక్కరలలో యతి ప్రయోగము, పద్యాలలోని ప్రాసల తీరు – వీటిని గురించి సంగ్రహముగా, సోదాహరణముగా రచించారు.
 4. యతి ప్రాసల అధ్యాయములో వడి అని పిలువబడే అక్షరసామ్య యతి పుట్టు పూర్వోత్తరాలను విశదీకరించారు. ఈ యతుల సంఖ్య కవిజనాశ్రయము, ఛందోదర్పణము, అప్పకవీయము లాటి తెలుగు ఛందోగ్రంథాలలో ఎలా మార్పులు చెందాయో అనే విషయాన్ని విస్తారముగా వివరించారు. ప్రాసభేదాలను కూడ విడమరచి చెప్పారు. చతుర్విధకవిత్వము, శతకము, ఉదాహరణ, జానపద ఛందస్సులను కూడా మరువలేదు.
 5. ఇందులో మూడు అనుబంధాలు ఉన్నాయి – అవి వృత్తసూచిక, బంధనామసూచిక, షట్ప్రత్యయములు. ఇందులోని వృత్తసూచిక నా ఉద్దేశములో ఒక ప్రత్యేకత.
 6. ఆధునిక ఛందస్సుపైన ఒక సుదీర్ఘమైన అధ్యాయమే ఉన్నది. గురజాడవారి ముత్యాలసరాలు, శ్రీశ్రీ ఉపయోగించిన ఛందస్సు, కిన్నెరసాని పాటలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. మాత్రాఛందస్సులైన రగడలు, అర్ధ రగడలు, వాటి భేదాలను పదేపదే నవయుగములో కవులు ఎలా ఉపయోగించారో అన్నది ఇందులోని ముఖ్యాంశము.
  ఇందులో నన్ను ఎక్కువగా ఆకర్షించినది ద్విపదను గురించి వీరు వ్రాసిన అధ్యాయము. ఈ విషయాన్ని తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు అనే పుస్తకములో కూడ వివరించారు. అక్కడ ఈ వివరాలను తెలుపుతాను.

ఛందఃపదకోశము

తెలుగు అకాడెమీ వారు తెలుగు సాహిత్యకోశము, వ్యాకరణకోశము లాటి కొన్ని శాస్త్ర నిఘంటువులను ప్రచురించారు. ఆ కోవకు చెందినదే ఛందఃపదకోశము కూడ. దీని సంగ్రాహకుడు సంపత్కుమార, పరిష్కర్త శ్రీ దువ్వూరి వేంకటరమణ శాస్త్రిగారు. 349 పుటల ఈ గ్రంథము 1977లో ప్రచురించబడినది. ఇందులో ఐదు అధ్యాయాలు ఉన్నాయి. గురులఘువులు, మాత్రలు, గణములు, ఉపగణములు, గద్య, పద్య, వచనముల లక్షణాలను గురించిన విషయాలు – పరిభాషలు అనే మొదటి అధ్యాయములో ఉన్నాయి. యతి, వడి, యతి భేదాలు, ప్రాస భేదాలు ఇవన్నీ యతిప్రాసములు అనే రెండవ అధ్యాయములో వివరించబడినాయి. 136 పుటల సుదీర్ఘమైన మూడవ అధ్యాయము వృత్తాలపైన వ్రాయబడినది. ఒకటినుండి 26 అక్షరాలవరకు ఉండే ఛందముల పేరులు, అందులోని ముఖ్యమైన వృత్తాలు, 26 అక్షరాలకు ఎక్కువగా ఉండే ఉద్ధురమాలా వృత్తాలు, అర్ధసమ వృత్తాలు (మొదటి రెండు పాదాలవలె చివరి రెండు పాదాలు), విషమ వృత్తాలు (పద్యములోని నాలుగు పాదాలకు వేరు వేరు లక్షణాలు), దండకములు మున్నగునవి ఈ అధ్యాయపు ముఖ్యాంశాలు. అన్ని వృత్తాలకు ఉదాహరణములు చూపబడ్డాయి. రామాయణ కల్పవృక్షము నుండి ఎన్నో పద్యాలను విశేష వృత్తాలకు ఉదాహరణాలుగా ఎత్తి చూపించారు. జాత్యుపజాతుల ప్రకరణములో సంస్కృతములోని జాతులయిన ఆర్యాగీతి భేదాలు, మాత్రా వృత్తాలకు నాంది పలికిన వైతాళీయములు, తెలుగులోని ఉత్సాహ, అక్కరలు, రగడలు, తరువోజ, ద్విపద మున్నగునవి, సీసము, గీతులవంటి ఉపజాతులకు లక్షణాలు వివరించారు. చివరి అధ్యాయములో ఛందోగ్రంథాలు, లాక్షణికులు, చిత్రకవిత వంటి విషయాలను తెలిపినారు. ఈ పుస్తకపు మరొక ప్రత్యేకత గ్రంథాంతములోని విపులమైన అకారాది పట్టిక. ఛందస్సులో ఆసక్తి ఉండే ప్రతి విద్యార్థి, పరిశోధకుడు పక్కన పెట్టుకొని చదువవలసిన అత్త్యుత్తమ గ్రంథము ఇది అని చెప్పడములో ఏ మాత్రము అతిశయోక్తి లేదు.