విశ్వనాథ కోవెల

యదభిముఖముగ జెప్పిరో అల్ల దాని
దదభిముఖముగ జూచిన ధర్మ మొప్పు
అపముఖమ్ముగ జూచిన అఖిల దోష
కలితముగ దోచు ధర్మ సంఘాతమెల్ల

– (రామాయణ కల్పవృక్షము, అయోధ్య, పాదూ ఖండము.)

విశ్వనాథని తలచుకోకుండా కోవెలవారి సంస్మరణ సంపూర్ణం కాదు. సంపత్కుమారగారికి విశ్వనాథతో ఉన్న అనుబంధం అల్లాంటిది. విశ్వనాథ విషయంలో కోవెల సంపత్కుమారగారు ఒక విమర్శకుడు కాదు, వ్యాఖ్యాత. విశ్వనాథశారద విరాడ్స్వరూపాన్ని సమగ్రంగా దర్శించి, తన విశ్లేషణా సామర్థ్యంతో, స్పష్టమైన సరళమైన రచనాశైలితో వివిధ వ్యాసాల రూపంలో సహృదయులకి పరిచయం చేశారు సంపత్కుమార. ఇంచుమించుగా ఆ వ్యాసాలన్నిటినీ సమీకరించి, ‘విశ్వనాథ సాహిత్య దర్శనం’ అనే పుస్తకం ప్రచురించారు. ఈ పుస్తకానికి ఆముఖంగా పై పద్యముంటుంది. ఇది సంపత్కుమారగారి విమర్శ దృక్పథాన్ని ప్రతిఫలించడమే కాకుండా, అసలు సహృదయులైన పాఠకులు సాహిత్యాన్ని, అందులోనూ కవిత్వాన్ని, ఎలా చదివి ఆస్వాదించాలో కూడా సూచించే పద్యం. దాని వివరణ సంపత్కుమారగారి మాటల్లోనే:

“కవి ప్రతిపాదిస్తున్న విషయం గూర్చి పాఠకునికి ఉండే అభిప్రాయభేదాలను బట్టి కూడా కావ్యం అర్థమవడం కాకపోవడం ఉంటుంది. ప్రతిపాదింపబడ్డ విషయం పాఠకుడికి అనిష్టమవుతే, అది ఆధారంగా సాగిన రచన సమస్తమూ తదభిముఖంగానే ఉంటుంది. కాబట్టి, మొత్తమూ అనిష్టం అయ్యే ప్రమాదం ఉన్నది. అందుకని ఆ విషయమందు పాఠకుడికి సానుభూతి ఉండటం అవసరం. అప్పుడే కావ్యగతమైన సర్వరచనా శిల్పమూ, రసనిర్వహణా, తద్విషయానికి సంబంధించిన సంప్రదాయానుసరణమూ పాఠకునికి కావ్యానందాన్ని కలుగజేస్తవి.”

కల్పవృక్షంలో విశ్వనాథ ధర్మపరంగా చెప్పిన విషయాన్ని సంపత్కుమార కావ్యానికి చక్కగా అన్వయించారు. ఇది నిజానికి ఏ కవిత్వానికైనా అన్వయించుకో దగిన సూత్రమే. సంపత్కుమార చేసిన విశ్వనాథ సాహిత్య విశ్లేషణ అంతటికీ యీ సూత్రం ఆధారం. అందుకే అది విశ్వనాథని సక్రమంగా అర్థం చేసుకోవడానికి కరదీపిక. ఒక్క విశ్వనాథనే కాదు, ఎవరి కవిత్వాన్ని ఆస్వాదించేందుకైనా అవసరమైన కొన్ని మౌలిక సూత్రాలు సంపత్కుమారగారి వ్యాసాలలో మనకు దొరుకుతాయి. వారు చూపించిన ఆ దారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, నా అవగాహన మేరకు పాఠకులకు దాన్ని పరిచయం చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తాను. నిజానికిది సంపత్కుమార గురించిన వ్యాసం కాదు. వారి పేరు చెప్పుకొని, వారి మాటల్లో, విశ్వనాథ సాహిత్యాన్ని మరోమారు, మరికొంత లోతుగా అవగాహన చేసుకొనే ప్రయత్నమే!

ఒక సాహిత్య రచనని, అందులోనూ కవిత్వాన్ని సరిగాను, సమగ్రంగాను అర్థం చేసుకోడం ఎలా? ఇది సాహిత్యాభిమానులైన పాఠకులకి తరచూ తలెత్తే ప్రశ్న. నాకు తెలిసి దీనికి చిటికలో సాధ్యమయ్యే చిట్కాలాంటిదేదీ లేదు. సాహిత్యం సంగీతంలా ఆపాతమధురం కాదు, ఆలోచనామృతం. సాహిత్యమనే పాలసముద్రాన్ని మన మనసనే మంథరంతో మథించగా మథించగా పుట్టే అమృతం. సాహిత్యాన్ని మథించడమంటే? ఒక రచనలో ఉండే అభివ్యక్తి, అంతస్సారం – రెండిటినీ బాగా పరిశీలించి, అవగతం చేసుకొని, వాటి సమన్వయంలోంచి పుట్టే అనుభూతిని హృద్గతం చేసుకోవడమే ఆ మథనం. అంతే కాని Love at first sight అన్న మాదిరి చదవగానే మనసుకి హత్తుకొని గొప్ప అనుభూతిని కలిగించెయ్యాలనుకోవడం అత్యాశే. కొన్ని కొన్ని రచనలు అలా హత్తుకోవచ్చు. కాని అన్నీ అలాగే అవ్వాలనుకోవడం సమంజసం కాదు. గాఢమైన, శాశ్వతమైన అనుభూతి మిగిల్చేవి మాత్రం అలాంటి మథనాన్ని అపేక్షించే రచనలే అని నేననుకుంటాను. విశ్వనాథ సాహిత్యం ఆ కోవకి చెందుతుంది. విశ్వనాథ సాహిత్యంలోని అంతర్బహిస్స్వరూప స్వభావాలని సమగ్రంగా దర్శించినవారు సంపత్కుమార. ఆ అభివ్యక్తి అంతస్సారాల సమన్వయ దర్శనం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం.

1. అభివ్యక్తి

చెప్పదలుచుకున్న విషయానికీ, వస్తువుకి రచయిత కల్పించే విలక్షణమైన ఆకృతి అభివ్యక్తి. ఇది రసవ్యంజకంగా ఉన్నప్పుడే అది మంచి రచన అవుతుంది. అలా చెయ్యగలగడమే కవి ప్రతిభ. “కవి ప్రతిభలోన నుండు కావ్యగత శతాంశములయందు తొంబదియైన పాళ్ళు” అని విశ్వనాథ అనడంలో ఉద్దేశం అదే. రచనా సంవిధానం, శైలి, భాష మొదలైన అంశాలు రచనకి విలక్షణ రూపాన్ని ఇస్తాయి. విశ్వనాథ రచనాభివ్యక్తిలోని వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని పరిశీలించాలంటే దానికి రకరకాల మార్గాలున్నాయి.

1అ. ఆలంకారిక మార్గం

ప్రాచీన కావ్యాల గురించి అభివ్యక్తి పరమైన విచారం మన అలంకారశాస్త్రంలో సర్వేసర్వత్రా కనిపిస్తుంది. విశ్వనాథ కావ్యాలు ప్రధానంగా ఆ సంప్రదాయాన్ని అనుసరించినవే కాబట్టి అలంకారశాస్త్రాధారంగా వారి రచనల్లోని అభివ్యక్తిని విశ్లేషించవచ్చు. అలంకారశాస్త్రంలో సంపత్కుమారగారికి గొప్ప పాండిత్యం ఉన్నది. అది విశ్వనాథ సాహిత్య వివేచనకు ఎంతగానో ఉపయోగపడింది. ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము – తులనాత్మక పరిశీలన’ అన్న వ్యాసంలో దీనికి ఒక మంచి ఉదాహరణ కనిపిస్తుంది. కావ్య నాయకునిగా రాముని పాత్ర వాల్మీకం, తులసీదాస రామాయణం, కల్పవృక్షాలలో ఏ రకంగా ఉన్నదీ; కావ్యంలో ఉండాల్సిన రసౌచిత్యం దృష్ట్యా తులసీదాస రామాయణం కన్నా కల్పవృక్షం ఎలా ఉత్తమమార్గాన్ని అవలంబించిందీ చక్కగా విశ్లేషించి చూపారు.

“వాల్మీకిని రామునిలోని మహాపురుషత్వం, మర్యాదావధిత, పూర్ణ మానవభావం తద్గాథాగానంలో ప్రేరేపించినాయని తెలుస్తుంది. రామాయణారంభంలో నారద వాల్మీకుల సంభాషణ ద్వారా ఇది స్పష్టమవుతున్నది… అందువల్లనే తన రామాయణమందంతటా రాముని ఆ విధంగానే చిత్రించినాడు కాని దేవత్వాన్ని అతనియం దారోపించలేదు. తులసీదాస్ మరొక విధముగా ప్రేరణ పొందినాడు. ఆయనను రామునిలోని పరబ్రహ్మత్వం ఆకర్షించింది. అతనికి రామతత్వముపాస్యమైనది… అందువల్ల అతనికి మహాపురుషుడైన రాముడు గాక పరబ్రహ్మగా రూపొందిన రాముడే ముఖ్యుడయినాడు. పురాణాదులలోకి వెళ్ళేప్పటికి ఈ గాథ, అవతారవాదము ప్రబలి రాముడు ఎల్లాగూ పరబ్రహ్మగా మారిపోయినాడు. ఆయా పురాణాలు ఆధ్యాత్మిక దృష్ట్యా రామాదులను సంకేతములుగా తీసుకొని వేదాంతబోధ చేసినవి. అల్లాంటి వివిధ పురాణాదులను మనోదఘ్నంగా తులసీదాసు అధ్యయనం చేసినాడు. స్వయముగా ఆజన్మతః భక్తుడయిన తులసీదాసు వాటితో ప్రభావితుడయినాడు…

మరి విశ్వనాథ దాకా వస్తే విశ్వనాథ అద్వైతి… ఈయనకూ రాముడు బ్రహ్మస్వరూపమే. ఈయనా భక్తుడే… తాను మహాభక్తుడు కావచ్చును. మరేమయిననూ కావచ్చును. కాని కావ్యరచనా సందర్భంలో వీటన్నిటినీ మించి రసమార్గము ఉన్నది. ఆ రసనిర్వహణ కొరవడినట్లయితే రచన ఉత్తమకావ్యంగా గణ్యం కాకుండాపోతుంది. అందుకనే “ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి రెట్లు గొప్పది, నవకథాదృతిని మించి” అంటాడు విశ్వనాథ. లోచనకర్త కూడా, “రస ఏవ వస్తురాత్మా, వస్త్వలంకారద్వ్హనీతు సర్వధా రసం ప్రతిపర్యవస్యేతే” అని నిక్కచ్చిగా వచిస్తాడు. అందువల్ల తనకు రాముడు పరబ్రహ్మ అయినా, రసౌచిత్యం కొఱకు, కథౌచిత్యం కొఱకు, యథా వాల్మీకంగానే, అంటే రాముడు పూర్ణపురుషుడు గానే రామాయణ రచన సాగవలసి వస్తుంది. అందుకనే విశ్వనాథ ఇక్కడ ఉత్తమ మార్గమును అనుసరించినాడు. రాముని మహామానవునిగా చిత్రిస్తూ తత్కాలీనులలో అతనియందలి పరబ్రహ్మ భావన వ్యక్తం చేయించాడు. దీనివల్ల రసాద్యౌచిత్య భంగ రహితంగా ఉభయథా భవ్యరచన అవుతున్నది.

మరొకటి, రామగాథలో కన్న కృష్ణగాథలో భక్తిరసం నప్పుతుంది. ఎందుకంటే, రాముడు ‘అదివ్యనాయకుడు’. కృష్ణుడు ‘దివ్యాదివ్య నాయకుడు’… అదివ్యనాయకుని యందు దివ్యత్వం ఆరోపించడము వల్ల ఔచిత్యభంగం కలుగుతుంది. వీటన్నిటి దృష్ట్యానే కావచ్చు, అలంకారికులు సర్వసమ్మతంగా ‘భక్తిరసం’ ఒప్పుకోలేదు… రాముడు భగవంతుడే అన్న విషయాన్ని స్వయంగానూ, రామునిద్వారానూ తులసీదాసు చెప్పిస్తాడు. విశ్వనాథ అల్లా కంఠోక్తిగా చెప్పక ఇతరపాత్రల ద్వారా వ్యక్తీకరింపజేస్తాడు. ఈయన రాముని పరబ్రహ్మముగా చిత్రించలేదనడానికి ఉదాహరణ ఒకటి ఉంది. పరబ్రహ్మయందు లోపమని ఏదీ ఉండగూడదు. ఉంటే పూర్ణత్వానికి లోపం వస్తుంది. కాని విశ్వనాథ రామునియందు ‘హాస్యశీల’ మనే ఒక లోపం ఉన్నదని మారీచునిచే రావణునికి చెప్పిస్తాడు. దీనివల్ల రామ పాత్రను మానవునిగానే చిత్రించినట్లవుతుంది… అయితే తత్కాలీనులు, తత్సన్నిధానులచే దివ్యత్వం చెప్పించవచ్చును… అన్య పాత్రలచే రాముని భగవత్తత్వాన్ని స్ఫురింపజెయ్యడంవల్ల, పూర్ణమానవునియందు లోకం భగవద్భావన నెరపడం జరగవచ్చుననే సత్యం నిర్ధారితమవుతున్నది. రామ భగవత్తత్త్వాన్ని ఒప్పుకొనడములో తులసీవిశ్వనాథలు సమార్గులే అయినా, కావ్యగౌరవం దృష్ట్యా విమార్గులయినారు. విశ్వనాథ వాల్మీకి ననుసరించి ఉజ్జ్వలత్వాన్ని సంపాదించాడు.”

కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టు, రసౌచిత్యం చెడకుండా రాముని భగవత్తత్వాన్ని విశ్వనాథ తన కల్పవృక్షంలో ఎలా నిరూపించారో మనకీ విశ్లేషణ ద్వారా చక్కగా బోధపడుతుంది.