వచన పద్యం: ఒక పరిశీలన

పద్యం అనగానే పాదబద్ధత ఉండాలి, అన్నది మొదటి నియమం.

పద్యం యొక్క పాద నిర్మాణానికి ‘ఛందోబద్ధమైన పద్ధతి’ కూడా ఒకటి ఉండి తీరాలన్నది రెండో నియమం. దీన్నే ‘పాదం యొక్క అంతర్నిర్మాణం’ అనవచ్చు.

ఒక గతి ననుసరించి – మాత్రల పరిమితి గాని, గురు-లఘువుల నిర్దిష్ట వ్యవస్థ గాని, గణ పద్ధతి గాని, ఏదైనా సరే ఒక పద్ధతి ననుసరించి (అది ఛందశ్శాస్త్ర రిత్యా చెప్పబడ్డ పద్ధతే అయిఉండాలి) – పాదం యొక్క అంతర్నిర్మాణం ఏర్పడుతుంది.

1.పాదానికి మొత్తం ఇన్ని మాత్రలుండాలి. ఫలాని చోట్ల గురువులు లేక లఘువులు ఉండరాదు (లేక) ఉండవలె అన్న విధి నిషేధాలు ఒక పద్ధతి అంతర్నిర్మాణం.
2.పాదానికి మొత్తం ఇన్ని మాత్రలు: లయానుసారంగా, గతి భేదాన్ని బట్టి ఇన్నేసి మాత్రలకు విరుగుతూ, సమగతి విషమగతుల ననుసరించిన గురులఘువుల విధినిషేధాలతో గణవిభాగం చెప్పడం ఇంకొక పద్ధతి అంతర్నిర్మాణం. ఇది పరిభాషా బద్ధమైన శాస్త్రీయపద్ధతి.
3.పాదానికి ఇరవై అక్షరాలుండాలి. 1, 4, 6, 10, 13, 16, 18, 20 సంఖ్య గల అక్షరాలు గురువులు గాను, తక్కినవి లఘువులుగానూ ఉండాలి: ఇది ఉత్పలమాలా వృత్తం – ఇత్యాదిగా చెప్పడం ఒక అంతర్నిర్మాణ పద్ధతి.
4.ఉత్పలమాలకు భ-ర-న-భ-భ-ర-వ అనే గణాలు వరుసగా ఉండాలి అనేది పరిభాషాబద్ధమైన గణపద్ధతి ననుసరించిన అంతర్నిర్మాణం.
ఈ పద్ధతుల్లో అంతర్నిర్మాణం గూర్చి ‘చెప్పడం’లోనే ‘తేడా’లున్నవి గాని వస్తుస్థితి మాత్రం ఒక్కటే. పాదం అంతా ఒక యూనిట్‌గా తీసుకుని అంతర్నిర్మాణాన్ని గూర్చి వివరణ ఇచ్చినా, గణం యూనిట్‌గా తీసుకుని వివరించినా రెండూ ఒకటే. కాకపోతే మొదటి పద్ధతి ప్రాచీనమై, దానికి బోలెడు వివరణ కావాలి. రెండో పద్ధతి సులభమైన అర్వాచీన శాస్త్రీయ పద్ధతి. అంటే, పరిభాషా క్లేషమూ, గణ సాంకర్యం వంటి మినహాయింపుల బెడద పడాలి. కాని, రెండూ చెప్పేది ఒకటే సంగతి. పాదానికి ఛందోబద్ధమైన అంతర్నిర్మాణ పద్ధతి ఉన్నది, ఉండాలి.

ఛందః పద్ధతిలో – అక్షరాల దగ్గర్నుంచి మాత్రలు, గురు-లఘువులు, గణాలు, పాదాలు, పద్యం అనే పద్ధతిలో నిర్మాణం జరుగుతుంది. పద్యం దగ్గర్నుంచి పాదాలు, గణాలు, గురు-లఘువులు, మాత్రలు అనే విధంగా అక్షరాల కాడికి విభజన అవుతుంది. మధ్యలో గణ విభాగం ఉండాలన్నా; అక్కర్లేదు. గురు-లఘు నిర్దేశం చాలునన్నా, వస్తు స్థితి మాత్రం ఒక్కటే.

కాని, అక్షరాల దగ్గర్నుంచి పదాలు, భావాంశాలు, భావాలు లేక భావగణాలు అనే రీతి నిర్మాణం ఛందోబద్ధమైన పద్ధతి కాదు. పదాల నుంచి భావాంశాలు, భావాలు, వాటివల్ల భావగణాలు, భావగణాలను బట్టి భావలయ – ఇట్టి అంతర్నిర్మాణంతో ఏర్పడిన పాదబద్ధత వచన పద్యానికి చెప్పడం ఛందశ్శాస్త్రానుసారం మాత్రం కాదు. అది వేరే పద్ధతి కల్పన. అందువల్ల వచన పద్యాన్ని ‘ఛందస్సు’గా గ్రహించడానికి వీల్లేదు.

ఈ సందర్భంగా అలౌకిక వైదిక వాఙ్మయ సంబంధి అయిన ఒకానొక మారుమూల సూత్రాన్ని ఆశ్రయించి ఋక్పాద వ్యవస్థ (పఠనంలోనా? లేఖనంలోనా?) అర్థవశంగా ఉంటున్నది. వచన పద్య పాదవ్యవస్థ భావపరంగా ఉంటుంది కాబట్టి, ఇది గూడా ఛందశ్శాస్త్ర మర్యాదానుసారమే అని ఆధునిక లౌకిక సారస్వత సంబంధి అయిన వచన పద్యానికి ముడి వెయ్యటం పద్ధతిగా లేదు. ఛందఃకారకులెవరూ అర్థ-భావ వశంగా పాద వ్యవస్థను నిర్ణయించింది లేదు. అట్లాంటిదే విషమ వృత్తాల ప్రస్తావన కూడాను. అల్లాంటప్పుడు ఇక ఛందస్సు కానిదేముంటుంది?

ఒక శుద్ధవచన భాగాన్ని – వ్యాసం గానీ, వ్యాపార ప్రకటన గానీ – భావగణాల పద్ధతి ననుసరించి, పాద బద్ధత పాటించి రాస్తే లేదా అచ్చువేస్తే అది వచన పద్యమే అయ్యేటట్లయితే వచనానికీ, వచన పద్యానికీ ‘లేఖనం’లోనే తేడా ఉన్నట్లు గ్రహించవలసి వస్తుంది. అంటే, వచన పద్యాన్ని గూడా శుద్ధవచనంగా, వరసగా రాసేసి, మార్చి వెయ్యవచ్చునన్నమాట. అప్పుడు ఛందో ధర్మం ఎక్కడున్నట్లు?

పాదబద్ధత లేని ‘దండకం’ అంతర్నిర్మాణం వల్లే ఛందస్సు అయినట్లు, నిర్దిష్టమైన అంతర్నిర్మాణం లేకపోయినా సూత్రప్రాయంగా ఒక పాదబద్ధత గల ‘వచన పద్యం’ ఒకటి మాత్రం సకృత్తుగానే అయినా ఉన్నది.

రచయిత తాను కల్పించుకొన్న కొన్ని నిబంధనలతో అలాంటి వచన పద్యం రాస్తున్నాడు. ఆ కల్పించుకొన్న నిబంధనలు ఛందశ్శాస్త్ర మర్యాదానుసారాలు కావటం వల్లనే వాటిని పాటించిన పద్యాలు ఛందస్సు అవుతాయని చెప్పడం. నిర్దిష్టమైన అంతర్నిర్మాణం లేనందువల్ల వచనంలాగే ఉండినా, మాత్రల పరిమితితో ఛందోధర్మానికి కట్టుబడే సూత్రప్రాయమైన పాదబద్ధత వల్ల అవి శుద్ధవచనమూ – శుద్ధపద్యమూ కాకుండా వచన పద్యం కావలసి ఉన్నదని భావించాలి.

పద్యానికెన్ని పాదాలుండాలి అన్నది కవి ఇష్టం. రెంటినుంచి పది పన్నెండు దాకా, లేదా ఎన్నయినా పెట్టుకోవచ్చు; కాని, ఒకదానికొకటి, లేక ఏ కొన్నిటితోనైనా మరి కొన్నిటికి పాదాల్లో సామ్యం ఉంచుకోవాలి. ఒక పాదానికి ఇన్ని మాత్రలు; లేక కొన్ని పాదాలకు ఒక సంఖ్య, మరికొన్ని పాదాలకు ఇంకొక సంఖ్యగా మాత్రల పరిమితి – అని ఇట్లా కవి తాను కల్పించుకోవచ్చు. ఈ మాత్రాపరిమితిలో గూడా ఒకటీ అరా మాత్రలు హెచ్చుతగ్గులు ఉన్నా ఉండవచ్చు. అంత్యప్రాసాది అలంకార నియమం ఏదో ఒకటి ఉండకపోతే ఇదిగూడా శుద్ధవచనంలో అంతర్భవించే ప్రమాదం ఉన్నది. ఇటువంటి నిబంధనలతో రాసే వచన పద్యాలని ఛందో విభాగంగా గ్రహించవచ్చునని అభిప్రాయ పడుతున్నాను.

ఒక చిన్న ఉదాహరణ – ఐదు పాదాల వచన పద్యం ఒకటి. దానికి మొదటి రెండు పాదాలు ఒకటిగా – 15 మాత్రల పరిమితితో ఉంటాయి. తరువాతి రెండు పాదాలు ఒకటిగా – పన్నెండు మాత్రల పరిమితితో ఉంటాయి. చివరి పాదం పై నాల్గింటికి భిన్నమైనా, చివరి రెండు పాదాల పరిమాణంతో ఒకటిగా ఉంటున్నది. తొలి రెండింటికి, మలి రెండింటికి అంత్యప్రాసం; తొలి రెంటిలో చివరి పాదానికి అంత్యప్రాసం కల్పించబడ్డది. ఇది అంతర్నిర్మాణం లేని పాదబద్ధత మాత్రం గల వచన పద్యం. ఇందులో మూడో పాదంలో ఒక మాత్ర లోపించడం ఝుటితిని స్ఫురించకపోవచ్చు.

అమీనాను ఒదిలేసిన చలం
అందుకున్నాడు కరుణాచలం
గుడిసెపాటిది పోయింది
గుడిపాటిది వచ్చింది
క్వశ్చన్‌గా పుట్టి ఫుల్‌స్టాప్ అయ్యాడు నిశ్చలం.

ఇట్లా ఛందో విభాగంగా గ్రహింపదగ్గ పద్యాలు కొన్ని లేకపోలేదు. ఐతే, తుదముట్టా ఒక పద్ధతిగా రాసిన పద్యాలు ఏపాటి ఉన్నాయో చూడవలసి ఉంది. ఆరుద్రగారి ఇంటింటి పజ్యాలు ఈ కోవకు సన్నిహితమైనవి.

వచన పద్యాన్ని గూర్చి ‘భారతి’లో సంపత్కుమార, రామారావు గార్ల సిద్ధాంత వ్యాసాలు చూచింతర్వాత నాకు తోచిన ఈ రెండు మాటలు మనవి చేశాను. వారికి నా కృతజ్ఞతలు.

(భారతి, ఏప్రిల్ 1973. పే 64-66)