నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన

ఉ. ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చా
      పాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు స్వామి దే
      హాకృతి సర్వదేహమున యందును రాఘవ వంశమౌళి ధ
      ర్మాకృతి కూర్చున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై

ఇది లంకాపురిలో అశోక తరువు క్రింద కూర్చుని వున్న సీతాదేవి వర్ణన. ఆమెను వెదకడానికి పోయిన హనుమ రాత్రంతా అక్కడా ఇక్కడా వెదకి, చివరకు అశోకవనిలో ఆమెను చూచి, ఇంకా ఆమెను కలవక ముందు – అదే సమయంలో సీత వద్దకు రావణాసురుడు వచ్చి ఆఖరి హెచ్చరిక చేస్తాడు. అప్పటి సీత ఆకృతి ఇది.

ఆకృతి రామచంద్ర విరహాకృతి యట. ఇక్కడ విరహం ఉభయనిష్ఠము. రామచంద్రుడు సీత విరహాకృతి, సీత రామచంద్ర విరహాకృతి. సీతారాముల పరస్పరానుబంధం ఎటువంటిదంటే, తొలిసారిగా ఆమెను చూచిన హనుమ అనుకుంటాడు గదా – అసలు శ్రీరాముడంటే ఎవరో నాకు సంపూర్ణంగా తెలిసిపోయింది అనుకునే వాడిని, ఇప్పుడు ఈమెను చూసే సరికి అసలు నాకేమీ తెలియదు అనే సంగతి అర్థమయింది – సీత నెరుంగకుండ రఘుశేఖరుడర్థము గాడు పూర్తిగా – అని. ఇక సీత ఆకృతి రామచంద్ర విరహాకృతి కావడంలో ఆశ్చర్యమేముంది! రామచంద్ర విరహాకృతి అంటే రామచంద్రుని కొరకైన విరహము ఆకృతి దాల్చినట్లుండటమే గాక, సీత కొరకైన రామచంద్రుని విరహమంతా సీతగా మూర్తీభవించి ఇక్కడ కూర్చుని వుండడమూ కావచ్చు. మొత్తానికి ఆమె ఆకృతి అంతా ఒక వియోగ భావపు ముద్ద.

కన్బొమ తీరు స్వామి చాపాకృతి. కనుబొమలను ధనుస్సుతో పోల్చటం సాధారణ కవిసమయం. కనుబొమలు ధనుస్సు లాగా ఉండటం సౌందర్య సూచకం. సీత కన్బొమలు రామచాపంలా ఉన్నాయట. అంత బాధలోనూ ఆమె రూపలావణ్యాలను రూపిస్తూ వున్నది ఆమె కనుబొమల తీరు.

కన్నులన్ ప్రభువు కృపాకృతి. రామచంద్రుడెంత కృపాసముద్రుడో, ఆ కృప అంతా ఆమె కన్నుల్లో గూడు కట్టుకొని ద్యోతకం అవుతూనే వున్నది. ఈమె కన్నుల్లో ఆయన కృప ఆకారం ధరించటం ఆ దంపతుల ఏకత్వ భావనకు మరో తార్కాణం.

కైశికమందు రామ దేహాకృతి. కైశికమంటే తల వెండ్రుకలు. సీత కేశపాశాలు – శ్రీరాముని దేహవర్ణం వలే – నల్లనివే. ఆయన ఒంటి రంగు ఈమె కైశికంలో ఆకారం ధరించినట్లున్నది.

సర్వదేహమున్ యందును రాఘవ వంశమౌళి ధర్మాకృతి. సీత స్వయంగా మూర్తీభవించిన ధర్మము. రామచంద్రుడు ధర్మోద్ధారణకు అవతరించినవాడు. ఆయన ధర్మభావం మొత్తం ఆమె సర్వదేహంలోనూ మూర్తీభవించింది. ఇప్పుడు ఆ ధర్మానికే భంగం కలిగింది రావణుని వలన. రావణ నిగ్రహమూ, ధర్మ రక్షణా – వీటికి రాముని ప్రస్తుత కర్తవ్యం పరాకాష్ఠ అయి, అధర్మ నిర్మూలనం జరిగి సీత ఆకృతిగా వున్న ధర్మం పరిరక్షింపబడుతుంది.

ఇక ఆమె కూర్చున్న వైఖరి – రావణ నిర్మూలనానికి, అంటే అధర్మ నిధనానికి సన్నద్ధుడైన శ్రీరాముని పూనిక రూపం దాల్చినట్లు కూర్చున్నది. ఆమె కూర్చున్న పద్ధతిలోనే ఆమె నిశ్చయమూ, ఆమె నిశ్చలతా, తన భర్త యెడ ఆమెకు గల అనంత విశ్వాసమూ అన్నీ ద్యోతకమౌతున్నాయి.

ఒక క్షుద్రుని చేత దొంగతనంగా ఎత్తుకుని రాబడిన మహావమానాన్ని సహిస్తూ కూర్చుని వున్న ఆ పత్యైకశీల ఆకృతి, కనుబొమలు, కన్నులు, కేశపాశము, సర్వ దేహము, కూరుచున్న వైఖరి అన్నీ – ఆమె ఏ మహాత్ముని రాకడకై నిరీక్షిస్తున్నాయో – ఆయన లక్షణాలతో ఏకీభూతంగా ఆరోపింపబడటం ఈ పద్యంలోని సొగసు.

ఇక్కడ తీసుకురాబడిన సీత శారీరక వాంఛాతీత అయిన అయోనిజ. కారణ జన్మురాలు. ధర్మరక్షణ కొరకే అవతరించిన శ్రీరామపత్ని. తీసుకువచ్చినవాడు వేదవేదాంగాలనూ ఆపోశన పట్టినవాడు, నిరంతర శివపూజా ధురంధరుడు. అయినా దైత్యభావాన్ని వదల్చుకోలేని పరదారేచ్ఛాశీలి, రావణుడు. “అతడు నిలిచి సీత వంకనె చూచుచుండ,” – ఆమె పైన చెప్పిన విధంగా కనిపించినదంటాడు కవి. అతని అసుర భావం కామాన్ని ఉద్దీపిస్తూ వున్నాఅతని విజ్ఞానం, యధార్థాన్ని అతని అంతరాత్మకు బోధపరుస్తూనే వుంది కాబోలు. ఆ అసమయంలో వచ్చిన రావణుని చూసి కలవరపడుతున్న సీత అతని కంటికి ఇంకా ఎట్లా కంపించిందో – పై పద్యానికి ముందు మరికొన్ని పద్యాల్లో వివరించాడు కవి.

ప్రళయపయోధి జలాల్లో భీకరాకారంతో సోమకుడు వస్తుంటే భయపడిపోయిన త్రయాకాంత (వేద మూర్తి) లాగా వుందిట. చాపగా చుట్టి భుజాన పెట్టుకుని హిరణ్యాక్షుడు వెళ్ళేటపుడు అతని కోర గీచుకుపోయి క్రిందమీదయిన భూమాత లాగా వుందిట. తానే సర్వేశ్వరుణ్ణని దురహంకారంతో గర్వించే హిరణ్యకశిపుని సభలో, ప్రళయ భీతిని పొందుతున్న విష్ణుభక్తి లాగా వుందట. ఆత్మజ్ఞాన విరహితమై కేవలం దాతృత్వాది లౌకిక గుణాలే మోక్షమనే బలి చక్రవర్తి ప్రాగల్భ్యత ముందు కృశీభూత అయిన స్వర్లోక లక్ష్మి లాగా వుందట. తిన్న ఇంటి వాసాలు లెక్కించే కార్తవీర్యార్జునుని దౌష్ట్యానికి బెదరి, ఆవులా అంభారవాలతో దిగులుపడిపోయే ఆతిథ్యదేవత లాగా వుందిట.

ఒక పరమ బలీయమైన దైత్యాటోపం ముందు వణకిపోతున్నా కూడా, ధర్మాకృతిగా కూరుచున్న సీత వర్ణన – హృదయాస్పర్శిగానూ, ఆలోచన కలిగించేట్లు గానూ వివరిస్తుంది ఈ పద్యం.

ఆమె కన్బొమల చాపాకృతి రామచంద్రుని కోదండాన్ని స్ఫురింపజేసి వుండాలి రావణునికి. ఆ చాపపు శక్తిని తప్పించుకోవాలంటే అతను కనుబొమలు దిగి కన్నుల దగ్గరకు రావాలి. ఆ కన్నులు ప్రభు కృపాకృతులే అయినా ఆమె కూరుచున్న వైఖరి స్వామి ప్రతిజ్ఞను గుర్తుకు తెచ్చి వుంటుంది. తాను దొంగతనంగా తెచ్చిన స్త్రీ సాధారణ స్త్రీ కాదనీ, మూర్తీభవించిన ధర్మాకృతి అనీ, తన దుడుకుతనానికి ఫలితం – శ్రీరాముని ప్రతిజ్ఞ లోనూ, ఆయన కోదండం లోనూ – తాను అనుభవించ బోతున్నాడనేది సూచించబడటం కూడా ఈ పద్యంలోని సొగసు.

ఇది కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి పద్యం. రామాయణ కల్పవృక్షం, సుందరకాండ లోని పరరాత్ర ఖండం లోనిది.