దుప్పట్లో ముడుక్కున్నా

రేగుతోంది చలిగాలి
కొయ్యబారింది కిటికీ
వంట గదిలో ఏదో
వెదుకుతోంది ఎలుక పిల్ల

దూరంగా తాగుబోతు కేక
లీలగా మనుషుల ఊసు
చీకట్లో ఒకటే
మొరుగుతోంది ఊరకుక్క

చెవి దగ్గర దోమ ఫిడేల్
కీచురాయి కంఠశోష
గూర్ఖా లాఠీ చప్పుళ్ళకి
పారిపోతోంది దొంగల ముఠా

ఇంకిప్పుడు మెల్లిగా
మాయాలోయల్లోకి జారి
సోయలేని నా పక్కన-
లాఠీ తిప్పుతున్న ఎలుకపిల్లల ముందు
పిల్లి మొగ్గలు వేస్తున్న భేతాళ మాంత్రికులు
ఫిడేల్ ఎత్తుకుపోతున్న పిండారీల వెనకాల
కేకలు పెడుతున్న కింపురుషులూ
తెల్లవార్లూ తచ్చాడతారు.