జలప్రపాతము

కానలలో, మహీరుహనికాయసమావృతశైలపంక్తులన్,
సూనమరందగంధపరిశోభితమారుతసంప్రసారణా
నూనదరీతటంబుల వినోదరతిం జరియించు చొక్కనా
డేను జలప్రపాతముల నెన్నిటినో కనుగొంటి చెంగటన్.

గిరికుమారకుల్ ధరియించు సురుచిరంపు
పాండురోత్తరీయంబుల భాతిఁ దనరు
నా ప్రపాతమనోజ్ఞత కలరి మదిని
పాడఁదొడఁగితిఁ దద్వైభవంబు నిటులు.

కనుగొని సుందరీమణి నొకర్తుక నుత్కటరాగతీవ్రతం
జని యతిగాఢచుంబనవశస్థితుఁడైన విటాగ్రణిం బలెన్
ఘనరయపూర్ణవాఃపతనకైతవరాగమనఃప్రచండుఁడై
గొనకొని ధాత్రి గోత్రపతి కూరిమి ముద్దిడు వైనమిట్టిదౌ!

అట్లు చుంబింపఁ బరవశంబందియున్న
పుడమికన్నియ తనువందుఁ బొడమియున్న
ఘర్మబిందుల చందంబు గానఁబడియె
తత్ప్రపాతోత్థితపృషద్వితాన మపుడు.

పలువను సంస్కరించి యొక ప్రాజ్ఞునిగా నొనరించినట్లుగన్
బలముగ భూమికిం బడెడు ప్రాంతములం గల కర్కశంబులున్
పలుముఖముల్ గలట్టి పెనుబండలకున్ వెలయించె నున్పునున్
చెలువము గల్గు రూపముల శీఘ్రపతత్ బలవత్ ప్రపాతముల్.

మునులచందము గానల మనుచునున్న
గిరికుమారుల మస్తిష్కసరణులందు
మెఱపుతీవలవోలె సంస్ఫురితమైన
భావబింబములొకొయీ ప్రపాతతతులు!

ఉరువడి భూమికిం బడగ నుత్థితమై జలబిందుసంతతుల్
పరిసరమందు దట్టమగు పాండురమేఘములన్ సృజింప, భా
స్కరుకిరణంబు లా నిబిడకంధరబృందములందుఁ జొచ్చి సుం
దరతరశక్రకార్ముకవితానములన్ విరచించె వింతగన్.

త్వరితవాతహతిఁ జలించు తత్పృషంతి
కాభ్రములతోడఁ జలియించు నా మహేంద్ర
చాపవితతులు గూర్చె లాస్యన్మయూర
బర్హసంస్ఫురద్వర్ణవిభ్రాంతి నపుడు.

జడములై పొల్చు నీ శైలసంఘములకు
నెట్లు చేతనత్వము గూర్చు నీ జలంబు
లట్లె మత్ప్రియారాగరసామృతఝరి
మన్మనశ్చేతనత్వసంస్థాన మగుత!

ఆ జలపాతగర్భసముదంచితశక్రశరాసనాభమై
నా జవరాలి రాగమయనవ్యసముత్కటభావరాజిచే
భ్రాజితమౌచు మన్మనము రంజిలుగావుత, మాదుబంధముల్
జాజులతీవలట్లు సుఖసౌరభపూర్ణములై చెలంగుతన్.

పర్వతము శాశ్వతం, బట్లె వాహినియును,
వాని సాంగత్యఫల మీ ప్రపాతచయము;
నిత్యమగుచు మాప్రణయసాంగత్యమటులె
అవిరతప్రమోదప్రపాతాఢ్య మగుత!

ఈ సలిలప్రపాతముల నిట్లతిలోకమనోజ్ఞతారమా
వాసముగా నొనర్చిన టువంటి పరాత్పరుఁ బ్రస్తుతించెదన్,
గ్రాసముకోసమై యొరులకై కయిమోడ్చెడి శుష్కజీవితా
భ్యాసము మాని యిచ్చటనె వాసము సేయఁగ నిచ్చగించెదన్.