నాకు నచ్చిన పద్యం: శ్రీరామ ధనుష్టంకారం

ఉ. అంతఁగడంక రాముడు సమగ్ర భుజాలుల విక్రమోత్సవం
     బెంతయు బర్వ మౌర్వి మొరయించె దిగంతర దంతి కర్ణరం
     ధ్రాంతర సాగరాంతర ధరాభ్ర తలాంతర చక్రవాళ శై
     లాంతర సర్వ భూధర గుహోకుహరాంతర పూరితంబుగన్

పై పద్యం భాస్కర రామాయణం లోని బాలకాండము లోనిది. కవి మల్లికార్జున భట్టు. ఇదే భాస్కర రామాయణం లోని, ఈ మల్లికార్జున భట్టు వ్రాసిన ఒక పద్యాన్ని గురించి ఇంతకు ముందు ముచ్చటించుకున్నాము. ఆంధ్రభారతం లాగే ఈ రామాయణం కూడా ఒక్క చేతి మీదగా రచింపబడలేదు. భాస్కరుడు అరణ్య యుద్ధకాండములను తాను వ్రాసి, తన పుత్రుడైన మల్లికార్జున భట్టు చేత బాల కిష్కింధ సుందర కాండములనూ, శిష్యుడైన కుమార రుద్రదేవుని చేత అయోధ్యా కాండమునూ రచింపించాడు. యుద్ధకాండములో కొంత శేషభాగాన్ని అతని మిత్రుడైన అయ్యలార్యుడు రచించాడు. పెద్దవాడైనందునా, ఎక్కువ భాగం తాను వ్రాసినందునా, భాస్కరుని పేర ఈ రామాయణం భాస్కర రామాయణమని పిలవబడుతున్నది.

మల్లికార్జున భట్టు కవిత్వం ప్రసన్నంగా వుంటుంది. మాధుర్య గుణంతో మంచి ఓజస్సు కలిగివుంటుంది. ఈయన పద్యాల్లో సంస్కృత పదాలు ఎక్కువగా వాడటం వలన ప్రౌఢత, ధార బాగా కనిపిస్తుంటాయి.

పై పద్యం శ్రీరాముడు తాటకను చంపబోయే ముందు చేసిన ధనుష్టంకారాన్ని వర్ణించే పద్యం. విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ కోసం దశరథుణ్ణి అర్థించి రామ లక్ష్మణులను తీసుకొని అరణ్యానికి బయల్దేరతాడు. అరణ్యంలో తాటకను గురించి ఆమెను సంహరించవలసి వుంటుందని తెలుపగా, రాముడు అంగీకరించి తన వింటి నారిని మ్రోగిస్తాడు. ఆ ధనుష్టంకార శబ్దం ఎలా మ్రోగిందో తెలుపుతుంది ఈ పద్యం. ఆ మౌర్వీరవం దిగంతరాల్లో మ్రోగింది. ఎనిమిది దిక్కులో వుండే దిగ్గజాల శూర్ప కర్ణాల వివరాలలో హ్రీంకారించింది. సముద్రాంతరాల్లో ధ్వనించింది. భూమికీ ఆకాశానికీ మధ్య సర్వ వాతావరణంలోనూ ప్రతిధ్వనించింది. పర్వత సమూహాల్లో మారుమ్రోగింది. కొండగుహల్లో నిండిపోయింది. ధనుష్టంకార విశేషాన్ని పద్యంలో పట్టుకోవడం దీనిలోని అందం.

మొరసిన మౌర్వీరావం పద్యంలో గూడ వినిపించింది. దిగంతర, దంతి కర్ణ రంధ్రాంతర, సాగరాంతర, ధరాభ్ర తలాంతర, చక్రవాళ శైలాంతర, సర్వ భూధర గుహోకుహరాంతర పూరితంబుగన్ అని అంతర, అంతర, అంతర అంటూ ఆ పదాలతో పాటు మనలని లాక్కునిపోయి, వింటినారి వింత శబ్దం పద్యంలోని ధారలో వినిపింపజేశాడు కవి.

అర్థం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఏమీ లేకపోయినా పద్య సందర్భాన్ని గురించి మాత్రం ముచ్చటించుకోవాలి. అంతవరకూ శ్రీరాముడు తల్లిదండ్రుల చాటు బిడ్డ. అదే ప్రథమంగా రాజభవనాల్లోంచి విశాల ప్రపంచంలోకి – ఒక బాధ్యతను నెత్తిన వేసుకొని రావడం. అసలు తన అవతారం ఏ ఉద్దేశ్యం కోసం జరిగిందో ఆ ధ్యేయాలకు – మునిజన రక్షణ, రాక్షస వధ అనేవాటికి – ప్రారంభోత్సవం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ మహాకార్యం ప్రథమంగా విశ్వామిత్ర యాగ సంరక్షణం ద్వారానూ, దానికి విఘ్నకారకులైన తాటకనూ, ఆమె పుత్రులనూ ఎదుర్కొనడం ద్వారానూ మొదలు గావాలె. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఇదిగో రంగం మీదకి నేను వచ్చేశాను అని రాజలోకానికీ, ముని గణాలకూ, రాక్షసలోకానికీ తెలియపరచుకొనే పరిచయ పత్రం లాంటిది ఈ ధనుష్టంకారం. ఇలా తన రంగప్రవేశాన్ని తన ధనుష్టంకారం ద్వారా, చాలా స్పష్టంగా చాటి చెప్పాడు శ్రీరాముడు. అలా ఆ అల్లెత్రాటి యొక్క ఆర్భటి సర్వప్రపంచంలోనూ మ్రోగిపోయింది.

విశ్వనాథ సత్యనారాయణ తన కల్పవృక్షంలో సుందరకండంలో హనుమ చేత రాముడికి నమస్కారం చేయిస్తూ “మౌర్వీరావ బధిరీకృత గాఢ నభోంతరాళ దిక్కుహరునకున్, సలక్ష్మణునకున్” అని అనిపిస్తాడు. భూనభోంతరాళాలకూ, దిక్కుల కందరాలకూ తన మౌర్వీరావంతో చెవుడు పుట్టిస్తాడట శ్రీరాముడు. విశ్వనాథ వాచ్యంగా చెప్పిన ఈ రామశక్తిని కొన్ని శతాబ్దాల ముందే వాస్తవంగా చేయించి చూపించాడు మల్లికార్జున భట్టు. రాముని రంగప్రవేశ సందర్భపు ప్రాధాన్యత, ఆయన ధనుష్టంకారపు ప్రత్యేకత రెంటినీ బుద్ధిగతం చేసుకొని వ్రాసిన పద్యం ఇది. అందుకే ఇది చెవుల్లో గింగురుమంటూ మ్రోగుతూనే వుంటుంది.