“అమృతం కురిసిన రాత్రి” పై రారా సమీక్ష – ఒక ప్రతి విమర్శ

[రా.రా సమీక్షపై సి. ఎస్. రావ్ గారు వ్రాసిన ప్రతిస్పందన నిడివి, పరిశీలన వ్యాసానికి సరిపోయినంతగా వుండటంతో వారి లేఖను ఒక పూర్తి వ్యాసంగా ప్రచురించాము. ఇలా ఆలస్యంగా ప్రచురించడం మా నియమ భంగమే అయినా సబబైన నిర్ణయమనే మా అభిప్రాయం – సం. 13 సెప్టెంబర్ 2010.]

రారాగా ఆంధ్రదేశమంతటా ప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డిగారు గొప్ప సాహితీ విమర్శకులు. రమ్యమైన తెలుగు వచనరచనాశైలి కలిగినవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహితీ సంప్రదాయాల్నీ, క్రొత్తగా వస్తున్న పోకడలనీ లోతైన వివేచనాశక్తితో ఆకళింపు చేసికొన్న పండితులు, మేధావులు. ఆయన మీద నాకు అపారమైన గౌరవం ఉంది. వారి నిష్పక్షపాత వైఖరి, నిశితపరిశీలన, నిర్భీతి, ఇంటలెక్చువలైజ్డ్ అభివ్యక్తీకరణ ఎవరినైనా ఇట్టే వశపరచుకోగలవు.

1969 ‘సంవేదన’ లో వారు ‘తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు’ శీర్షికతో దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి ‘అమృతం కురిసిన రాత్రి’ మీద వ్రాసిన సమీక్ష (ఈమాట ఈ సంచికలోనే పునర్ముద్రణ) వారి స్థాయికి, వారి రీతికి తగినట్లుగా లేకపోవటం ఆశ్చర్యం వేస్తుంది, విచారం కలిగిస్తుంది. సమీక్ష తిలక్ కవిత్వం యొక్క జీవలక్షణాల్ని చక్కగా అంచనా వేయటంతో ప్రారంభమవుతుంది.

“తిలక్ లోని ప్రముఖమైన గుణం భావుకత్వం – కించిత్ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయస్పందన శక్తి … ఈ భావుకత్వానికి తోడు తన హృదయం లోని అనుభూతిని వ్యక్తం చేయగల శబ్దశక్తి, అలంకారపుష్టి కలిసి రావటంతో తిలక్ ఉత్తమశ్రేణి కవి కాగలిగినాడు.” మరలా అంటారు: “భావుకత్వం అనేది ఏ ఉత్తమ కవికైనా ఉండవలిసిన ముఖ్యలక్షణం.”

బావుంది. భావుకత లేకపోతే కవిత్వమే లేదు. నాకు స్పష్టంగా అర్ధంకాని విషయం: “కానీ, అతను ఏ ధోరణి కవి అయ్యేదీ అతని హృదయతత్వం మీదా, జీవితం పట్ల అతని దృక్పధం మీదా ఆధార పడుతుంది. ఈ రెండూ కలిసి తిలక్‌ను ఒక ఉత్తమ భావకవిగా తయారు చేసినాయి” అనడం. భావుకత్వం ఏ ఉత్తమ కవికైనా ఉండవలసిన ముఖ్యలక్షణం అని అన్న తరవాత మరలా ఎవరినో భావకవి అనడం ఏమిటి? భావుకత్వం లేనివాడు కవే కాడుగా? కవిత్వం కవిత్వమే. కవిత, వస్తువు ప్రాతిపదికగా, లేదా కవి హృదయతత్వం మీద ఆధారపడి వర్గీకరించటం ఏ మాత్రం సబబు? ఇన్ని విభజనలు చేయాలా?

భావుకత కలిగిన కవి దేనిని కవితా వస్తువుగా స్వీకరిస్తేనేమి, అతని దృక్పధం ఏదైతేనేమి? తనదైన రీతిలో తాను వ్రాసుకోవచ్చు. అభ్యుదయపు బావుటాలు ఎగరవేయనివ్వండి. విప్లవశంఖం వినిపించనీయండి. జన వాహినిని విప్లవోన్ముఖంగా మలుపు తిప్పనీయండి. అలానే మరొకర్ని ఆశాచంద్రశాలలని నిర్మించుకోనియ్యండి. ‘వార్షుకాభ్రంలో యక్షపతీ సౌందర్యాన్ని’ చూడనియ్యండి. ‘ఒక శుష్కస్తన్య సన్నిధిని క్షుధార్తినేడ్చు పసిపాప’ను చూసి ‘సిగ్గుతో రెండుగా చీలిన వెదురుబొంగు’ను కానీయండి. ‘మంటలో అంతరాంతర దగ్ధమైన బూడిదను కానీయండి’. ‘దిగులు నీరు నిండిన కోటి మనస్సరస్తీరాల నా కవిత కోరికల కోణాకారపు కొత్త చెట్లను నాటుతుంది’ అననీయండి. ఇవన్నీ హృదయం ఆర్ద్రం అయ్యే రీతిలో వ్రాయమనండి. పాఠకుడిని కదిలించే విధంగా వ్రాయమనండి. ఆ కవితలు కలకాలం పాఠకుని మనసులో చెక్కు చెదరకుండా నిల్చిపోయేట్లు, ప్రతిధ్వనించేట్లు వ్రాయమనండి. అలా ఉత్తేజితులని జేసే విధంగా వ్రాయమనండి. ఆకట్టుకొనని కవిత్వం వ్యర్ధం. ఆకట్టుకోవాలంటే అందంగా వ్రాయటమే మార్గం. ఈ విషయాన్ని గురించి మాత్రమే తన కవిత్వంలో తిలక్ వ్రాశారు.

“గాజుకెరటాల వెన్నెల సముద్రాలు
జాజిపువ్వుల అత్తరు దీపాలు
మంత్రలోకపు మణి స్తంభాలు
నా కవితా చందనశాలా చిత్రవిచిత్రాలు”

“నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు”

“అన్నా!
అగ్నిజల్లినా అమృతం కురిసినా
అందం,ఆనందం దాని పరమావధి”

“ఉత్తమ కవులందరిలోనూ శైలి, ఇతివృత్తము విడదీయరాకుండా పెనవేసుకునే ఉంటాయి.తిలక్ అలాంటి ఉత్తమ కవిగానే కనపడతాడు.” – రారా చాలా బాగా చెప్పారు. తిలక్ అరువు తెచ్చుకున్న భావాలతో కానీ, అనుకరించిన శైలీ విలాసంతో కానీ కవిత్వం వ్రాయలేదు. రారా ఈ విషయాన్ని బాగానే గమనించారు అనుకునే లోపలనే ఇలా అంటారు: “అలౌకిక సౌందర్య శోభితమైన ఐంద్రజాలికుల అంతఃపురం లాగానే ఉంది అతని కవితా చందనశాల.” ఇలా అనడంలో విమర్శ కంటే అవహేళనే ఎక్కువగా ఉంది. కవిత్వంలో ఏ అనుభూతినైనా అందంగానే చెప్పాలి. ఒక మానసిక స్థితిని లేదా పరిస్థితిని సజీవంగా చిత్రీకరించి శుష్కనినాదాలు ఇవ్వకుండానే వానికనుగుణమైన ప్రేరణను పాఠకుడు పొందేట్లు చేస్తుంది గొప్ప కవిత. అందంగా వ్రాయటం అంటే ప్రకృతి శోభను చూపించటమో, శారీరక సౌందర్యాన్ని పెరేడ్ చేయించటమో, షోకులు పోవటమో, వాగాడంబరంగా భాషా సౌందర్యాన్ని ప్రదర్శించటమో కాదు. ఆకట్టుకునేలా అనుభూతిని, ఏ రకమైన అనుభూతినైనా వ్యక్తీకరించటం. రారా అన్నట్లు పాఠకులను ఉత్తేజితులని చేయాలన్నా, వారిని ఆకట్టుకునే విధంగా వ్రాయకపోతే ఉత్తేజితులెలా అవుతారు?

తిలక్ తన కవిత్వాన్ని గురించి చెప్పిన కవితా ఖండికల మీద రారా వ్యాఖ్య సరైన వివేచనతో కూడుకున్న దానిలా కనిపించటం లేదు. “తన కవిత్వం కరుణారస భరితంగా… వెన్నెల సముద్రాల మీద విలాసయాత్రలు చేసేదిగా ఉండాలి. అత్తరుదీపాలు వెలిగించేదిగా ఉండాలి. మంత్రలోకపు మణిస్తంభాలమధ్య దాగుడుమూతలాడేదిగా ఉండాలి.” అనడంలో నిష్పక్షపాతంగా ఆలోచిస్తే వక్ర భాష్యం కనిపిస్తుంది. తిలక్ తన కవిత్వం గురించి వ్రాసిన పంక్తులలోని వెన్నెల సముద్రాలు, మణిస్తంభాలు, అత్తరు దీపాలు కేవలం అందంగా వ్రాయటానికి సంకేతాలు.దానికి ఎంతటి అవహేళనతో కూడిన పెడార్ధం తీశారు రారా!

అభ్యుదయ కవులనబడే వారు, విప్లవకవులనబడే వారు అందానికి వ్యతిరేకులా? చెప్పదలచుకున్న విషయం, వ్యక్తీకరించదలచుకున్న అనుభూతి అందంగా వ్యక్తీకరించక పోయినా వారు పాఠకులని ఉత్తేజితులని చేయగలరా? అభ్యుదయకవులనీ, విప్లవకవులని అనటం అవసరమైన వర్గీకరణా? కవిత అభ్యుదయ లేదా విప్లవ కవులకు మాత్రమే పరిమితమా? మానవానుభవంలోని ఇతర పార్శ్వాలను స్పృశిస్తూ కవిత వ్రాయకూడదా? అభ్యుదయభావాలు కవిత్వంలో వ్యక్తీకరించని వాళ్ళు మంచి కవులు కావటానికి అవకాశం లేదా? అభ్యుదయభావాలు కవిత్వంలో వ్యక్తీకరించిన వాళ్ళందరూ మంచి కవులా? ఉద్యమనిర్మాణం జరగవలసినది నైతికమైన నిబద్ధతతో, ధర్మనిష్టతో, ఉద్యమంలో పాల్గొనడం ద్వారా చేసే త్యాగాలతో. కవిత్వాలు ఉద్యమాలను సృష్టించవు: ఉద్యమాలు కవిత్వాలను సృష్టించవచ్చు.

“నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ నా జాతి జనులు
పాడుకునే మంత్రంగా మ్రోగించాలని”

అభ్యుదయకవి తనకు ఇంతటికి ప్రాముఖ్యతను కోరుకుంటాడా? ఇంతటి ప్రాధాన్యతను తనకు తాను ఆపాదించుకుంటాడా? తన జాతి జనుల ఆశలను, వారి అవసరాలను కవితగా (మరలా మంత్రమెందుకు!) మలచుకుని అది తనలో మార్మోగాలి కానీ? “నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా…” మలచడమా? అభ్యుదయ కవి ఆదర్శాలను సోదరులు పంచుకోవాలా? అంతేకానీ తోటిజనుల ఆకాంక్షలను తాను ఆదర్శాలుగా స్వీకరించడా? అసంబద్ధం, అన్యాయం, ఘోరమైన పెత్తందారీ మనస్తత్వం. “వెలుగుల రవ్వల జడి” బావుంది. అందమైన పదచిత్రం. నేను చెప్పదలచుకున్నది కూడ ఇదే: అనుభూతి ఆవిష్కరణ కేవలం కవితలో అంతటి అందమైన పదచిత్రాల ద్వారానే జరుగుతుందని.

“ఒక్కొక్క యుగంలో జీవితం గురించి ఆనాటి జనులకు ఒక్కొక్క అవగాహన ఉంటుంది.” రారా గొప్పదనమిదే. మంచి అవగాహన. చారిత్రక పరిణామంలో విలువల అస్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవటం. అంటే కవిత్వావగాహన సాపేక్షమని. అంతవరకు బాగానే ఉంది. కానీ, “వాస్తవ జీవితానికీ,కవిత్వానికీ మధ్య అఖాతం విస్తరించేకొద్దీ జీవిత వాస్తవాన్ని విస్మరించటమే కవిత్వధ్యేయం అవుతుంది” అనడంలో ఒక లాజికల్ ఫ్లా ఉంది. ఈ వాక్యం మరొకసారి చదవండి. వాస్తవ జీవితానికీ కవిత్వానికీ మధ్య అఖాతం ఎందుకేర్పడింది? దానికి కారణం ఏమిటి? కవిత్వం జీవిత వాస్తవానికి దూరంగా జరగటమే. అంటే అంతటితో ఈ ప్రాసెస్ అయిపోయింది. అఖాతం ఏర్పడటంలోనే, విస్తరించటంలోనే విస్మరించటం ఉంది. ఇంక విస్మరించటం ధ్యేయం కావటం ఏంటి? జ్వరం వచ్చిన తర్వాత వళ్ళు కాలటం మొదలెట్టింది అన్నట్లు (జ్వరం లోనే వళ్ళు కాలటం ఉంది). “పర్యవసానంగా కవిత్వం మద్యంలాంటిది అయ్యింది. కవిత్వం ఇచ్చే ఆనందం కైపు లాంటిదయింది.” ఈ మాటలు తిలక్‌కి కానీ, ఆయన కవిత్వానికి గానీ ఎలా అన్వయించటం సాధ్యమవుతుంది? ఆయన ప్రవచించిన జీవన విలువలకు, వ్రాసిన కవిత్వానికీ, జీవించిన తీరుల మధ్య క్రూరమైన వైరుధ్యాలున్నాయా? ప్రపంచవ్యాప్తంగా మానవులని వేధించే వర్గాలకు, శక్తులకు, సమస్యలకు వ్యతిరేకంగా, మహాశక్తివంతంగా, కవితామయంగా ఆయన స్పందించటం మనం చూడలేమా?

“అభ్యుదయకవుల అవగాహన లో కవిత్వం ఇవ్వవలసింది ఆనందం కాదు, ఉత్తేజం.” – కీర్తిశేషులైన రారాని ప్రశ్నలు వేసి ప్రయోజనం లేదు. మనం ఒక క్షణం ఆలోచిద్దాం. ఉత్తేజంలో ఆనందం అంతర్లీనంగా ఉండి తీరుతుందే? ఆనందం అంటే ఇక్కడ కవిత ఇచ్చే ఆనందం. అది వ్యక్తీకరించే అనుభూతి స్వభావం ఏదైనా హృదయానికి హత్తుకునే విధంగా, హృదయం ఆర్ద్రమయ్యే విధంగా చెప్పటంద్వారా కలిగించే ఆకర్షణ. ఆ ఆకర్షణే ఆనందం. ఇది లేనప్పుడు ఉత్తేజం సాధ్యం కాదు. ఆనందం, ఉత్తేజం వేరు వేరు అనుభూతులుగా సిద్ధాంతీకరింపబూనటం గందరగోళానికి గురిచేయటమే. వైయక్తిక భావనలను సర్వ మానవాళి భావనలతో సమన్వయం సాధించవలసిన అవసరం గొప్ప కవిత్వానికి ఉంది. వ్యక్తి తనను తాను నిష్పక్షపాతంగా అర్ధంచేసుకుంటే మానవాళి ఆశలను, ఆకాంక్షలను, కష్టసుఖాలను అర్ధం చేసుకోవటానికి వీలవుతుంది. అలా తన వ్యక్తిగత చైతన్యాన్ని విస్తరించుకుని విశ్వచైతన్యానికి చేరువై, ఆ చైతన్యాన్ని తాను తన కవితలలో వ్యక్తీకరించగలుగుతాడు. ఇలా చెప్పటంలో కవితలో అనుభూతి ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుందో చెప్పటమే.