తిలక్ జ్ఞాపకాలు: మరీ పాతవీ, ఆ తరవాతవీ

[తిలక్ గోరువంకలు పద్యకవితా సంకలనం ముందుమాట, ఆ కవిని ఈమాట పాఠకులకు ఇంకొంతగా పరిచయం చేస్తుందనే ఉద్దేశంతో ప్రచురిస్తున్నాం – సం.]

1966 జులై ఒకటవతేదీనో, రెండవ తేదీనో, సరిగా గుర్తు లేదు. పదకొండు, పన్నెండు గంటల వేళ – ఏలూరు నుంచి ఫోన్‌కాల్. ఫోన్‌లో స్మైల్. తిలక్‌గారు పోయారంటూ మృతి వివరాలు చెప్పాడు. పేపర్లో ప్రచురణకు వార్త రాసుకున్నానుగానీ, ఒకంతట నమ్మబుద్ధి కాలేదు.

తిలక్‌ది అక్షరాలా అకాలమరణం. ఆ రోజుల్లో ఈ మాట అనుకోనివారు లేరు. బాధపడనివారు లేరు. సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో ఆయన ఆకస్మికంగా మిత్రుల్ని, అభిమానుల్ని విడిచి వెళ్ళిపోయాడు.

తిలక్ మంచి వచనకవితలలో మరీ మంచివాటిలో ఒకటి –

నువ్వులేవు నీపాట వుంది; ఇంటిముందు
జూకా మల్లెతీగల్లో అల్లుకుని
లాంతరు సన్నని వెలుతురులో క్రమ్ముకుని
నా గుండెల్లో చుట్టుకుని
గాలిలో ఆకాశంలో నక్షత్రం చివరి మెరుపులో
దాక్కుని నీరవంగా నిజంగా వుంది
జాలిగా హాయిగా వినపడుతూ వుంది…

అని చాలా అందంగా ఆర్ద్రంగా సాగిపోయే గీతం తిలక్‌ని తలచుకున్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తుంది.

నిజమే మరి. ఇవాళ తిలక్ లేడు. తిలక్ పాట వుంది. నిజంగా వుంది. జాలిగా హాయిగా వినపడుతూ వుంది. ఇంకా ఇంకా అలా వినబడుతూనే వుంటుంది.

రాజమండ్రి ఆర్ట్స్ కాలేజిలో చదువుకునే రోజుల్లో సూరంపూడి భాస్కరరావు ద్వారా తిలక్‌తో పరిచయం. భాస్కరరావు నాకంటే రెండేళ్ళు సీనియర్. తిలక్‌దీ అతనిదీ ఒకేవూరు. ఏమోయ్ అనుకునే చిన్ననాటి స్నేహితులు. తిలక్ తణుకు నుంచి అప్పుడప్పుడూ రాజమండ్రి వచ్చి పిలకా గణపతిశాస్త్రిని, ఇతర సాహితీమిత్రుల్నీ కలుసుకుని, ఒకటి రెండు సాహిత్య సభల్లో ప్రసంగించి, స్వీయ కవితల్ని వినిపించి వెళ్ళిపోయేవాడు. అవి 1943-44 రోజులు. భాస్కరరావు, అతని క్లాస్‌మేట్ రాయప్రోలు రాజశేఖర్ మాటల్లో చెప్పాలంటే, ‘చాలా వేల్యుబుల్ పొయెట్రీ’ రాస్తూ వుండేవాడు. నేనూ ఏవో పద్యాలూ, పాటలూ గిలకాలని ఉబలాటపడుతూ వుండేవాడిని. ఆ రోజుల్లో అలా ఆ పాటలు, పద్యాల నెపంతో తిలక్‌తో నాకు పరిచయమయింది.

భాస్కరరావు ఓసారి క్రిస్మస్ సెలవుల్లో కాబోలు, వాళ్ళ వూరు తీసుకువెళ్ళాడు. అప్పటి తణుకుకీ ఇప్పటి తణుకుకీ పోలికే లేదు. దాదాపు యాభై ఏళ్ళనాటి మాట కదా? తిలక్ అంటే ఇష్టం వల్లనో, అతని అందమైన కవిత్వాన్ని ఇన్‌స్పయిర్ చేసిందనో, తణుకు ఆ రోజుల్లో ఆంధ్రలోని చక్కని పట్టణాల్లో ఒకటి అనిపించేది. ముగ్గురం ఆ సాయంత్రం వూరివెలుపల గోస్తనీ నది ఒడ్డున చెట్ల కింద కూర్చున్నాము. (”అరటితోట నడుంచుట్టి కాలువ ఏటవాలుగా మలుపు తిరిగింది”) తిలక్ తన పద్యాలు గొంతెత్తి రాగయుక్తంగా చదివాడు. ఆరాత్రి వాళ్ళ డాబాపై నక్షత్రాల కింద కూర్చుని భాస్కరరావు తన పాటలు, నేను నా పాటలు పాడి వినిపించాము. అవి నేను సైగల్, పంకజ్ మల్లిక్, రాజేశ్వరరావు, కృష్ణశాస్త్రి, విశ్వనాథ, టాగోర్‌ల ఆరాధనలో మునిగి తేలుతున్న రోజులు.

“విభుడేగు దెంచేటి వేళాయెనే చెలీ! సజ్జ సవరించేటి సమయమిదియే సఖీ!” అనే నా పాట నేను పాడి వినిపిస్తే, “చాలా బావుంది మీ పాట,” అని అభినందిస్తూ “నా పాటలకి కూడా ఇలా ట్యూన్స్ కట్టిపెడతారా?” అని తిలక్ మెచ్చుకోలుగా అడగడం నేను గర్వపడే జ్ఞాపకాల్లో ఒకటి.

అప్పటి తిలక్ రూపం, పద్యాలు నాకు లీలగా గుర్తు. సన్నగా, పొడుగ్గా, తెల్లగా మెరిసిపోతూ, పెద్ద పెద్ద అంగలతో నడుస్తూ, ఎప్పుడూ కృష్ణశాస్త్రి గురించో, టాగోర్ గురించో, మొత్తంమీద కవిత్వం గురించే, సాహిత్యం గురించే మాట్లాడుతూ, సాహిత్యమే జీవితమైనట్టు – తరవాతి రోజుల్లో తన గురించి తానే రాసుకున్నట్టు – కలల పట్టుకుచ్చులూగుతున్న కిరీటం ధరించినవాడుగా, కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నవాడుగా, …దుఃఖాన్నీ చావునీ వెళ్ళిపొమ్మన్నవాడుగా, …జీవితాన్ని హసన్మందారమాలగా భరించినవాడుగా, కనపడేవాడు. అతని పద్యాలు కూడా అతని లాగే ‘ఇజాలూ రాజకీయాలూ వాదాలూ యుద్ధాలూ హత్యలూ ఇంకా ఇటువంటి చెత్తాచెదారం మనస్సులో పేరుకోకముందు’ రాసినట్టు ముగ్ధమోహనంగా వుండేవి.

అప్పటికే శ్రీశ్రీ తన మహాప్రస్థానం గీతాలు పూర్తి చేసినప్పటికీ యువకుల మీద భావకవితా ప్రభావం పూర్తిగా తొలగిపోని రోజులు. దానినుంచి బయటపడాలన్న బలమైన ప్రయత్నమూ వుండేది. తిలక్ అప్పటికే పద్యాలతో పాటు మాత్రాచ్ఛందస్సులలోనూ, ముక్తచ్ఛందస్సులలోనూ కవితలు రాస్తున్నాడు. దాదాపు పదేళ్ళపాటు కవిత్వం రాసినట్టు లేదు. ఏదో వ్యాధి కాని వ్యాధితో (హైపోకాండ్రియా?) బాధపడుతున్నాడని మిత్రులు అనుకునేవారు. మద్రాసులోనే ఏదో ఆస్పత్రిలో వున్నాడని, వెళ్ళిచూడమని భాస్కరరావు ఉత్తరం రాశాడు. కాని ఆ రోజుల్లో తిలక్‌ని చూడటం వీలుపడలేదు. “అమృతం కురిసిన రాత్రి” సంకలనం ప్రకారం భూలోకం అనే గీతం 1945లో రాసింది. ఆ తర్వాత వచ్చే “యుగళగీతం” 1955 నాటిది. అంటే పదేళ్ళపాటు కవితామౌనం! అయిన “అద్దంలో జిన్నా” (ఎంత గొప్ప ప్రోజు!) లాంటి వచన రచనలు చేయకపోలేదు.

కాని, 1956 నుంచి బాగా విజృంభించాడు. అప్పటికి ప్రపంచం మారిపోయింది. కవిత్వ స్వరూప స్వభావాలు మారిపోయాయి. భావకవిత్వం, రొమాంటిసిజం ఔటాఫ్ ఫ్యాషన్ అయ్యాయి. కవిత్వంలో శ్రీశ్రీదే ఏకచ్ఛత్రాధిపత్యం. ఆ ప్రభావం తిలక్ పైన కూడా పడింది. ‘కవితా ఓ కవితా’ గీతం విన్నప్పుడు లక్ష జలపాతాల పాటలూ కోటి నక్షత్రాల మాటలతో పాటు రాజ్యాలూ సైన్యాలూ విప్లవాలూ ప్రజలూ శతాబ్దాలూ నా కళ్ళ ముందు గిర్రున తిరిగి నేను చైతన్యపు మరో అంచు మీద నిలిచాను అని తిలక్ రాసుకున్నాడు. అతని ఆలోచనలలో మార్పు వచ్చింది. కవిత్వంలో, కవిత్వశైలిలో కూడా మార్పు వచ్చింది. అప్పుడప్పుడు వృత్తచ్ఛందస్సులతో రాసినా, ఎక్కువగా వచన కవితా ప్రక్రియనే భావవాహికగా ఎంచుకున్నాడు. అతని రచనలలో ప్రసిద్ధమైన ఆర్తగీతం, గొంగళీ పురుగులు ఇత్యాది కవితలు ఆ కాలం నాటివి.

అయితే, తనపై ఎంతగా కొత్త ప్రభావాల నీడలు పడినా తిలక్ స్వీయవాణిని, సొంతబాణీని వదులుకోలేదు. ఎన్ని కిటికీలు తెరిచి కొత్త గాలుల్ని ఆహ్వానించినా, ఆయన స్వీయవ్యక్తిత్వం చెక్కు చెదరలేదు. అది మరింత పదును తేరింది. సమకాలికపు కవులెవరిలోను కనిపించని ఒక అపూర్వ సౌందర్యంతో కూడిన పదగుంఫనం అతని కవితలకు ఒక వినూత్నత, వైలక్షణ్యం ఆపాదించి పెట్టింది. 1960 నుంచి ఆయన వచన కవిత అత్యంత మనోజ్ఞంగా సహస్రదళపద్మంలా వికసించింది. కవిత్వం ఒక ఆల్కెమీ అని, దాని రహస్యం కవికే తెలుస్తుందని తానే అన్నాడు. ఆ రహస్యం తెలిసిన కవిగా తిలక్ తాను ఏది రాసినా మేలిమి బంగారంలా మెరిసేటట్టు రాశాడు. రొమాంటిసిజం ఫ్యాషన్ కాని రోజుల్లో రొమాంటిక్ కవిత్వం రాసి ఒప్పించాడు. అమృతం కురిసిన రాత్రి, నువ్వులేవు నీపాట వుంది, వానలో నీతో (ఆకాశాన్ని మేఘం నల్లని కంబళిలా కప్పుకుంది – ఆనందం మనసులో మయూర బర్హంలా విప్పుకుంది – ఆలోచనలెందుకు జవ్వనీ – విలోకించు వర్షాసంధ్యని – సందేహం వదిలి నా సందిటిని నిలిచి కళ్ళెత్తిచూడు” లాంటి గొప్ప లిరికల్ కవితలు ఆనాటివి. నెహ్రూ పోయినప్పుడు రాసిన వచన కవిత (ప్రిన్స్ చార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ది మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు – దారినివ్వండి – స్వప్నశారికలతని శిరస్సు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి…) తెలుగులోని గొప్ప ఎలిజీలలో ఒకటి.