మహామంగళప్రవచనము

మదధార లొల్కెడి మత్తదంతులరీతిఁ
        గఱిమబ్బు లభ్రంబుఁ గప్పికొనఁగ,
తీవలై సాగి ధాత్రీదివంబుల నెల్ల
        మిఱుమిట్లు గొల్పెడుమెఱపు లెసఁగ,
మర్దలనిధ్వానమాధుర్యమును బూని
        ఉరుములసవ్వడు లుప్పతిలఁగ,
దారుణగ్రీష్మర్తుతప్తావనీకాంత
        శీతోదకస్నానసేవఁ గొనఁగ,

తొట్టతొలిజడి కిలయెల్ల నిట్టలముగ
పులకలూని మధురగంధములొలుకంగ,
సకలసృష్టిసంజీవనాస్పదము నగుచు
వచ్చె నప్పుడు వర్షర్తు వవనియందు.

శ్రావస్తీ1నగరంబునందపుడు విస్తారంబు, జేతాఖ్యమౌ
పూవుందోఁటను దావులుల్లసిలగం బూచెం గదంబంబు, లం
భోవాహస్వనితానుకూలనటనంబూనె న్మయూరంబులున్,
తావుల్ గ్రమ్మఁగఁ బూచె గేదఁగులు సద్యఃఫుల్లపత్రంబులై.

పవలందున్, నిశలందు నెప్పుడు నిజావాసంబుఁ జేరంగ వ
చ్చు విపన్నశ్రమణార్థ్యనాథగణముం జొక్కంపుఁ బ్రేమంబునం
జవులూరించెడు నన్నపానములచే సంతృప్తులం జేయు పూ
జ్యవదాన్యేంద్రుఁ డనాథపిండికుడు2 జేతారామరమ్యావనిన్.

గౌరవ మెచ్చ నూత్నమగు గౌతమబుద్ధుని మార్గమందునన్
చారువిహారసద్మముల శాక్యమునీంద్రుఁడు ఛాత్రయుక్తుఁడై
చేరి ఘనాగమంబున వసింపఁగ నొప్పెడు రీతిఁ గట్టె వ్యా
పారసమార్జితోరుధనభాగము నందుకు వెచ్చఁబెట్టుచున్.

దుఃఖాహిదష్టులై దురపిల్లు జనులకున్
        విషభేదిమంత్రంబు వేయు వెజ్జు,
సవనతంత్రార్థమై జంతుజాలముఁ జంపు
        నధ్వర్యువర్యుల కగ్గిపిడుగు,
భవబంధదుఃఖాబ్ధి నవలీల దాటించు
        నవమార్గవిదుఁడైన నావికుండు,
రాజభోగముఁ ద్రోసిరాజని లోకావ
        నార్థంబు సన్యాసి యైనవాఁడు,

శాక్యమౌనీంద్రుఁ డొక్క వర్షర్తువందు
శ్రమణసంఘముతోడ, శిష్యతతితోడ,
వాస మొనరింపఁగా జేతవనమునందు
వచ్చె హర్షింప శ్రావస్తిపౌరు లెల్ల.

ఆ తథాగతు నావాసనార్థ మవ్వ
నాన నిర్మితంబైన గంధకుటి యనెడు
నిలయమందున బుద్ధుండు నిల్చియుండి
ప్రవచనంబులు సేయును ప్రజల కెపుడు.

అనయము భక్తితత్పరత నా గురువర్యుని దర్శనార్థమై
చనియెడు పౌరులా గురుని శ్రావ్యవినూతన ధర్మబోధ వా
సనలను దాల్చెనో యన పసందగు తావుల నొప్పు పూవులం
గొని యటనుంప నాకుటికిఁ గూడెను గంధకుటీ సునామమున్.

అనదలు, నామయార్తులు, జరాన్వితులున్, సుఖులైన రాట్సుతుల్,
వణిజులు, బ్రాహ్మణోత్తములు, వారును, వీరను నంతరంబు లే
కనయము వత్తు రవ్వనికి నమ్ముని నూతనధర్మబోధల
న్విని తరియింప వేదనల, నిర్మలధర్మపథం బెఱుంగఁగన్.

పతిఁ బాసితిన్, సుతుఁ బాసితిన్ మరణంబు
        కిఁకనేమి శరణంబొ యిలను నాకు?
ముదిరెను ప్రాయంబు, వదలవు రోగంబు
        లిఁక నెవ్వి యగదంబు లిలను నాకు?
రాణులుండిరి భాగ్యరాశులుండెను గాని
        లేదు చేతశ్శాంతి లేదు నాకు,
చదివితి వేదముల్ శాస్త్రంబులం గాని
        కనరాదు తరణమార్గంబు నాకు,

అనుచుఁ దమబాధలను వార లచటఁ జేరి
మనవి సేయంగ నష్టాంగమార్గఫణితి
వారి కెఱిగించి నిర్వాణపథముఁ దెల్పు
భువనపావనమూర్తి, యా బుద్ధమూర్తి.

భయదమతంగజంబులటు వార్షుకమేఘము లంబరంబునం
బయికొనియుండఁ, దారలు క్షపాకరుడుం గనరాకయుండఁ గా
లయవనికాంతరస్థనటులం బలె, నొక్క తమిస్రయందు వి
స్మయకరమైన దృశ్యము సమాహితమయ్యెను తద్వనంబునన్.

నెఱిమించుతీవకున్ సరియైన తనుకాంతి
        దెసలందు మిఱుమిట్ల నెసఁగఁజేయ,
కనరాని చంద్రుఁ డాననసీమ డాఁగెనో
        యను రీతి ముఖకాంతి యందగింప,
తనువంటఁ గట్టిన కనకాంబరచ్ఛవి
        పసిఁడిపూతను బూయ వనము కెల్ల,
తలనిండఁ దాల్చిన యలరుల మిసమిసల్
        వనసుమచ్ఛవులతో వైరమాడ,

తనదు లావణ్యకాంతితో వనమునెల్ల
స్నిగ్ధచాంద్రీమయంబుగాఁ జేయుచంత
ధరణికిం డిగ్గి దివ్యసుందరి యొకర్తె
శాక్యముని చెంత నిల్చెను సంభ్రమమున.

ఆగతి నిల్చి శాక్యముని కాదరపూరితభక్తిభావనో
ద్వేగముతో నతాంగియయి వేగఁ బ్రణామము సల్పి పల్కె బౌ
ద్ధాగమసూత్రకర్తకును, వ్యాకులలోకరుజాపహారివి
ద్యాగదసృష్టికర్తకును, ధ్యానవిహర్తకు నీవిధంబుగన్.

“శాక్యముని! కల్గె నాకొక్క సందియంబు,
దేన నీ భువి మానవుల్ దేవతలును
మంగళంబును గాంతు రా మార్గమిపుడు
తెల్పఁ గదవయ్య! నాశంక తీర నింక!”

అను ప్రశ్నంబున కమ్ముని
మనమున సంతసిలి యమృతమధురోక్తులతో
వినిచెను దేవాంగనకున్
ఘనమంగళదంబగు పథకం బీ ఫణితిన్.

“ఖలులను, వాఙ్మనఃక్రియలఁ గాపథమందుఁ జరించువారలన్
గొలువకయుంట, పూజ్యులను గొల్చుట, విజ్ఞులతోడ నెప్పుడుం
జెలిమిని సల్పుటల్, విమలచిత్తుల నెప్పుడు గారవించుటల్
దలపఁగ నీ ప్రవర్తనలు ధారుణి నుత్తమమంగళాంకముల్.

ఎచ్చట సజ్జనుల్ శ్రమణు లింద్రియజేతలు నుందురచ్చటన్
నిచ్చలు సంవసించుట, వినీయపువర్తన లుజ్జగించుటల్,
పొచ్చెములేని వర్తనముఁ బూనుట, ధర్మపథాన జీవికన్
బుచ్చుట, యీ ప్రవర్తనలు భూమిని నుత్తమమంగళాంకముల్.

ప్రియమృదుభాషణంబులును, విద్యలయందు సుశిక్షితత్వమున్,
నయమగు కౌశలంబు కరణంబులయందునఁ, దల్లిదండ్రులన్
ప్రియమగు సేవచేతఁ బరితృప్తులఁ జేయుట, దారపుత్రులన్
ప్రియముగఁ జేరఁదీయుటయుఁ బృథ్విని నుత్తమమంగళాంకముల్.

ఆరయ బంధువర్గములయందునఁ గూరిమి, దాతృతాగుణో
దారత, సాదువర్తనము, ధర్మమునం దచలాభిలాషయున్,
వైరము క్రూరకర్మసమవాయమునందు, సురాదిమద్యపా
నారతి, యీగుణంబులు జనావళి కుత్తమమంగళాంకముల్.

గురువరులందునన్, శ్రమణకూటములందున, ప్రాజ్ఞులందునన్,
పరిణతబుద్ధి, గారవము, భక్తికృతజ్ఞతలూని యుండుటల్,
తఱుగఁగనీక ప్రత్యయము ధర్మమునందున శాస్త్రచర్చలం
దఱిఁ గని యాలకించుటయు ధాత్రిని నుత్తమమంగళాంకముల్.

క్షాంతియు, దాంతియున్, హృదయసంయమనంబు, తపం, బహింసయున్,
శాంతము, బ్రహ్మచర్యమును సాధన చేసి ప్రపంచధర్మసం
క్రాంతసుఖప్రశోకభయకర్షితచిత్తుఁడు గాక సుస్థిర
స్వాంతుఁడునై మెలంగుట ధ్రువంబుగ నుత్తమమంగళాంకమౌ.

ఈ విధంబును బాటించు చెల్లవేళ
లందు నెల్ల ప్రదేశంబులం దజేయు
లగుచు సుఖులౌచు మనుటయె యగును నుత్త
మంబయిన మంగళాంకంబు మానవులకు.”

అని సర్వోత్తమధర్మమార్గమును వ్యాఖ్యానించు నా సూక్తులన్
విని యా దేవత మేనఁ బుల్క లొదవన్ విస్తార హృష్టాత్మయై
చని శౌద్ధోదని పాదకంజములకున్ సాష్టాంగదండంబులన్
వినయోత్కర్షితమానసాంబురుహయై వేమాఱు గావించియున్.

“దుఃఖాగ్నిదగ్ధులై దురపిల్లు జనులకున్
        స్వాతిచిన్కులు మీదువాక్యవితతి,
కాపథగాములై కలహించు జనులకున్
        క్షాంతి నేర్పును మీదు శాంతిపథము,
దుర్వ్యసనార్తులై దుఃఖించు జనులకున్
        రక్షామనువు మీదు ప్రవచనమ్ము,
సంసారశృంఖలాసక్తులౌ జనులకున్
        ముక్తిదంబులు మీదు సూక్తితతులు,

స్వామి! స్వకుటుంబమందును,సంఘమందు,
సకలభువనంబునందును సభ్యుఁడగుచు
మనుజుఁడుండంగవలసిన ఫణితిఁ దెల్పు
సూక్తి యిదె; మహామంగళసూత్ర మిదియె.

వనముల నాశ్రమంబులను వాసముసేయుచు సన్యసింపఁగా
వనరులు లేని వారలు ప్రపంచమునందు సమాచరింపఁగా
ననువగు సత్ప్రవర్తనగుణావళిఁ దెల్లము సేయు మీ నుడుల్
ఘనజనతారణార్థపరికల్పితమంగళసూక్తిగానముల్.

పావనమగు నుడులన్ లో
కావనమార్గము దెలిపిన యనుకంపాబ్ధీ!
పావనమయ్యెను నా భవ
మీ వాగ్ఝరియందుఁ దోఁగ నీక్షణమందే”

మఱిమఱి యివ్విధి నమ్ముని
వరునిం గొనియాడి, వీడి వనరాజంబున్
సురవర్త్మంబున నా సుర
తరుణీమణి యెగసిపోయెఁ దామసియందున్.

(ఈ మహామంగళసూత్రము బౌద్ధులు ప్రతిదినం పఠించే పవిత్రమైన సూక్తులలో ప్రధానమైనది. దీనిలో గల 12 అనుష్టుప్ శ్లోకాలలో గృహస్థులు అనుసరింపవలసిన ధర్మాలను గౌతమబుద్ధుడు సంక్షిప్తంగా వచించినాడు. ఈ శ్లోకాల సారాంశాన్ని 6 ఉత్పల,చంపకమాలావృత్తాల్లో నేనీ ఖండికలో కూర్చినాను. మూలంలో రేఖామాత్రంగా సూచింపబడ్డ సన్నివేశ సందర్భాలను మిగిలిన పద్యాలలో వర్ణించినాను. శ్రావస్తీ నగరాంతికమందలి జేతవనంలో ఒక వర్షర్తువులో చాతుర్మాస్యవ్రతస్థుడై బుద్ధుడు నివసించుచుండగా నొకనాటి చీకటిరాత్రి ఒక దేవాంగన అతనికి కనిపించి, “నరులకు,సురలకు మంగళకరమైన ధర్మమేది?” అని అడుగగా బుద్ధుడు ఈ అనుష్టుప్ శ్లోకములలో గల విషయమును చెప్పినాడని బౌద్ధమతగ్రంథములు తెల్పుచున్నవి.)

  1. కోసలరాజ్యరాజధాని యైన శ్రావస్తి బుద్ధుని కాలములో ఆర్యావర్తములో నున్న ఆఱు మహానగరములలోనొకటి.
  2. అనాథపిండికుడు (సంస్కృతం: అనాథపిండదుడు) అను నతడు శ్రావస్తీనగరమునందలి ధనికుడైన శ్రేష్ఠి. అతడు బుద్ధుని శిష్యుడై తన వ్యాపారసమార్జితధనము నంతయు బౌద్ధశ్రమణులకు, అనాథులకు అన్న దానము సేయుటకు, బౌద్ధవిహారాదులను నిర్మించుటకు వెచ్చించిన మహాత్యాగి. ప్రతిరోజు అతడు 500 మందికి ఉచితాన్నదానము చేసేవాడట. అంతేకాక, బుద్ధుడు, అతని శ్రమణకులు నివసించుటకు శ్రావస్తీనగరసమీపమునందున్న ఒక ఉద్యాన వనాన్ని జేతుడనే సామంతప్రభువునకు అపారధన మొసగి కొని (అందుకే దానికి జేతవనమని పేరు), అందులో బుద్ధుడు నివసించుటకై గంధకుటి, కోశాంబకుటి అనే రెండు విహారములను, ఇతరమైన శ్రమణకనివాసములను కట్టించెను. బుద్ధుని జూడవచ్చిన ప్రజ లనేకసుగంధయుతమైన పుష్పగుచ్ఛముల గొనివచ్చి అట నుంచుటవల్ల మొదటి విహారము సుగంధమయ మగుటచే దానికి “గంధకుటి” అను పేరు వచ్చినదని బౌద్ధుల సంప్రదాయము. బుద్ధునికి జ్ఞానోదయమైన తర్వాత 25 వర్షర్తువులు శ్రావస్తలోనే గడిపినాడని, ఇందులో 19 గంధకుటిలోనే గడిచా యని, 13వ శతాబ్ది వఱకు ఈ ఆశ్రమాలుండినవని, ఆతర్వాత శిథిలమైనవని చారిత్రకుల అభిప్రాయము. 1883లో పురావస్తుశాఖవారి త్రవ్వకాలలో ఈ ఆశ్రమాదుల అవశేషములు బయల్పడినవి. ఇప్పుడవి వివిధదేశములనుండి వచ్చు బౌద్ధయాత్రికులకు పవిత్రయాత్రాస్థలములు. అట్లు వచ్చిన శ్రమణకులు ఈ జేతవనంలో ప్రార్థనాదులు చేసు కుంటూ కాలం గడపుతుంటారు. చైనా, జపాను, కొరియా, బర్మా, థాయిలాండు, శ్రీలంక దేశములకు చెందిన బౌద్ధుల ఆశ్రమములు ప్రస్తుతము శ్రావస్తిలో నెలకొనియున్నవి.