తోడు

ఒర్లాండో, ఫ్లోరిడా – సాయంకాలం నీరెండలో పడక్కుర్చీలో కూర్చుని బయటకి చూస్తోంది శారద. నవీన్ ఇవాళ తొందరగా వస్తానన్నాడు కదా. వాడితో పాటు బయటకెళ్ళి తెచ్చుకోవాల్సిన లిస్ట్ రాస్తోంది. అరటి పళ్ళు, ఉరద్ దాల్. అమెరికా వచ్చేక మినప్పప్పు అనడం ఎక్కడైనా ఉందా? కాకరకాయలు, ఆవాలు, వంకాయలు, కొత్తిమీర… హటాత్తుగా శారదకి రామారావు గుర్తొచ్చేడు. ఒకసారెప్పుడో రామారావుని ఇంటికి పిల్చింది తండ్రికి పరిచయం చెయ్యడానికి. అప్పుడే భోజనంలో వంకాయ కొత్తిమీర చేసి పెడితే ’నాకు వంకాయ కూర చాలా ఇష్టమండీ’ అని చెప్పేడు రామారావు. ‘ఇప్పుడెక్కడున్నాడో? అమెరికాలోనే ఉన్నాడా?’ లిస్ట్ రాయడం ఆపి అనుకుంది.

విజయవాడలో డిగ్రీ చదువుతున్నప్పుడు పరిచయం అయ్యేడు రామారావు. అప్పట్లో క్లాస్ మొత్తంమీద ఇరవై, ముఫ్ఫై మంది అబ్బాయిలూ, శారదొక్కత్తే బిఎస్సీ మేథ్స్ క్లాసు లో జేరిన అమ్మాయి. మొదటిరోజున నలభైదాకా కళ్ళు శారదని తినేసేటట్టు చూసాయి. క్లాస్ అయిపోయిన తర్వాత మేథ్స్ లెక్చరర్ శారదని పిల్చి ఓ ఉచిత సలహా పారేసేడు, “అమ్మాయ్ నువ్వు ఒక్కత్తివీ క్లాసులో కూర్చుంటే కుర్రాళ్ళు నిన్ను ఏడిపిస్తారు. మేథ్స్ ఎందుగ్గానీ ఏ బయాలజీయో తీసుకో” అని. శారద చెప్పింది, “అలా అంటారేమిటి మేష్టారూ, నాకు ఇంజినీరింగులో సీటు వస్తున్నా వద్దు అనుకుని ఇక్కడ మేథ్స్ లో జేరేను. నాన్నగారు కూడా బాగా ఎంకరేజ్ చేసారు. మీకు నేను క్లాసులో కూర్చోడం ఇష్టం లేకపోతే చెప్పండి వేరే కాలేజీ చూసుకుంటాను.”

అలా ఆయన నోరు మూయించిన శారద మూణ్ణెల్లు తిరిగేసరికి ఇరవై మంది కుర్రాళ్ళ నోర్లు కూడా మూయించగలిగింది తన మేథ్స్ సబ్జక్ట్ మీద పట్టుతో. ఓ రోజు కొత్తగా జేరిన రామారావు పరిచయం అయ్యేడు శారదకి. జేరిన మూణ్ణెల్లకి రాముడు మంచి బాలుడు శారదతో మాట్లాడ్డం మొదలెట్టేడు. రామారావు పది మాటలు మాట్లాడితే అందులో రెండు సార్లు ఐ.ఐ.టి అనేవాడు. చదివితే ఐ.ఐ.టి లో చదవాలండీ అనేవాడు. అలాంటి రామారావే ఓ సారి నోరు జారి చెప్పేడు శారద నిక్ నేమ్ గురించి.

“సెంటు భామా? నా దగ్గిర అంత దుర్వాసన వస్తుందా? నేను ఎప్పుడూ సెంటు రాసుకోనే? మీగ్గానీ పిచ్చా, వెర్రా?” అంది శారద.

“అందుక్కాదు శారద గారు. మీకు వచ్చే మార్కులన్నీ సెంట్ పెర్సెంట్ అనీ, మీకా పేరు.” చెప్పేడు రామారావు నవ్వుతూ. ఈ సారి శారద కూడా నవ్వింది.

డిగ్రీ అయ్యాక రామారావు ఎమ్మెస్సీ ఐ.ఐ.టి లో చేయడానికి కాన్పూర్ వెళ్ళిపోయేడు. వెళ్ళేముందు శారద తండ్రి అనంతరామయ్య శారద గురించి చూచాయగా ప్రస్తావించేడు రామారావుతో. ఎమ్మెస్సీ అయ్యేక పి.హెచ్.డి చేస్తాననీ, పెళ్ళికి అప్పుడే తొందర్లేదనీ చెప్పేడు రామారావు. శారదక్కూడా ఎమ్మెస్సీ చెయ్యాలనీ ఉంది కానీ, బతకలేని బడిపంతులు కూతురిగా ఎక్కువ చదువు పెళ్ళికి ఆటంకం అని ముందే గ్రహించి వచ్చిన బి.ఎడ్ లో చేరింది. తర్వాత రామారావు చాలాసార్లు గుర్తొచ్చేడు శారదకి. పెళ్ళైనప్పుడూ, నవీన్ పుట్టేక కూడా రామారావు అలా గుర్తొస్తూనే ఉన్నాడు.

పెళ్ళయ్యేటప్పటికి శారద బి.ఎడ్ పూర్తిచేసి స్కూల్లో పంతులమ్మగా జేరింది. వెంటవెంటనే ఏదో తరుముకొస్తున్నాట్టు విషయాలు జరిగిపోయేయి. పెళ్ళై అమెరికా వచ్చేక వెంటనే నవీన్ పుట్టేడు. వీడికి పదిహేనేళ్ళు నడూస్తూండగానే ఆయన వెళ్ళిపోయేడు తిరిగిరాని లోకాలకి. డాక్టర్లు చెప్పిన విషయం ’స్ట్రోక్’ అని. చెట్టంత మనిషి పోయేక కారణం ఏదైతేనేం? ఒక పదిహేనేళ్ళు అమెరికాలో ఉన్నాక ఇండియా వెనక్కి వెళ్ళడం ఎంత కష్టమో తెల్సొచ్చింది శారదకి. వచ్చిన ఇన్స్యూరెన్స్ డబ్బుల్తో ఇప్పటిదాకా జాగ్రత్తగా నవీన్ ని చదివించుకొచ్చింది. అదృష్టం కొద్దీ నవీన్ తొందరగానే చదువు ముగించి ఉద్యోగం తెచ్చుకున్నాడు. మంచి జరిగినా, చెడు జరిగినా ప్రతీ సందర్భంలోనూ రామారావు గుర్తొస్తూనే ఉన్నాడు.

“అమ్మా పడుకున్నావా?” అంటూ నవీన్ కుదుపుతూంటే శారద ఈ లోకంలోకి వచ్చింది.

“నువ్వెప్పుడొచ్చావురా? ఉండు, టీ తాగుతావా?” అంటూ లేచింది శారద.

ఫ్రెష్ గా తయారై ఓ అరగంట పోయేక బయల్దేరేరు.

డ్రైవ్ చేస్తూ అడిగేడు నవీన్ శారదని, “అమ్మా నీకు ఇంకా యాభై ఏళ్ళు రాలేదు. నాన్న పోయినప్పటినుంచీ నువ్వు ఒక్కత్తివే ఉంటున్నావు కదా? నన్ను పెళ్ళిచేస్కోమని పోరుతున్నావు. నా పెళ్ళి అయితే నువ్వొక్కత్తివీ ఎలా? నువ్వు వాలంటీర్ గా పనిచేసే మదర్ థెరిస్సా సంఘం వాళ్ళు హెల్ప్ చేస్తారా?”

“ఏమోరా, అంత దూరం ఆలోచించలేదు”

“పోనీ నువ్వు మళ్ళీ పెళ్ళిచేసుకోకూడదూ?”

“హేవిటీ?” అంది శారద ఎర్రబడ్డ మొహంతో

“అవును తప్పేమిటీ? నీకు తోడు ఉండక్కరలేదా?”

శారద మాట్లాడలేదు. నవీన్ చెప్పినదాంట్లో నిజానిజాలు ఎలా ఉన్నా తను మళ్ళీ పెళ్ళి చేసుకోగలదా? మళ్ళీ రామారావు గుర్తొచ్చేడు శారదకి ఎందుకో గాని. ఐ.ఐ.టి చదువు తర్వాత రామారావు నూటికు నూరు శాతం అమెరికా వచ్చే ఛాన్స్ ఉందని శారదకి అమెరికా వచ్చేక తెల్సింది. ఎవరినైనా అడిగి కనుక్కుందామంటే మొహమాటం. అయినా ఇప్పుడు రామారావు ఏం చేస్తూంటే తనకెందుకు? పెళ్ళయ్యి పిల్లా పాపలతో కాలక్షేపం చేస్తూ ఉండి ఉండవచ్చు. తను నవీన్ తో ఉండట్లేదా?

“ఏమిటి నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకుంటే తప్పు? ఇండియన్ వేల్యూస్ అని పట్టుకుని వేళ్ళాడితే జీవితంలో ఎలా కుదురుతుంది? ఎప్పుడో పాతకాలం నాడు ఐతే జాయింట్ ఫేమిలీలో ఇంట్లో చాలా మంది వుండేవారు కనక రెండోపెళ్ళి అవసరం ఉండేది కాదేమో. కానీ ఈ రోజుల్లో ఎలా కుదురుతుంది? ఇప్పుడు నువ్వు వద్దన్నా నాకు పెళ్ళయ్యాక ఒక్కత్తివీ ఎలా ఉంటావు?”

“ఏమిరోయ్, పెళ్లవకుండానే నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావా?” నవ్వుతూ అడిగింది శారద

“లేదు, లేదు నువ్వు నాతోనే ఉండొచ్చు కానీ నువ్వే అంటూ ఉంటావు కదా పెళ్ళయ్యాక నీతో ఉండనూ అని?” కంగారుగా అన్నాడు నవీన్.

షాపు రావడంతో అక్కడితో ఆ సంభాషణకి తెర పడింది. రాత్రి భోజనం అయ్యేక చెప్పేడు నవీన్ “ఈ రోజు వనజతో మాట్లాడేను. వచ్చే శుక్రవారం రాత్రి భోజనానికి పిల్చేను. అప్పుడు నువ్వు తనతో మాట్లాడి అన్నీ అడగొచ్చు.”

“నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఎప్పుడైతే అమెరికా వచ్చామో అప్పుడే కులం సంగతి మర్చిపోయేం. అసలు వాళ్ళది ఏ వూరు?”

“ఆంధ్రా అని చెప్పింది. కానీ ఊరు నాకు తెలియదు. ఈ మధ్యన ప్రతి వాళ్ళు అడిగితే హైద్రాబాద్ అని చెప్పడం అలవాటైంది కదా? అయినా వనజకి కూడా తెలియక పోవచ్చు. నేను సోమవారం అడుగుతానులే. వాళ్ళ నాన్నగారు కూడా దాదాపు ఇరవై ముఫ్ఫై ఏళ్ళ క్రితం అమెరికా వచ్చేరుట. వనజ కాలిఫోర్నియాలో పుట్టింది. నేను చేసేది ఆఫ్తాల్మాలజీ రెసిడెన్సీ కనక అప్పుడప్పుడూ వాళ్ళ డిపార్ట్మెంట్లో పని పడుతూ ఉంటుంది. అక్కడ వనజ చేసే కేన్సర్ రీసెర్చ్ లో పేషెంట్లు మా దగ్గిరకి వస్తూ ఉంటారు కదా? అయినా సబ్జక్ట్ విషయాలు తప్ప మిగతావి మాట్లాడటం తక్కువే అనుకో. వనజకి నిజంగా వాళ్ళ వూరి పేరు తెల్సి నాకు చెప్పినా, నాకు మాత్రం ఏం తెలుస్తుందిలే. నా ఆంధ్రా జాగ్రఫీ నాలెడ్జ్ బండి సున్నా.” నవ్వేడు నవీన్.

శుక్రవారం సాయింత్రం నవీన్ వనజని తీసుకొచ్చేటప్పటికి శారద వంట చేసి ఎదురుచూస్తూ కూర్చుంది. డ్రెస్ పేంట్స్, సన్నటి ముత్యాల దండలతో వనజ సింపుల్గా కనిపించింది శారదకి. అంత అందకత్తె కాదూ, అనాకారి కాదు. శారదే పలకరించింది ముందు. ప్రతిగా అలవాటులేని రెండుచేతుల నమస్కారం పెట్టింది వనజ.

పరిచయాలయ్యేక శారద అడిగింది, “మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? మీది ఆంధ్రాలో ఏ వూరో తెలుసా?”

“నాకు నాన్న తప్ప ఎవరూ తెలియదు. అసలు అమ్మ చిన్నప్పుడే పోయిందనుకుంటా. అలా అని నా స్కూల్ సర్టిఫికేట్లో రాసారు నాన్న. ఎన్ని సార్లు అడిగినా నాన్న మాట దాటవెయ్యడమే తప్ప ఎప్పుడూ చెప్పలేదు. అడిగితే అమ్మ గురించిన జ్ఞాపకాలతో బాఢపడతారని నేనూ అడగలేదు. ఆ విధంగా నేను సింగిల్ పేరెంట్ ఫేమిలీ లోంచి వచ్చినదాన్ని. ఆంధ్రాలో వూరు కనుక్కున్నాను నాన్నకి ఫోన్ చేసి. దాని పేరు ’కచిపడి’ అనీ విజయవాడ దగ్గిర అని చెప్పేరు. ఆ వూరు ఆంధ్రా డేన్స్ కి చాలా ఫేమస్ ట.”

“ఓ కూచిపూడా? కచిపడి కాదు. నాకు బాగానే తెలుసు. మీ నాన్న గారు ఏం చేస్తూ ఉంటారు? కాలిఫోర్నియాలోనా ఉండేది?”

“నాన్న పనిచేసేది, పలోమార్ అబ్సర్వేటరీలో. కొంతకాలం కాల్ టెక్ లో ప్రొఫెసర్ గా చేసారు. అయిదేళ్ళ క్రితం పలోమార్ లో జేరారు.”

“ఆయన పేరు ఏమిటమ్మా?”

“రామారావు”

షాక్ కొట్టినట్టూ శారద తుళ్ళి పడింది ఒక్కసారి. ఎంతమంది రామారావులు లేరు ఈ ప్రపంచంలో? అనుకుని మళ్లీ మాట్లాడటం కొనసాగించింది. భోజనం చేసాక గంటా గంటన్నర కూర్చుని లేచింది వనజ. దిగబెట్టడానికి నవీన్ కూడా వెళ్లేడు. దారిలో అడిగేడు వనజని నవీన్ “అమ్మ నీకు నచ్చిందా?”

“మీ అమ్మగారు చాలా లోతైన మనిషి, నేను నాన్నకి ఫోన్ చేసి మాట్లాడమని చెపుతా. గుడ్ నైట్.”